శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము
విష్ణు సహస్రనామ స్తోత్రాలు 1 కి 2 సార్లు పైకి చదువుచూ, కంఠస్థం చేయండి . ప్రతిపదార్థాలు కూడా మనసు
బెట్టి, చదివి, చక్కగా ఆకళింపు చేసుకోండి. మీరు, కలకండ పలుకులు చప్పరించినంత మాధుర్యాన్ని / అమృతాన్ని చవిచూడవచ్చు
#శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము
🕉️ శ్లోకం 01 🕉️
హరి : ఓమ్
విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః||
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః||
1. విశ్వం --- విశ్వము అంతా తానే ఐన వాడు (నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చరాచర జడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము), సకల విషయము లందును సంపూర్ణమైన వాడు. (అంతా తానైన వాడు). ఇది శ్రీ విష్ణుసహస్రనామములలో మొదటి నామము. అంతా భగవంతుడే అన్న భావంలో ఈ నామానికి భాష్యకారులు వ్యాఖ్యానం చెప్పారు.
2. విష్ణుః --- అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు. (అంతటా తానున్నవాడు).
3. వషట్కారః --- వేద మంత్ర స్వరూపి, వషట్ క్రియకు గమ్యము (యజ్ఞములలో ప్రతిమంత్రము చివర మంత్రజలమును 'వషట్' అనే శబ్దముతో వదులుతారు) ; అంతటినీ నియంత్రించి పాలించు వాడు.
4. భూతభవ్యభవత్ ప్రభుః --- భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము - మూడు కాలములకు అధిపతి, మూడు కాలములలోను అన్నింటికి ప్రభువు.
5. భూతకృత్ --- సకల భూతములను సృష్టించువాడు; ప్రళయ కాలమున సకల భూతములను నాశనము చేయువాడు (భూతాని కృన్తతి).
6 . భూతభృత్ = .సృష్టిలోని సమస్త చరాచర భూతములకు / ప్రాణులకు /జీవులకు భృతి (ఆహారము / జీవనాధారము /జీవన భృతి ) కల్పించు వాడు / కలుగచేయువాడు / అందించువాడు . సమస్త చరాచర
భూతముల ప్రాణములకు ఆధారము కల్పించువాడు. సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు.
7 .భావః =. సర్వ చరాచర భూతముల / ప్రాణుల / జీవుల యడ సమ భావన ( ఒకే భావన / చిన్న , పెద్ద తేడా లేని భావన ) సమ దృష్టి (ఒకే చూపు ) కలిగి యుండువాడు.
అన్నింటికి ఉనికియైనవాడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపజేయువాడు. సమస్త చరాచర భూతప్రపంచమంత వ్యాపించి యుండు భగవానుడు. తాను తయారు చేసిన సృష్టి తనకన్నా అన్యముగాక పోవుటవేత తాను సర్వవ్యాపి అయినాడు.
8. భూతాత్మా --- సమస్త భూతములకు తాను ఆత్మయై యుండువాడు. సర్వ జీవకోటి యందు అంతర్యామిగా యుండువాడు. సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు సమస్త శరీర మనుగడకు కర్తయై, సాక్షియై యుండు చైతన్యము.
9. భూతభావనః --- అన్ని భూతములను సృష్టించి, పోషించి, నిలుపువాడు. జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించు వాడు భగవానుడు. అతడే జగత్పిత.
భావము : ఈ సృష్టి అంతయు విష్ణువు చే వ్యాప్తి చెంది యున్నది. అతడు విశ్వమంతయు నిండి అందు నివసించి యున్నవాడు. అతడే, జరిగినది, జరగబోవునది మరియు జరుగుచున్నది అను కాలము. అతడు ఈ సృష్టికి పాలకుడు కనుక జీవులకు సృష్టికర్త. అతడు భూతములకు ఆత్మ అయినవాడు. కనుక వానిని భరించి పోషించుచున్నాడు. తన ఉదరమందే జీవులను కల్పించుచున్నాడు.
ఓం నమో నారాయణాయ
విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్ర భుః అంటూ పూజించే నారాయణుడు సర్వవ్యాపి. సమస్త జగత్తు నారాయణ స్వరూపమే.
‘నరము’ - అనగా ఆత్మ. ఆ ఆత్మయందు ఉత్పన్నమైన ఆకాశాదులు నారములన్నారు.
నారములు ఆయనముగా కలవాడు నారాయణుడు.
బ్రహ్మము, శివుడను,ఇంద్రుడును, కాలము, దిశలు-విదిశలునూ నారాయణుడే. నిష్కళంకుడు. నిరంజనుడు, నిర్వికల్పుడు, అనిర్వచనీయుడు, నిరాకారుడు, దేవాదిదేవుడు ఇలా ఎన్ని చెప్పినా నారాయణుడు ఇది అని చెప్పడానికి వీలులేనివాడు. అందుకే నారాయణుని నిర్వచించడానికి అక్షరాలు లేవంటారు. నారాయణుడు తప్ప ఇతరమైనదేదీ ఈ లోకంలో లేదు.
ఆ నారాయణుని తెలుసుకున్నవాడే విశ్వవేత్త అంటుంది యజుర్వేదం. ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షర మంత్ర మహిమను గూర్చి సామవేదం అద్భుతంగా వర్ణించి చెప్తున్నది.
నారాయణ మహామంత్రానే్న తిరుమంత్రమని అంటారు. నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపములను నశింపచేసే ఈ అష్టాక్షరీ మంత్రాన్ని సద్గురువుల వద్ద ఉపదేశం పొందాలంటుంది శాస్త్రం.
భవబంధాలను పారద్రోలే ఈ నారాయణ మంత్రం ప్రహ్లాదుని, జ్ఞాన, నామదేవ, తుకారాం, సక్కుబాయ, మీరాబాయ లాంటి ఎందరినో భాగవతోత్తములలుగా అందరిచేత స్మరింపచేసినట్లుగా మూగవాళ్లను మహా విద్వాంసులు గాను చేసింది. ఎంతోమంది గుడ్డివారు దృష్టిని పొందారు. పీడితులు, భయభీతులు, భయంకరమైన రోగాలచేత బాధపడేవారు కేవలం ఒక్కసారి నారాయణ నామ కీర్తనచేస్తే చాలు వారు సమస్త దుఃఖాలకు దూరమ వుతారు. సుఖాలను పొందుతారు ఈ విషయానే్నశ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం చెబుతుంది.
సదా ధ్యానించవలసినవాడు కేవలం నారాయణుడే అని పద్మపురాణం చెబుతుండగా, నారాయణ నామం విన్నంతనే సమస్త దురితాలు దూరమవు తాయని వామన పురాణం అంటుంది.
‘నారాయణ’ ‘నా’ - అనే అక్షరం దేవుడు లేడనే బుద్ధిని తొలగిస్తుంది
. ‘రా’ - అనే అక్షరం భగవత్ప్రేమనూ, వైరాగ్యాన్నీ, రక్షణనూ కల్పిస్తుంది.
‘య’ - అనే అక్షరం యోగానుష్ఠానాన్ని పొందిస్తుంది.
అంతేకాదు యక్షరాక్షస భేతాళ భూతాదుల భయాన్ని పోగొడ్తుంది.
‘ణ’ - అనే అక్షరం భగవంతుణ్ణి వర్ణించే వాక్శుద్ధిని సిద్ధింప చేస్తుంది.
కనుక నారాయణ అన్న నాలుగక్షరాలు మానవజన్మను సార్థకం చేస్తాయ అనడంలో అతిశయోక్తి లేదు. నారాయణ మంత్రం జపించే చోటున ఈతిబాధలు, కరువుకాటకాలు ఉండవు. భూతలమే స్వర్గలోకంలా భాసిస్తుంది.
ఇంత ప్రభావమున్న శ్రీమన్నారాయణుని సదా స్మరించి, ఆ మంత్ర రాజమును సదా జపించి జన్మలను సార్థకం చేసుకోవాలి.
ఓం నమో నారాయణాయ 🙏
శ్లోకం 02
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ||
10. పూతాత్మా --- కర్మ ఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ. 'పూత' అనగా పవిత్రమైన, 'ఆత్మా' అనగా స్వరూపము గలవాడు. పవిత్రాత్ముడు. భూతములు ఆవిర్భవించి, వృద్ధిచెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడు.
11. పరమాత్మా --- పరమమైన, అంతకు అధికము లేని, ఆత్మ. సర్వులకూ తానే ఆత్మ గాని, తనకు వేరు ఆత్మ యుండని వాడు. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్యకారణముల కంటే విలక్షణమైన వాడు. తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు.
12. ముక్తానాం పరమాగతిః --- ముక్తులైన వారికి (జనన మరణ చక్రమునుండి విముక్తి పొందిన వారికి) పరమాశ్రయమైన వాడు. ముక్తులకు ఇంతకంటే ఆశించవలసినది మరొకటి లేదు. ముక్త పురుషులకు పరమ గమ్యమైనవాడు - భగవంతుడు. గతి యనగా గమ్యము. పరమా అను విశేషణము యొక్క అర్ధము ఉత్తమము. ఏది గ్రహించిన పిదప మరొకటి గ్రహించనవసరములేదో, ఏ స్థానమును చేరిన జ్ఞానికి పునర్జన్మ ప్రాప్తించదో అదియే పరమాగతి యని తెలియనగును. నదికి సాగరము పరమాగతి అయినట్లు-మానవులకు భగవానుడు పరమగమ్యమై ఉన్నాడు. సాగరములో లయించిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి అనంత సాగరములో ఐక్యమయిన రీతిని భగవానుని చేరిన జీవి భగవద్వైభవములో లయించుట జరుగుచున్నది. అది కరిగిపోవు సమస్థితియేగాని తిరిగివచ్చు దుస్థితి కాదు. "దేనిని చేరిన పిదప జీవులు తిరిగి రాలేరో అట్టి పవిత్ర పరమాగతియే నా నివాసము" అని భగవానుడు భగవద్గీతలో తెలియజేసి యున్నాడు.
13. అవ్యయః --- తరుగు లేని వాడు; తనను చేరిన వారిని మరల జనన మరణ చక్రములో పడనీయని వాడు. వినాశము కానివాడు మరియు వికారము లేనివాడు. గోచరమగునది ఏదైనను పరిణామము చెందును. పరిణామశీలమైన వస్తువు నశించి తీరును. భగవానుడు అలా పరిణామము చెందు వస్తు సముదాయములలో చేరడు.
14. పురుషః --- ముక్తులకు పుష్కలముగా బ్రహ్మానందాను భవమును ప్రసాదించువాడు; శరీరమందు శయనించియున్న వాడు; సమస్తమునకు పూర్వమే ఉన్నవాడు. జగత్తునకు పరిపూర్ణత నిచ్చువాడు.
15. సాక్షీ --- సర్వమును ప్రత్యక్షముగా (ఇంద్రియ సాధనములు అవుసరము లేకుండా) చూచువాడు; సమస్తము తెలిసినవాడు; భక్తుల ఆనందమును వీక్షించి ప్రీతితో కటాక్షించువాడు. సా+అక్షి = చక్కగా దర్శించువాడు. చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి యని పాణిని వ్యాకరణము తెలియజేయుచున్నది.
16. క్షేత్రజ్ఞః --- ఈ శరీరమను క్షేత్రమున విలసిల్లుచు, నాశనరహితుడై, క్షేత్ర తత్వమును తెలిసిన వాడు; ముముక్షువుల పరమార్ధమైన శుద్ధ సచ్చిదానంద పర బ్రహ్మానుభవము తెలిసి, వారినక్కడికి చేర్చువాడు.
17. అక్షరః --- ఎన్నడునూ (కల్పాంతమునందు కూడ) నశింపక నిలచియుండువాడు; ముక్తులు ఎంత అనుభవించినా తరగని అనంత సచ్చిదానంద ఐశ్వర్య స్వరూపుడు.
భావము : పవిత్రమైన, ఆత్మా- స్వరూపముగలవాడు, నిత్యశుద్దబుద్దముక్త స్వాభావుడు, ముక్తులగువారికి సర్వోత్తముడు, పునర్జన్మ యనునది లేకుండా చేయువాడు, వినాశముగాని వికారముగాని లేనివాడు, శరీరమనెడి పురమున శయనించు వాడు, గొప్పవియగు ఫలములను ఇచ్చువాడు, సాక్షాత్తుగా తనస్వరూపమేయైన జ్ఞానముచేత సమస్తమును చూచువాడు, శరీరములను వీనికి బీజమైన శుభాశుభకర్మలను తెలిసికొను చున్నవాడు, తరుగులేనివాడు, నక్షరతీతి
అక్షరా: - గుణములు పై పైని అభివృద్ధి చెందునే కాని తరగని వాడు అగు పరమాత్మునికి ప్రణామాలు అర్పిస్తున్నాము
పద్యం.
పావనంబె యాత్మ, పరమాత్మ చూడగా
తనను చేరు జనుల దరిని జేర్చు
అంత మెరుగడతడె యసలైన పురుషుడే
వందనాలు హరికి వంద వేలు !!
[అర్థాలు: పూతాత్మ ... పవిత్రమైన ఆత్మ, పరమాత్మ ... గొప్పదైన ఆత్మ, ముక్తానాం ... మోక్షమొసగు, పరమాం గతి ... గొప్పదైన గమ్యం, అవ్యయ ... వ్యయముకాని, పురుష ... పురుషుడు.
