మాఘపురాణం -10వ 11వ 12వ అధ్యాయములు

MAAGHA PURANAM -- 10

మాఘపురాణం -10వ అధ్యాయము

మృగశృంగుని వివాహము

దిలీప మహీజునకు వశిష్ఠువారు మాఘపురాణము గురించి ఇంకా ఈ విధముగా చెప్పసాగిరి.
పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు. అది ప్రకృతినైజము. ఆవిధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండి హరినామ స్మరణయందు ఆసక్తి గలవాడు అయ్యాడు. .

అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువ వేసారు. అచట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్ననలను పొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస పలము సంపాదించియుండెను.

కుమారుడు దేశాటన పూర్తిచేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకొనెదనని తన మనో నిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారముగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవముగా వివాహము చేసారు.

సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగుని చూచి “ఆర్యా! మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొన్నట్లే మా ఇద్దరినీ కూడా ఈ శుభలగ్నమున పరిణయము చేసుకొమ్మ” ని పలికారు. మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎట్లు జరుగును?” అని ప్రశ్నించగా – “మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడుమని ఆ కన్యలు పట్టుబట్టినారు. పురుషునకు ఒక్క భార్యయేకదా! ఇద్దరు భార్యలా?” అని మృగశృంగుడు ప్రశ్నించగా –
ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహము చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా! దశరథునకు ముగ్గురు భార్యలు, శ్రీకృష్ణునకు ఎనమండుగురు భార్యలు, పరమేశ్వరునకు గంగ, గౌరీ ఇద్దరు గదా! వారికి లేని అభ్యంతరములు నీకు కలవా? అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు.

వివాహపు వేడుకలను చూడ వచ్చిన అనేకమంది మునీశ్వరులు కూడా మృగశృంగా “అభ్యంతరము తెలుపవలదు. ఆ ఇరువురి కన్యల అభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖించిన నీకు జయము కలుగదు. అయిననూ ఇటువంటి ఘటనలు ఇంతకు ముందు అనేకములు జరిగి ఉన్నవి” అని పలికారు. పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు.

ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా “మహర్షీ! వివాహములు ఎన్ని విధములు? వాటి వివరములు తెలియజేసి నన్ను సంత్రుప్తుని చేయమ” ని ప్రార్థించగా వశిష్ఠ మహర్షి “రాజా! వివాహములు ఎన్ని విధములో వాటి వివరములు చెప్పెదను. సావదానుడై ఆలకింపుము” అని చెప్పసాగెను.

1. బ్రాహ్మణ కన్యను బాగుగా సింగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు “బ్రాహ్మము” అని పేరు.
2. దైవము: యజ్ఞము చేయు వానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి “దైవము” అని పేరు.
3. ఆర్షము: పెండ్లికుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయు దానిని “ఆర్షము” అని పేరు.
4. ప్రాజాపత్యము: ధర్మము కోసం దంపతులు కట్టుబడియుండమని దీవించి చేయు వివాహమునకు ‘ప్రాజాపత్యము’ అని పేరు.
5. అసురము: డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి చేయు వివాహమునకు ‘అసుర’ అని పేరు.
6. గాధర్వము: ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకొను వివాహమును ‘గాంధర్వ’ వివాహము అని పేరు.
7. రాక్షసము: వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడిన దానికి ‘రాక్షస’ వివాహము అని పేరు.
8. పైశాచిక: మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకొన్న దానిని “పైశాచిక’ వివాహము అని పేరు.
ఇవి వివిధ రకములైన వివాహ సంబంధమైన పేర్లు. వాటి ధర్మములు తెలియపర్చెదను ఆలకించు.
గృహస్థాశ్రమ లక్షణములు
మంచి నడవడికతో ఇహము, పరము సాధించవలయునన్న ఈ గృహస్థాశ్రమము ఒక్కటియే సరియైన మార్గము. భార్య, భర్త అనుకూలంగా నడచుకొనుట, ఉన్నంతలో తృప్తిచెంది దైవభక్తితో నడచుకొనుట, అతిథి సత్కారములను ఆచరించుట, మొదలగు సద్గుణములతో నడచుకొను వాడినే సరియైన గృహస్థుడు అంటారు. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములుండి కార్తికమాసమందునా, మాఘమాస మందునా నదీస్నానం చేసి, కడునిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములను ఆచరించు వారికి మంచి తేజస్సు కలుగును.

ప్రాతః కాలమున నిద్రనుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి, కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలయును. కార్తిక మాసమందు, మాఘ మాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలది దానధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును. ప్రతి మనుష్యుడు ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును.

పతివ్రతా లక్షణములు

పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తము అనేక ఘనకార్యములు చేసిన కాని మంచి ఫలము పొందలేక పోతున్నాడు. ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలెను గాని, అందమును, ఆకారమును చూచి మోసపోకూడదు. పురుషులు స్త్రీ యొక్క అందమునే చూడక, శీలము, గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆవిధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో కాపురము చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏవిధంగా ప్రేమతో సేవించునో అదే విధముగా అత్తమామల సేవ, అతిథి సేవలను తగు భక్తిశ్రద్ధలతో చేసినయెడల ఆ స్త్రీకి సద్గతి కలుగును.
భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలె సలహాలు ఇస్తూ , పనిపాటల యందు సేవకురాలి వలె నడుచుకొనవలయును. భోజనం వడ్డించు సమయములో ప్రతి తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టులో ఆవిధముగా భర్తకు భోజనము వడ్డించవలెను. శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందం కలుగచేయవలయును. రూపములో లక్ష్మిని పోలి, ఓర్పు వహించుటలో భూదేవిని పోలి ఉండవలెను. ఈవిధముగా నడచుకొను ఆమె ఉత్తమ స్త్రీ అనిపించుకుంటుంది.
స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాటలాడకూడదు. ఎవరినీ ముట్టుకొన రాదు. అ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. నాలుగవ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్ళు పోసుకొని, శుభ్రమైన వస్త్రములు ధరించి, భర్త పాదములకు నమస్కరించి, సూర్య భగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును. ఎటువంటి సమయములో అయినా భర్త భుజించకుండా తాను భుజించకూడదు.
ఇటువంటి లక్షణములు కలిగివున్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందముగా కాలము గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను.

మృకండుని జననము:

ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లియాడితిగదా అని మృగశృంగుడు మిగుల ఆనందముతో ఆ ముగ్గురు పడతులతోను సంసారము చేయుచుండెను. కొంతకాలం జరిగినది. సుశీల అను భార్య గర్భం ధరింఛి ఒక శుభలగ్నమున కుమారుని కన్నది. తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావలయునని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి “మృకండు”డని నామకరణం చేశారు. మృకండుడు దినదిన ప్రవర్థమానుడై తల్లిదండ్రుల యెడ, బంధుజనుల యెడ, పెద్దలయెడ, భయభక్తులు గలిగి పెరుగుచుండెను. ఐదేళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించాడు. గురుకులములో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువుయొక్క మన్ననలు పొందుచు, యుక్త వయస్సు వచ్చువరకు చదివి సకల శాస్త్రములయందు ప్రావీణ్యతను సంపాదించాడు. మృకండుడు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. మరికొంత కాలమునకు అతనికి ‘మరుద్వతి’యను కన్యతో వివాహం చేసారు. ఆనాటినుండి మృకండుడు గృహస్థాశ్రమము స్వీకరించాడు.

మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పించారు. పెద్దవారలయిన తరువాత వివాహములు చేసారు. తన కుటుంబమంతయును మాఘమాసంలో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్ఠతో జరుపవలసినదిగా ప్రోత్సహించెడివాడు. తాము ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావముచే సంసారమునందు ఏ ఇబ్బంది లేకుండా ఉండుటే గాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలగుచున్నదని సంతోషించుచు తనకింక ఏ ఆశలూ లేనందున భగవసాన్నిధ్యమునకు పోవలయునని సంకల్పించి, తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నుని చేసికొని, నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠము చేరాడు. “విన్నావు కదా భూపాలా! మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే గాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళాడు. ఇక అతని జ్యేష్ట కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెపుతాను ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు చెప్పసాగారు.
మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటినుండి జ్యేష్టపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి, గృహమునందు ఏ అశాంతియు లేకుండా ఉన్నప్పటికి, తాను వివాహమాడి చాలాకాలం గడిచిననూ సంతానము కలుగలేదు అన్న విచారముతో అతడు లోలోన కుమిలిపోతూ ఒకనాడు “కాశీ మహాపుణ్యక్షేత్రము. సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే గాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేకమంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి అభీష్టములను తీర్చుకున్నారు. నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళెదను.” అని మనసున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలు దేరి వెళ్ళాడు.
మార్గమధ్యమున అనేక కౄరమృగముల బారినుండి, క్రిమికీటకముల ప్రమాదమునుండి అతికష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీ క్షేత్రము వెళ్ళాడు. కాశీ పట్టణము ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండుడు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమున ప్రవేశించగానే మృకండునకు ఎక్కడలేని ఆనందం కలిగి తన జన్మ తరించెనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు.
ఈవిధంగా కుటుంబ సమేతముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్టించి ఒక సంవత్సరము విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపవలెనని నిర్ణయించుకున్నాడు. ఒక దినమున మృకండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడచిపెట్టారు. మృకండుడు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా! అయినా ఈశ్వరుని ధ్యానిస్తు చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు చేసి తన మాతృ ఋణమును తీర్చుకున్నాడు. మృకండునకు సంతానం కలుగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా! సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసాడు. అనేక దానధర్మములు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధముల స్తుతి చేసారు.

పరమేశ్వరుడు - “మహామునీ! మీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చినాము. మీ అభీష్టము నెరింగింపుడు” అని పలికెను. మృకండుడు నమస్కరించి పార్వతీ పరమేశ్వరులను “మహాదేవా! తల్లీ అన్నపూర్ణా! ఇదే మా నమస్కృతులు. లోకరక్షకా! మీ దయవలన నాకు సలక్షణవతి, సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినది. నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. ఎంతకాలమైననూ మాకు సంతానం కలుగనందున విచార పడుతున్నాము. సంతానం లేని వారికి ఉత్తమగతులు లేవు గదా! మాకు పుత్రసంతానం ప్రసాదించ వేడుకొనుచున్నాను” అని ప్రార్థించాడు.

మృకండుని దీనాపములు ఆలకించి త్రినేత్రుడు “మునిసత్తమా! నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని ఒక్క నియమము ఉన్నది. బ్రతికి ఉన్నంతవరకు వైధవ్యముతో ఉండే పుత్రిక కావలయునా? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా? అని ప్రశ్నించారు. మృకండునకు ఆశ్చర్యము కలిగి పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చింది. కొంతసేపు ఆగి “ హే శశిధరా! నన్ను పరీక్షింప ఎంచితివా? నాకు జ్ఞానోదయము అయినది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే చేస్తూ సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించే పుత్రికకన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు” అని అడిగాడు.
“అటులనే యగుగాక” అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యాడు. పరమేశ్వర అనుగ్రహముచేత వారికి ఒక శుభముహూర్తమున పుత్రుడు కలిగాడు.

మృకండునకు పుత్రసంతానము కలిగెనని అనేకమంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చారు. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి, మార్కండేయుడని నామకరణం చేసి వెళ్ళాడు. ఓ దిలీప మహారాజా! పరమ పూజ్యుడును భాగవతోత్తముడును, అగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి సుపుత్రుని పొందాడు.

MAAGHA PURANAM -- 11
11వ అధ్యాయము
మార్కండేయుని వృత్తాంతము
వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీవిశ్వనాథుని దర్శనం, విశ్వనాధుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి –
మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరిస్తాను శ్రద్ధగా ఆలకించుమని వశిష్ఠుల వారు చెప్పసాగారు. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అవుతున్నది. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసి ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభము చేసారు. అతడు తన తండ్రివలెనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను పొందాడు.తల్లి తండ్రులు “కుమారా! నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుతున్నావు. అందులకు మేము చాలా సంతోషము పొందుతున్నాము. గురువులయెడ పెద్దలయెడ బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరములు. నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును” అని చెప్పారు.
పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువ అవుతున్నది. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి ఋషులందరకి ఆహ్వానములు పంపించారు. మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చారు. అందుకు మృకండుడు ఆనందముతో అతిథి సత్కారములు చేసాడు. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించాడు. అలా చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి “మహానుభావా! మీరు వారించుటకు కారణమేమి?” అని ప్రశ్నించారు.
వశిష్ఠుల వారు “ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని “చిరంజీవివై వర్ధిల్లు” అని దీవించారు. ఇతని ఆయుర్దాయము పదహారేండ్లే ! ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుదు ఇచ్చిన వరము ప్రకారము ఇతడు ఒక్క సంవత్సరమే జీవిస్తాడు” అనగా అంతవరకూ మార్కండేయుని దీవించిన మునీశ్వరులు అందరు చాలా విచారించి “చిరంజీవివై వర్ధిల్లు”మని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి “దీనికి మార్గాంతరము లేదా? అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి “మునిసత్తములారా! మనము ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహదేవుని వద్దకు వెళదామ” ని పలికి మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని వెళ్ళారు.
మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మదేవుడు సంతోషించాడు. మునులందరితో పాటు మా ర్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ “చిరంజీవిగా జీవించు నాయనా” అని దీవించాడు. వశిష్ఠమహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును వివరించగా బ్రహ్మదేవుడు కూడా జరిగిన పొరపాటుకు విచారపడి కొంతసేపు ఆగి “భయపడకు” అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి “పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయును గాక” అని తన మనస్సులో శివుని ధ్యానించాడు. మునులవంక జూచి ఓ మునులారా! మీరు వెళ్లి రండి. ఇతనికి ఏ ప్రమాదము జరుగదని పలికి, వత్సా! మార్కండేయా! నువ్వు కాశీక్షేత్రమునకు వెళ్ళి సదా విశ్వనాథుని సేవిస్తు ఉండు. నీకు ఏ ఆపదకలుగదని పంపించాడు.
మార్కండేయుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీవిశ్వనాథుని సేవించి వస్తాను. అనుజ్ఞ ఇమ్మని కోరగా మృకండుడు అతని భార్య కొడుకుయొక్క ఎడబాటునకు ఎంతో దుఃఖించిరి. చివరికి మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరారు.
కుటుంబ సహితముగా కాశీవెళ్ళి మృకండుడు కాశీవిశ్వేశ్వరాలయ సమీపమందు ఒక ఆశ్రమము నిర్మించాడు. మార్కండేయుడు సదా శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము వద్దనే ఉండేవాడు. పదహారవయేడు ప్రవేశించెను. మరణ సమయమము ఆసన్నమైనది. “మార్కండేయుని ప్రాణములు తెమ్మని” ఆజ్ఞాపించిన యముని ఆజ్ఞ మేరకు భటులు మార్కండేయుని ప్రాణములు తీసుకునిపోవుటకు శివసన్నిధిని ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని వద్దకు వచ్చారు కానీ భటులు అతని సమీపమున నిలువలేకపోయారు. కాలపాశము విసరుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించి ఉన్నది. ఆ తేజస్సు యమభటులను అగ్నిలా బాధించినది. ఆ బాధ ఓర్చుకోలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునకు చెప్పగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశము విసిరాడు. మార్కండేయుడు కన్నులు తెరచి చూసేసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా ఉండుటము చూసి భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించాడు. పార్వతీపతి తన భక్తుని ఆక్రందన విని మహా రౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించాడు.
యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించి జటాధారి కోపము చల్లార్చి “ మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చాడు. మీరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువును ఇచ్చారు గదా! అతనిని ఆయువునిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చాడు. మీరు మార్కండేయుని చిరంజీవిగా చేసినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాము. ధర్మ పాలన నిమిత్తం వచ్చిన యముడు మరణించుట లోకములకు లోటుకదా! మరల యముని బ్రతికించమని వేడుకొన్నారు. ఈశ్వరుడు యముని బ్రతికించి “యమా! నీవు నా భక్తుల దరికి రావద్దుసుమా!” అని పలికి అంతర్ధానమయ్యాడు. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయినందులకు మృకండుడు ఎంతో సంతోషించాడు. తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడిందని మాఘమాస ప్రభావం లోకులందరకు చెపుతూ ఉండేవాడు.


_*🚩మాఘ పురాణం - 12 వ అధ్యాయము🚩*_

🕉🕉🌻🕉️🕉️🌻🕉️🕉️🌻🕉️🕉️

*శుద్ర దంపతుల కథ*

☘☘☘☘☘☘☘☘☘

వశిష్ఠమహర్షి దిలీపునితో మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు , వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించ లేకపోవు చున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయవంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. *"అమ్మా నేను బాటసారిని అలసినవాడను , చలి , చీకటి మిక్కుటములుగ నున్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే వెళ్లిపోదునని"* ఇంట నున్న కుముదను అడిగెను. ఆమెయు వానిస్థితికి జాలిపడి యంగీకరించెను. ఆమె యదృష్టమో ఆ బ్రాహ్మణుని యదృష్టమో యజమానియగు సుమనందుడు వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్లసావిడిలో ఒక చోట బాగుచేసి కంబళిమున్నగు వానినిచ్చి , పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరి నామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలపాడుచుండెను.

కుముద *"ఓయీ నీవెచటినుండి వచ్చుచున్నావు యెచటికి పోవుచున్నావని యడిగెను. అప్పుడా విప్రుడు "తుంగభద్రాతీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును , అందులకై ఇట్లు వచ్చితిని సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను , కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలయునని యనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసిరావలెననుకొనెను. తన అభిప్రాయమును చెప్పగ బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీస్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు , అనారోగ్యమునకు , ధనవ్యయమగును వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి. నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచుకొట్టుచు ఇంటికి తీసికొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసికొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి.*

అప్పుడామె విష్ణుదూతలారా ! నామాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమ లోకమునకు తీసికొనిపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో బాటు యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని అడిగెను. అప్పుడు విష్ణుదూతలు అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగ నరకమునకు పోవలసియున్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు నీ కిష్టము కాకున్నను , భయమువలన గాని , పతిభక్తి వలన గాని నీ భర్తకు యెదురు చెప్పలేదు. కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు. ఇంతే గాక మాఘమాస స్నానమును కూడ మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నొందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడామే నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా ! మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీటమునిగి లేచెను కదా ! బలవంతముగ చేసినను ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా ! ఆవిధముగా జూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతోబాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.

అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని పట్టికలో నన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీజలమున పడుట , నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసికొని రావలయునను ప్రయత్నమున , నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన నితడు ఇష్టములేకున్నను. బలవంతముగ మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణు లోక ప్రాప్తిని పొందవలసియున్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి. రాజా ! బలవంతముగ నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగ పూర్వము చేసిన పాపములుపోయి , విష్ణులోకమును చేరు పుణ్యమువచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి , యిష్ట దేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని , యధాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము.

మానవుడు తెలిసికాని , తెలియకకాని బలవంతముగ దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగ చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవజన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములయందాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పని సరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలయును , తన పనులను నూరింటినైనను వదలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లుకాక స్నానము , పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒకదినమైనను స్నానము పూజా , పురాణశ్రవణము , దానము యధాశక్తి గా పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందులవలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసినవానికి పునర్జన్మ వుండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి , కృష్ణవేణి , నర్మద , తుంగభద్ర , సరస్వతి , గోకర్ణ , ప్రభాస , కోణభద్ర , గౌతమీ యిత్యాది నదులయందు స్నానము చేసినను , కూడ ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరును వారెట్టి వారయినను మాఘస్నానము పూజ , పురాణశ్రవణము , దానము వీనినన్నిటినిగాని , కొన్నిటిని యధాశక్తిగ చేయుటయే వారికి పాపతరణోపాయము , మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠమహర్షి దిలీపునకు వివరించి చెప్పెను.

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: