తిరువణ్ణామలై అరుణాచలం గిరిప్రదక్షణకు
పర్వతమలై మల్లిఖార్జున ఆలయం
శివుని నివాసాలైన హిమాలయ పర్వతశ్రేణిలోని కైలాసపర్వతం మరియు తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై.
మనదేశంలో భక్తులు గిరిప్రదక్షిణలుచేసి శివుని అనుగ్రహాన్ని కోరుకునే పుణ్యక్షేత్రాలు.
మల్లిఖార్జున స్వామి లింగ రూపంలో దర్శన మిచ్చే తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లాలో పర్వతమలై క్షేత్రంకూడా ఆక్షేత్రముల వలే గిరిప్రదక్షణకు విశిష్టమైనది. ధ్యానంకోసం సిద్ధులు ఏర్పాటు చేసుకొన్న పవిత్ర ప్రదేశాలలో పార్వతమలై శివునిఆలయం ఒకటి.
ఆలయంలో శివుడు మల్లికార్జున రూపంలో భార్య పార్వతీదేవితో పూజింపబడు చున్నారు. ఆలయంగురించి జనబాహుల్యానికి చాలా అరుదుగా తెలుసు మరియు మల్లికార్జునుడి దర్శనం కోసం చాలా కష్టమైన పర్వతారోహణ అవసరం.
పర్వతమలై తూర్పుకనుమల్లో తమిళనాడురాష్ట్రం తిరువన్నామలైజిల్లా పోలూరు, తెన్మడిమంగళం, కడలాడి గ్రామాలకు సమీపంలో ఉన్న కొండ.. సముద్రమట్టం నుండి సుమారు మూడువేల అయిదువందల అడుగుల ఎత్తులోనున్న కొండల అగ్రభాగమున శివాలయం మరియు విటోబాస్వామి సమాధి ఉన్నాయి.
ఆలయానికి తలుపులు లేకపోవుట మరియు అన్నిసమయాల్లో తెరువబడి ఉండుటబట్టి ఈప్రదేశంలో ప్రబలమైన దైవశక్తి ఉన్నదని గ్రహించ వచ్చును. పర్వతమలై కొండనందు అద్భుతశక్తులు దాగిఉన్నాయని చెబుతారు. స్థానికులు మరియు యాత్రికులు కొండ చుట్టుపక్కల సజీవ సిద్ధులు ఉన్నారని నమ్ముతారు.
పర్వతమలైపర్వతం తిరువణ్ణామలై నుండి 35 కి.మీ పోలూరునుండి 22 కి.మీ, ఆరణి నుండి 50 కి.మీ దూరంలో ఉన్నది. ఈ మూడు పట్టణములనుండి పర్వతామలై చేరుకోడానికి బస్సు సౌకర్యంఉన్నది. ఈపట్టణాలలో రాత్రి బసకు వసతిసౌకర్యం లభ్యం. పర్వతమలై చెన్నై నుండి సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది. కావున విమానప్రయాణం చేయువారు చెన్నైవరకు విమానంలోను అచ్చటినుండి టాక్సీలోనూ పర్వతమలై సమీప పట్టణంచేరుకొని అచ్చట బస చేయవచ్చు.
పర్వతమలై కొండపైభాగం సుమారు ఆరుకిలోమీటర్లు. కొండ పైకి చేరుకోవడానికి యాత్రికులు వారి శరీర ధారుఢ్యం, వయస్సు మరియు ఆరోగ్య స్థితినిబట్టి ప్రయాణించ వలసిఉంటుంది.. పైకిచేరుకోడానికి సుమారు 6 గం పడుతుంది. మల్లికార్జున స్వామి దర్శనంపట్ల పట్టుదల కొండఎక్కడానికి ఉత్సాహం నింపుతుంది. కొండ ఎక్కడం భక్తుల శారీరక, మానసిక శక్తికి పరీక్ష. పర్వతమలైకొండ మెట్లు, బండరాళ్లు కలిగి పర్వతారోహకులకు మాత్రం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మార్గంమంతా అనేక చిన్నచిన్న దుకాణాలు ఉన్నాయి. కొండపై ఆలయ విస్తీర్ణం పరిమితం కాబట్టి అవసరమైన పూజా సామగ్రిని తీసుకెళ్లాలి. కొండలో చాలా భాగం నెట్‌వర్క్ పరిధిలోఉంటుంది. యాత్ర చేసేవారు నడకద్వారా కొండపైకి చేరు యాత్రికులు తెన్మడి మంగళం మార్గంద్వారా చేరతారు. పర్వతారోహణపై ఆశక్తికలవారు కఠినమైన కదలడి మార్గం ఎంచుకుంటారు. రెండు మార్గాలు మధ్యలోకలిసి కొండపైఉన్న ఆలయానికి దారితీస్తాయి. కాలినడకన ఆలయానికి చేరుకోవాలి ఆనుకునే యాత్రికులు ముందుగా తెలియజేయడం ద్వారా పర్వతమలై దిగువన ఉన్న ఆశ్రమంలో వసతి పొందుటతో పాటు కొండపైకి చేరుకోవడానికి మార్గం తెలుసుకోవచ్చు.
.
పర్వతమలై ప్రసిద్ధమైన ఔషధ మూలికలుకల ప్రదేశం. భక్తులు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని పఠిస్తూ పార్వతీదేవిని స్మరిస్తూ ఒక్కోమెట్టు ఎక్కుతూ కొండను అధిరోహిస్తారు. ఆలయాన్నిదర్శించే భక్తులు జీవితంలోని దుఃఖాలనుండి స్వామి విముక్తి ప్రసాదిస్తాడని మరియు సన్మార్గ ఆచరణకు మార్గం చూపుతాడని నమ్ముతారు. ఆస్తి, ధన, ప్రేమ, వివాహ, కుటుంబ సమస్యలు మరియు విధ్యాసమస్యలు ఉన్నభక్తులు శివునిపై అత్యంత భక్తితో ఆలయం దర్శించడంద్వారా పరిష్కారం పొందుతారు.
మల్లిఖార్జునుడు మరియు అదృశ్యరూపులైన సిద్ధులు భక్తులకు ఉజ్వల భవిష్యత్తు సాధించుమార్గాన్ని నిర్ధేశించి ఆశీర్వదిస్తారని కధనం. పాదరక్షలు లేకుండా చెప్పులు లేని కాళ్ళపైకి ఎక్కితే, అధిక ఫలం పొందవచ్చు. కానీ ఇది చాలా కష్టమైన పని. ఇతర ఆలయాల్లోవలే కాక ఈఆలయంలో శివునికి భక్తులే స్వయంగా పూజలు చేయవచ్చు.
జగద్గురు శ్రీఆది శంకరాచార్యులువారు లింగరూపంలో ఉన్నకొండను చూచి మల్లిఖార్జునుడిని దర్శించడానికి కొండపై అడుగు పెట్టకుండా గిరిప్రదక్షిణ చేశారని కధనం.
శ్రీరమణమహర్షి జ్ఞానదృష్టిద్వారా కొండశక్తిని కనుగొని తిరువణ్ణామలై మరియు పర్వతమలై పరిసరాల్లో నివసించువారు ధన్యులని చెప్పారని తెలుస్తున్నది.
కొండపైకిఎక్కి మల్లిఖార్జునుని దర్శంచ శక్తిలేని యాత్రికులు తమిళ మాసం మర్గజి మొదటిరోజు మరియు పౌర్ణమిరోజులలో కొండచుట్టూ గిరివలయ ప్రదక్షిణచేస్తారు.. నలభై ఎనిమిది పౌర్ణమి మరియు అమావాస్య రోజులలో పర్వతమలైని దర్శించే భక్తులు కైలాసపర్వతంపై శివునిదర్శనం పొందడంతో సమానమైన ఫలం పొందుతారని తెలుపబడింది.
పర్వతమలై గిరివలయం మార్గం దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మరియు గిరివలయ ప్రదక్షిణ చేయడానికి దాదాపు పది గంటల సమయం పడుతుంది. తెన్మడిమంగళం నుండి కొండ ప్రదక్షిణమార్గం ప్రారంభమై అడవి జంతువులున్న కొండలు, అడవులద్వారా సాగుతుంది. ప్రదక్షణలోవచ్చు మూలికలగాలి ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. పర్వతమలై పర్వతానికి ప్రదక్షిణలుచేసే యాత్రికులకు తిరువణ్ణామలై, పోలూరు మరియు అరణి వంటి సమీప పట్టణాలలో వసతి అందుబాటులో ఉంది. ఆరోజు బసచేయడానికి మరుసటిరోజు కొండపై మల్లిఖార్జునుడిని దర్శించుకోవడం లేదా పర్వతమలై పర్వతానికి ప్రదక్షిణ చేయడం ద్వారా మరుసటి రోజు కష్టపడి పనిచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి బస అనువైనది. మార్గశిర శుద్ధపాడ్యమి రోజు ప్రారంభమయే ప్రధాన గిరి ప్రదక్షణయందు లక్షలాదిమంది ప్రజలు పాల్గొంటారు. అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో కూడా మల్లికార్జున రూపుడైన పరమశివుని ఆశీస్సులు పొందేందుకు వేలాదిమంది భక్తులు గిరిప్రదక్షణ చేస్తారు. గిరి ప్రదక్షణం రోజున భక్తులకు ఉచిత భోజనం అందజేస్తారు.
త్రేతాయుగంలో, ఆంజనేయుడు లక్ష్మణుడు మూర్ఛ నుండి కోలుకోవడానికి సంజీవని పర్వతాన్ని తీసుకువస్తున్నప్పుడు, సంజీవని పర్వతం యొక్క ఒక భాగం కిందపడిందని మరియు పర్వతమలై అని పిలువబడిందని నమ్ముతారు. ఈ కొండ సంజీవని పర్వతంలో ఒక భాగం కాబట్టి ఔషధ మూలికలు ఉన్నాయని నమ్ముతారు. అరుదైన ఇచ్ఛటి ఔషధ మూలికలు హిమాలయ శ్రేణులలో మాత్రమే కనిపిస్తాయి అన్నవాదన ఈవిషయం ధృవపరుస్తుంది.
ఈవిషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరుజిల్లా నందున్న అర్ధగిరి క్షేత్రం గురించి తెలుపవాల్సి ఉన్నది.
జాంబవంతుని ఆదేశంప్రకారము ఆంజనేయుడు హిమాలయ పర్వతములందలి ద్రోణగిరిపర్వతం చేరి ఔషధమొక్కలందు సంజీవని తెలుసుకొవడం కష్టమై పర్వతమునే పెకలించి లంకకు తీసుకు వచ్చేటప్పుడు శ్రీరాముని సోదరుడైన భరతుడు చీకటిసమయం ఆగుటవలన తమకు హానిచేయుటకు రాక్షసులు పర్వతము తెస్తున్నారని భావించి హనుమంతునిపై బాణం వేయగా అది పర్వతానికి తగిలి సగభాగం భూమిపై పడింది.
పడిపోయిన పర్వతభాగాన్ని అరకొండ లేదా అర్ధగిరి అని మరియు గ్రామాన్ని అర్ధగిరి అని పిలుస్తారు. రెండు క్షేత్రాలు ఉత్తరాన హిమాలయములనుండి దక్షణాన రామేశ్వరం మార్గంలోనే ఉన్నవి కనుక ఆంజనేయుడు ఆకాశమార్గమున పయనించాడు కాబట్టి రెండు క్షేత్రాలలో పర్వత భాగములు పడే అవకాశం ఉన్నది.
మూలికల నుండి వచ్చే గాలి మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి మంచిది. పర్వతమలైలో రాత్రిపూట గడిపే భక్తులు అమావాశ్య రోజున చీకటిలో, దివ్యమైన ప్రకాశం తమ ముందు అద్భుతంగా కనిపించిందని మరియు అది తమ జీవితఅనుభవం అనిచెపుతారు.
కర్పూరం మరియు పూల వాసనలు, గంటల మ్రోత సిద్ధులు చేయుపూజలకు సంకేతాలని నమ్ముతారు. పర్వతమలై కొండ ఎక్కేటప్పుడు భక్తులకు ఎలాంటి హానికరమైన సంఘటనలు జరగలేదని చెబుతారు. నగరాలు మరియు పట్టణాలనుండి పర్వతమలై యాత్రికులకు రాత్రిబసలో వికసించే అరుదైన పూల వాసన ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది.
వందకు పైగా ఔషద మూలికలున్న పర్వతమలైని కొద్దికాలం ప్రతిరోజూ సందర్శించడంవల్ల కొండపైఉన్న మూలికల ప్రభావంవల్ల వ్యాధులు, ఒత్తిడి, ఆందోళన మరియు ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. పర్వతారోహణకానీ గిరిప్రదక్షణకానీ చేయదలచిన యాత్రికులు వారితో త్రాగునీరు, ఫలహారాలు, అవసరమైన పూజాసామాగ్రి, టార్చ్ లైటు మరియు రాత్రి బసకు ఇతర అవసరమైన మందులు తీసుకు వెళ్లవలసి ఉంటుంది. పర్వతమలై కొండలను చేరుకోనే మార్గంలో హనుమంతుడు, వినాయకుడు, అమ్మవారితోపాటు సప్తమునీశ్వర మరియు వనదుర్గ దేవత ఆలయాలు ఉన్నాయి.
పర్వతమాలై గిరిప్రదక్షణం మల్లిఖార్జున దర్శన ధనంతో కాదు సాధ్యం భక్తితో సుసాధ్యం.
Comments
Post a Comment