భావము: పవిత్రమూ మరియూ గొప్పదీ అయిన ఆత్మ గలవాడు, తనను నమ్ముకున్నవారికి మోక్షం ప్రసాదిస్తూ తగిన గమ్యం చేర్చువాడు, ఆద్యంతములు లేని అసలైన పురుషుడు అనగా ధర్మం దాటనీయకుండా కాపాడే వాడు అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]
//ఓం నమో నారాయణాయ//
శ్లోకం 03:
యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః|
నారసింహవపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః||
18. యోగః --- ముక్తి సాధనకు ఏకైక మార్గము, సాధనము, ఉపాయము; యోగము వలననే పొందదగినవాడు; కోర్కెలు తీరుటకు తిరుగులేణి ఉపాయము. ధ్యానము వలన, సమత్వ భావము వలన తెలియబడువాడు. యోగముచే పొందదగినవాడు - భగవానుడు. సాధ్య సాధనములు తానైన భగవానుడే సాధకులకు మార్గగామి. సాధ్యవస్తువయిన భగవానుడు తనకన్నా అన్యం కాదని గ్రహించిన సాధకుడు ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, యోగయుక్తుడయిన భగవానునితో కలసి కరిగిపోవుటయే యోగము.
19. యోగవిదాం నేతా --- తానే మార్గదర్శియై, నాయకుడై, యోగ సాధన చేయువారిని గమ్యమునకు చేర్చువాడు. యోగులకు నేత; కర్మజ్ఞానాది సాధనాంతరములకు ఫలమునొసగువాడు.
20. ప్రధాన పురుషేశ్వరః --- ప్రధానము (ఆనగా ప్రకృతి, మాయ), పురుషుడు (జీవుడు) - రెండింటికిని ఈశ్వరుడు (అధిపతి, నియామకుడు).
21. నారసింహ వపుః --- ప్రహ్లాదుని కాచుటకై శ్రీనారసింహావతారమును ధరించి అవతరించినవాడు; అభయమునొసగువాడు. మంగళ మూర్తి.
22. శ్రీమాన్ --- రమణీయమైన స్వరూపము గలవాడు (శ్రీనారసింహ మూర్తిగా) ; సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు.
23. కేశవః --- సుందరమైన కేశములతో విరాజిల్లువాడు. కేశి అను రాక్షసుని సంహరించినవాడు. బ్రహ్మ, విష్ణు, శివ రూపములు ధరించువాడు (త్రిమూర్తి స్వరూపి) ; అందమైన కిరణములతో విశ్వమును చైతన్యవంతులుగా చేయువాడు. 'కేశ' యనెడి అసురుని వధించినవాడు - విష్ణుమూర్తి. మనోహరములైన శిరోజములు (కేశములు) కలిగియున్నవాడు - శ్రీ కృష్ణుడు. "క + అ + ఈశ" కలసి "కేశ" శబ్దమయినది. 'క' అనగా బ్రహ్మ. 'అ' అనగా విష్ణువు, 'ఈశ' అనగా ఈశ్వరుడు. ఈ త్రిమూర్తులకు ఆధారమయిన వాసుదేవ చైతన్యమే కేశవుడు.
24. పురుషోత్తమః --- పురుషులలో ఉత్తముడు; త్రివిధ చేతనులైన బద్ధ-నిత్య-ముక్తులలో ఉత్తముడు. క్షరుడు (నశించువాడు), అక్షరుడు (వినాశన రహితుడు) - ఈ ఇద్దరు పురుషులకు అతీతుడు, ఇద్దరికంటె ఉత్తముడైన వాడు.
భగవానుడు యోగవిదులకు ప్రభువై, ఇంద్రియ మనో బుద్ధులను నిగ్రహించి యోగముక్తుడై , ప్రకృతి పురుషులకు తానే అధినేతయై, ఇందుగలడూ అందుగలడనీ,తానులేని చోటులేదని లక్ష్మీదేవితో కూడియుండి శ్రీమాన్ గా,కేశిని వధించుటచే కేశవుడిగా, ఉత్తమ పురుషుడుగా విశ్వంతా వ్యాప్తి చెందిన భగవతత్వమే 'భగవంతుడు ' ... శ్రీ మహా విష్ణువు
విశ్లేషణ
20) ప్రధానపురుషేశ్వరః ఓం ప్రధానపురుషేశ్వ రాయనమః
ప్రధాన మను శబ్దమునకు ప్రకృతి లేక మాయ యని యర్థము. పురుషః అను శబ్దమునకు ప్రాణుల యందు గల చైతన్య స్వరూపుడగు జీవుడు అని అర్థము. ఈ రెంటికిని అనగా ప్రకృతి
పురుషులకు అతీతుడైన వాడు పరమాత్మ యగుటచేత ఆయన ప్రధానపురుషేశ్వరః యని గానము చేయబడును.
నశింౘు స్వభావముగలది ప్రకృతి గదా జీవుడు మాయాబద్దుడు, ప్రకృతితో కూడియున్న వాడగును. కావున త్రిగుణాత్మకమగు మాయను దాటినపుడే జీవుడు పరిశుద్ధుడై ఈశ్వరుడగు ౘున్నాడని భావము.
నన్ను భక్తియోగముతో, శ్రద్ధాభక్తులతో సేవింౘువాడు త్రిగుణాత్మకమగు మాయను దాటిపోయి పరబ్రహ్మ స్వరూపుడగు ౘున్నాడు. అని పార్థసారథియొక్క అనుష్ఠాన వేదాంత వాణి
స్మరణీయము. (అ14_26). ఇదియే ఈ దివ్యనామము బోధింౘు సాధన.
21) నారసింహవపుః ఓం నారసింహ రవపుషేనమః
ఇయ్యది శ్రీమహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమగు నృసింహావతారమును సూచింౘు పౌరాణికనామము ఈ స్తవరాజము లో అన్ని అవతారముల నామములనూ మున్ముందు సాధకులు ౘూడగలరు. ప్రహ్లాదకుమారుని భక్తి పారవశ్యమునకు మెచ్చి సాక్షాత్కరించిన నృసింహావతార ఘట్టమిది. భాగవతములో మహాద్భుతముగా వర్ణింపబడియున్నది. అహంకారముగల హిరణ్యకశిపునకు యెంతగా వెదికిననూ శ్రీహరి కానరాడయ్యెను. భక్తిప్రపత్తులతో పిలిచినంత మాత్రముచేతనే తనకు కావలసినచోటుల యందెల్లా శ్రీహరి సాక్షాత్కరించెను. అనన్య భక్తియే శ్రీహరి సాక్షాత్కారమునకు సాధనమని ఈ నామము బోధింౘుౘున్నది. " అడుగడుగునకును మాధవానుచింతన సుధామాధుర్యమున మేనుమఱౘువాడు" ప్రహ్లాదుడు. పానీయములు ద్రావుౘు, గుడుౘుౘు, భాషింౘుౘూ, హాసలీలానిద్రాదులు సేయుౘు సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై భౌతికప్రపంచమును మఱచిన వాడు ప్రహ్లాదుడు. అట్టి వారికే ఈశ్వర సాక్షాతాకారమని ఈ యుగళనామము బోధింౘును
4. యోగమనగ తానె యోగ విద్యకు నేత
ప్రకృతి జీవమునకు ప్రాణమతడు
నారసింహుడతడె క్రూరత్వ మణచునూ
వందనాలు హరికి వంద వేలు !!
[అర్థాలు: యోగో ... యోగము అనగా మహర్దశ, యోగ విదాం నేత ... యోగవిద్యకు అధినేత, ప్రధాన పురుషేశ్వర ... ప్రకృతి(ప్రధాన), పురుషులకు ప్రభువు, నారసింహవపు ... నరసింహావతారుడు.
భావము: యోగవిద్యకు అధిపతియై మహర్దశ కల్పించువాడు, ప్రకృతి పురుషులకు అధిపతి, నరసింహావతారియై క్రూరత్వాన్ని అణచువాడు అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు. ]
5. నల్ల వేల్పుగాను నలినె బంచునతడు
పొగులుపుచ్చు దలవ పూర్తిగాను
పూజలందుకొనును పురుషోత్తమునిగాను
వందనాలు హరికి వంద వేలు !!
[అర్థాలు: శ్రీమన్ ... శ్రీపతి పర్యాయ పదం నల్లవేల్పు, కేశవ ... క్లేశము(పొగులు) హరించు(పుచ్చు)వాడు, పురుషోత్తమ ... పురుషులలో ఉత్తముడు.
భావము: శ్రీపతియై కష్టాలను అనగా క్లేశములను హరించువాడు, పురుషులలోకెల్లా ఉత్తముడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.]
🙏ఓం నమో నారాయణాయ 🙏
🙏🙏🙏🌺🙏🙏
🕉️ శ్లోకం 04:
సర్వశ్శర్వ శ్శివ స్ధాణుః భూతాది ర్నిధి రవ్యయః|
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః||
25. సర్వః --- సర్వము తానెయైన వాడు. సృష్టి స్థితి లయములకు మూలము.
26. శర్వః --- సకల పాపమును పటాపంచలు చేయువాడు. సమస్త జీవుల దుఃఖములను, అనిష్టములను నాశనము చేయువాడు. ప్రళయ కాళములో సమస్త భూతములను తనలో లీనం చేసుకొనేవాడు.
27. శివః --- మంగళములనొసగు వాడు. శుభకరుడు.
28. స్థాణుః --- స్థిరమైన వాడు. భక్తుల పట్ల అనుగ్రహము కలిగి నిశ్చయముగా ఇష్ట కామ్యములు సిద్ధింపజేయువాడు. వృద్ధి క్షయ గుణములకు లోబడనివాడు.
29. భూతాదిః --- సకల భూతములకు మూలము, కారణము, సకల భూతములచే ఆత్రముగా కోరబడువాడు. పంచ భూతములనుసృష్టించిన వాడు.
30. నిధిరవ్యయః --- తరుగని పెన్నిధి, ప్రళయకాలమునందు సమస్త ప్రాణికోటులను తనయందే భద్రపరచుకొనువాడు.
31. సంభవః --- తనకు తానుగానే (కర్మముల వంటి కారణములు, బంధములు లేకుండానే) అవతరించువాడు. శ్రద్ధా భక్తులతో కోరుకొన్నవారికి దర్శనమిచ్చువాడు.
32. భావనః --- కామితార్ధములను ప్రసాదించు వాడు. మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింప జేయువాడు.
33. భర్తా --- భరించువాడు; భక్తుల యోగ క్షేమములను వహించువాడు; సకల లోకములకును పతి, గతి, పరమార్ధము.
34. ప్రభవః --- దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు; కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు.
35. ప్రభుః --- సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు; బ్రహ్మాదులకు కూడా భోగ మోక్షములోసగు సమర్ధుడు.
36. ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.
6.సర్వమతడె మరియు శర్వుడు దానెగా
శస్తకరుడు మరియు స్థాణువతడె
సకల భూతములకు సరియైన మూలము
వందనాలు హరికి వంద వేలు !!
[అర్థాలు: సర్వ ... సర్వము, శర్వ ... హరించు, శస్త కరుడు అనగా శుభంకరుడు అనగా శివుడే, స్థాణువు ... దేనికీ చలించని వాడు,భూతాది ... భూతాలకు మూలము.
భావము: బ్రహ్మాది దేవతలు మొదలు సకల చరాచర జీవకోటి తానే అయినవాడు, సకల దోషాలను శమింపజేసేవాడు, శుభంకరుడూ అయిన శివుడు కూడా శ్రీహరియే. దేనికీ చలించనివాడు అనగా కాలాతీతుడు, సకల భూతాలకూ ఆధారము, మూలమూ తానే అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]
7. నిఖిల జగతి కతడు నిధియె వ్యయముగాడు
యుగయుగాలు తానె యుద్భవించు
భావనొకటి యున్న భర్తయై గాచును
వందనాలు హరికి వంద వేలు !!
[అర్థాలు: నిధి రవ్యయ ... వ్యయము కాని నిధి, సంభవో ... సంభవామి యుగే యుగే, భావన ... భావము చేతనే, భర్త ... భరించువాడు.
భావము: పునరపి జననం, పునరపి మరణం సాధారణ ప్రాణకోటికే గాని శ్రీహరికి కాదు గదా. కనుక ఆయన మన పుణ్య కార్యాలన్నిటికీ తరగని నిధియై ప్రళయానంతరం తదనుగుణమైన సృష్టి చేస్తూ ఉంటాడు. అలాగే అవసరం అనుకున్నపుడు తనకు తానుగానే అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ప్రాణకోటి తన ఉనికిని గుర్తిస్తూ తనకై ప్రార్థనలు చేసీ చేయగానే ఆ భావ మాత్రముననే రంగంలోకి దిగి భారం వహించి కాపాడుతుంటాడు. కనుకనే అట్టి యా శ్రీహరికి శత సహస్ర వందనాలు.]
8. సాధు జనులకెపుడు సంరక్షగా తాను
ప్రభల నిచ్చుటకును ప్రభవ మందు
ప్రభువు లక్షణమెగ పాలించ లాలించ
వందనాలు హరికి వంద వేలు !!
[అర్థాలు: ప్రభవ ... పుట్టుక, ప్రభు ... పాలకుడు, ఈశ్వర ... ఆలించి పాలించువాడు(రాజులేదా తండ్రి), ప్రభలు ... వెలుగులు.
భావము: సాధు జనుల రక్షణకై వెలుగులు ప్రసరించే అనగా జ్ఞాన జ్యోతులను అందించే నిమిత్తం తనకు తానుగానే అవతరించు వాడు, పాలన, పోషణ వంటి బరువు బాధ్యతలను నిర్వర్తించు వాడు అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]
ఓం నమో నారాయణాయ 🙏🙏
🕉️ శ్లోకం 05🕉️
స్వయంభూశ్శంభు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాది నిధనో ధాతా విధాతా ధారురుత్తమః||
37. స్వయంభూః --- స్వయముగా, ఇచ్ఛానుసారము, వేరు ఆధారము లేకుండ జన్మించువాడు.
38. శంభుః --- శుభములను, సుఖ సంతోషములను ప్రసాదించువాడు.
39. ఆదిత్యః --- సూర్య మండల మధ్యవర్తియై బంగారు వర్ణముతో ప్రకాశించువాడు; ద్వాదశాదిత్యులలో విష్ణువు; సమస్తమును ప్రకాశింపజేసి పోషించువాడు; అదితి కుమారుడైన వామనుడు. సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు - భగవానుడు. "ద్వాదశాదిత్యులు లో విష్ణువు అను పేరు గలవాడు తానే" యని భగవానుడు భగవద్గీత విభూతి యోగములో తెలియజేసి యున్నాడు. 'ఆదిత్యః' అనగా ఆదిత్యుని వంటి వాడని కూడా భావము. ఆదిత్య ఉపమానము ద్వారా ఈ అద్వైత సత్యమును నిత్యానుభవములోనికి తెచ్చుకొని సంతృప్తి చెందవచ్చును.
40. పుష్కరాక్షః --- తామరపూవు వంటి కన్నులు గల వాడు.
41. మహాస్వనః --- గంభీరమైన దివ్యనాద స్వరూపుడు; వేద నాదమునకు ప్రమాణమైనవాడు.
42. అనాదినిధనః --- ఆది (మొదలు, పుట్టుక) లేనివాడు మరియు నిధనము (తుది, నాశనము) లేనివాడు.
43. ధాతా --- బ్రహ్మను కన్న వాడు; నామ రూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధరించిన మహనీయుడు.
44. విధాతా --- బ్రహ్మను ఆవిర్భవింపజేసిన వాడు; విధి విధానములేర్పరచి, తగురీతిలో కర్మ ఫలములనొసగువాడు. కర్మఫలముల నందించువాడైన భగవానుడు. విశ్వ యంత్రాంగ మంతయు అతని ఆజ్ఞకు లోబడి నడచుచున్నది. తనకు భయపడి ప్రకృతిప్రవర్తించుచున్నది. సర్వమును కదిలించి, కదిలిన సర్వమును కనిపెట్టి, ధర్మబద్ధంగా ఫలితముల నందించి, పోషించుటచే ఆదిదేవుడు విధాత ఆయెను.
45. ధాతురుత్తమః --- బ్రహ్మకంటెను శ్రేష్ఠుడు, ముఖ్యుడు; సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోను ప్రధానము తానే అయినవాడు.
సొంత నిర్ణయమున సూత్రధారిగ తానె
అవతరించుచుండు నవని యందు
శంభువనగ తానె యంబర రత్నమే
వందనాలు హరికి వంద వేలు !!
[అర్థాలు: స్వయంభూ ... స్వంతముగా ఉనికి ప్రదర్శించు, శమ్భూ ... శివుడు(శంభు అనగా శుభము. అది కలుగజేసేవాడే శమ్భుడు), ఆదిత్య ... సూర్యుడు (అంబర రత్నమే).
భావము: అవసర సమయాలలో ఎవరి ప్రమేయమూ లేకనే తానే స్వయముగా అవతరించువాడు, శుభములను కలగజేయువాడు, సూర్యుడు కూడా అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]
10. కమలములను బోలు కనులు గల్గినవాడు
ప్రణవ నాదమునకె ప్రతినిధాయె
ఆది రహితుడతడె, అంతమె యెరుగడు
వందనాలు హరికి వంద వేలు !!
[అర్థాలు: పుష్కరము అనగా కమలము కనుక పుష్కరాక్ష అనగా కమలాక్షుడే, మహాస్వన ... గొప్ప ధ్వని, అనాది నిధన ... ఆది, నిధనములు అనగా జనన మరణములు లేనివాడు.
భావము: కమలముల వంటి కనులు కలవాడు, తానే ఓంకార నాదమైనవాడు, జనన మరణములు లేనివాడు అనగా ఆద్యంత రహితుడు అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]
11. సృజన కర్త తానె నిజ ఫలములకును
కారకుండు నతడె కనగ నెపుడు
ధాతువులకు గొప్ప ధాతువు తానెగా
వందనాలు హరికి వంద వేలు !!
[అర్థాలు: ధాత ... సృష్టి కర్తయైన బ్రహ్మ, విధాత ... విలేఖించు ధాత(అనుకోవచ్చు) అనగా నొసటి వ్రాత వ్రాయువాడు, ధాతురుత్తమ ... ధాతువులలో కెల్ల ఉత్తముడు.
భావము: సృష్టించేది అతడే. విధాతగా కర్మ ఫలాలకు కారకుడూ అతడే. శరీరంలోని వేలాది ధాతువులన్నిటా వ్యాపించియున్న ఉత్తమ ధాతువు కూడా తానే అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]
ఓం నమో నారాయణాయ 🙏
💮🌿💮🌿💮🌿💮🌿💮
శ్లోకం 06:
అప్రమేయా హృషీకేశః పద్మనాభో మరప్రభుః||
విశ్వకర్మా మనుస్త్వష్టా స్ధవిష్ఠః స్ధవిరో ధ్రువః||
46. అప్రమేయః --- ఏ విధమైన ప్రమాణములచేత తెలియరాని వాడు; కొలతలకందనివాడు; సామాన్యమైన హేతుప్రమాణముల ద్వారా భగవంతుని నిర్వచించుట, వివరించుట, అంచనా వేయుట అసాధ్యము.
47. హృషీకేశః --- ఇంద్రియములకు అధిపతి (హృషీకములకు); సూర్య, చంద్ర రూపములలో కిరణములు పంచి జగముల నానందింప జేయు వాడు. హృషీకములకు అనగా ఇంద్రియములకు ప్రభువు - భగవానుడు. సూర్యచంద్ర కిరణములు హరి ముంగురులని వేద ప్రవచనము. సూర్యచంద్ర రూపులగు భగవానుని కేశములు (కిరణములు) జగత్తునకు హర్షమును కలిగించుచున్నవి. అందుచేత కూడా తాను హృషీకేశుడయ్యెనని మహాభారత శ్లోకము వివరించుచున్నది.
48. పద్మనాభః --- నాభియందు పద్మము గలవాడు. ఈ పద్మము నుండే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించెను. పద్మము నాభియందు కలిగియుండువాడు - భగవానుడు. అట్టి పద్మము నుండి సృష్టికర్త అయినచతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. పద్మము జ్ఞానమునకు ప్రతీక. విష్ణుదేవుడు తన జ్ఞానశక్తిచే బ్రహ్మను సృష్టించి, తద్వారా సకల జీవులు పుట్టుటకు కారణమాయెను.
49. అమరప్రభుః --- అమరులైన దేవతలకు ప్రభువు
50. విశ్వకర్మా --- విశ్వమంతటికిని సంబంధించిన కర్మలను తన కర్మలుగా గలవాడు. విశ్వమును సృష్టించిన వాడు. విశ్వరచన చేయగలుగువాడు - భగవానుడు. విచిత్రమైన సృష్టినిర్మాణము చేయగల సామర్ధ్యమును కలిగియుండెను. బ్రహ్మ ఆవిర్భావమునకు పూర్వమే భగవానుదు సృష్టిరచన సాగించెను; కాని సృష్టిని అనుసరించలేదు. అందుచేత సృష్టిలోని అశాశ్వత లక్షణములు భగవానునియందు లేవు. "సర్వభూతములు నాయందు న్నవి. నేను వాని యందు లేను" అని భగవానుడు భగవద్గీత-రాజవిద్యా రాజగుహ్యమునందు తెలియజేసియున్నాడు.
51. మనుః --- మననము చేయు మహిమాన్వితుడు; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు.
52. త్వష్టా --- శిల్పివలె నానా విధ రూపములను, నామములను తయారు చేసినవాడు; బృహత్పదార్ధములను విభజించి సూక్ష్మముగా చేసి ప్రళయ కాళమున తనయందు ఇముడ్చు కొనువాడు.
53. స్థవిష్ఠః --- బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి; సమస్త భూతజాలమునందును సూక్ష్మ, స్థూల రూపములుగా నుండు విశ్వ మూర్తి.
54. స్థవిరః --- సనాతనుడు; సదా ఉండెడివాడు
55. ధ్రువః --- కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు
స్థవిరో ధ్రువః (ఆదిశంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించిరి) --- స్థిరుడై, నిత్యుడై, కాలాతీతుడైన వాడు
శ్లో. అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః
విశ్వకర్మా మనుస్త్వష్టా స్ధవిష్ఠః స్ధవిరో ధ్రువః ||6||
------------------------ (నామాలు 46 – 54)
12. అప్రమేయు డతడె యనగ హృషీకేశ,
పద్మ నాభు డమర ప్రభువు గాను
విశ్వకర్మ మరియు వినగ మనువు కాదె
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : అప్రమేయ ... ఊహలకందనివాడు, హృషీ కేశ ... హృషీ అంటే ఇంద్రియాలు, కేశ అంటే కేశములు, పద్మనాభు డు ... నాభి యందు పద్మము గలవాడు, అమర ప్రభు ... మరణమెరుగని లేదా దేవతలకు ప్రభువు, విశ్వ కర్మ .. విశ్వాన్ని రచించేవాడు, మనువు ... మననము చేసే (చేయదగిన) వాడు.
భావము : సామాన్య జనుల ఊహలకు అందకుండా కేవలం ఆత్మజ్ఞానంతోనేదర్శనమిచ్చేవాడు, ఇంద్రియాలను తన కేశ కిరణాలతో నియంత్రించేవాడు, పద్మము నందు నాభి గలవాడు, దేవతల(మరణమే యెరుగని) ప్రభువు, చరాచర జగత్తును రచించువాడు, మంచి ఆలోచనలను చేయువాడు అయినట్టి శ్రీహరికే శతసహస్ర వందనాలు.)
13. త్వష్ట గాను తానె సృష్టి నంతము జేసి
తిరిగి చేయుచుండు తీరుగాను
స్థూలమైన వాడె కాలమెరుగబోడు
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : త్వష్ట ..విశ్వ కర్ముడు, సృష్టిని అంతము చేయువాడు, స్థవిష్ట ... స్థూల శరీరుడు, స్థవిరో ధ్రువ ... శాశ్వతమైన వాడు, సనాతనుడు.
భావము : ప్రళయకాలమునందు సృష్టిని అంతము చేసి అనగా తనలో కలుపుకుని తిరిగి సమయం రాగానే పునఃసృష్టి చేసేవాడు, కాలాలతో నిమిత్తం లేని సనాతనుడు అనగా పూర్వకాలం నుంచి ఉన్న శాశ్వతమైన వాడు ... అట్టి శ్రీహరికే శతసహస్ర వందనాలు.)
ఓం నమో నారాయణాయ
🌿🍁🌿🍁🌿🍁🌿🍁
శ్లోకం 07:
అగ్రాహ్యాః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః|
ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్||
56. అగ్రాహ్యః --- తెలియరానివాడు. ఇంద్రియ, మనో బుద్ధులచే గ్రహింప నలవి కానివాడు.
57. శాశ్వతః --- కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడు ఉండెడివాడు.
58. కృష్ణః --- సర్వమును ఆకర్షించువాడు; దట్టమైన నీల వర్ణ దేహము గలవాడు; సృష్ట్యాది లీలా విలాసముల వలన సర్వదా సచ్చిదానందమున వినోదించు వాడు..
59. లోహితాక్షః --- తామర పూవు వలె సుందరమగు ఎర్రని కనులు గలవాడు; అంధకారమును తొలగించు ఎర్రని కనులు గలవాడు.
60. ప్రతర్దనః --- ప్రళయకాలమున అంతటిని (విపరీతముగ) నాశనము చేయువాడు.
61. ప్రభూతః --- పరిపూర్ణుడై జన్మించిన వాడు; జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజము మొదలగు సర్వగుణములు సమృద్ధిగా గలవాడు.
62. త్రికకుద్ధామః, త్రికకుబ్ధామః --- సామాన్యలోకము కంటే మూడు రెట్లు పెద్దదైన పరమ పదమందు ఉండెడివాడు; మూడు గుణ వర్గములకును ఆశ్రయమైన వాడు; ఊర్ధ్వ, మధ్య, అధో లోకములకు ఆధార భూతుడు; జాగ్రత్, స్వప్న, సుషుప్తి - మూడు అవస్థలందును వ్యాపించియున్నవాడు.
త్రికకుత్ --- మూడు కొమ్ములు (మూపులు) గల శ్రీవరాహమూర్తి
ధామః --- నివాస స్థానము, ప్రకాశవంతమైన కిరణము.
63. పవిత్రం --- పరమ పావన స్వరూపుడు, పరిశుద్ధమొనర్చువాడు.
64. మంగళం పరం --- అన్నింటికంటె మంగళకరమగు మూర్తి; స్మరణ మాత్రముననే అన్ని అశుభములను తొలగించి, మంగళములను ప్రసాదించు వాడు.
శ్లో. అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ !! 7 !!
------------------------(నామాలు...55--63)
14. గ్రాహ్యమేమి కాదు గణములకెప్పుడూ
నశ్వరుండు కాడు, నల్లనయ్యె
లోహితాక్షు డతడె, లోకేశ, శ్రీలుడు
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు: అగ్రాహ్య ... కనిపించనివాడు, శాశ్వత ... శాశ్వతమైన వాడు, కృష్ణ ... నల్లనయ్య, లోహితాక్షుడు అనగా ఎర్రని కన్నులు గలవాడు, ప్రతర్దన ... ఈశ్వరుడు, ప్రభూత ... సంపన్నుడు.
భావము : సామాన్యుల మామూలు ఇంద్రియ మనో బుద్ధులకు కనిపించని వాడు, సర్వకాల సర్వావస్థలందు శాశ్వతమై ఉండేవాడు(నశ్వరుడు), సచ్చిదానంద స్వరూపుడైన కృష్ణుడు, ఎర్రని కనులు కలిగి, ప్రళయాంతమున సమస్తమూ తనలో కలుపుకునే వాడు అనగా లయకారుడైన ప్రతర్దనుడు (శివుడు), జ్ఞాన గుణ సంపద కలిగిన ఉన్న (ప్రభూత) ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
15. అష్ట దిక్కులతని యావాసమై యుండు
పరమ పురుషు డతడు పావనుండు
స్మరణ మాత్రముననె సర్వ శుభము లొసగు
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : త్రికకుబ్ధాముడు ... ముల్లోకాలలోనూ ఉండువాడు, పవిత్ర ... పరిశుద్ధమైన వాడ, మంగళం పరమ్ ... మంగళ ప్రదమైన మూర్తి.
భావము : దశదిశలకూ ఆధార భూతమై, అంతటా తానే అయి ఉన్నవాడు, పరిశుద్ధమైన ఆత్మతో స్మరణ మాత్రముననే సకల శుభాలు అందించు శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
ఓం నమో నారాయణాయ
🙏🙏
🌿💮🌿💮🌿💮🌿💮
శ్లోకం 08:
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః|
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః||
65. ఈశానః --- సమస్తమునూ శాసించు వాడు; సకలావస్థలలోనూ సకలమునూ పాలించువాడు.
66. ప్రాణదః --- ప్రాణములను ప్రసాదించువాడు (ప్రాణాన్ దదాతి) ;ప్రాణములను హరించువాడు (ప్రాణాన్ ద్యాతి) ; ప్రాణములను ప్రకాశింపజేయువాడు (ప్రాణాన్ దీపయతి).
67. ప్రాణః --- ప్రాణ స్వరూపుడు; జీవనము; చైతన్యము.
68. జ్యేష్ఠః --- పూర్వులకంటె, వారి పూర్వులకంటె, పెద్దవాడు; తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడ దగినవాడు.
69. శ్రేష్ఠః --- ప్రశంసింపదగిన వారిలోకెల్ల ఉత్తముడు.
70. ప్రజాపతిః --- సకల ప్రజలకు ప్రభువు, తండ్రి; నిత్యసూరులకు (పరమపదము పొందినవారికి) ప్రభువు.
71. హిరణ్యగర్భః --- రమణీయమగు స్థానమున నివసించువాడు, పరంధాముడు; సంపూర్ణానందమగువానిని ప్రసాదించువాడు; చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై యున్నవాడు.
72. భూగర్భః --- భూమిని (కడుపులో పెట్టుకొని) కాపాడువాడు; విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు.
73. మాధవః --- మా ధవః -శ్రీమహాలక్ష్మి (మా) కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడు వాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు) ; మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు.
74. మధుసూధనః --- మధు, కైటభులను రాక్షసులను సంహరించినవాడు; బంధకారణములైన కర్మఫలములను నాశనము చేయువాడు.
---------------------( నామాలు 64 ... 73 )
16. పాలనంబు సేయు ప్రాణ దాత యతడు
ప్రాణమతడె మరియు ప్రధముడతడె
పరమ పురుషుడైన పరమేశుడే వాడు
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : ఈశానః ... పాలకుడు, ప్రాణదః ... ప్రాణము పోయువాడు, ప్రాణః ... ప్రాణములు, జ్యేష్ఠ ... పెద్దవాడు, శ్రేష్ఠ ... గొప్పవాడు, ప్రజాపతిః ... ప్రజలందరికీ అధిపతి.
భావము : సకల లోకాలకు పరిపాలకుడు, జవము, జీవమూ తానై అందరికీ తానే అందించే వాడు, దేవతలందరిలోకీ అగ్రజుడు, పరమ పురుషుడు, సర్వలోకాలకూ అధిపతి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
17. పసిడి నందు బుట్టె బ్రహ్మ గాగ నతడు
పుడమి దాచి గాచె కడుపు నందు
మాధవుడును యతడె మధుసూదనుడాయె
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : హిరణ్య గర్భో ... స్వర్ణమయమైన గర్భము నందు జన్మించిన వాడు, భూగర్బో ... భూమిని గర్భము నందు దాచుకున్నవాడు, మా ధవుడు ... లక్ష్మీపతి, మధుసూదనః ... మధు అనే రాక్షసుని చంపిన వాడు.
భావము : స్వర్ణమయమైన గర్భము నందు జనించిన చతుర్ముఖుడు అనగా బ్రహ్మ, తల్లి మాదిరి భూమిని గర్భము నందు దాచి కాచిన వాడు( కడుపులో పెట్టుకుని దాచడం), మా అనగా లక్ష్మి ధవ అనగా భర్త ... కనుక మాధవుడనగా శ్రీదేవి భర్త అయిన శ్రీహరియే, మధుకైభులలో ఒకరైన మధును చంపిన వాడు శ్రీహరి. అట్టి శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
భావము : సకల లోకాలకు పరిపాలకుడు, జవము, జీవమూ తానై అందరికీ తానే అందించే వాడు, దేవతలందరిలోకీ అగ్రజుడు, పరమ పురుషుడు, సర్వలోకాలకూ అధిపతి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
ఓం నమో నారాయణాయ 🙏
శ్లోకం 09:
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||
75. ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.
76. విక్రమీ --- విశిష్టమగు పాద చిహ్నములు గలవాడు; అమిత శౌర్య బల పరాక్రమములు గలవాడు.
77. ధన్వీ --- (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.
78. మేధావీ --- అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు; సర్వజ్ఞుడు.
79. విక్రమః --- బ్రహ్మాండమును కొలిచిన అడుగుల గలవాడు (శ్రీవామన మూర్తి) ; పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు.
80. క్రమః --- సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ - పద్ధతి) ; సమస్త జీవరాశులలోను చైతన్యము (క్రమ - కదలిక) ; అనంత, అసాధారణ వైభవ సంపన్నుడు (క్రమ - సంపత్తు) ; సంసార సాగరమును దాటించువాడు (క్రమణ - ఈదుట).
81. అనుత్తమః ---అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు.
82. దురాధర్షః --- తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.
83. కృతజ్ఞః --- నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులననుగ్రహించువాడు; పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్ధ మోక్షములను ప్రసాదించువాడు; సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.
84. కృతిః --- తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు.
85. ఆత్మవాన్ --- సత్కార్యములోనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు; తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు.
శ్లో. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమ క్రమః
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ !!9 !!
........నామాలు 74 ... 64)
18. సర్వ శక్తులుండె, సామర్థ్యమది మెండు
విల్లు ధూర్తు నడచు, విద్వతుండు
శౌర్య వంతుడతడు సక్రమ పథగామి
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : ఈశ్వరః ... శక్తి సంపన్నుడు, విక్రమీ ... విశేష సామర్థ్యము గలవాడు, ధన్వీ ... శార్జ్ఞమను ధనుస్సు గలవాడు, మేధావీ ... జ్ఞాన గుణసంపన్నుడు, విక్రమః ... పక్షి వాహనంపై నుంచే విశ్వ సంచారం చేయగల సమర్థుడు, క్రమః ... నియమ బద్ధత పాటించేవాడు మరియూ పాటింపజేసేవాడు.
భావము : సకల ప్రాణకోటిని పోషించగల సమర్థుడు, ఘటనాఘటన సమర్థుడు, విశ్వ రక్షణకై శార్జ్ఞమను ధనుస్సు ధరించినవాడు, జ్ఞాన గుణ సంపన్నుడు, గరుడుడినే వాహనంగా చేసుకుని విశ్వమంతా విహారం చేయగలవాడు, తాను పద్ధతిగా ఉంటూ చరాచర జగత్తును గీత దాటకుండా నడిచేట్లు చూసేవాడు ఐన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
19. సాటిలేని సుగుణి, సరిలేరు పోరులో
కర్మ చేయుచుండు, కర్మ కతడె
ఆధరవును మరియు నాత్మవాననవలె
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : అనుత్తమః ... సాటిలేని ఉత్తముడు(సుగుణి యనునది ఇకారాంత పుంలింగమే ననేది నిఘంటు ప్రమాణం), దురాధర్ష ... ఎదురులేని వాడు, కృతజ్ఞః ... ప్రాణులు చేయు కర్మలు తానే చేయువాడు, కృతి ఆత్మవాన్ ... ఆత్మల యందు సుప్రతిష్టుడు.
భావము : సుగుణాలలో సాటిలేనివాడు, రాక్షసులు సైతం ఎదుర్కోలేని యోధుడు, తనపట్ల నమ్మకముంచుచూ కృతజ్ఞతతో మెలిగేవారి కర్మలు తానే చేసేవాడు, సకల ఆత్మలయందు సుప్రతిష్ఠుడై ఉండువాడు అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు.)
ఓం నమో నారాయణాయ.
శ్లోకం 10:
సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః|
అహ స్సవంత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః||
86. సురేశః --- సకల దేవతలకును దేవుడు; దేవదేవుడు; భక్తుల కోర్కెలను తీర్చువారిలో అధిపుడు.
87. శరణం --- తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు; ఆర్తత్రాణ పరాయణుడు; ముక్తుల నివాస స్థానము.
88. శర్మ --- సచ్చిదానంద స్వరూపుడు; మోక్షగాముల పరమపదము.
89. విశ్వరేతాః --- విశ్వమంతటికిని బీజము, మూల కారణము.
90. ప్రజాభవః --- సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు.
91. అహః --- ఎవరినీ ఎన్నడూ వీడనివాడు; పగటివలె ప్రకాశ స్వరూపుడై అజ్ఞానమును తొలగించి జ్ఞానోన్ముఖులను చేయువాడు; తన భక్తులను నాశనము కాకుండ కాపాడువాడు.
92. సంవత్సరః --- భక్తులనుద్ధరించుటకై (వెలసి) యున్నవాడు; కాల స్వరూపుడు.
93. వ్యాళః --- భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు; (సర్పము, ఏనుగు, పులి వంటివానివలె) పట్టుకొనుటకు వీలుగానివాడు (చేజిక్కనివాడు)
94. ప్రత్యయః --- ఆధారపడ దగినవాడు; విశ్వసింపదగినవాడు (ఆయనను నమ్ముకొనవచ్చును) ; ప్రజ్ఞకు మూలమైనవాడు.
95. సర్వదర్శనః --- తన కటాక్షపరిపూర్ణ వైభవమును భక్తులకు జూపువాడు; సమస్తమును చూచుచుండెడి వాడు.
శ్లో. సురేశః శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః !! 10 !!
---(నామాలు 85--94)
20. స్వామి దేవతలకు సంరక్షఁ దానెగా
ముదము గూర్చు, మూల పురుషు డతడె
జన్మ కారకుడును, జగతికి జీవమూ
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : సురేశః ... సురలకు అంటే దేవతలకు ఈశుడు అంటే స్వామి లేదా దేవుడూ అనవచ్చు, శరణః ... దుఃఖాలను పోగొట్టేవాడు అంటే రక్షకుడే, శర్మః ... ఆనంద కారకుడు అంటే ముదము గూర్చువాడు, విశ్వరేతా ... సకల ప్రపంచం పుట్టుకకూ కారణమైనవాడు, ప్రజాభవః ... ప్రజోత్పత్తికి కారణభూతుడు, అహః ... జీవము.
భావము : దేవతలకు సైతం ప్రభువు, శరణన్న వారిని సంరక్షించేవాడు, పరమానంద స్వరూపుడు, ప్రజలను పుట్టించ డానికి సాధనమైనరేతస్సూ, దాని ఆధారంగా జరిగే పుట్టుకలకు కారణమైన వాడూ, పగలు మాదిరి వెలుగు ప్రసాదించేవాడు లేదా పగలే ప్రజలకు జీవము గనుక జీవమూ తానే అయిన వాడు అయిన ఆ శ్రీహరికి శతసహస్ర వందనాలు.)
21. కాల పురుషు డనగ, కాల నాగను తానె
పట్టు వీడబోని పరమ పురుష
ప్రజ్ఞ యున్న వాడు, పారవ గలవాడు
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : సంవత్సరః ... కాలపురుషుడు, వ్యాళః వాసుకి (మహానాగు), ప్రత్యయః ... ప్రజ్ఞా ధురీణుడు, సర్వ దర్శనః ... సకలమూ వీక్షించువాడు ... పారవ అంటే వీక్షణ, చూపు అనే అర్థమూ ఉన్నవి కదా...
భావము : భూతభవిష్యద్వర్త మానాలన్నీ తానే అయిన వాడు, తన పట్టు నుంచి భక్తులెవరూ జారిపోకుండా చూడగలవాడు, ప్రజ్ఞా ధురీణుడు, తన దృష్టి పథం నుంచి ఏదీ తప్పించుకు పోలేకుండా సర్వమూ వీక్షించువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
ఓం నమో నారాయణాయ
🌿💮🌿💮🌿💮🌿💮
శ్లోకం 11:
అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః|
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః||
96. అజః --- జన్మము లేనివాడు; అన్ని అడ్డంకులను తొలగించు వాడు; భక్తుల హృదయములందు చరించుచుండువాడు; అన్ని శబ్దములకు మూలమైనవాడు.
97. సర్వేశ్వరః --- ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు; ఎవరు తనను వేడుకొందురో వారి చెంతకు తానై వేగముగా వచ్చి అనుగ్రహించువాడు.
98. సిద్ధః --- పొందవలసిన సమస్త సిద్ధులను పొందియే యున్నవాడు; తన భక్తులకు అందుబాటులో నుండెడివాడు; ఏ విధమైన లోపములు లేని, సకల పరిపూరహనత్వమైన రూపము గలవాడు.
99. సిద్ధిః --- సాధనా ఫలము, పరమ లక్ష్యము; సర్వకార్య ఫలములు తానై యున్నవాడు; భక్తులకు నిధివలె సిద్ధముగా నున్నవాడు.
100. సర్వాదిః --- సర్వమునకు మూలకారణము, ప్రప్రథమము; సకల సృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ.
101. అచ్యుతః --- తన దివ్య తేజో విభూతి శక్తి సంపన్నత్వముల నుండి యెన్నడును జారని (తరగని) వాడు; తన భక్తులెన్నడు ను పతనము చెందకుండ గాచువాడు; జన్మ, పరిణామ, వార్ధక్యము వంటి దశలకు అతీతమైనవాడు.
102. వృషాకపిః --- జలములలో (అధర్మములో) మునిగిపోవు భూమిని ఉద్ధరించిన శ్రీవరాహ మూర్తి; ధర్మ పరిరక్షకుడు.
103. అమేయాత్మా --- ఆ పరమాత్ముని స్వరూపము కొలుచుటకు (తెలిసికొనుటకు) సాధ్యము కాదు; ఆశ్రితులను అనుగ్రహీంచుటలో పరిమితి లేనివాడు. ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కలిగిన వాడు - భగవంతుడు. అందరి ఊహలకు తాను కారణమై యుండగా తన ఊహలను ఊహించు సామర్ధ్యమెవరికున్నది.
104. సర్వ యోగ వినిసృతః --- అన్ని సంగములకు,బంధములకు, విషయ వాసనలకు అతీతుడు; ఎన్నో విధములైన (జ్ఞాన, కర్మ, భక్తి వంటి) యోగములద్వారా సులభముగా పొందనగువాడు.
శ్లో. అజః సర్వేశ్వర స్సిద్దః సిద్ధిః సర్వాది రచ్యుతః
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్మృతః !!11!!
22. జనన మనగ లేదు, జగదీశ్వరుడె తాను
పొంద తగిన దంత పొంది యుండె!
మోక్ష దాత యతడు, మూలమన్నిటికినీ
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : అజః ... పుట్టుక లేనివాడు, సర్వేశ్వరః ... ఈశ్వరులకే ఈశ్వరుడు, సిద్ధః ... పొందవలసినదంతయూ పొందియున్న వాడు, సిద్ధిః ... ఫలరూపుడు, సర్వాది ...అన్నిటికీ మూలకారకుడు.
భావము : జననం అంటూ లేనివాడు,ఈశ్వరులకే ఈశ్వరుడు (జగదీశ్వరుడన్నా అదే అర్థం కదా), ఈ విశ్వంలో పొందదగిన దంతా (కర్మ ఫలము అనుకోవచ్చు) పొంది యున్నవాడు, మోక్షప్రదాత (ఆంగ్ల భాష్యం ప్రకారం కైవల్య ప్రదాత అని కూడా ఉన్నది), అన్నిటికీ మూలకారకుడు అయిన శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
23. అచ్యుతుడును, తానె ఆది వరాహపు
రూపు దాల్చె, నెన్నొ రూపులుండె!
బంధములును లేవు, భవబంధములు దెంచు
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : అచ్యుతుడు ... పతనం లేనివాడు, వృషా కపిః ... అర్థాలు రకాలుగా ఉన్నాయి. సమీపంగా ఉన్న అర్థం ఆది వరాహమనే, అమేయాత్ః ... అనేక రూపాలు న్నవాడు, సర్వయోగ వినిస్మృతః .. అన్నిరకాల సాంగత్యాలను వదిలించుకున్నవాడు.
భావము : స్వరూప, సామర్థ్యాలలో ఏ విధంగానూ లోటు పాట్లు లేనివాడు, ఆది వరాహమై ధర్మాన్ని ఉద్ధరించినవాడు, అనేకానేక రూపాలున్నవాడు, తానుగా భవబంధాలను తెంచుకుని, భక్తులను సైతం వాటికి దూరం చేసేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
ఓం నమో నారాయణాయ
🙏🙏
శ్లోకం 12:
వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః|
అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః||
105. వసుః --- సమస్త భూతములు తనయందు గలవాడు; తన భక్తుల హృదయములందు వసించువాడు; క్షీరసాగరమున వసించువాడు; భక్తులు కోరుకొను పరమార్ధము; అష్ట వసువులలో శ్రేష్టుడైన పావకుడు; అంతరిక్షమున వసించువాడు.
106. వసుమనాః --- శ్రేష్ఠమయిన, సకలైశ్వర్యవంతమయిన మనసు గలవాడు; ఏ విధమైన వికారములకును లోనుగాని పరమ శాంతిచిత్తుడు; తన భక్తులను గొప్ప నిధులుగా భావించువాడు.
107. సత్యః --- నిజమైనది, మూడు కాలములలోనుండునది, నాశనము లేనిది; ప్రాణము, పదార్ధము (అన్నము), సూర్యుడు అనే మూడింటిచే కూడిన రూపము గలవాడు; సత్ప్రవర్తనయందు ప్రీతిగలవాడు,
108. సమాత్మా --- సమమైన, భేదభావములేని, రాగద్వేష రహితమగు ఆత్మ;
109. సమ్మితః --- తన భక్తులచే ఇచ్ఛానుసారముగా నియంత్రింపబడువాడు (వారి అనుభవములకు గోచరించువాడు) ; ఋషులచే అంగీకరింపబడి, ఉపనిషత్తుల ద్వారా తెలుపబడినవాడు;
అసమ్మితః --- పరిచ్చేదింపబడజాలనివాడు; అంత్యము, హద్దు లేనివాడు
110. సమః --- అన్నింటియందును సమభావముగలవాడు; మార్పులేకుండ ఎల్లప్పుడు సమముగా (ఒకే తీరున) ఉండువాడు; (స మయా-) శ్రీలక్ష్మీ సమేతుడు.
111. అమోఘః --- తనను పూజించువారికి నిశ్చయముగ సత్ఫలితములనిచ్చువాడు (భగవంతుని ఆరాధన వ్యర్ధము కాదు).
112. పుణ్డరీకాక్షః --- తామరపూవు వంటి కన్నులు గలవాడు; అందరి హృదయ కమలమున వసించి సమస్తమును చూచువాడు; వైకుంఠవాసులకు కనుచూపువంటివాడు.
113. వృషకర్మా --- ధర్మమే తన నిజకర్మగా గలిగినవాడు.
114. వృషాకృతిః --- మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు.
శ్లోకం 13
రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః|
అమృత శ్శాశ్వతః స్ధాణుః వరారోహో మహాతపాః||
115. రుద్రః --- కన్నులలో నీరు తెప్పించువాడు (1. ప్రళయకాలమున ప్రాణుల లయము చేయునపుడు 2. తనను స్మరించు భక్తులను ఆనందపరచుచు) ; భక్తులకు శుభములను కలిగించువాడు; దుఃఖమును, దారిద్ర్యమును నాశనము చేయువాడు.
116. బహుశిరాః --- అనేకములైన శిరములు గలవాడు; ఆదిశేషునిగా అవతరించినవాడు; అనంతుడు.
117. బభ్రుః --- ఆధారమైనవాడు, భరించువాడు (ఆదిశేషుడై, ఆది కూర్మమై, ఆదివరాహ మూర్తియై)
118. విశ్వయోనిః --- విశ్వమునకు కారణమైనవాడు; తనను ఆశ్రయించిన భక్తులను తనలో విలీనము చేసుకొనువాడు.
119. శుచిశ్రవాః --- శుభప్రథమైన, శ్రవణమాత్రముననే పవిత్రులను చేయగల దివ్యనామములు గలవాడు; ధర్మపూరితములు, సత్యములునగు వాక్కులు విని ఆనందించువాడు; దివ్య సుందరమగు చెవులు గలవాడు.
120. అమృతః --- భక్తులకు తనివి తీరని అమృతమూర్తి; అజరుడు, అమరుడు.
121. శాశ్వత స్థాణుః --- కాళముతో నిమిత్తము లేకుండ నిశ్చలముగా, నిత్యమై, సత్యమై, నిరంతరమైన వాడు; ఆదిమధ్యాంత రహిత పరబ్రహ్మము; స్థిరుడై భక్తులకు నిత్యభోగమైనవాడు.
122. వరారోహః --- అన్నింటికంటె శ్రేష్టమగు ఊర్ధ్వగతి, పొందదగిన అత్యున్నత పదము; ఏ స్థానము చేరినపిదమ మరల తిరిగి జన్మింపరో అట్టి పరమోత్కృష్ట స్థానము గలవాడు; అత్యుత్తమమగు వృద్ధి గలవాడు; ఆదిశేషునిపై పవళించువాడు..
123 మహాతపాః --- గొప్ప తపస్సు (జ్ఞానైశ్వర్య ప్రతాపములు) గలవాడు; మహత్తరమైన జ్ఞానము గలవాడు.
శ్లో. వసు ర్వసుమనాః స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః !!12!!
---(నామాలు 104 ... 113)
24. వాసముండు జీవ రాశులన్నిటి యందు
విరస, రాగములకు విముఖు డతసత్యమైనవాడు, సముడె, సమ్మితుడెగా
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : వసుః ... సర్వ భూతములందునూ వసించు వాడు, వసుమనాః ... రాగ ద్వేషములు లేని పరిశుద్ధాత్ముడు, సత్యః ... సత్యమైనవాడు, సమాత్మా ... సమతా భావము కలవాడు, సమ్మితః ... భక్త సులభుడు (ఆంగ్ల భాష్యం ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన వాడు).
భావము : సకల జీవ రాశులలో నివసించేవాడు, (కొన్ని భాష్యాల ప్రకారం అష్టవసువులలో ఒకరైన అగ్ని అని ఉంది. ఆ ప్రకారంగా చూసినా అన్ని జీవులలోనూ అంతో ఇంతో వేడిమి ఉంటుంది కదా), రాగ ద్వేషాలకు అతీతమైన వాడు, సత్యమైనవాడు, సమతా భావం కలవాడు( సౌమ్యుడు, ఉదారుడు అనే నానార్థాలు కూడా ఉన్నవి కదా), భక్త సులభుడై అందరికీ ఆమోదయోగ్యమైన వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
25. సముడు నతడె, జూడు సత్ఫలములొసగు
హృదయ పద్మ వాసి, యుదజ దళాక్షుడే
ధర్మ కర్త దానె, ధర్మమే యాకృతి
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : సమాః ... సర్వ సమానుడు (లక్ష్మీ పతి కూడా కావచ్చును), అమోఘః ... సరియైన ఫలితములనిచ్చువాడు, (ఆంగ్ల భాష్యం ప్రకారం ఉపయోగకారి), పుండరీకాక్షః ... పుండరీకము (ఉదజము) అంటే పద్మము కనుక పద్మము (రేకల) వంటి కనులు గలవాడు అని ఒక పాఠం, కాగా భక్తుల హృదయ పద్మములో నివసించువాడు అని ఇంకొక భాష్యం, వృష కర్మః ... ధర్మ బద్ధమైన కర్మలు చేయువాడు, వృషాకృతిః ... ధర్మమే ఆకారమైనవాడు( రామో విగ్రహవాన్ ధర్మః అనడంలో భావం అదే కదా...).
భావము : సకల భూతముల పట్ల సమానంగా వ్యవహరించువాడు,( స మా ... అంటే లక్ష్మితో ఉండువాడు అనే భాష్యమూ ఉన్నది), సరియైన ఫలితముల నిచ్చువాడు, భక్తుల హృదయ పద్మము లందు నివసించువాడు, (లేదా పద్మముల వంటి కనులు కలవాడు అనే భావమూ ఉన్నది), ధర్మమైన కార్యక్రములనే నిర్వర్తించే, ధర్మమే ఆకారముగా గలవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
🙏ఓం నమో నారాయణాయ🙏
⚛️ శ్లోకం 13 ⚛️
రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః|
అమృత శ్శాశ్వతః స్ధాణుః వరారోహో మహాతపాః||
115. రుద్రః --- కన్నులలో నీరు తెప్పించువాడు
(1). ప్రళయకాలమున ప్రాణుల లయము చేయునపుడు
2. తనను స్మరించు భక్తులను ఆనందపరచుచు) ; భక్తులకు శుభములను కలిగించువాడు; దుఃఖమును, దారిద్ర్యమును నాశనము చేయువాడు.
116. బహుశిరాః --- అనేకములైన శిరములు గలవాడు; ఆదిశేషునిగా అవతరించినవాడు; అనంతుడు.
117. బభ్రుః --- ఆధారమైనవాడు, భరించువాడు (ఆదిశేషుడై, ఆది కూర్మమై, ఆదివరాహ మూర్తియై)
118. విశ్వయోనిః --- విశ్వమునకు కారణమైనవాడు; తనను ఆశ్రయించిన భక్తులను తనలో విలీనము చేసుకొనువాడు.
119. శుచిశ్రవాః --- శుభప్రథమైన, శ్రవణమాత్రముననే పవిత్రులను చేయగల దివ్యనామములు గలవాడు; ధర్మపూరితములు, సత్యములునగు వాక్కులు విని ఆనందించువాడు; దివ్య సుందరమగు చెవులు గలవాడు.
120. అమృతః --- భక్తులకు తనివి తీరని అమృతమూర్తి; అజరుడు, అమరుడు.
121. శాశ్వత స్థాణుః --- కాళముతో నిమిత్తము లేకుండ నిశ్చలముగా, నిత్యమై, సత్యమై, నిరంతరమైన వాడు; ఆదిమధ్యాంత రహిత పరబ్రహ్మము; స్థిరుడై భక్తులకు నిత్యభోగమైనవాడు.
122. వరారోహః --- అన్నింటికంటె శ్రేష్టమగు ఊర్ధ్వగతి, పొందదగిన అత్యున్నత పదము; ఏ స్థానము చేరినపిదమ మరల తిరిగి జన్మింపరో అట్టి పరమోత్కృష్ట స్థానము గలవాడు; అత్యుత్తమమగు వృద్ధి గలవాడు; ఆదిశేషునిపై పవళించువాడు.
123. మహాతపాః --- గొప్ప తపస్సు (జ్ఞానైశ్వర్య ప్రతాపములు) గలవాడు; మహత్తరమైన జ్ఞానము గలవాడు.
శ్లో. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వ యోని శ్శుచి శ్రవః
అమృత శ్శాశ్వత స్థాణుర్వరారోహో మహా తపాః !!13!!
నామాలు 114 ... 122)
26. శివుడె కాని చూడ శిరసులెన్నో యుండు
విశ్వ పాలకుండు, విశ్వయోని
శుభ్రమైన చెవులు, సురసేవితుడతడు
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : రుద్ర ... శివుడు, బహుశిరా ... వేలాది శిరస్స లున్నవాడు, బభ్రుః ... పాలకుడు, విశ్వయోని ... సృష్టి యంతటికీ జన్మస్థానం, శుచిశ్రవాః ... పరిశుద్ధమైన చెవులున్నవాడు, అమృతః ... మరణము లేనివాడు.
భావము : దుఃఖములను హరించి శుభములిచ్చువాడు, వేలాది శిరస్సులున్నవాడు ( సృష్టిలోని చరాచర జీవులన్నిటా ఉంటూ అన్నీ తానే ఐన వాడు గనుక వేలాది చెవులున్నట్లే కదా), మంచి పాలకుడూ, మరణము లేని(అమృతం అనగా సుర) తాగిన వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
27. నశ్వరుండు కాడు నయముగా జేర్చునూ
జ్ఞాన గమ్యమునకు గమము చూపు
తాపసులలొ జూడ తనకు సాటియె లేదు
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : శాశ్వత స్థాణుః ... శాశ్వతంగా నిశ్చలమైన (నాశము లేని)వాడు, వరా రోహః ... జ్ఞాన మార్గము చేర్చువాడు (గమము అంటే దారి అనే యర్థమూ ఉన్నది కదా) లేదా తానే గమ్యం అయిన వాడూ కావచ్చు, మహా తపాః ... అద్భుతమైన జ్ఞానం కలవాడు. తాపసి అంటే తాప త్రయాలను జయించిన మునీశ్వరుడు కదా.
భావము : శాశ్వతమైన వాడు, దేనికీ చలించని వాడు, జ్ఞానానికి చివరి మెట్టు లేదా దారి చూపే వాడు, తాపసులలో యెన్న దగిన వాడు లేదా విశేష జ్ఞానము కలవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
ఓం నమో నారాయణాయ
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
శ్లోకం 14:
సర్వగ స్సర్వవిద్భానుః విష్యక్సేనో జనార్దనః|
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః||
124. సర్వగః --- అంతటను గమనము గలవాడు; ఎక్కడైనా చేయూతనిచ్చువాడు.
125. సర్వవిత్ --- సమస్తము తెలిసినవాడు; సమస్తమునకు పునరుజ్జీవనము ప్రసాదించు వాడు (వెలుపలికి తీయువాడు)
సర్వవిద్భానుః --- (శంకరాచార్యులు ఒకేనామముగా పరిగణించిరి) సర్వము తెలిసి, అవిరామముగ, అవికారముగ ప్రకాశించేవాడు.
126. భానుః --- ప్రకాశించువాడు.
127. విష్వక్సేనః --- లోక రక్షణార్ధము అన్ని దిక్కులందు సైన్యము గలవాడు; తన తలంపు మాత్రమున సర్వదానవ సైన్యమును నాశనము చేయువాడు.
128. జనార్దనః --- దుష్టులను శిక్షించువాడు; దుష్టుల బారినుండి సజ్జనులను రక్షించువాడు; భక్తుల రక్షణలో విఘ్నములు కలిగించువారిని పరిమార్చువాడు; కామితార్ధములకై భక్తులు ఎవరిని ఆశ్రయింతురో ఆ దేవుడు.
129. వేదః --- సమస్త జ్ఞానము మూర్తీభవించినవాడు; వేదమూర్తి.
130. వేదవిత్ --- వేదములను, వాని సారము (అర్థమును) సంపూర్ణముగా నెరిగినవాడు; వేదజ్ఞానము బోధీంచువాడు.
131. అవ్యఞ్గః --- ఏ విధమైన లోపములు లేనివాడు (వేద జ్ఞానమందు, గుణ వైభవము నందు). వేదాంగములు తానే అయినవాడు.
132. వేదాఞ్గః --- వేదములే శరీరముగా (అంగములుగా) గలవాడు; వేదమూర్తి.
133. వేదవిత్ --- వేదములనెఱుగుటయే గాక, వేదసారమైన ధర్మము నెరిగిన వాడు.
134. కవిః --- సామాన్య దృష్టినధిగమించి, సునిశిత దర్శనము (సూక్ష్మ దృష్టి) కలిగిన వాడు; సకలమును దర్శించు వాడు; రమ్యముగా కనుపించు వాడు.
సర్వగః సర్వ విద్భానుః విష్వక్సేనో జనార్దనః
వేదో వేద విదవ్యంగో వేద విద్కవిత్కవిః !!14!!
(నామాలు ... 123...132)
28. లేని చోటు లేదు, జ్ఞానులలో జ్ఞాని
ఎదురు లేదు తనకు, ముదము గూర్చు
వేద రూపు వాడె, వేద విద్వాంసుడే
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : సర్వగః ... సర్వత్రా జొచ్చుకుని పోగలవాడు, సర్వ విద్భానుః ... సర్వమూ తెలిసిన వాడు, విష్వక్సేనః ... దేవతలు సైతం తేరిపార జూడలేని వాడు, జనార్దనః ... ఆనందింపజేయువాడు, వేదః ... వేద రూపుడు, వేద విత్ ... వేదములను ఔపోశన పట్టినవాడు.
భావము : గమ అంటే వెళ్ళడం, ముందుకు సాగడం, (చొచ్చుకు పోవడం కూడా కావచ్చు) కదా...ఆ ప్రకారంగా సర్వగ అంటే అంతటా తానై ఉన్నవాడు అనుకోవచ్చు, స్రవమూ తెలిసిన వాడు (జ్ఞానులకెల్లా మహా జ్ఞాని), దేవతలను సైతం అవలీలగా ఎదుర్కోగలవాడు, గొప్ప శక్తిమంతుడు, జనులకు ఆనందం కలగజేయువాడు, వేదరూపుడూ, వేదాలను ఔపోశన పట్టిన వాడూ ఐన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }
29. వ్యంగ కాడు, వాని యంగాలె వేదాలు,
వేద సారమంత విస్తృతముగ
ఎరుక గలిగి యెరుక బరచు కవి యతడె
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : అవ్యంగః ... అ + వి + అంగ ... వి అంగ కానివాడు అనగా ఏవిధమైన లోపాలు లేనివాడు, వేదాంగః ... వేదాలే అంగాలైనవాడు, వేదవిత్ .... వేదాల లోతుపాతులను క్షుణ్ణంగా తెలిసిన వాడు, కవి ... సర్వ ద్రష్ట.
భావము : ఏ విధమైన లోపాలు లేని మనోహరమైన రూపం గలవాడు, వేదాలే తన అంగాలు కాగా, వాటి లోతుపాతులు క్షుణ్ణంగా ఎరిగినవాడు, సర్వమూ తెలిసిన మునీశ్వరుడు(" నాన్ ఋషి కురుతే కావ్యం " ... అనే పెద్దల వాక్కును బట్టి కావ్యం వ్రాయగలవాడు అనగా కవి ఐనవాడు ఋషి తుల్యుడే ఇక్కడ ఆంగ్ల పాఠంలో కూడా కవిః అంటే మునీశ్వర అనే అర్థం కనబడు తూండటం గమనార్హం కదా!) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు. }
ఓం నమో నారాయణాయ
శ్లోకం 15:
*లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|*
*చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః||*
135. లోకాధ్యక్షః --- లోకములకు స్వామి, త్రిలోకాధిపతి.
136. సురాధ్యక్షః --- దేవతలకు స్వామి; దేవదేవుడు.
137. ధర్మాధ్యక్షః --- ధర్మమునకు ప్రభువు.
138. కృతాకృతః --- ఇహపరములు రెండింటను ఫలములు ప్రసాదించువాడు; ప్రవృత్తి, నివృత్తి ధర్మములచే జీవులకు నిత్యఫలమునిచ్చువాడు; కారణ రూపమున అవ్యక్తమైనవాడు, కార్యరూపమున వ్యక్తమైనవాడు.
139. చతురాత్మా --- సృష్టి, స్థితి, లయములందు నాలుగేసి విభుతులతో నొప్పువాడు; (నాలుగు సృష్టి విభూతులు - బ్రహ్మ, దక్షుడు మున్నగు ప్రజాపతులు, కాళము, సర్వభూతములు; నాలుగు స్థితి విభూతులు - విష్ణువు, మనువు మొదలగువారు, కాళము, సర్వభూతములు; నాలుగు లయ విభూతులు - రుద్రుడు, కాలము, యముడు, సర్వభూతములు) ; నాలుగు విధములగు సాధనావస్థలకు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలకు) ప్రభువు.
140. చతుర్వ్యూహః --- నాలుగేసి వ్యూహములతో నొప్పువాడు (వ్యూహము = ఒక ప్రయోజనము కొరకు ఏర్పడిన ఆకారము) ; ప్రద్యుమ్న వ్యూహము - సృష్టి కార్యము నిర్వహించు ఐశ్వర్య, వీర్య సంపన్న స్వరూపము; అనిరుద్ధ వ్యూహము - స్థితికార్యము నిర్వహించు శక్తి, తేజో ప్రధాన స్వరూపము; సంకర్షణ వ్యూహము - లయ కార్యము నిర్వహించు జ్ఞాన బల గుణ ప్రధాన స్వరూపము; వాసుదేవ వ్యూహము - షడ్గుణ (జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజో) పరిపూర్ణ స్వరూపము, అనంత నిరవధిక శక్తి గుణ కాంతి సంపన్నుడు.
141. చతుర్దంష్ట్రః --- నాలుగు కోరపండ్లు కలవాడు (అభయ ప్రదాత శ్రీనృసింహస్వామిని స్మరించు మంగళ నామము).
142. చతుర్భుజః --- నాలుగు బాహువులతో నొప్పువాడు; శంఖ చక్ర గదా పద్మ ధారి
29. వ్యంగ కాడు, వాని యంగాలె వేదాలు,
వేద సారమంత విస్తృతముగ
ఎరుక గలిగి యెరుక బరచు కవి యతడె
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : అవ్యంగః ... అ + వి + అంగ ... వి అంగ కానివాడు అనగా ఏవిధమైన లోపాలు లేనివాడు, వేదాంగః ... వేదాలే అంగాలైనవాడు, వేదవిత్ .... వేదాల లోతుపాతులను క్షుణ్ణంగా తెలిసిన వాడు, కవి ... సర్వ ద్రష్ట.
భావము : ఏ విధమైన లోపాలు లేని మనోహరమైన రూపం గలవాడు, వేదాలే తన అంగాలు కాగా, వాటి లోతుపాతులు క్షుణ్ణంగా ఎరిగినవాడు, సర్వమూ తెలిసిన మునీశ్వరుడు(" నాన్ ఋషి కురుతే కావ్యం " ... అనే పెద్దల వాక్కును బట్టి కావ్యం వ్రాయగలవాడు అనగా కవి ఐనవాడు ఋషి తుల్యుడే ఇక్కడ ఆంగ్ల పాఠంలో కూడా కవిః అంటే మునీశ్వర అనే అర్థం కనబడుతూండటం గమనార్హం కదా!) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు. }
శ్లో. లోకాధ్యక్ష, సురాధ్యక్షో, ధర్మాధ్యక్ష, కృతా కృతఃచతురాత్మా, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్రా, చతుర్భుజః !!15!!
(నామాలు 133...140)
30. అధిపతె జగమునకు, అరసు నాకమునకు,
అరయ గల్పములకు నతడె బతియు,
కార్య కారణములు కనగ యాతనిలోనె
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : లోకాధ్యక్ష ... లోకాలకు అధిపతి, సురాధ్యక్ష ... స్వర్గాధిపతి, ధర్మాధ్యక్ష ... ధర్మాలకు అదినాథుడు, కృతా కృతః ... కార్య కారణ రూపుడు, వ్యక్తా వ్యక్త స్వరూపుడు.
భావము : లోకాలకు అధిపతి, స్వర్గానికి (నాకమునకు) అధినాథుడు(అరసు అంటే రాజు, ప్రభువు అనే అర్థాలూ ఉన్నాయి కదా), ధర్మాలకు( కల్పము అంటే న్యాయము, ధర్మము అనే అర్థాలూ ఉన్నాయి కదా) అధిపతి (పతి అంటే కూడా ప్రభువు అనే అర్థం ఉందికదా), వ్యక్తా వ్యక్త స్వరూపుడు(కృతము అంటే చేసినది, అకృతము అంటే చేయనిది...చేసేదీ చేయించేదీ వాడే . కనుక చేయించేటపుడు తాను అకృత రూపుడే కదా) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.}
31. చనుగ జూడ చతురాత్మయై తానె
నాల్గు వ్యూహములతొ నయముగాను
నాల్గు కోరలుండు, నాలుగే భుజములు
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : .చతురాత్మా ... విభూతి చతుష్టయం, చతుర్ వ్యూహ ... నాలుగు వ్యూహాలు, చతుర్ దంష్ట్ర ... నాలుగు కోరలు, చతుర్భుజః ... నాలుగు భుజాలు.
భావము : పరమాత్ముడైన శ్రీహరి రజోగుణ స్వరూపమై సృష్టి కార్యక్రమంలో పరబ్రహ్మ, ప్రజాపతులు (కశ్యపాదులు), కాలము, సృష్టి, స్థితిలో విష్ణువు, మనువులు, కాలము, పాలన, తమోగుణ ప్రధానమైన లయములో రుద్రుడు, అగ్ని, కాలము, లయము...( దీనినే విభూతి చతుష్టయం అంటున్నారు) లై ప్రసిద్ధికెక్కు తున్నాడు(చను అంటే ప్రసిద్ధికెక్కు అనే అర్థమూ ఉంది కదా). ఇక నాలుగు వ్యూహాలంటే వాసుదేవ. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే వ్యూహాలు... (బహుశా ఆ అవతారాలే వ్యూహాత్మకం కావచ్చునేమో), నాలుగు కోరలంటే ... ధర్మార్థ కామ మోక్షములు, నాలుగు వేదాలు, చతురాత్మలూ, వ్యూహాలు... (వీటితోనే సందర్ఙానుసారం రక్కసి గుణాలను అణచివేస్తుంటాడా శ్రీహరి,) నాలుగు భుజాలు ... శంఖు, చక్ర, గదా, ధనువులు వీటిని ధరించడానికీ, జగత్తులోని తన భక్తులను భవసాగరం నుంచి దాటించడానికి తగినంతగా విశాలమూ, దృఢతరమూ అయిన భుజాలు... ఇన్ని విశిష్టతలున్న ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}
🙏ఓం నమో నారాయణాయ🙏
శ్లోకం 16:
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః||
143. భ్రాజిష్ణుః --- స్వయంప్రకాశ స్వరూపుడు; తేజోమయుడు; (సాధన చేయు, శరణాగతులైన) భక్తులకు కనిపించువాడు.
144. భోజనం --- నోటితో గాని, జ్ఞానేంద్రియములతో గాని స్వీకరించు విషయములు (అన్నము, శబ్దము, స్పర్శ, గంధము వంటివి) అన్నియును భగవత్స్వరూపములే. ఇంద్రియముల ద్వారా గ్రహించు విషయముల రూపమునను, ఇతర పూజాదిక కార్యముల ద్వారా లభించు ఫల రూపమునను భక్తులకు ఆనందానుభూతిని ప్రసాదించువాడు; సచ్చిదానంద స్వరూపుడు.
145. భోక్తా --- భుజించువాడు; భోజన రూపమగు ప్రకృతి లేక మాయను పురుష రూపమున అనుభవించువాడు; భక్తితో నొసగిన కానుకలు స్వీకరించి సంతుష్టుడయ్యేవాడు; యజ్ఞములో అర్పించినదానిని గ్రహించువాడు.
146. సహిష్ణుః --- సహించి, క్షమించి, అనుగ్రహించు కరుణామయుడు; ఓర్పు కలిగి భరించు సర్వ సాక్షి, సహన మూర్తి; దుష్టులను సంహరించువాడు.
147. జగదాదిజః --- జగములన్నింటికంటే ముందుగా నున్నవాడు.
148. అనఘః --- పాపరహితుడు; కల్మషము లేనివాడు.
149. విజయః --- జయించుటయే స్వభావ స్వరూపముగా గలవాడు; బ్రహ్మ రుద్రాదుల విజయములకు కూడా కారణమైనవాడు; ప్రకృతిని జయించినవాడు; పాండవులలో అర్జునుడు.
150. జేతా --- జయించువాడు; అంతా ఆయన ఇచ్ఛానుసారమే జరుగును.
151. విశ్వయోనిః --- విశ్వమునకు జన్మ స్థానము, కారణము; విశ్వమే కారణముగా గలవాడు.
152. పునర్వసుః --- తన సృష్టి యందంతట సకల దైవము లందును అంతరాత్మయై మరల మరల విలసిల్లువాడు; ప్రళయానంతరము మరల సృష్టి కావించువాడు.
శ్లో. భ్రాజిష్ణు ర్భోజనం భాక్తాః సహిష్ణు ర్జగదాదిజః
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః !!16!!
32. వెలుగులకును తానె వెలుగు నిచ్చుచు నుండు
భోజనంబు మరియు భోక్తఁ దానె
సహన శీలి యతడె, సకల సృష్టికి యాది
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : భ్రాజిష్ణు ... అద్వయ ప్రకాశకుడు (Light of Lights), భోజనం ... భుజింప దగిన వాడు(భోజ్యము), భోక్త...భుజించువాడు,
సహిష్ణు ... సహనశీలి, జగదాదిజ ... జగత్తుకు ముందు నుంచీ ఉన్నవాడు.
భావము : సూర్య చంద్రులకు, అగ్నికి సైతం వెలుగు ప్రసాదిస్తూ తానే స్వయం ప్రకాశకుడైనవాడు (ఆంగ్ల భాష్యంలో కూడా Light of Lights అనే ఉన్నది కదా) , భుజింప దగిన వాడు లేదా భోజ్యము అనగా అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం (అలాగే సర్వత్రా ఆయనే ఉన్నప్పుడు ఫలాదులలోనూ ఉన్నట్లే కదా) కనుక భోజ్యమే, అంతే గాక, జ్ఞానేంద్రియాలకు జీవం(ఆహారం) తానే అంటాడు కనుక ఆ ప్రకారంగానూ శ్రీహరిని భోజ్యమనవచ్చునేమో కదా, కాగా ... ఫలం, తోయం, రకరకాల ఆహారాలను నివేదిస్తుంటాం కనుక ఆయనను భోక్తగానూ వ్యవహరించ వచ్చు. భక్తులు యెన్ని ఎలా మాట్లాడినా సహనంతో ఉంటూ వారిని కాపాడుతుంటాడు కనుక సహిష్ణువే అనవచ్చు. సృష్టికి పూర్వం నుంచీ ఉన్నవాడు గనుక జగదాదిజ అనీ వ్యవహరించ బడుతున్న ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}
33. అనఘు డనగ నతడె, అద్భుత విజయుడు,
జయమె శీల మాయె, జగతికంత
కారకుండు, మరియు కనగ పునర్వసు
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు :
అనఘ .. పాపరహితుడు, విజయ ... శ్రేష్ఠమైన విజయం సాధించిన వాడు,
జేతా ... జయుడు (సంస్కృత నిఘంటువు ప్రకాంర జయశీలి), విశ్వయోని ... విశ్వం పుట్టుకకు కారణమైనవాడు, విశ్వం వల్లనే పుడుతున్నవాడు.
పునర్వసు ... పదే పదే పుడుతున్నవాడు, క్షేత్రజ్ఞుడవు తున్నవాడు.
భావము : కర్మలు చేయనివాడు, వాటి ఫలాలు కూడా అంటని వాడు గనుక పాపాలు పుణ్యాలు కూడా అంటని వాడే కదా, అసురులపై అద్భుతమైన విజయాలు సాదించిన వాడు, అంతేగా పార్థుని ద్వారా కూడా ధర్మ సంస్థాపనలో విజయం సాధింపజేసినవాడు(ఆంగ్ల పాఠం ప్రకారం విజయుడంటే పార్థుడే అనీ ఉంది) చెడుపై గెలుపు సాధించడమే తన తత్త్వంగా గలవాడు (సంస్కృత నిఘంటువులో జేతా అంటే జయస్వభావుడు అనే అర్థం ఉన్నది కదా), విశ్వం పుట్టుకకు కారకుడు, మరో పాఠం ప్రకారం విశ్వమే తన పుట్టుకకు కారణమైన వాడు, పదే పదే పుడుతూ( ఏదో ఒక జీవరాశిలో వసించి) యుండే వాడు (సంభవామి యుగే యుగే అన్నది ఆయనే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }
ఓం నమో నారాయణాయ
శ్లోకం 17:
ఉపేన్ద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః|
అతీన్ద్ర స్సంగ్రహా స్సర్గో ధృతాత్మా నియమో యమః||
153. ఉపేంద్రః --- ఇంద్రునిపై ఇంద్రుడు (ఇంద్రునకు అధిపతి) ; ఇంద్రునకు తమ్ముడై (వామనుడై) అవతరించినవాడు; ఇంద్రియములకు అగోచరుడు.
154. వామనః --- పొట్టివానిగా అవతరించిన వాడు; చక్కనైన, కనులకింపైన, చూడ చిన్నదైన రూపము గలవాడు; ఇంద్ర రక్షణకు వామనావతారము దాల్చినవాడు.
155. ప్రాంశుః --- ఎంతో ఎత్తైన, ఉన్నతమైన, విస్తారమైన దేహము గలవాడు; త్రివిక్రముడై ముల్లోకములు ఆక్రమించినవాడు.
156. అమోఘః --- మహదాశయముతో విశేష పరిణామములు గల పనులు చేసెడివాడు; శ్రీహరి ప్రతి కార్యము విశేషించి కారణ యుక్తము, ఏదియును వ్యర్ధము కాదు, ప్రతి పనికిని పరమార్ధము ఉంది.
157. శుచిః --- పరమ పావన మూర్తి, ఏ విధమైన దోష మాలిన్యములు అంటనివాడు; ప్రత్యుపకారమేమియును కోరని పరిశుద్ధుడు; భక్తులను పవిత్రులుగా చేయువాడు.
158. ఊర్జితః --- అనంత శక్తి సామర్థ్య సంపన్నుడు; బలి చక్రవర్తిని పాతాళమునకు త్రొక్కిన మహాబలవంతుడు; ఐశ్వర్యము, శక్తి సంపన్నత, నిర్మలత్వము గలవన్నియును భగవద్విభూతులు (తేజోంశ సంభూతములు).
159. అతీంద్రః --- ఇంద్రునికంటె అధిపుడు; మనసు కంటే శ్రేష్ఠుడు.
160. సంగ్రహః --- ప్రళయ కాలమున సమస్తమును తనయందు చేర్చుకొనువాడు; సమస్తమును కలిపి తన అధీనములో నుంచుకొన్నవాడు; సులభముగా, కేవలము భక్తి వల్లనే పొందనగువాడు (అందుబాటులో ఉండేవాడు)
161. సర్గః --- తనను తానే సృష్టించుకొని, తననుండి సమస్తమును సృజించినవాడు; భక్తులననుగ్రహీంచుటకు తనను తానే సృష్టించుకొనువాడు (అవతరించువాడు).
162. ధృతాత్మా --- సకల జీవాత్మలకును ఆధారమైనవాడు (అన్ని ఆత్మలను ధరించువాడు) ; షడ్భావ వికారములు లేనివాడు.
163. నియమః --- శాసన కర్త; నియమములనేర్పఱచి, నియంత్రించి, నడపువాడు; భక్తుల శత్రువులను నిగ్రహించు వాడు.
164. యమః --- పరిపాలించువాడు. సమస్తమును (ప్రకృతి శక్తులను) వశము చేసుకొన్నవాడు; జీవుల హృదయము లందు అంతర్యామియై నడిపించువాడు.
శ్లో. ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘః శుచి రూర్జితః
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః !!17!!
34. ఇంద్రుడికిని చూడ నితడె సోదరుడుగా
అనుజుడైన మరియు నధికుడైన !
వటువె, యంబరమున వరలె నమోఘుడై
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : ఉపేంద్ర ...ఇంద్రునికి సోదరుడు లేదా ఇంద్రునికంటే అధికుడు (అర్థాలు రెండు రకాలుగానూ ఉన్నాయి కదా), వామన ... వామనావతారుడు, ప్రాంశుః ... ఉన్నతమైన శరీరం కలవాడు, అమోఘః ... గొప్ప ప్రయోజనాత్మకమైనవాడు.
భావము : ఇంద్రుని సోదరుడు, ఇంద్రుని కంటే అధికుడు అని రెండు అర్థాలు స్ఫురిస్తున్నాయి. (వీటిలో సోదరుడు అనే అర్థమే తీసుకుంటే వామనుడే అనే పాఠాంతరమూ కనిపిస్తున్నది.) వామనావతారుడు... దీనికే మరో భాష్యం ...
అహంకారం అణగదొక్కేవాడు (బలి చక్రవర్తి విషయంలో ఇది నిజమయినది కదా), ఉన్నతమైన శరీరం కలవాడు ... (వామనావతారంలో ... " ఇంతింతై... నభోరాశి కంతై "....అనే పద్యం ఈ సందర్భాన మననార్హం కదా), గొప్ప, అనూహ్య ప్రయోజనం కలిగించువాడు ...( శిక్షించినా దాని పర్యవసానం జ్ఞానం చేకూర్చడమే కదా ) అయిన ఆ శ్రీహరికే శత సహస్రవందనాలు.
35. వంక పెట్టలేము, వంక తీయు తానె,
ఎదురు లేని శక్తి, యెరుక మిన్న,
సర్వమెపుడు తానె సంగ్రహించుచు నుండు
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : శుచిః ... పరిశుద్ధుడు, భక్తులనూ పరిశుద్ధులుగా చేయువాడు,
ఊర్జితః ... ఎదురు లేని శక్తి గలవాడు, అతీంద్రః ... ఇంద్రుని మించిన జ్ఞాన బలం కలవాడు, సంగ్రహః ... సర్వమూ తనలో లీనం చేసుకునేవాడు.
భావము : తాను పవిత్రంగా ఉంటూ,తనను నమ్మి కొలిచిన వారిని పావనులుగా మలచేవాడు, ఇంద్రుని మించిన (జ్ఞాన) బలం గలవాడు, ప్రళయ కాలమున సర్వమూ తనలో లీనం చేసుకునేవాడు( ఒక్కచోటకు చేర్చి సం గ్రహించేవాడు) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }
36. సృష్టి కర్త తానె, సృష్టిలో యాదరువు
కచ్చుకొనడు, తానె కట్టుబాట్లు
పెట్టుచుండ గలడు, పిదప యముడు తానె
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : సర్గ ... సృష్టి కర్త, ధృతాత్మా ... ఆత్మలకు ఆధారము, నియమ ... నిమాలు నిర్దేశించు వాడు,
యమ ... యముడు.
భావము : సృష్టి చేసేది తానె, ఆ కార్యక్రమంలో గానీ, స్థితి, లయాలలో గాని తానుగా ఎవరిపై ఆదారపడని సర్వస్వతంత్రుడు ( ఆదరువు అంటే ఆధారము, కచ్చుకొనుట అంటే అపేక్షించడం లేదా స్వీకరించాలనుకోవడం), వివిధ జీవరాశులను, దేవతలను సైతం తానే సృష్టిస్తూ వారికి తగిన పదవులూ, విధి విదానాలూ నిర్దేశించవాడు, వాటిని ఉల్లంఘిస్తే తగిన రీతిలో శిక్షించేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.
ఓం నమో నారాయణాయ
శ్లోకం 18:
వేద్యో వైద్య స్సదా యోగీ వీరహా మాధవో మధుః|
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః||
165. వేద్యః --- తెలిసికొనబడువాడు; తెలిసికొన దగినవాడు (మోక్షగాములకు).
166. వైద్యః --- విద్య లన్నియును తెలిసినవాడు, సర్వజ్ఞుడు; జనన మరణ చక్రమునుండి తన భక్తులను ముక్తులోనరింప నెరిగినవాడు; భవరోగ బంధన విమోచకమగు ఔషధ విద్యయందు ప్రవీణుడు.
167. సదాయోగీ --- భక్తులపట్ల ఎల్లపుడు జాగరూకుడై అందుబాటులోనుండెడివాడు; సర్వవ్యాపియై విశ్వమును అవిచ్ఛిన్నముగా నిలుపువాడు; సదా ధర్మమార్గానువర్తి యైనవాడు; యోగచింతనలో నిమగ్నుడైన సచ్చిదానంద పూర్ణ బ్రహ్మము; ఎల్లపుడు సమత్వ భావన కలిగినవాడు.
168. వీరహా --- బలవంతులగు దుష్టులను నాశనము చేయువాడు.
169. మాధవః ---
(73, 169, 741 నామములు)
మా ధవః -శ్రీమహాలక్ష్మి (మా) కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడు వాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టిన వాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు) ; మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు; బ్రహ్మ విద్యను ప్రసాదించువాడు.
170. మధుః --- భక్తులకు తేనెవలె, అమృతమువలె అత్యంత ప్రియమైనవాడు; మంగళకరమగు జ్ఞానమయుడు.
171. అతీంద్రియః --- ఇంద్రియములకు అందనివాడు (ఇంద్రియముల ద్వారా తెలియరానివాడు).
172. మహామాయః --- అధిగమింపజాలని మాయా మయుడు
173. మహోత్సాహః --- గొప్ప ఉత్సాహముతో కార్యాచరణ కావించువాడు; అంతులేని సహనముతో జగత్తును భరించువాడు.
174. మహాబలః --- అనంతమగు, అద్భుతమగు బలము కలవాడు; బలవంతులకంటె బలవంతుడు; అందరికిని (భక్తులకు) వివిధ బలములను ప్రసాదించువాడు (జీవనాధారము).
.
వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః
అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహా బలః !!18!!
37. తెలియ దగిన వాడు, తెలిసిన వాడెగా
యోగి పుంగవుండు, యాగ త్రాత,
అతడె మాధవుడును యతడెగా యమృతము
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు :
వేద్యః ... తెలుసుకోదగినవాడు, వైద్యః ... విద్యలన్నీ తెలిసినవాడు, సదాయోగిః ... యోగిపుంగవుడు, వీరహా ... ధర్మరక్షకుడు, మాధవః ... లక్ష్మీపతి మరియూ విద్యాపతి, మధుః ... అమృతము.
భావము : తన (తత్త్వం) గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకో (వలసిన) దగిన వాడు, విద్యలన్నీ తెలిసిన వాడు (వైద్యమే అనుకున్నా మానసిక రుగ్మతలను ఆధ్యాత్మిక పరమైన చికిత్సతో నయం చేసేవాడు అనుకోవచ్చు కదా) యోగ విద్యలన్నీ యెరిగినవాడు (జీవాత్మ, పరమాత్మతానే అయి స్వస్వరూపాన ఉండేవాడు), ధర్మరక్షకుడు (ధర్మానికి యాగము అనే పర్యాయ పదమూ, రక్షకునికి త్రాత అనే పర్యాయ పదమూ ఉన్నాయి కదా), లక్ష్మీ (మా అంటే లక్ష్మియే కదా) పతి , పరమేశ్వరునికి చెందిన పరా విద్యను కూడా మా అంటారని మరొక పాఠం. కనుక ఆ ప్రకారంగా కూడా మాధవుడే, కాగా, భక్తుల పాలిటి అమృతమయుడై వ్యవహరించేవాడు అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు.)
38. ఇంద్రియములకెపుడు నితడు గన్పట్టడు
మాయలకును పెద్ద మాయ యతడె !
భక్త జనుల గాచ బర్వులెత్తు, బలుడు
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : అతీంద్రియః ... ఇంద్రియములకు గ్రాహ్యం కానివాడు, మహా మాయః ... మాయలకే మాయావి, మహోత్సాహ ... ఉత్సాహం ఉరకలు వేసేవాడు, మహాబలః ... ఎదురులేని మహా బల సంపన్నుడు.
భావము : సాదారణ ఇంద్రియాలకు గోచరించని వాడు, (ఆత్మ జ్ఞానంతో మాత్రమే దర్శనమీయగలవాడు), మాయామేయమైన ఈ చరాచర జగత్తు నంతటా తన మాయలనే ప్రసరించిన వాడు (తన లీలలు తెలియనివ్వరానివాడు), భక్తులను రక్షించడానికి సదా ఉత్సాహం ఉరకలు వేసేవాడు(సిరికిం జెప్పడు.... పద్యం ఈ సందర్భాన మననార్హం కదా), ఎదురులేని మహా బలసంపన్నుడైన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. )
-ఓం నమో నారాయణాయ
హరికి వంద వేలు వందనాలు!!
ఓం నమో నారాయణాయ
శ్లోకం 19
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః|
అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్||
175. మహాబుద్ధిః --- అనంతమగు బుద్ధి (జ్ఞానము, విచక్షణ, గ్రహణము) కలవాడు; అన్ని ప్రాణులలోను బుద్ధికి కారణమైనవాడు.
176. మహావీర్యః --- సకల సృజనాత్మక దివ్య శక్తులకును ఆఆరము; అచంచల మూర్తి; సృష్టిలోని చేతనత్వమంతా భగవంతుని అంశయే.
177. మహాశక్తిః --- సృష్ట్యాది సకల కార్యములకును ఆరణమగు శక్తిగలవాడు; క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తుల సంగమమైన అనంత శక్తి సంపన్నుడు; అన్ని శక్తులకు, అందరిలోని శక్తులకు మూలము. మహిమాన్విత శక్తిపరుడైన భగవానుడు. భగవానుని యందలి ఇచ్చాశక్తిచే సృష్టి ఊహించబడెను. ఆ పరమాత్మ యందలి జ్ఞానశక్తిచే సృష్టిక్రమము నిర్వహించబడెను. ఆ పావనాత్ముని యందలి క్రియాశక్తిచే క్రియారూపము దాల్చెను. ఈవిధంగా తనలోని శక్తిత్రయ ప్రభావముచే భగవానుడు సృష్టికార్యమును నిర్వహించెను. అందుచేత అతను మహాశక్తి అని పిలువబడెను.
178. మహాద్యుతిః --- అసమానమగు దివ్యమైన కాంతితో విరాజిల్లువాడు, తేజోమయుడు; సృష్టిలోని కాంతి అంతయు భగవంతుని ప్రకాశము వలననే కలుగుచున్నది.
179. అనిర్దేశ్యవపుః --- వర్ణించుటకు వీలు కానట్టి, ఊహింపనలవి కానట్టి దివ్య మంగళ మూర్తి.
180. శ్రీమాన్ --- (22, 180, 222 నామములు) దివ్యాభరణ శోభితుడు; సౌందర్యమూర్తి; సుందరాంగుడు; లక్ష్మీ వల్లభుడు; సకలైశ్వర్యయుతుడు.
181. అమేయాత్మా --- తెలియరాని స్వరూపము గలవాడు; ఊహింపరాని తత్వమూర్తి; దివ్య గాంభీర గుణ సంపన్నుడు.
182. మహాద్రిధృత్ --- మహాద్రిధృక్ --- గొప్ప కొండలను ధరించినవాడు; క్షీరసాగర మథనమున శ్రీకూర్మమూర్తియై మందర గిరిని, చిన్నికృష్ణునిగా గోవర్ధన గిరిని ఎత్తినవాడు.
శ్లో. మహాబుద్ధి ర్మహా వీర్యో మహాశక్తి ర్మహా ద్యుతిః
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రి ధృక్ !!19!!
39. జ్ఞాని యనగ నతడె, గాంచ త్రిమూర్తుల
శక్తి యున్న మేటి, శక్తి యుక్తి
మెండు గానె యుండె నిండుగా వెలుగుగా
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : మహా బుద్ధిః ... మహా జ్ఞాని, మహా వీర్యః ... సృష్టి స్థితి లయ శక్తి సంపన్నుడు, మహా శక్తిః ... మహిమాన్విత శక్తి పరుడు, మహా ద్యుతిః ... గొప్ప ప్రకాశం గలవాడు.
భావము : సకల కళా వల్లభుడైన మహా జ్ఞాని, త్రైమూర్త్యాత్మకమైన అంటే సృష్టి, స్థితి, లయ కార్యాలను తానే అయి నిర్వహించగల సామర్థ్యము గలవాడు, మహిమాన్విత శక్తి (ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి) సంపన్నుడు, సూర్య చంద్రులను, అగ్నిని సైతం మించిన పరమాద్భుతమైన తేజస్సు గలవాడు ఐన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. )
40. నిర్వచింప లేము, నిథులకె నిథి తాను
అంచనాకు రాదు అతని యునికి
వీపుపైన కొండ, వేలుపై గిరినెత్తె
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : అనిర్దేశ్యవపుః ... నిర్వచనాలకు అందని రూపం గల వాడు, శ్రీ మాన్ ... ఐశ్వర్య వంతుడు, అమేయాత్మా ... అంచనాలకు అందని ఉనికి గల ( సర్వత్రా వ్యాపించి ఉండు) వాడు, మహాద్రి ధృక్ ... గొప్ప పర్వతాలను పైకెత్తినవాడు.
భావము : సాధారణ నిర్వచనాలకు అందని రూప సంపద గలవాడు, గొప్ప ఐశ్వర్య వంతుడు (శుభప్రదుడు కూడా), మహా పర్వతాలను అవలీలగా ఎత్తి ధర్మాన్ని, ఆశ్రిత భక్త గణాలను ఆదుకున్నవాడు( కూర్మావతారంలో వీపుపై మందర గిరినీ, కృష్ణావతారంలో వేలుపై గోవర్ధనమునూ ఎత్తిన వాడు కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. )
-ఓం నమో నారాయణాయ
శ్లోకం 20:
*మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః||*
*అనిరుద్ధ స్సురానందో గోవిన్దో గోవిదాం పతిః||*
183. మహేష్వాసః --- తిరుగులేని, గొప్ప బాణములు ప్రయోగించువాడు; బ్రహ్మాండమగు ధనుస్సును ధరించినవాడు; గొప్ప విలుకాడు.
184. మహీభర్తా --- భూభారమును వహించినవాడు - ఆదికూర్మమై భూమిని భరించి యుండు కూర్మావతార మూర్తి, పాతాళాంతర్గతయైన భూదేవిని ఉద్ధరించిన భూవరాహమూర్తి.
185. శ్రీనివాసః --- సిరికి నిలయమైనవాడు, శ్రీమహాలక్ష్మికి తన హృదయమే నివాస స్థానముగా నున్నవాడు.
186. సతాంగతిః --- సత్పురుషులకు, ముముక్షువులకు పరమగతియైనవాడు.
187. అనిరుద్ధః ---
ఎవరివల్లను, ఎన్నడైనను నిరోధింపబడనివాడు; అపరిమిత చేష్టామూర్తి.
188. సురానందః --- దేవతలకు ఆనందము ప్రసాదించు దేవదేవుడు.
189. గోవిందః --- దేవతలచే ప్రస్తుతింపబడు దేవదేవుడు; మహార్ణవమునుండి భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; గోవులను కాచేటి గోపాలుడు; వేదములనొసగిన, వేదముల ద్వారా పొందదగినవాడు, వేదవేద్యుడు.
190. గోవిదాం పతిః --- వేదార్ధములనెఱిగిన జ్ఞానులకు రక్షకుడు.
శ్లో. మహేష్వాసో మహీ భర్తా శ్రీనివాసః సతాంగతిః
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః !!20!!
41. కార్ముకము ధరించు, కాశ్యపి నాథుడు,
లక్ష్మిపతియె, చూడ లక్షణముగ
సాధు సంతులకును శ్రయము నిచ్చుచునుండు
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : మహేష్వాసః ... మహేష్వాసో అంటే గొప్ప బాణప్రయోగము కలవాడు, మహీ భర్తా ... మహీభర్త అనగా భూమిని భరించువాడు, శ్రీనివాసః ... లక్ష్మీపతి, సతాంగతిః .. సాధుసంతులకు సమాశ్రయం కల్పించువాడు.
భావము : సారంగమను గొప్ప విల్లు (మహా ఇష్వాసం అనగా కార్ముకము అనగా విల్లు అనే యర్థాలూ ఉన్నవి గదా) ధరించిన,మరియూ దానిని గొప్పగా ప్రయోగించగల వాడు(ఎంత గొప్పగా బాణాలు ప్రయోగించగలడో, రామాయణంలో మనకు కొన్ని చోట్ల కనబడుతుంది. ), భూమికి భర్తయై సదా కాపాడు వాడు(కాశ్యపి అంటే భూమి అనే అర్థమూ ఉన్నది కదా), లక్ష్మి నివాసముగా గలవాడు లక్ష్మీపతి, సాధు సంతులకు సజ్జనులకు కూడా ఆశ్రయమిస్తూ తనలో కలుపుకునేవాడు(శ్రయము అన్నా ఆశ్రయము అన్నా ఒకటే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
42. ఎదురు లేని వాడె, యదితిజుల వరుడు
గోవు నెపుడు గాచు గోపతిగను
వేదములను కాయు వేద వేద్యుడతడె
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : అనిరుద్ధః ... ఎదురు లేనివాడు, సురానందః ... దేవతలకు ఆనందము చేకూర్చువాడు, గోవిందః ... గో సంరక్షకుడు, గోవిదాం పతిః ... వేద సంరక్షకుడు.
భావము : తన కార్యక్రమాలలో ఏ విధమైన అడ్డంకులు ఎదురుకానివాడు, దేవతలకు (అదితిజులు అనగా అదితి పుత్రులే కదా) ఆనందం చేకూర్చేవాడు (వరుడు అనగా వరింపదగినవాడు... కోరదగిన వాడు), గోవు అంటే భూమి, వాక్కు, ఆవు, వేదములనే నానార్థాలున్నవి కనుక వాటిలో దేనికైనా అధినాథుడు, గోవిదాంపతి అనగా వేదములు తెలిసినవారిని రక్షించువాడు అని, వేదములు తెలిసినవారిలో మేటి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
-ఓం నమో నారాయణాయ
Comments
Post a Comment