యక్ష ప్రశ్నలు - ధర్మరాజు సమాధానాలు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀132.

              *శ్రీ మహాభారతం*
                  ➖➖➖✍️
                132 వ భాగము
  శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

కొంగరూపములోని యక్షునితో మాట్లాడుచున్న యుధిష్టురుడు:
                 ▪️〰️▪️

ఆ కొంగ ధర్మరాజుతో… ”వాస్తవానికి నేను కొంగను కాను, యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడి పోయారు.” అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. “నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలివి కలవాడవు కనుక నీరు త్రాగలేదు. కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు!” అన్నాడు.

ధర్మరాజు… “అయ్యా! నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా?అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను,” అన్నాడు.

యక్షుడు:-
”సూర్యుని ఎవరు నడుపుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యునికి ఆధారభూతం ఏమిటి?”

ధర్మరాజు:- 
”సూర్యుని బ్రహ్మం నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారం.”

యక్షుడు:- 
”శ్రోత్రియుడు ఎలా ఔతాడు? పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునికి సాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా ఔతాడు?”

ధర్మరాజు:- 
శ్రుతం వలన శ్రోత్రియుడు ఔతాడు. అనగా వేదము అధ్యయనం వలన. తపస్సు వలన మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సాయం. గొప్పవారికి, జ్ఞానులకు సేవచేయడం వలన బుద్ధిమంతుడు ఔతాడు.”

యక్షుడు;- 
బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతనికి సాధు భావము ఎలా ఏర్పడుతుంది? అతడు దుష్కృతుడు ఎలా ఔతాడు? బ్రాహ్మణుడు మానవుడు ఎలా ఔతాడు?”

ధర్మరాజు;- 
వేదపఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ఠ వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్ఠను కోల్పోయినప్పుడు దుష్కృతుడు ఔతాడు.
శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడు ఔతాడు.”

యక్షుడు;- 
”జీవన్మృతుడు అనగా ఎవరు?

ధర్మరాజు;- 
”దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, తన వద్ద వున్న సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించినా మరణించినట్లే.”

యక్షుడు;- 
”భూమికంటే బరువైనది ఏది? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డికంటే వేగంగా పెరిగేది ఏది?”

ధర్మరాజు;- 
”భూమికంటే బరువైనది కన్నతల్లి. ఆకాశంకంటే పొడవైన వాడు కన్న తండ్రి. గాలి కంటే వేగ మైనది మనసు. మనసులో కలిగిన చింత గడ్డికంటే వేగంగా పెరుగుతుంది.”

యక్షుడు;- 
కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తరువాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వలన వర్ధిల్లేది ఏది?”

ధర్మరాజు ;- 
”కన్నులు తెరిచి నిద్రించేది చేప. పుట్టిన తరువాత కదలలేనిది అండము. రూపం ఉండి హృదయం లేనిది పాషాణం. వేగం వలన వర్ధిల్లునది ఏరు.”

యక్షుడు;- 
”బాటసారికి, రోగగ్రస్తునకు, గృహస్తునకు, చనిపోయిన వారికి ఎవరు బంధువు?

ధర్మరాజు;- 
బాటసారికి తోటి ప్రయాణీకుడు, రోగ గ్రస్తునకు వైద్యుడు, గృహస్తునకు మంచి భార్య, చని పోయిన వారికి అతను ఆచరించిన ధర్మములు బంధువులు.”

యక్షుడు;- 
ధర్మమునకు ఆధారం ఏది? కీర్తికి ఆశ్రయం ఏది? దేవలోకమునకు పోవు మార్గం ఏది? సుఖించుటకు మూలం ఏది?”

ధర్మరాజు;-
”కరుణ స్వభావం ధర్మమునకు మూలం. దానం చేయుట వలన కీర్తి వస్తుంది. సత్యం పలుకుటయే దేవలోకము పోవుటకు మార్గం. మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం.”

యక్షుడు;- 
నరునకు ఆత్మ ఏది? దైవీకమైన చుట్టము ఎవరు? అతడు ఏ ఆధారంగా జీవిస్తాడు? నరుడు ఎందువలన మంచితనం పొందుతాడు?”

ధర్మరాజు;- 
”పుత్రుడే నరునకు ఆత్మ. భార్య దేవుడిచ్చిన చుట్టము. అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి. దానం వలన నరుడు మంచితనం పొందుతాడు.”

యక్షుడు;- 
”ధర్మములలో గొప్ప ధర్మం ఏది? ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది? ఏది వదిలి పెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు?”

ధర్మరాజు;-
”అహింస పరమ ధర్మము. యజ్ఞ యాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి. అహంకారం వదిలి పెడితే మనకు ఆనందం కలుగుతుంది. మంచి వారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు.”

యక్షుడు;- 
”ఈ లోకములకు దిక్కు ఎవరు? అన్నం, జలం ఎందు వలన సంభవిస్తాయి? విషము అనగా ఏమి? శ్రాద్ధ కర్మలకు ఏది సమయము?”

ధర్మరాజు;-
”మంచివారే ఈ లోకమునకు దిక్కు. నీరు, అన్నం మేఘం వలన సంభవిస్తాయి. బ్రాహ్మణుని ధనం విషతుల్యం. బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయం.”

యక్షుడు;- 
”మనుజుడు ఏది వదిలి పెడితే సర్వజన ప్రియుడు, శోకము లేని వాడు, ధనం కలవాడు, సుఖి ఔతాడు?”

ధర్మరాజు;- 
”గర్వం వదిలి పెడితే సర్వజన ప్రియుడు ఔతాడు. కోపం వదిలి పెడితే దుఃఖం ఉండదు. లోభి కాని వాడు సంపన్నుడు ఔతాడు. అత్యాశను వదిలి పెడితే సుఖాన్ని పొందుతాడు.”

యక్షుడు;-
”పురుషుడు ఎవరు? అత్యంత ధనంకలవాడు ఎవరు?”

ధర్మరాజు;-
ఎవడు కీర్తివంతుడో అతడే పురుషుడు. ప్రియము, అప్రియము, సుఖదుఃఖములు, జరిగినవి, జరగబోవునవి, ఎవరు సమముగా చూచునో అతడే అత్యంత ధనవంతుడు.”

యక్షుడు ధర్మరాజును పరీక్షించుట:

ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు… “ధర్మరాజా! నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తి పరిచావు. నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చెదను కోరుకొనుము.” అన్నాడు.

ధర్మరాజు… “మహాత్మా! నా తమ్ముడు నకులునకు ప్రాణములు తిరిగి ఇమ్ము!”అన్నాడు. 

యక్షుడు… “అదేమిటి భీమార్జునులను వదిలి నకులుని కోరుకున్నావు?” అని అడిగాడు. 

ధర్మరాజు… “అయ్యా! నా తల్లికి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను. మా తడ్రి రెండవ భార్య మాద్రి పుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతనిని కోరుట ధర్మం కదా?” అన్నాడు.

యక్షుడు… “ధర్మరాజా నీ ధర్మ నిరతికి మెచ్చాను. నీ తమ్ములు అందరూ పునరుజ్జీవితులు కాగలరు!” అని వరం ఇచ్చాడు.*

వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు.

ధర్మరాజు… “మహాత్మా! నీవు మామూలు యక్షుడవు కావు. నీ వెవరో ఎరిగింపుము అని ప్రార్ధించాడు.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: