దైవం మానుష రూపేణ..."
🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺🍀
"దైవం మానుష రూపేణ..."
➖➖➖✍️
‘‘ఏవండీ, ఈరోజు కార్తీక సోమవారం, ఈ రోజైనా స్నానం చేసి కాఫీ తాగొచ్చు కదా'’ అంటూ బెడ్‌రూమ్‌లోకి వచ్చింది కమల.
అప్పటికి ఇంకా తెల్లవారలేదు. కళ్ళు విప్పి చూస్తే, ఎదురుగా చందన బ్రదర్స్ క్యాలెండరు(కాస్త పైనున్న దేవుడి బొమ్మ నా కెప్పుడూ కనబడదు). ‘‘అబ్బా, పొద్దున్నే ఏమిటే నీ నస! ఎలాగూ లేపేశావ్ కదా, వెళ్ళి కాఫీ పట్టుకురా’’ అన్నాను విసుగ్గా మంచం మీద దొర్లుతూ. 'సరే,మీఇష్టం’ అంటూ వెళ్ళి పోయింది కమల.
దగ్గరలో ఉన్న శివాలయంలోంచి అయ్యప్ప భక్తుల భజన వినిపిస్తోంది. నేనెందుకు తగ్గాలనుకున్నాడో ఏమిటో వేంకటేశ్వర స్వామి గుడి లోంచి సుప్రభాతం రొటీన్‌గా వస్తోంది. నాకు నిద్రొస్తోంది, కానీ కమల గొడవతో లేవక తప్పలేదు.
ఇంతలో కమల కాఫీ తెచ్చి మంచం అంచున పెట్టి తీసుకోమంది. ‘‘ఏమిటీ, పాత రోజుల్లో పాలేరుకి పోసి నట్టు పోస్తున్నావు?’’ అన్నాను కొంచెం కోపం నటిస్తూ.
‘‘నేను మడిగా స్నానంచేసి ఉన్నాను. మిమ్మల్ని ముట్టుకోకూడదు. లేచి కనీసం బట్టలు మార్చుకుని నన్ను కాస్త శివాలయం దగ్గర దింపారంటే పుణ్య మంతా మీదే’’ అంది కమల.
తనకి తెలుసు, నేను గుడికి రానని! తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన నమ్మకాల్ని నామీద రుద్దదు. నేను కూడా తనని ఏమీ మార్చాలనుకోను. ఎంత భార్యాభర్తలైనా, ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉండాలని నమ్ముతాను. లేచి ప్యాంట్ వేసుకుని కారు తీసి హారన్ కొట్టాను త్వరగా రమ్మని.
కమల పరుగుపరుగున వచ్చి జాగ్రత్తగా నన్ను ముట్టుకోకుండా ముందు సీట్లో కూర్చుంది. తలంటు పోసుకుని పట్టు
చీర కట్టుకుందేమో విరిసిన మందారం లా ఉంది కమల. అలాగే ఆమెకేసి చూస్తూ ఉండిపోయాను.
‘‘సర్, కొంచెం ముందుకి చూసి డ్రైవ్ చేయండి’’ అంది కమల నవ్వుతూ.
ఆమెని గుడి దగ్గర దింపేసి కార్లోనే కూర్చున్నాను. ‘‘చాలా రష్‌గా ఉంది, త్వరగా రా’’ అన్నాను విసుగ్గా.
‘‘అలాగే. పంతులుగారు నాకు బాగా తెలుసు. ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను’’ అంది కమల కారు దిగి, పళ్ళూ పూలూ కొబ్బరికాయ కొంటూ.
టైమ్ అప్పటికే 5.30 అవుతుంది. క్యూలో దాదాపు వెయ్యిమంది దాకా ఉన్నారు. అంతలో మా కొలీగ్ , వాళ్ళ ఆవిడా లైన్లో కన్పించారు. కమల వాళ్ళని పలకరిస్తోంది. ‘ఆయన రాలేదా’ అని అడుగుతున్నట్లున్నారు, కార్లో కూర్చున్న నన్ను చూపించి నవ్వుతూ ఏదో చెప్తోంది.
ఆ లైన్లో ఉన్నవాళ్ళని చూస్తే జాలే స్తోంది. ఎముకలు కొరికే చలిలో గంటల తరబడి నిలబడే వాళ్ళ ఓపిక చూస్తే ఈర్ష్యగా ఉంటుంది. నేను కూడా ఒకటి రెండుసార్లు ట్రై చేశాను. కానీ, నాకేమీ తేడా కనిపించలేదు. ఎటువంటి డివైన్ ఫీలింగూ రాలేదు. అందులో కచ్చితంగా నాకంటే తెలివైనవాళ్ళూ ఉంటారు. ఏముంది అంతగా, నాకెందుకు అలాంటి అనుభూతి కలగటంలేదు? ఆ చలిలో వేడి వేడిగా టీ తాగితే బావుంటుందనిపించింది. కారు వదిలి వెళ్ళే పరిస్థితి లేదు. చాలా చిరాగ్గా ఉంది. ఇంతలో ‘భవాని మాల’ వేసుకున్న ఒక పాతికేళ్ళ కుర్రాడు నా కారు పక్కనుంచి బండిమీద వెళ్తూండగా వాడి బండి నా కారు బంపర్‌ని చిన్నగా రాసుకుంది.
అంతే, ఒక్కసారి నా బద్ధకం అంతా వదిలిపోయింది. వెంటనే కారు దిగి వెనక్కి వెళ్ళి చూశాను. బంపర్ మీద చిన్న స్క్రాచ్ పడింది. నాకు చిర్రెత్తు కొచ్చింది. అసలే చలికాలం, లేట్‌నైట్ పార్టీ హ్యాంగ్‌ఓవర్‌తో హాయిగా దుప్పటి ముసుగేసుకుని పడుకోవాల్సిన నేను- ఇలా కారులో నాకు నచ్చని వాతా వరణంలో విసుగెత్తిపోతున్న నాకు ఆ స్క్రాచ్ చూసేసరికి ఒళ్ళు మండి పోయింది. అంతే, ఆ కుర్రాడు చెప్పేది వినకుండా లాగి వాడి చెంప మీద ఒక్కటిచ్చాను. వూహించని నా చర్యకి ఆ కుర్రాడు బిత్తరపోయాడు.
‘సర్,తప్పయిపోయింది, క్షమించండి సార్’అంటూ ఏడుపు అందుకున్నాడు. అప్పటికి కానీ నా కోపం, అహం తగ్గ లేదు.
ఇంతలో అక్కడున్న మిగతా భక్తులంతా గుమిగూడి ‘‘వదిలేయండి సార్,పాపం దీక్షలో ఉన్నాడు’’ అన్నారు.
అంతే, మళ్ళీ నాకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘దీక్షలోఉంటే, ఇలా అందరి కార్ల మీద పడిపోతాడా,వాడిదేంపోయింది,డొక్కు బండొకటి వేసుకొచ్చి వూరుమీద పడి పోతాడు. ఇప్పుడీ స్క్రాచ్ తీయించా లంటే నాకు పదివేలు వదులుతుంది’’ అన్నాను కోపంగా.
ఆకుర్రాడు భయంభయంగానే ‘‘సర్, నా దగ్గర రెండువేలు ఉన్నాయి. మీరు ఏమీ అనుకోకపోతే...’’ అంటూ ఏదో నసిగాడు.
‘‘ఏడిశావ్, రెండువేలతో అయిపోడానికి ఇది నీలా డొక్కుబండి కాదురా’’ అంటూ వాడి చేతిలోంచి రెండువేలు లాక్కున్నాను.
మేనేజ్‌మెంట్ కోర్సు చేసినవాడ్ని, ఎటువంటిఅవకాశంవదలకూడదన్నది మొదటి పాఠం కదా.
పక్కనున్న కొబ్బరికాయల కొట్టువాడు ఏదో చెప్పబోతుండడం చూసి, ‘‘చూడు స్వామీ,మేటర్ అయిపోయింది. నువ్వేం పెదరాయుడు తీర్పులు ఇవ్వక్కర్లేదు’’ అంటూ విసురుగా కారులో కూర్చుని లాక్ చేశాను.
ఇంతలో కమల వచ్చింది. ఆ విసుగంతా ఆమెమీద చూపిస్తూ ‘‘ఇంతసేపా, నేను నీలా ఖాళీగా లేను. అవతల నా గురించి ఆఫీసులో ఎంతమంది వెయిట్ చేస్తారో తెలీదా?’’ అంటూ అరిచాను.
కమల సారీ చెప్తూ ‘‘పదండి వెళ్దాం’’ అంది. అదే ఆమెలో గొప్పతనం. నేనెంత అరిచినా నవ్వుతూనే ఉంటుంది.
ఇంటికొచ్చాం. నేను స్నానంచేసి బట్టలేసుకుని డైనింగ్‌టేబుల్ దగ్గరికి వచ్చాను టిఫిన్ కోసం. వంటింట్లోంచి కమల వస్తూ ‘‘ఏమండీ, ఈరోజు ఉపవాసం ఉంటే, కోటి ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుందట. మీరు కూడా ఉండొచ్చు కదా’’ అంది ఆశగా.
‘‘చూడూ,ఇవన్నీ నావల్ల కాదు. నేను చేసే పనిని నమ్ముతాను. నా పనే నాకు అన్నీ. అదే లేకపోతే నీకు రోజూ ఉపవాసమే, అర్థం అయిందా? ఇలాంటి పిచ్చిపిచ్చి సలహాలు ఇవ్వటం మాని తొందరగా టిఫిన్ పెట్టు. ఇప్పటికే లేట్ అయింది’’ అంటూ అరిచే సరికి ఒక్కసారిగా భయపడిపోయి అప్పటికే రెడీగా ఉన్న టిఫిన్ పెట్టేసింది. నేను అరిచేటప్పుడు అవతలివాళ్ళ కళ్ళల్లో భయం అంటే నాకు చాలా ఇష్టం. నాకున్న ఈ లక్షణం వల్ల ఈ ఉద్యోగం వచ్చిందో లేక ఈ ఉద్యోగం వచ్చాక ఈ లక్షణం అలవడిందో చెప్పడం కష్టం. టిఫిన్ చేసి బీపీ మాత్ర వేసుకుని ఆఫీసుకి బయలుదేరాను. నా హోదాతో పాటు పెరిగిన కవలలు అహం, రక్తపోటు. నాకు వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. బహుశా అందుకేనేమో నేను దేవుడు వూసెత్తను.
‘‘సర్’’ కాఫీ ఇస్తూ నసిగాడు ప్యూన్ అప్పారావు.
‘‘ఏంటి చెప్పు’’ అన్నాను ఫైల్ చూస్తూ విసుగ్గా. నాకు తెలుసు అతనికి లీవ్ కావాల్సినప్పుడే అలా నసుగుతాడని.
‘‘ తిరుపతి వెళ్ళాలిసర్,రెండురోజులు లీవ్ కావాలిసర్’’ అన్నాడు వినయంగా.
‘‘పోయిన నెలేగా వెళ్ళావు, మళ్ళీనా!’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘అప్పుడు వెళ్ళింది పెద్దతిరుపతి సర్. ఇప్పుడు వెళ్తున్నది చిన్న తిరుపతి సర్’’ అన్నాడు అప్పారావు. అలా చెప్తున్నప్పుడు వాడి కళ్ళల్లో ఒక రకమైన తన్మయత్వం.
‘‘అప్పారావ్,ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్నావు. మళ్ళీ ఎందుకీ అదనపు ఖర్చు... వెళ్ళకపోతే ఏమవుతుంది?’’ అన్నాను సానుభూతి నటిస్తూ. వాడు లేకపోతే నాకు మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడుండడు ఆఫీసులో. అదీ అసలు బాధ.
‘‘భలేవారు సర్, ఓసాధారణ ప్యూన్‌ని అయినా నాకు అవసరానికి అప్పు పుడుతోందంటే, అన్ని అప్పులున్నా హాయిగా నిద్రపడు తోందంటే... అదంతా ఆ భగవంతుడి మీదున్న నమ్మకమే సార్’’ అన్నాడు అప్పారావు. అతని మాటలో, కళ్ళల్లో అదో రకమైన తృప్తి.
‘‘సరే, నీ ఇష్టం’’ అంటూ అతన్ని పంపించేశాను. అంతకన్నా ఎక్కువ వినటం ఇష్టంలేదు నాకు.
ఆరోజు సాయంత్రం క్లబ్‌లో ఉదయం గుడి వద్ద జరిగిన విషయం ఫ్రెండ్స్ అందరికీ చాలా గర్వంగా చెప్పాను. ఆ కుర్రాడ్ని ఎలా భయపెట్టిందీ, వాడిచ్చిన రెండువేలలో కేవలం పదిహేను వందల తో రిపేర్ చేయించి ఐదొందలు ఎలా మిగిల్చిందీ చెప్తూ ఉంటే ఎందుకో ఎక్కువమంది నుంచి చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది. బహుశా నా తెలివికీ వాళ్ళ కుళ్ళుకీ ఎప్పుడూ ఉండే ఆధిపత్య పోరేమో! నవ్వుకున్నాను.
ఆమర్నాడు ఉదయం మాఅబ్బాయి ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ టర్మ్ ఎండ్ ఎగ్జామ్‌కి వెళ్ళే సమయం. ఎగ్జామ్ తొమ్మిది గంటలకి. ఎనిమిదింటికి బయలుదేరాం. వచ్చే ఆదివారం ఫ్రెండ్స్ తో వెళ్ళబోయే పిక్నిక్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ వాట్సాప్ గ్రూప్‌లో చాటింగ్ జరుగుతోంది. అది ఆపటం ఇష్టంలేక, మావాడ్ని కారు తీయమన్నాను. లైసెన్స్ లేకపోయినా వాడు బాగానే నడుపు తాడు కారు. కారు నెమ్మదిగా వెళ్తొంది. ఇంటి దగ్గరలో ఉన్న పోలమాంబ గుడి దాటుతూ ఉండగా అప్పుడు జరిగిందా సంఘటన. మావాడు కారు సడన్‌గా లెఫ్ట్ కి తీయటం, మా కారుకి లెఫ్ట్ లో వెళ్తున్న బైక్‌కి తగలడం, ఆ బైక్ మీద ఉన్న ఇద్దరు మనుషులూ తూలి గుడి పక్కన పార్క్ చేసి ఉన్న బండిమీద పడటం, ఆ బండి కాస్తా పక్కనే నిలబడి ఉన్న ఒక పాతికేళ్ళ యువతి మీద పడటం... ఇవన్నీ బహుశా ఒక ఇరవై సెకన్లలో జరిగిపోయాయి. అంతే, ఒక్కసారి ఫోన్‌లోంచి బయటకి వచ్చిన నేను ఆదృశ్యం చూసి వణికిపోయాను. ఇది చాలా పెద్ద క్యాజువాల్టీ అని నా అనుభవం చెప్తోంది. జరగబోయే అవమానాలూ ప్రమాదాలూ ఎలా తప్పించుకోవాలా అని నా బ్యూరోక్రాటిక్ బ్రెయిన్ చకచకా ఆలోచిస్తోంది. అక్కడ నుంచి పారిపోయే అవకాశం లేదు. నా వేళ్ళు ఫోన్‌లోని పోలీస్ ఫ్రెండ్స్ నంబర్ల కోసం వెతుకుతున్నాయి. మా అబ్బాయి ఐతే దాదాపు స్పృహ తప్పిపోయాడు. ఒకపక్క ఎగ్జామ్ టైమ్ అయిపోతోంది. వాడు మైనర్. డ్రైవింగ్ లైసెన్స్ లేదు. వాడికి కారు ఇచ్చినందుకు నామీద అదో కేసు. ఒక్క మనిషికి ఇన్ని కష్టాలా? కొంపదీసి ఇదంతా దేవుడి పరీక్షా? ఛఛ, నేనేమిటీ ఈ ఆలోచనేమిటీ? వెంటనే సర్దుకున్నాను. ఇంతలో జనం మొత్తం మూగేశారు.
‘‘ఆ కారువాడ్ని పట్టుకోండి’’ అంటున్నారెవరో.
ఇక లాభంలేదు అనుకుని నెమ్మదిగా వాళ్ళకేసి వెళ్ళాను. ‘‘సారీ అండీ, మా అబ్బాయి ఎగ్జామ్‌కి టైం అయిపోతోంది, ఆతొందర్లో..’’అంటూ నసిగాను మొహం లో ఎక్కడలేని దైన్యం తెచ్చిపెట్టుకుని.
బండి మీద ఉన్న ఇద్దరూ అయ్యప్ప మాల వేసుకుని ఉన్నారు. నడివయసు ఉంటుంది. ఒకడికి చెయ్యీ, ఒకడికి కాలూ బాగా చెక్కుకుపోయాయి. ఇక ఆ అమ్మాయి పరిస్థితి మరీ ఘోరం. భర్త కొబ్బరికాయ కొనడానికి వెళ్ళినట్టున్నాడు. ఆమె వాళ్ళ బండి దగ్గర వెయిట్ చేస్తోంది. ఆ బండే ఆమెమీద పడి పోయింది. ఎవరో నెమ్మదిగా బండి లేపారు. ఆమెను లేపి గట్టుమీద కూర్చో పెట్టారు. ఆమె షాక్‌లో ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. ఎవరో మొహంమీద నీళ్ళుచల్లారు.నెమ్మదిగా కళ్ళువిప్పింది.
ఎవరో అంటున్నారు ‘‘అమ్మా, మీవారిని పిలవండి. ఆ కారువాడ్ని వదలకండి. ముందు హాస్పిటల్‌కితీసుకెళ్ళమనండి. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. బాబూ, మీరు కూడా హాస్పిటల్‌కి వెళ్ళండి. కంప్లైంట్ ఇవ్వండి’’ అని బండిమీద నుంచి పడిన ఆ ఇద్దరికీ కూడా చెప్తున్నారు.
నాకెందుకో మొట్టమొదటి సారి భయంవేసింది. వాళ్ళకి తగిలిన దెబ్బల గురించో, హాస్పిటల్ బిల్ గురించో, పోలీసు కేసు గురించో కాదు, ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే- ఆమె కొత్త పెళ్ళికూతురిలా ఉంది. ఎందుకో వాళ్ళ ఆయనవస్తే నన్నులాగి కొడతాడేమోనని ఒక గట్టి నమ్మకం. అదే జరిగితే, నా పరువేం కావాలీ, నాఅహం ఏంకావాలీ, నా హోదా ఏం కావాలి?
అప్పుడు జరిగిందా సంఘటన- పడిపోయిన ఆ ఇద్దరు అయ్యప్పలూ లేచి, ఒళ్ళు దులుపుకున్నారు. ఆ అమ్మాయి దగ్గరకి వచ్చారు. ‘‘అమ్మా, మీకెలా ఉంది?’’ అడిగారు.
ఆ అమ్మాయి వాళ్ళిద్దరికేసి చూసి, అంత నొప్పిలోనూ వాళ్ళకి నమస్కారం పెట్టింది.‘‘స్వామీ,నేనుబాగానే ఉన్నాను, మీకేం దెబ్బలు తగల్లేదు కదా. మీరు పూజకి వెళ్తున్నట్టున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి’’ అంది.
వెంటనే వాళ్ళిద్దరూ నాకేసి తిరిగి ‘‘సర్, మాకేం పెద్ద దెబ్బలు తగల్లేదు.ఆ స్వామి దయవల్ల ఆ అమ్మాయి కూడా బానే ఉందట. మీరు బయలుదేరండి. అబ్బాయి పరీక్షకి వెళ్తున్నట్టున్నారు. తొందరగా వెళ్ళండి’’ అన్నారు.
ఇంతలో పక్కనుంచి ఎవరో అంటు న్నారు ‘‘అమ్మా, చూసుకోండి. ఒకసారి కారతను వెళ్ళిపోతే, ఆ తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళవలసి వస్తే బిల్లు మీరే ఇచ్చుకోవాలి. కనీసం మీ ఆయన వచ్చేవరకూ అయినా అతన్ని ఆపండి’’ అంటున్నారు.
అయినా, ఆ అమ్మాయి ‘‘ఏం ఫర్వాలేదండీ, నేను బాగానే ఉన్నాను. ఆయన్ని వెళ్ళనివ్వండి’’ అంది నవ్వుతూ అంత బాధలోనూ.
ఇంకొక్క క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి పరిగెత్తమంటోంది బుద్ధి. ఉండమంటోంది మనసు. మొట్ట మొదటి సారి నా మనసు గెలిచింది. వెంటనే ఆ ఇద్దరు అయ్యప్ప భక్తుల చేతులూ పట్టుకున్నాను. మనస్ఫూర్తిగా ‘‘క్షమించండి’’ అన్నాను.
‘‘అయ్యో, ఏం ఫర్వాలేదు సర్, మీరు వెళ్ళండి’’ అన్నారు వాళ్ళు. అప్పుడు ఆ అమ్మాయి దగ్గరకి వెళ్ళాను.
‘‘అమ్మా, నన్ను క్షమించు. నావల్ల చాలా పెద్ద ప్రమాదం జరగబోయింది. ఎందుకైనా మంచిది హాస్పిటల్‌కి వెళ్దాం పదండి’’ అన్నాను.
‘‘నాకేం కాలేదు సర్, మీరు వెళ్ళండి. మీ అబ్బాయి పరీక్ష టైమ్ అవుతున్నట్లుంది’’ అంది నవ్వుతూ.
అక్కడనుంచి మావాడ్ని కాలేజీలో దింపి ఇంటికి వచ్చాను. మనసులో ఏదో మధనం... గుండెల్లో ఎక్కడో
అలజడి. ఉన్నచోట నిలబడలేక పోతున్నాను. ఎందుకో ఒకసారి పూజ గదిలోకి వెళ్ళాలనిపించింది. కమల అక్కడ కూర్చుని ఏదో పుస్తకం చదువు కుంటోంది. చప్పుడు చేయకుండా వెళ్ళి నుంచున్నాను. మొదటిసారి దేవుడి విగ్రహంకేసి చూశాను. ఎందుకో దేవుడు నవ్వుతున్నట్టనిపించాడు.
గబగబా కారు తీసుకుని పొద్దున కమలని తీసుకెళ్ళిన శివాలయానికి వెళ్ళి కారాపి, కొబ్బరికాయలు అమ్మేవాడి దగ్గరకి వెళ్ళాను.
‘‘బాబూ!’’ పిలిచాను.
‘‘చెప్పండి సార్’’ అన్నాడు కొట్టువాడు.
‘‘గుర్తుందా, పొద్దున ఒక కుర్రాడు నా కారుని గుద్దాడు. నేను అతన్ని ... కొట్టాను.’’
నేను పూర్తిచేసేలోగానే అతనన్నాడు ‘‘అవును సర్, చెప్పండి’’ అన్నాడు.
‘‘ఆ కుర్రాడు ఎవరో నీకు తెలుసా?’’ అడిగాను.
‘‘తెలుసు సార్. ఆ విషయమే నేను మీకు చెప్పబోయాను. మీరు వినలేదు. ఆ కుర్రాడు ఇంజినీరింగ్ చదివాడు. ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తు న్నాడు. సాయంత్రంపూట పేటలో కుర్రాళ్ళందరికీ ఉచితంగా ట్యూషన్ చెప్తుంటాడు సర్. పోయిన నెలలో అమ్మగారు గుడిలో నీరసానికి కళ్ళు తిరిగి పడిపోతే, ఈ కుర్రాడే అమ్మగార్ని దగ్గరుండి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి, తగ్గాక ఇంటిదగ్గర దింపాడు సర్. చాలా మంచోడు సర్, వదిలేయండని పొద్దున మీకు చెప్పబోయాను. మీరేమో... " అన్నాడతను మొహమాటంగా.
అంతకుమించి అనకపోవటం అతని గొప్పతనం. చదువు వేరు, సంస్కారం వేరు. నాకేమనాలో అర్థం కాలేదు. వెంటనే షూస్ కారులోనే విప్పి గుళ్ళోకి పరిగెత్తాను. లోపలఏంచేయాలో నాకు తెలియదు. పంతులుగారు ఏదో అడుగుతున్నారు‘‘అర్చనా, అభిషేకమా వ్రతమా’’అని. నాకు అవేమీతెలియవు. అలా దేవుణ్ణే చూస్తూ ఉండిపోయాను. దేవుడు నవ్వుతున్నాడు. బయటికి వచ్చి రావిచెట్టు కింద కూర్చున్నాను. అప్పుడు మొదలైంది నాలో ఆలోచనల సునామీ.
ఒకవేళ అందరూ నాలానేఉండుంటే?బలిష్టంగా ఉన్న పాతికేళ్ళ ఆ కుర్రాడు పొద్దున నన్ను తిరిగి కొట్టుంటే..? ఆ తర్వాత గుడి దగ్గర మేము చేసిన యాక్సిడెంట్‌కి వాళ్ళు నా కాలర్ పట్టుకు నాలుగుతన్ని, ఆతర్వాత కేసుపెట్టుంటే? నా భార్యకి కూడా దేవుడంటే నమ్మకం లేకుంటే, నా అహంకారాన్ని ఆమె భరించేదా? అన్ని అప్పులున్న అప్పారావు నాకంటే సంతోషంగాఉండ గలుగుతున్నాడంటే..? ఎన్నో ప్రశ్నలు.
ఒక్కటే సమాధానం... గుళ్ళొ దేవుడి చిరునవ్వు!
సివిల్ సర్వీస్‌ఎగ్జామ్‌లోకష్టమైన ప్రశ్నకి సమాధానం దొరికినప్పుడు కలిగిన రిలీఫ్.
దైవమంటే విగ్రహంకాదు, మనలోని నిగ్రహం. దైవమంటే మాయ కాదు, మనకందే సాయం. భక్తంటే కాలక్షేపం కాదు, ఏకాగ్రత... మనకొకరున్నారనే భద్రత... మనలోని అహాన్ని గ్రహించే ఒక గ్రాహకం.
బయటికి వచ్చి కొబ్బరి కాయల కొట్టతనికి రెండువేలూ, నా విజిటింగ్ కార్డూ ఇచ్చి, పొద్దున నేను కొట్టిన కుర్రాడికి ఇచ్చి అతన్ని ఫోన్ చేయమని చెప్పాను.
ఒంట్లో ఉన్న బరువంతా దిగిపోయి, నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి బయల్దేరాను. కారుదేముంది, ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు- తీరు మార్చుకోవడం కష్టం కానీ.ఆరోజు నుంచి నాకెప్పుడూ క్యాలెండరులో ‘చందన బ్రదర్స్’ పేరు కనబడలేదు- స్వామి చిరునవ్వు తప్ప.
‘దైవం మానుష రూపేణా!’
ఈ కధలో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటి అంటే ...
దైవం అంటే విగ్రహం కాదు నిగ్రహం అనేది!...✍️️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
Comments
Post a Comment