మహా ప్రజ్ఞ-మహాకరుణ🌸
🌸మహా ప్రజ్ఞ-మహాకరుణ🌸
ఒక యువకుడు గురువు గారి దగ్గరకి వచ్చాడు…"నాకు చిన్న ఉద్యోగం ఇవ్వండి, కాసింత కూడు పెట్టండి...
"ఏదో దేవుడిని తలచుకుంటూ, మీ సేవ చేసుకుంటూ బతుకుతాను." అని అడిగాడు.
"నీకేం వచ్చోయ్?" అని ప్రశ్నించారు గురువుగారు.
"నాకేమీ రాదండీ. చదువుకోలేదు.
ఏ విద్యా నేర్చుకోలేదు. కప్పులు కడగడం, ఇల్లు ఊడ్వడం వంటి పనులు వచ్చు. అంతే నండీ" అన్నాడు యువకుడు.
"ఇంకే పనీ రాదా?"
"అంటే... చదరంగం కొద్దిగా వచ్చు."
అప్పటికప్పుడు చదరంగాన్ని తెప్పించారు గురువుగారు.
"ఆటాడుదాం, ఒకటే పందెం! ఇదిగో ఈ కత్తిని చూశావా? ఓడిన వాడి ముక్కు తెగ కోయాలి. ఒప్పుకుంటావా?"
యువకుడికి ఉద్యోగం కావాలి. ఇంకో మార్గం లేదు. ఒప్పుకున్నాడు.
ఆట మొదలైంది. యువకుడు మొదట్లో కొన్ని తప్పులు చేశాడు. ఆటలో వెనకబడ్డాడు.
అతని దృష్టి పొడవాటి కత్తిపై పడింది. చేత్తో ముక్కును తడుముకున్నాడు. మొత్తం దృష్టినంతా కేంద్రీకరించాడు. ఏకాగ్రతతో పావులు కదిపాడు.
యువకుడిదే పైచేయి అయింది, ఇంకో రెండు మూడు ఎత్తులతో గురువుగారిని చిత్తు చేసే స్థితికి వచ్చాడు...
ఆ సమయంలో అతను మళ్లీ కత్తి వైపు చూశాడు...
గురువుగారి ముక్కు వైపు చూశాడు.
ఏమనుకున్నాడో ఏమో కావాలనే ఒక తప్పుడు ఎత్తుగడ వేశాడు...
గురువు గారు ఒక్క ఉదుటున లేచి కత్తితో చదరంగం పై పావులను తోసేశారు...
"ఆట అయిపోయింది, నువ్వు ఆశ్రమంలో ఉద్యోగానికి ఎంపికయ్యావు." అన్నారాయన... యువకుడికి ఏమీ అర్ధం కాలేదు.
మంచి పనివాడికైనా, మంచి సాధకుడికైనా రెండు గుణాలుండాలి...
మొదటిది ‘మహాప్రజ్ఞ.’ అంతులేని ఏకాగ్రతతో దృష్టిని చేస్తున్న పని మీదే పెట్టగలగాలి.
రెండవది అన్నీ ఉన్నా అతనికి తప్పనిసరిగా ‘మహాకరుణ’ ఉండాలి.
నువ్వు గెలిచే ఆటని నేను ఓడకుండా ఉండేందుకు వదులుకున్నావు.
నా ముక్కు తెగే కన్నా నీ ముక్కు తెగడమే మంచిదనుకున్నావు.
ఇదే మహాకరుణ, ఈ రెండు గుణాలూ నీకున్నాయి...
"అందుకే నువ్వు మాతోటే ఉండు." అన్నారు గురువుగారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Comments
Post a Comment