సూర్యుడు --భావ ఫలితములు

ఓం శ్రీమాత్రే నమః

సూర్యుడు --భావ ఫలితములు

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే.🙏🌹🙏

 ఏ భావములో సూర్యుడు ఉంటే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది చూద్దాం.
అది చదివేముందు సూర్యుని ప్రభావం గురించి కొంత సమాచారం తెలుసుకుందాం.
సూర్యుడు అంటేనే జీవము. సూర్యుడు లేనిదే సృష్టిలేదు. జీవం లేదు, ప్రేమ లేదు. అసలు ఏమీ లేదు. సూర్యుడు విశ్వ శక్తి కి నిదర్శనం .
విశ్వశక్తి తరంగాలుగా మార్చి మనకు అందిస్తున్నాడు .అందువల్లే అతన్ని విశ్వానికే ఆత్మ అంటారు. ఆత్మకారకుడు సూర్యుడు అయ్యాడు .

"ఆత్మ జగతస్ తస్థు ఖశ్చ"

ఆత్మగౌరవానికి నమ్మకానికి మన చుట్టూరా ఆవహించి ఉన్న అనుకూలతకు కారణం సూర్యుడు.
ఆత్మకారకుడైన సూర్యుడు మన జాతక చక్రంలో ఏ భావంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది పరిశీలిద్దాం.
తను భావమైన లగ్నము నుండి, సూర్యుని స్థానము చూసినప్పుడు సూర్యుని స్థానమును బట్టి సూర్య లగ్నము అని కూడా కొన్నిసార్లు విని ఉంటాం .సూర్య లగ్నం అనగా సూర్యుని రాశి లేదా రవి అధిపతిగా ఉన్న రాశి .
వేదాల నుండి భగవద్గీత దాకా ప్రతి పవిత్రమైన పురాణము సూర్యుని ఆత్మ కారకునిగా ఆయన ప్రాముఖ్యతను వివరిస్తూ జ్యోతిషం లో ఆయన విలువను చాటి చెప్పాయి.
సౌర కుటుంబంలో సూర్యుడు శక్తి కి ముఖ్య కారకుడు.
 ఈ సూర్యుడు లేకపోతే
-173° C ఉష్ణోగ్రత తో భూమి తన ఉనికిని కోల్పోతుంది. ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత వద్ద జీవము అసాధ్యం. 
సౌర శక్తి ప్రాముఖ్యత నేటి ప్రపంచం లో దాదాపు తగ్గిపోతోంది. భూమిపైన జీవనానికి ముఖ్య కారణమైన సూర్యుని త్రిమూర్తుల స్వరూపంగా సృష్టి స్థితి లయ కారకుడు కాలపురుషుని గా పూజిస్తూ ఉంటారు. ఉత్పత్తి,స్థితి, ప్రళయ కారకత్వంతో భగవంతునితో పోలుస్తుంటారు.
 99.9% భూమి మీద పచ్చని చెట్లు కిరణజన్యసంయోగక్రియ ద్వారా ప్రాణం నిలుపుకోవడం అనేది ప్రకృతి పరంగా స్పష్టమైన సృష్టిగా సూర్యరశ్మి కారణమవుతోంది.
ఇది ఒక చక్కని పర్యావరణాన్ని సృష్టిస్తోంది. దీనివల్లనే జీవం అనేది వచ్చి మనుగడ అనేది ఏర్పడుతోంది .కనుక ఆదిత్యుడే ఆ శ్రీహరి అని మనం నమ్ముతాము.
సనాతన ధర్మం ప్రకారం పంచ దేవతలలో సూర్య భగవానుడు కూడా ఒకరు .గణేషుడు ,విష్ణుమూర్తి ,శివుడు, శక్తి మరియు సూర్యుడు . ఈ ఐదుగురుని పంచాయతన మూర్తులు గా తలవకుండా ,పూజించకుండా హిందువులకు రోజు గడవదు అనడం సత్యదూరం కాదు.
సూర్యునికి తెలియకుండా భూమి మీద ఏ పని జరగదు. ఏది దాచలేము. అతను కర్మసాక్షి. మనసునైనా మోసం చేయగలము గాని ,ఆయన నుండి ఏది దాచలేము, దాగలేము కూడా.
దేవుడు ఉన్నాడా అని ఎవరైనా మూర్ఖంగా అడిగితే వారికి మనం సత్య ప్రమాణం గా సూర్యభగవానుని చూపించాలి గానీ సాధించడం, వాదించడం అనవసరం.
వేద జ్యోతిష్యంలో సూర్యుని ఆత్మ కారకుని గా పేర్కొంటారు .ఇక్కడ ఆత్మ అంటే చేతన, స్పృహ కలిగి ఉండడం. దీనివలన మనకు ఒక పేరు ప్రత్యేకత కీర్తి ఏర్పడతాయి.

ప్రతి వారి జాతక చక్రం లో ను సూర్యుడు ఏదో ఒక రాశిలో ఉంటాడు .
సూర్యుడు లగ్నం నుండి ఉన్న భావాన్ని బట్టి ఆ జాతకునికి గౌరవం వల్ల ఆత్మ తృప్తి రావడం,లేదా వ్యతిరేకత వలన మూర్ఖంగా ఉండడం అనేది ఉంటుంది.
ధర్మ కారకుడు గనుక సూర్యుడు మన వ్యక్తిత్వాన్ని మన లక్షణాలని నిర్దేశిస్తాడు.
అతనితో కలిసి ఉన్న గ్రహము కూడా సూర్యుని లక్షణములకు లోబడి పనిచేస్తుంది అనగా ఫలితాన్ని ఇస్తుంది అనగా మన బుద్ధి పై సూర్యుని ఆశీస్సులు పనిచేస్తూ ఉంటాయి.
బృహత్ పరాశర హోరా శాస్త్రము లో సూర్యుని రాముని అవతారం తో మర్యాద పురుషోత్తముడు అనగా మానవులలో ఉత్తముడిగా విలువలు కలిగిన వానిగా గుర్తించారు. ధర్మం కోసం రాముడు ఏవిధంగా నిలబడ్డాడు సూర్యుడు కూడా అదే విధంగా కర్మ సాక్షిగా నిలబడతాడు.
కానీ రాహు సంబంధం ఉన్నప్పుడు ,బలహీనమైన చంద్రునితో కలసి ఉన్నప్పుడు మాత్రం కొంత వ్యాకులమైన జీవితాన్ని ఇస్తాడు.
పురాణ పురుషుడైన రాముడు, రోజూ మనం చూసే సూర్యుడు ఒకే విధమైన శక్తిని కలిగి ప్రపంచశాంతికి పాటుపడతారు. వారితో కలిసిన ఎవరైనా ఉంటే వారిలో కలిసిపోవలసిందే అనగా ఉనికిని కోల్పోవలసిన అవసరం ఉంటుంది 
కాల పురుష చక్రంలో సింహరాశి, పంచమ రాశ్యాధిపతిగా సూర్యుడు సృష్టికి ఆధిపత్యానికి పనిచేయటానికి శక్తికి సామర్థ్యానికి గుర్తుగా నిలుస్తాడు.
మనం ఏదైనా పని చేసినప్పుడు ఇతరుల దృష్టి మనపై తప్పకుండా పడుతుంది. అనగా, ఆ పని వలన ఇతరులను ఆకర్షిస్తూ ఉంటాం .సూర్యుడు సృష్టి కారకుడు గనుక అందరూ ఆయనను మార్గదర్శి గానే చూస్తారు. ఆకర్షితులవుతారు.
సంతానం అనేది ఒక సృష్టికార్యము కనుకనే పంచమ భావం సంతాన భావానికి నిర్దేశించారు. 
సూర్యుడు ఉన్న రాశి మనం ఇతరులను ఎలా ఆకర్షిస్తాము, ఎటువంటి పనులు చేస్తాము, ఏ విధంగా ఊహిస్తాము, జీవితంలో ఎదుగుదల ఎలా ఉంటుంది అనేది సూచిస్తూ ఉంటుంది.
వంశవృక్షానికి మూలకారకుడు సూర్యుడు అవుతున్నప్పుడు, మన కుల దేవత తెలియక పోయిన సమయంలో సూర్యుని కులదేవతగా తీసుకుని ఆరాధిస్తారు.
విశ్వానికే తండ్రి సూర్యుడు సంతానానికి తండ్రిలాగా కారకత్వం వహిస్తున్నాడు. అందుకే తండ్రి పిల్లలకు ఒకే రకమైన పోలికలు ఉండడం సహజం గా ఉంటుంది.

***సూర్య రాశి భావము

లగ్నం నుండి రవి మొదటి భావం లో ఉంటే మంచి వ్యవహార కర్త తెలివితేటలు సృష్టికర్త ఆత్మగౌరవం ఎటువంటి పరిస్థితుల్లోను తలవంచని మనస్తత్వం.

సూర్యుడు రెండవ స్థానంలో ఉంటే చక్కటి మాట కుటుంబ గౌరవం నాయకుడు విలువలు కలిగిన వాడు సంపద సృష్టించుకోగలిగే వాడు అవుతాడు.

తృతీయ భావం లో రవి ఉంటే మంచి ఊహలు కలిగి ఇతరులతో రాయబారిగా ఉంటూ రచయితగా బృంద నాయకుడిగా వ్యూహకర్తగా రాణిస్తారు.

నాలుగవ భావం లో సూర్యుడు ఉంటే కుటుంబం అంటే ఇష్టం ప్రేమ దయ రక్షణ దేశ భక్తి సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తి నాయకుడు అవుతారు.

సూర్యుడు పంచమ స్థానంలో ఉంటే వ్యూహకర్త నాయకుడు రాజకీయ దృక్పథం అందరిని ఏకతాటిపై తీసుకురావడం మొదలగు లక్షణాలు కలిగి ఉంటాడు.

సూర్యుడు ఆరవ భావం లో ఉంటే అందరికీ సేవ చేసేవాడు కష్టపడే వాడు సామాజిక సేవ చేస్తారు ఎదుటివారిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు.

సప్తమంలో రవి వుంటే లావాదేవీల నిర్వహణ సంయుక్తంగా పనులు చేయడం వ్యాపార సమర్థత మొదలగునవి చక్కగా చేస్తారు.

రవి అష్టమంలో ఉంటే చాలా రహస్యాలు తెలుసుకొని ఉంటారు ,శాస్త్రవేత్త , ఆధ్యాత్మిక కూడా రహస్యాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు మాత్రమే తనలోని శక్తిని వాడుతూ ఉంటారు.

9 వ భావములో రవి ఉంటే విపరీతమైన జ్ఞానము కలిగి వివిధ విషయ పరిజ్ఞానంతో మత సంబంధమైన విషయాలపై ఆసక్తి తో ఉంటారు.

దశమ భావంలో రవి నాయకుడైన ఎటువంటి పనినైనా చేయించగలిగే సమర్ధత కలిగి ఉంటారు.

సూర్యుడు 11 వ భావం లో ఉంటే కలుపుగోలు మనస్తత్వం వలన సమాచార వ్యవస్థను సమర్థవంతంగా వాడుకుంటారు.

ద్వాదశంలో సూర్యుడు ఉంటే జాతకుడు జన్మభూమి కి మాత్రమే కాక ఇతర దేశాలలో కూడా తన జ్ఞానాన్ని పంచుతాడు. ఎల్లలులేని విజ్ఞానము. ఎల్లలు లేని రహస్యాలు అతని సొంతం.

గమనిక:
సూర్యుడు ఉండే రాశిని బట్టి ,అధిపతిని బట్టి నక్షత్రం బట్టి ,ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది.
సౌర వ్యవస్థలో సూర్యుని మధ్యలో ఉంచి అతని చుట్టూ గ్రహములు తిరుగుతూ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. సూర్యుని రాజులాగా గుర్తిస్తాము కనుకనే సూర్యుడు ప్రభుత్వానికి అధికారానికి గుర్తు .
సూర్యుని పాపగ్రహంతో కూడా పోలుస్తూ ఉంటాం .ఎందుకంటే రాజు అవసరమైతే నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించవలసి వస్తూ ఉంటుంది.
ఏదైనా ఒక పని చేస్తే దానికి ఫలితం వస్తూ ఉంటుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితము. ఈ పని చేయడం అనేది సూర్యుని మీద ఆధారపడి ఉంటే, ఫలితము అనే కర్మ శని మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుని పుత్రుడు ఈ శని. కనుక సూర్యుడు శని ఇద్దరూ ఒక వ్యక్తి జీవితంలో ముఖ్య పాత్రను వహిస్తున్నారు.
కాల పురుష చక్రంలో ఆరవ భావాన్ని రోగములకు కారణంగా చెప్తూ ఉంటారు ఆరవ భావము కన్యకు ఐదవరాశి సింహము పన్నెండవ భావం అవుతుంది. ఈ ఐదవ భావానికి అధిపతి సూర్యుడు కనుక రోగనిరోధక శక్తిని అందిస్తూ ఉంటాడు .సాధారణంగా వైద్యుల జాతకాలలో సూర్యుడు మంచి శక్తి కలిగి ఉంటాడు.
అలాగే రాజకీయ వేత్తలు న్యాయాధిపతులు కూడా బలమైన సూర్యుని కలిగి ఉంటారు.
సూర్యుని నుండి వచ్చే శక్తిని వెలుగును మనం స్వీకరించి మన నేత్రముల ద్వారా బయటకి ప్రసారం చేస్తూ ఉంటాం. అనగా మన దృష్టి కూడా సూర్యుని కారకత్వం మీదే ఆధారపడి ఉంటుంది .
సూర్యుని ఉన్న భావాన్ని బట్టి, స్థానాన్ని బట్టి, జాతకుడు తెలివితేటలు కలిగిన వాడు గుణవంతుడు మూర్ఖుడు జ్ఞానం కలిగిన వాడు తండ్రి అధికారి ప్రభుత్వము రోగనిరోధక శక్తి కలిగిన వాడు మరియు మగ సంతానం కలిగిన వాడు మొదలగు లక్షణములను నిర్ధారణ చేస్తూ ఉంటారు.
జాతకుని కీర్తికి వ్యక్తిత్వ నిర్ధారణకు సూర్యుడు నక్షత్రం నక్షత్రాధిపతి ఉన్న రాశిని బట్టి చూస్తారు.
సూర్యుని సంచారం అనగా గోచార ప్రకారం కూడా జాతకుని జీవితంపై ప్రభావం ఎక్కువగానే చూపిస్తుంది.అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండటం గమనిస్తూ ఉండవచ్చు.
లగ్నంలోనే సూర్యుడు ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు గౌరవము కీర్తి సంపద ఆత్మబలము మొదలగునవి రావడానికి అవకాశం ఉంటుంది.
బృహత్ జాతకం ప్రకారం 10 వ భావం సూర్యుడు నుండి చూసి వృత్తిని నిర్ణయిస్తుంటారు.
జాతకంలో ఉన్న సూర్యుని భావము నుండి తొమ్మిదవ రాశి చూసి తండ్రి స్థితి సంపద చెప్పగలుగుతున్నారు.
సూర్యుని నుండి 6/8/12 భావాధిపతులు జాతకుని గౌరవానికి భంగం అవుతే కారణం ఎవరూ అనేది గుర్తిస్తారు.
సంతానానికి సమయం కూడా ఈ రవి ఉన్న స్థానం బట్టి చెప్తూ ఉంటారు.ఇది మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే సూర్యుని గురించి కొన్ని ప్రత్యేక విశేషములు. శుభం.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: