కారకాంశ ఫలములు
కారకాంశ ఫలాధ్యాయము
కారకాంశ ఫలములు
నేనిప్పుడు బహ్మ చెప్పినరీతిగా మేషాది నవాంశగత ఆత్మకారక గ్రహఫలమును చెప్పుచున్నాను.
ఆత్మకారకుడు మేషానవాంశలో ఉన్న - జాతకుడు గృహమున ఎలుకలకు - పిల్లులకు భయపడు స్వభావము కలవాడగును. పాపసంబంధమున్న విశేషముగా ఉండును.
వృషభాంశయందున్న -చతుష్పాత్తుల వలన సుఖము కలుగును.
మిథునాంశమందున్న - దురద మెుదలైన రోగములు కలుగును.
కర్కాటకాంశయందున్న - నీటిభయ ముండును.
సింహాంశయందున్న -క్రూరమృగముల వలన భయము కలుగును.
కన్యాంశయందున్న - స్థౌల్యము, దురద, అగ్నిభయము కలుగును.
తులాంశమున ఉన్న - వాణిజ్య, వృత్తి, వస్త్రములు తయారీచేయుట ఉండును. వృశ్చికాంశలో ఉన్న - సర్పభయము, తల్లికి సనవ్రణము కలుగును.
ధనురంశయందున్న - పైనుండి పడుటగాని, వాహనము నుండి పడుటగాని జరుగును.
మకరాంశలోనున్న - జలజంతువులయిన చేపలు, శంఖములు, ముత్యములు, పగడములు, పక్షులనుండి నిస్సంశయముగా లాభము కలుగును.
కుంభాంశయందున్న - తటాకాది నిర్మాణమువలన కీర్తిమంతు డగును.
మీనాంశ యందున్న - సాయుజ్యముక్తి నందును.
శుభగ్రహ దృష్టి వలన అశుభమురాదు; అట్లే పాపగ్రహ సంబంధమున్న శుభము జరుగును.
ఆత్మకారకుడున్న అంశయందుగాని, లేక లగ్నాంశయందుగాని శుభగ్రహమున్నమున్నను, శుభగ్రహదృష్టి వున్నను జాతకుడు రాజగును.
కారకంశనుండి కేంద్రకోణములందు శుభగ్రహములుండి, పాపదృష్టి లేకున్న జాతకుడు ధనికుడు, విద్వాంసుడు నగును. మిశ్రగ్రహములున్న ఫలితమును మిశ్రమే యని చెప్పవలెను.
ఉపగ్రహము (మధ్యాంశలు కలవాడు - ఆత్మకారకునికి - చివరివానికి మధ్యవాడు) స్వ, ఉచ్ఛరాశులందుండి, శుభగ్రహసంబంధమున్న పాపదృష్టి లేకున్న - అంతమందు కైవల్యము - మెాక్షము కలుగును.
చంద్ర, కుజ, శుక్ర, వర్గములందాత్మ కారకుడున్నవాడు పరదారరతుడగును. మరొకచోట ఉన్న, ఫలము మరొకరీతిగా ఉండును.
గ్రహ కారకాంశ -
ఆత్మకారకుని నవాంశయందు రవియున్న జాతకుడు రాజకార్యపరుడగును. పూర్ణచంద్ర, శుక్రుల దృష్టియున్న భోగియు, విద్యకలవాడు నగును.
బలవంతుడైన కుజుడున్న - అగ్నిచే జీవించువాడుగాని, రసవాదిగాని అగును. బలవంతుడైన బుధుడున్న - వర్తకమున నిపుణుడు, పండితుడు, శిల్పకళా ప్రవీణుడు అగును.
గురుడున్న వేదశాస్త్ర పండితుడు, సత్కర్మనిరతుడు నగును.
శుక్రుడున్న -దీర్ఘజీవి, కాముకుడు, రాజకార్యములు చేయువాడు నగును. శనియున్న - విశిష్టమైన కార్యమువలన ప్రసిద్ధుడును, రాజమాన్యుడు నగును.
రాహువున్న - ధనుర్ధారి, చోరుడు, లోహయంత్రాదికము చేయువాడు, విషములిచ్చు వైద్యుడు అగును.
కేతువు - చోరుడు, గజాది వ్యాపారము చేయువాడు అగును.
Comments
Post a Comment