అష్ట భైరవులు

అష్ట భైరవులు

అసితాంగో రురుశ్చండహ్ క్రొధశ్ఛోన్మత్త భైరవ/
కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవాహ్//

1.అసితాంగ భైరవుడు,
2.రురు భైరవడు,
3.చండ భైరవుడు,
4.క్రోధ భైరవుడు,
5.ఉన్మత్త భైరవుడు,
6.కపాల భైరవుడు,
7.భీషణ భైరవుడు,
8.సంహార భైరవుడు.

     మనుషులుగా ఈ భూమ్మీద జన్మించి కష్టాలు, దుఖాలు అనుభవిస్తున్న జీవులు తమ దుఖాలను నివృత్తం చేసుకోవడం కోసం భైరవుడిని సేవించాలి. సతీదేవి శరీరత్యాగం చేసిన కారణంతో శివుడు దుఖాన్ని తట్టుకోలేక భైరవ రూపాన్ని ఆశ్రయించాడు. కనుక భైరవుడిని సేవిస్తే శివుణ్ణి సేవించినట్లే. "నేను భైరవ రూపంలో లోకానికి సుఖం చేకూర్చూతాను." అని సదాశివుడి వాక్యం.

1.అసితాంగ భైరవుడు:
     
 ఈయన నల్లని శరీరఛాయలో, శాంతి రూపంలో, దిగంబర శరీరంతో, మూడూ కళ్ళతో, బ్రహ్మీ శక్తితో కూడి నాలుగు చేతులతో ఉంటాడు. అక్షమాల, ఖడ్గం, కమండలం, పానపాత్ర. నాలుగు చేతులలో ధరిస్తాడు. ఈయన హంసవాహనుడు. వరాలనిస్తాడు భూషణాధికారి. సరస్వతి ఉపాసకులు అసితాంగ భైరవుని అర్చించి సిద్ది పొందాలి. ఆ తరువాతే సరస్వతీ ఉపాసన సిద్దిస్తుంది. ఈయన బ్రహ్మ స్వరూపుడు. మహా సరస్వతికి క్షేత్రపాలకుడు. ఈయన తూర్పు దిశకు అధిపతి.

2.రురు భైరవుడు:

ఈయన స్వచ్చమైన స్పటికంలాగ తెల్లని శరీర ఛాయతో, మూడు కళ్లతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో, చిరునవ్వుతో, మహేశ్వరి శక్తితో కూడిన కుమారరూపంతో వృషభ వాహనుడిగా ఉంటాడు. నాలుగు చేతుల్లో కత్తి,టంకము, పాత్రను, లేడిని ధరించి ఉంటాడు. శ్యామల, ప్రత్యంగిర, దశమహవిద్యలు మొదలగు ఉపాసకులు ముందు ఈయనని ఉపాసన చేయాలి. ఈయాన అనుగ్రహంతోనే అమ్మవారి ఉపాసనలు సిద్దిస్తాయి. ఈయన రుద్ర స్వరూపుడు. రుద్రాణికి క్షేత్రపాలకుడు. ఈయన ఆగ్నెయ దిశకు అధిపతి.

3.చండ భైరవుడు:

ఈయన తెల్లని శరీర ఛాయలతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దిగంబరంగా, కౌమారి శక్తితో, శాంత కుమార రూపంలో నెమలి వాహనంతో ఉంటాడు. సుబ్రమణ్య ఉపాసకులు, కన్యకాపరమేశ్వరి ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్దిస్తాయి. ఈయన సుబ్రమణ్య స్వరూపుడు. సర్పదోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు ఈయన్ని ఉపాసించాలి. ఈయన దక్షిణ దిశకు అధిపతి.

4.క్రోధ భైరవుడు:

ఈయన నీలి శరీర ఛాయతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో, వైష్ణవి శక్తితో కూడిన శాంత రూపంతో గరుడ వాహనా రూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో గధ, చక్రం, పానపాత్ర, శంఖం ధరించి ఉంటాడు. వైష్ణవ ఉపాసకులు అంటే గరుడ, హనుమ, సుదర్శన, నారసింహ, వరాహ, కృష్ణ ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి. ఈయన విష్ణు స్వరూపుడు. నైరుతి దిశకు అధిపతి.

5.ఉన్మత్త భైరవుడు:

ఉన్మత్త భైరవస్వామి బంగారం లాగ పచ్చని శరీర ఛాయతో, మూడు కండ్లాతో, నాలుగు చేతులతో, దిగంబరుడిగా, వారాహి శక్తితో కూడిన శాంత రూపంలో, అశ్వరూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో రోకలి, కత్తి, కపాలము, వేటకత్తి ధరించి ఉంటాడు. వారాహి, కుబేర ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్దిస్తాయి. ఈయన వారాహి స్వరూపుడు. పశ్చిమ దిక్కుకి అధిపతి.

6.కపాల భైరవుడు:

ఈయన ఎర్రని దేహకాంతితో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో, ఇంద్రాణీ శక్తితో కూడిన శాంతమైన బలరూపంతో గజవాహనుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో వజ్రం, ఖడ్గం, పానపాత్ర, పాశం ధరించి ఉంటాడు. భౌతిక సుఖ సంపదలు కావాల్సిన వారు ఈయన ఉపాసన చేయాలి. ఈ ఉపాసనతో ఈ లోకంలోనూ, స్వర్గలోకంలోను సుఖాలు సిద్దిస్తాయి. ఈయన దేవరాజు ఇంద్ర స్వరూపుడు.స్వర్గ క్షేత్రపాలకుడు. ఈయన వాయువ్య దిశకు అధిపతి.

7.భీషణ భైరవుడు:

ఈయన ఎర్రని శరీర ఛాయతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో, చాముండా శక్తితో, శాంత బాలరూపంతో, సింహ వాహనారూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో శూలం, ఖడ్గం, కపాలము, ముద్గరం ధరించి ఉంటాడు. చండి, చాముండా ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతో చండీ సప్తసతి సిద్దిస్తుంది. ఈయన చాముండాకు క్షేత్ర పాలకుడు. ఈయన ఉత్తర దిశకు అధిపతి.

8.సంహార భైరవుడు:

సంహార భైరవుడు మూడు కళ్లు, పది చేతులు కలవాడై, నాగ యజ్ఞోపవీతం ధరించి, దిగంబరంగా, బాల రూపంతో, కోరలు గల భయంకర వదనంతో, కుక్క వాహనంగా గలవాడై ఉంటాడు. చేతుల్లో శూలం, చక్రం, గద, ఖడ్గం, అంకుశం, పాత్ర, శంఖం, డమరుకం, వేటకత్తి, పాశం ధరించి ఉంటాడు. తాంత్రికులు కాపాలికులు, యామలులు, ముందుగా ఈయన్ని ఉపాసించాలి. ఈయన దయవల్లే తాంత్రిక షట్కర్మలు సిద్దిస్తాయి. ఫలవంతమౌతాయి. ఈయన సర్వశక్తి స్వరూపుడు. తంత్ర క్షేత్రపాలకుడు. ఈయన ఈశాన్య దిశకు అధిపతి.

//దిగంబరాయ విద్మహే కాశీక్షేత్రపాలాయ ధీమహి
తన్నో కాల భైరవ ప్రచోదయాత్//

                        🚩🔱శివోహం🔱🚩

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: