గర్భిణీకి సీమంతం చేయడం వెనుక ఉన్న రహస్యం!
గర్భిణీకి సీమంతం చేయడం వెనుక ఉన్న రహస్యం!
గర్భిణీలకు సీమంతం చేయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. స్త్రీ గర్భవతి అయిన ఏడో నెలలో గానీ, తొమ్మిదో నెలలో గానీ సీమంతం వేడుకలు నిర్వహిస్తారు. కుదరని వాళ్ళు వేరే మాసాల్లో నిర్వహిస్తారు. ఎప్పుడూ ఏ శుభకార్యానికి లేని విధంగా ఈ సీమంతం వేడుకల్లో మాత్రం గర్భిణీకి ప్రతి ఒక్కరూ గాజులు తొడిగి.. పండంటి బిడ్డని కనమని ఆశీర్వదిస్తారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షు కోరుతూ చేసే వేడుక ఈ సీమంతం. సీమంతం రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేయించి.. జుట్టు సాంబ్రాణితో ఆరబెట్టి.. కాళ్లకు పసుపు రాసి, నుదుట కుంకుమ పెట్టి, పూలతో జుట్టుని అలంకరించి.. కొత్త చీర కట్టి కుర్చీలో కూర్చోబెడతారు. ముత్తయిదవులందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. ఇంత ఘనంగా చేసే ఈ సీమంతం పండుగ వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? దీని వెనుక ఏమైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? అవేంటో తెలుసుకుందాం పదండి.
ఆడవారి జాతక కర్మలని మొత్తం 16 కర్మలు ఉంటాయి. వీటిని జన్మ సంస్కారాలు అని కూడా అంటారు. బిడ్డ పుట్టక ముందు మూడు, పుట్టిన తర్వాత 13 జాతక కర్మలు ఉంటాయని పెద్దలు చెబుతారు. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు గర్భాదానం, పుంసవనం, సీమంతం అని మూడు జాతక కర్మలు ఉంటాయి. బిడ్డ పుట్టిన తర్వాత జాతకర్మ, నామకరణం, నిష్క్రమణ, అన్నప్రాశన, చూడాకరణ, కర్ణ వేద, అక్షరాభ్యాసం, ఉపనయనం, వేదారంభం, కేశాంత, సమావర్తన, బిడ్డకు వివాహం, అంత్యేష్టి అని 13 జాతక కర్మలు ఉంటాయని పెద్దలు చెబుతారు. అంత్యేష్టి అంటే కర్మకాండ అని అర్థం. చివరి దశలో చేసే సంస్కారం. శుభమా అని సీమంతం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు.. ఈ నెగిటివ్ ఆలోచన గురించి మనకెందుకులెండి.
సీమంతం వెనుక ఉన్న పరమార్థం:
కడుపులో ఉన్న శిశువుకి మొదటి రోజు నుంచి ప్రాణ శక్తి ఉన్నప్పటికీ.. మెదడుకి సంబంధించిన చైతన్య శక్తి 7వ నెలలో వస్తుంది. అప్పుడే శిశువుకి అన్నీ తెలియడం మొదలవుతుంది. అందుకే 7వ నెలలో శిశువుకి ఒక రకమైన మానసిక ధైర్యాన్ని ఇచ్చే ప్రక్రియలో భాగమే ఈ సీమంతం అని పెద్దలు చెబుతారు. ఈరోజున ముత్తైదువులు గర్భిణీకి గంధం రాసి, కొత్త గాజులు వేసి.. తాము తెచ్చిన కానుకలు, చీరలు, తినుబండారాలు ఇచ్చి తల్లిని సంతోషబెడతారు. తల్లి సంతోషంగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా బాగుంటుందని నమ్మకం. అలానే గర్భిణీని మానసికంగా ప్రసవానికి సిద్ధం చేయడమే ఈ సీమంతం యొక్క ముఖ్య ఉద్దేశం. ముతైదువులందరినీ చూసి గర్భిణీకి భయం తగ్గుతుంది.
ఇంతమంది సీనియర్లు పిల్లల్ని కని ఆరోగ్యంగానే ఉన్నారు అన్న ధైర్యం ఆమెకు కలుగుతుంది. తాను కూడా తనకు ఏమీ కాదు అన్న మానసిక ధైర్యంతో ఉంటుంది. సీమంతంలో ఎక్కువ గాజులు తొడగడం వెనుక కూడా ఒక కారణం ఉంది. గర్భిణీ యొక్క గర్భకోశం మీద జీవనాడుల ఒత్తిడి అనేది పడాలి. చేతుల్లో ఉండే నరాలకు, గర్భకోశానికి సంబంధం ఉన్న కారణంగా.. ఆ గాజుల ఒత్తిడి అనేది గర్భకోశం మీద పడుతుంది. గర్భకోశంపై కావాల్సినంత ఒత్తిడి పడడం వల్ల సుఖ ప్రసవం జరుగుతుందని శాస్త్రం చెబుతుంది.
రాగి లేదా కంచు పాత్రల్లో నీరు నింపి.. వాటి మీద మామిడాకులు, కొబ్బరి కాయ, గరికెలు వేస్తారు. గంటన్నర సేపు వేద మంత్రాలు చదువుతారు. ఆ తర్వాత ఈ నీటిలో యాలకులు, లవంగం, కుంకుమ పువ్వు, ఇతర ఔషధ మూలికలు కలుపుతారు. ఆ నీటితో గర్భిణీ స్త్రీకి మంగళ స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకి ఆరోగ్యం చేకూరుతుంది. అలానే మర్రి చెట్టు ఆకులను పచ్చి పాలతో కలిపి ముద్దగా చేసి.. ఆ వాసనను పీల్చమని అంటారు. ఆ వాసన పీల్చడం వలన గర్భాశయం సురక్షితంగా ఉంటుంది. అందుకే మంగళస్నానం చేయించి.. గాజులు వేస్తారు.
ఇదొక కారణం అయితే.. మరో కారణం కూడా ఉంది. అత్తగారు ఒక్కరే తన కోడలిని చూసుకోవడం ఇబ్బంది అవుతుందని, అప్పటి వరకూ చూసి అలసిపోయి ఉండవచ్చునని.. ఇక ఏడో నెల నుంచి మేము చూసుకుంటామని చెప్పి పుట్టింటి వాళ్ళు తమ కూతురిని తీసుకెళ్లారు. అక్కడ నుంచి పురుడు పోసిన 5 నెలల వరకూ చూసుకుంటారు. అత్తగారికి విశ్రాంతి ఇవ్వాలన్న ఉద్దేశం కూడా ఇందులో భాగమే. ఇక అత్తింటి వారు, పుట్టింటి వారు పిండి వంటలు, స్వీట్లు పంచి పెడతారు. కూతురు/కోడలు ప్రసవం ఇద్దరం చూసుకున్నామని జనానికి తెలియజేస్తారు. కొంతమంది మొత్తం ఖర్చు పుట్టింటి వారే పెట్టుకుంటారు. స్థోమతను బట్టి చేసుకుంటారు. అయితే ప్రస్తుతం అత్తా, కోడళ్ల మధ్య గొడవలు ఎక్కువగా నడుస్తున్నాయి.
ఈ క్రమంలో కోడలు ఇబ్బంది పడితే కడుపున ఉన్న బిడ్డపై ఒత్తిడి పడుతుంది. ఈ కారణంగా పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది. అందుకే కొంతమంది ఆడపిల్ల తల్లులు.. 5వ నెలలోనే తమ కూతురిని పుట్టింటికి తీసుకెళ్తారు. తీసుకెళ్లకపోయినా సీమంతం చేయడం వల్ల.. తనను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దవాళ్ళని చూసి కోడలికి ధైర్యం కలిగి ఒత్తిడి తగ్గుతుంది. తన కోసం ఇంతమంది వచ్చారు, తనకి ఇంతమంది ఉన్నారు అన్న ధైర్యం కలుగుతుంది. మరోవైపు అత్త గారు కూడా వేడుక కాబట్టి అయిష్టంగా ఉన్నా కూడా ఆ బంధువులని చూసి సానుకూల దృక్పథం కలుగుతుంది. నిజానికి ఈ వేడుక భర్త చేయాలని చెబుతారు. భర్త ఆమెను అపురూపంగా చూసుకోవాలని సీమంతం చేస్తారు. అదండి మరి.. సీమంతం వెనుక ఉన్న పరమార్థం.
Comments
Post a Comment