రోబోట్లు (మరమనుషులు) :
🕉🌺 ఆధ్యాత్మికం🌺🕉 @aadyaatmikam360°:
పురాణాల్లో సైన్స్
(రచన: పోలిశెట్టి బ్రదర్స్)
శాస్త్రీయపరంగా మన ప్రాచీన మేధావులు :
శాస్త్రీయరంగాన అలనాటి రోబోట్లు (మరమనుషులు) :
నేటి సైన్స్ యుగాన మరమనుషుల (రోబోట్స్) తయారీ ఒక విశేష అంశం. ఆధునిక శాస్త్రవేత్తల మేధస్సుకు మచ్చుతునకలుగా "రోబోట్స్" ను చెప్పుకుంటున్నాం మనం. ఐతే, మన పురాణకాలంలోనూ ఈ రోబోట్స్ ప్రస్తావన కనిపిస్తోంది.
"యోగవాసిష్ఠం" లో ఒక కథ ఉంది. "దాళ, వామ, కటు" అనే ముగ్గుర్ని బ్రహ్మదేవుడు సృష్టించాడట. ఆ ముగ్గురికీ స్వంతంగా ఆలోచించే శక్తి లేదట. స్వతంత్రించి ఏ పనీ చేయలేరట. కాని, యజమాని చెప్పిన ఆజ్ఞను మాత్రం చక్కగా పాటిస్తారట. "యోగవాసిష్ఠం" వీరిని "చేతనామాత్ర జీవులు" అని పేర్కొన్నది. వీరి లక్షణాలు, ఆధునిక రోబోట్స్ లక్షణాలను పోలి ఉండడం గమనించండి.
ఇకపోతే, చారిత్రకంగా చూస్తే 11 వ శతాబ్దిలోనే మరమనుషుల వాడకం మనదేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. పారమార వంశస్థుడైన భోజరాజు వ్రాసిన "సమరాంగణ సూత్రధార" అనే గ్రంథంలో ఇందుకు సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇంటిపనులకు ఉపయోగించే రకరకాల మరమనుషుల గురించి వర్ణనలు ఇవ్వబడ్డాయి. ద్వారపాలకులుగా కర్రతో చేసిన మరమనుషులను నియోగించేవారట. వారి చేతిలో కర్ర, బల్లెం, శూలం వంటి ఏదో ఒక ఆయుధం ఉండేదట. అక్రమంగా ఇళ్ళల్లోకి ప్రవేశించేవారిని, వీరు ఆపివేసేవారట. పనిమనుషులుగా ఉపయోగించబడే మరమనుషులు పెద్దలకు స్వాగతం చెప్పడం, ఆహార పదార్థాలను వడ్డించడం, సంగీత వాయిద్యాలను వాయించడం, మొక్కలకు నీళ్ళు పోయడం వంటి పనులు చేసేవారట. ఈ మరమనుషులను కొయ్యతో తయారు చేసేవారట. తోలు లేదా వస్త్రాలతో వారిని అలంకరించేవారట. అవసరమైన చోట్ల రంధ్రాలు, నాళికలు, దారాలు, కడ్డీలు వంటివి అమర్చి, అవన్నీ ఒక యంత్రం ద్వారా కదిలే ఏర్పాటు చేసేవారట. ఇదీ ప్రాచీనకాలపు రోబోట్ల సంగతి!
అలనాటి ఇంజినీర్లు :
ఈసారి పురాణకాలపు ఇంజినీర్ల విషయం చూద్దాం.
దేవశిల్పిగా పేరొందిన ' విశ్వకర్మ ' త్రేతాయుగములో అందమైన లంకానగరాన్ని నిర్మించాడు. "రామాయణము" లో ఇవ్వబడిన లంకానగర వర్ణన మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. అక్కడి రాజవీధులు, నగర వీధులు, వివిధ కట్టడాల నిర్మాణరీతులు నిజంగా అద్భుతమనిపిస్తాయి. కందకాలపై నిర్మించిన వంతెనలను కావాలంటే మామూలుగా ఉంచి, శత్రువులు వచ్చే వేళ పైకి ఎత్తివేయడం, చిత్రవిచిత్ర జలయంత్రాల (ఫౌంటెన్స్) ఏర్పాట్లు, రమణీయమైన వాస్తు... మున్నగునవి లంకానగరంలోని కొన్ని ప్రత్యేకతలు. పుష్పకవిమానం సంగతి సరేసరి! దాన్ని తయారు చేసినవాడు కూడా విశ్వకర్మే! సకల కళలకూ, శిల్పశాస్త్రాలకూ ఆదిగురువు ఈయన.
రామాయణకాలపు వానరసేనలో ' నలుడు ' అనే గొప్ప ఇంజినీరు ఉన్నాడు. ఇతడు విశ్వకర్మ కుమారుడు. లంకను చేరేందుకు సముద్రముపై వారధి నిర్మింపజేసిన మేధావి ఇతడే!
ఋషీకేష్ లో "లక్ష్మణఝూలా" అనే ప్రసిద్ధమైన వంతెన నిర్మింపబడింది. ఊయల ఊగుతున్నట్లుగా ఉండే ఆ వంతెన గంగానదిపై నిర్మించబడింది. దాన్ని త్రేతాయుగంలో లక్ష్మణుడు నిర్మింపజేశాడని ప్రతీతి. లక్ష్మణునికి సాంకేతికవిద్య బాగా తెలుసునన్నమాట. (ప్రస్తుతం ఋషీకేష్ లో "లక్ష్మణఝూలా" గా ఉన్నది, ఆనాటి వంతెన కాదు. ఆనాటి "లక్ష్మణఝూలా" స్థానంలో ఆధునికంగా నిర్మించబడిన మరో వంతెన ఇది.)
ఇక ద్వాపరయుగానికి వద్దాం. "మహాభారతము" లో ' మయుడు ' అనే ఇంజినీరు మయసభ ను నిర్మించి, ధర్మరాజుకు బహూకరిస్తాడు. మయసభను గురించి వేరే చెప్పేదేముంది?!... మనందరకూ తెలుసు. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక అది. బంగారం వంటి ఖనిజాలనూ, నవరత్నాలనూ, అద్దాలనూ ఉపయోగించి కాంతి పరావర్తనం, ప్రతిబింబించడం, వస్తువు రెండు విధాలుగా కనిపించడం.... మొదలైన ప్రక్రియలతో 'ఉన్నవి లేనట్లుగానూ, లేనివి ఉన్నట్లుగానూ' అనిపించే రీతిలో ఈ మయసభా నిర్మాణం జరిగింది. ఈనాటి ఆర్కిటెక్ట్ లకు మతులు చెదరగొట్టగల నిర్మాణం అది!
పురాణకాలపు ఇంజినీర్లు ఎంతోమంది తమ మేధాసంపత్తితో నదుల దారిని మళ్ళించి, వివిధ ప్రాంతాలను సస్యశ్యామలం చేశారు. ఇందుకు సంబంధించిన విషయాలను ' నదుల దారి మళ్ళింపు ' అనే ఈ క్రింది అంశం ద్వారా తెలుసుకుందాం.
నదుల దారి మళ్ళింపు :
పురాణాల్లో నదుల పుట్టుకలను గురించి, నదులు ప్రవహించిన తీరును గురించి కొన్ని కథలు, గాథలు కనిపిస్తాయి. వాటిలో ఎంతో అంతరార్థం దాగి ఉంది.
' గంగావతరణం ' కథలోని అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు ఇంజినీర్లే! మేఘాల నుండి కురిసే వర్షపునీరు హిమాలయాలపై పడి వృధాగా పోతుందని, ఆ నీరంతా వృధా కాకుండా ఒక మార్గానికి మళ్ళిస్తే 'ఒక నదిగా' ఏర్పడుతుందని భావించిన అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు ఒకరి తర్వాత ఒకరుగా ప్రయత్నించి, ప్లాను చేసి, చివరకు ' గంగానది ' గా మార్చి ప్రవహింపజేసి, ఉత్తర భారతావనిని సస్యశ్యామలం చేశారు.
నేడు "గంగా-కావేరి పథకం" అంటూ గంగానదినీ, కావేరీనదినీ కలిపే పథకంలో ఎందరో ఇంజినీర్లు పనిచేస్తున్నారు. అలాగే "తెలుగుగంగ" పథకంలో సైతం ఎందరో ఇంజినీర్లు తమతమ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఇటువంటి బృహత్తరమైన పథకాలకు ఒకే ఇంజినీరు సరిపోడు కదా! ఆ విధంగానే గంగానదిని రూపొందించి తీసుకురావడంలో అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు అనే ముగ్గురు ఇంజినీర్లు కావలసివచ్చారు.
పూర్వం ఒకసారి కొన్ని ప్రాంతాల్లో 14 ఏళ్ళపాటు కరువు సంభవించగా, దాన్ని నివారించమని ప్రజలు కోరిన మీదట ' మహాపతివ్రత అనసూయ ' తన మేధాశక్తితో జాహ్నవీ నదిని ఆ ప్రాంతాలకు మళ్ళించే ప్లాను చేసి, దాన్ని అమలు జరిపించి, కరువు నిర్మూలనకు తోడ్పడింది. అనసూయ ఆనాటి మహిళా ఇంజినీరన్నమాట. ఐతే, అనసూయ తన తపశ్శక్తితో జాహ్నవీ నదిని దారి మళ్ళించిందని పురాణ పరిభాషలో గ్రంథస్థం చేయబడింది
మన గోదావరి నది సంగతి చూడండి. పడమటి కనుమల్లో కురిసిన వర్షపునీరు వృధాగా పోతుందని గమనించిన గౌతమ మహర్షి, దాన్ని ఒకే ప్రవాహంగా తీసుకొచ్చి ' గోదావరినది ' గా ప్రవహింపజేశాడు. దీన్నే ఒక పురాణకథగా మన పూర్వీకులు చెప్తూ, గోహత్యా పాతక నివారణార్థం తపశ్శక్తితో గోదావరి నదిని గౌతముడు తెచ్చాడన్నారు.
దక్షారామ భీమేశ్వరస్వామి స్థాపన కోసం సప్తఋషులు, గోదావరి నదిని ఏడు పాయలుగా చేసి తీసుకువెళ్ళారని "భీమేశ్వర పురాణం" చెప్తోంది. హెచ్చు భూమిని సస్యశ్యామలం చేస్తూ వివిధ ప్రాంతాల జనావళికి ఉపయోగపడాలని, గోదావరి నదిని సప్తపాయలుగా చేసిన ' సప్తఋషులు ' సైతం గొప్ప ఇంజినీర్లని గ్రహించాలి మనం.
ఓం నమో నారాయణాయ
Comments
Post a Comment