ఇంద్రుడు కర్ణుని కవచకుండలములు కోరుట:


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
130.

               శ్రీ మహాభారతం
                  ➖➖➖✍️
                 130 వ భాగము

 ఇంద్రుడు కర్ణుని కవచకుండలములు కోరుట:
                      ▪️〰️▪️

ఒక రోజు బ్రాహ్మణ వేషధారియై ఇంద్రుడు కర్ణుని వద్దకు వచ్చాడు. ఆ సమయంలో కర్ణుడు సూర్యోపాసన చేసి బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తున్నాడు. 

అప్పుడు ఇంద్రుడు ‘బిక్షాందేహి’ అన్నాడు. 

కర్ణుడు… “మీకు ఏమి కావాలో కోరుకోండి!” అని అడిగాడు.

ఇంద్రుడు… “నాకు నీ కవచ కుండలాలు కావాలి, ఇమ్ము!” అన్నాడు.

కర్ణునికి విషయం అర్ధం అయింది. కర్ణుడు… “బ్రాహ్మణోత్తమా! ఎందుకూ పనికి రాని ఈ కవచకుండలాలు నీ కెందుకు వాటికి బదులుగా ధనం, బంగారం, మణి మాణిక్యాలు కోరుకో!”అన్నాడు.

ఇంద్రుడు తనకు కవచ కుండలాలు మాత్రమే కావాలని పట్టుబట్టాడు.

కర్ణుడు… “బ్రాహ్మణోత్తమా! పోనీ నా అంగ రాజ్యాన్ని నీకు ఇస్తాను తీసుకో!” అన్నాడు.

అందుకు దేవేంద్రుడు అంగీకరించ లేదు.

కర్ణుడు… “దేవా! నిన్ను నేను గుర్తుపట్టాను. నీవు దేవేంద్రుడవు మేము దేవతలైన మిమ్ము వరం అడగాలి కాని మీరు వచ్చి నన్ను యాచించటం తగునా? వింతగా ఉందే” అన్నాడు.

దేవేంద్రుడు… “కర్ణా! నీకు నీ తండ్రి సూర్యుడు అన్ని విషయములు చెప్పి ఉంటాడు. అందుకనే నన్ను గుర్తించావు. నేను కోరిన కవచ కుండలాలు నాకు ఇచ్చి పంపు!” అన్నాడు.

కర్ణుడు… “దేవా! బదులుగా నాకు నీ వద్ద ఉన్న సకల శక్తి సంపన్న మైన శక్తి అనే ఆయుధాన్ని ప్రసాదించి కవచ కుండలాలను గ్రహించండి!” అన్నాడు. 

ఇంద్రుడు… “కర్ణా! నీకు శక్తిని సంతోషంగా ఇస్తాను. కాని యుద్ధ సమయంలో నేను శత్రువులపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించిన అది శత్రు సంహారం చేసిన తరువాత నాదగ్గరకు వస్తుంది. కనుక నీవు నీ శత్రువుపై ఆ శక్తి ఆయుధాన్ని ప్రయోగించగానే అది శత్రు సంహారం చేసి నీ వద్దకు రాదు నా దగ్గరకు వస్తుంది. కనుక నీవు దానిని ఒక సారి ప్రయోగించగానే అది నన్ను చేరుతుంది. కనుక దానిని నీవు ఒకసారి మాత్రమే ప్రయోగించగలవు. ఈ నియమానికి అంగీకరించి శక్తి ఆయుధాన్ని తీసుకో” అన్నాడు.

కర్ణుడు… “దేవేంద్రా! నాకు ఉంది ఒకే శత్రువు అర్జునుడు. ఈ శక్తి ఆయుధం అతనిని వధించిన చాలు!” అన్నాడు. 

ఇంద్రుడు నవ్వి… “కర్ణా! నీ మనోరధం నాకు తెలియును. నీవు అర్జునుని చంపాలని అనుకుంటున్నావు. కాని కృష్ణుడు అర్జునిని పక్కన ఉన్నంత కాలం నీవు ఏమీ చేయలేవు!” అన్నాడు.

కర్ణుడు… “దేవా! అది సరేకాని కవచ కుండలములు చీల్చి ఇచ్చిన నా శరీరం వికృతం ఔతుంది కదా ఎలా?” అన్నాడు.

ఇంద్రుడు… “కర్ణా! నీకు ఆ చింత లేదు. నీ శరీరం నీ తండ్రి సూర్యునిలా ప్రకాశిస్తుంది!” అని వరం ఇచ్చి అతని కవచ కుండలాలను తీసుకుని దేవేంద్రుడు దేవలోకం వెళ్ళాడు. 

ఈ వృత్తాంతం విని పాండవులు ఆనందించారు, కౌరవులు దు॰ఖించారు.

”జనమేజయా ఈవిధంగా ఇంద్రుడు మాయోపాయంతో కర్ణుని కవచ కుండలాలు సంగ్రహించాడు అని వైశంపాయనుడు జనమే జయునకు చెప్పాడు.

యక్షప్రశ్నలు:
అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరం ఉన్న పాండవుల వద్దకు ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి…”అయ్యా! నేను నా అరణిని చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తు కుంటూ వచ్చింది. దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది. ఆ లేడి నా అరణితో పారి పోయింది. దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి!” అని ధర్మరాజును అడిగాడు. 

ధర్మరాజు విల్లంబులు పట్టుకుని తమ్ములతో ఆ లేడిని వెంబడించాడు.

కాని అతను వేసిన బాణములు ఒక్కటి కూడా ఆ లేడికి తగల లేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తి మాయం అయింది.

పాండవులు అలసి పోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి… “అన్నయ్యా ! మనం ఉన్నత వంశంలో పుట్టాము. ధర్మశాస్త్రాలు చదువుకున్నాము. అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము. కాని ఇంతటి దుర్గతి రావడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు.

ధర్మరాజు నవ్వి… “నకులా! సుఖం కానీ, దుఃఖం కానీ మనకు కలగడానికి కారణం మనం చేసుకున్న కర్మే. వేరే ఏమి కాదు!” అన్నాడు. 

భీముడు నకులుని చూసి… “తమ్ముడూ ! ఆ రోజు పాత్రిగామి ద్రౌపదిని కొలువు కూటమికి తీసుకు వచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి.” అన్నాడు. 

నకులుడు… “అన్నయ్యా భీమా ! అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికి వారి వలె అడవులకు వచ్చామే. అదే అసలు కారణం. అన్నయ్యలూ ! ఆ రోజే మాయజూదం ఆడిన శకునిని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్ధశ తప్పేది కదా!” అన్నాడు సహదేవుడు.

ఆ మాటలు వింటున్న ధర్మరాజు… “తమ్ముడూ! ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు.” అన్నాడు.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: