గంగా పుష్కరాలు 2023 /ఏప్రిల్ /22నుండి.

🙏గంగా పుష్కరాలు 2023 /ఏప్రిల్ /22నుండి.
                                                               
     👉🏻 బ్రహ్మ ఆకాశం, వాయువు, జలం, అగ్ని, భూమి అను పంచభూతాలు సృష్టించగా పంచ భూతాలనుండి జీవులు పుట్టాయని ఉపనిషత్తుల సారాంశం. హిందూ సంప్రదాయంలో మానవుడు నీటిని గంగ, యమున, గోదావరి, కావేరీ మొదలైన నదులను శక్తిరూపాలుగా పూజిస్తారు. బ్రహ్మపుత్రతప్ప మిగిలిన నదులన్నీ స్త్రీల పేర్లతోఉన్నాయి. మానవుడు ఆచరించు అన్నిరకాల మంగళకరమైన సంప్రదాయాలతో పాటు శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు మొదలైన ఖర్మలుకూడా నీటితో ముడిపడినవి. పుష్కరసమయంలో నదీస్నానం పుణ్యప్రథమని పురాణాల్లో తెలుప బడింది. పుష్కరసమయంలో పుణ్యక్షేత్రాల్లో పుష్కర స్నానంతోపాటు మరణించివారికి శ్రాద్ధకర్మ, పిండ ప్రదానం, తర్పణం మొదలైన ఖర్మలుచేయుట ఉత్తమం ఆని తెలుపబడింది. మానవజీవితంలో ప్రధానమైన నీటి ప్రాముఖ్యత గుర్తుచేసేవే పుష్కరాలు.

పన్నెండేళ్ల కాలాన్ని దైనందిన కార్యక్రమాల్లో పుష్కర కాలంగా వ్యవహరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలోని 12 నదులకు బృహస్పతి సంబంధిత నదిలో ప్రవేశించే సమయంలో 12 రోజుల పుష్కరకాలం సాధారణ రోజులకంటే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పుష్కరాలకుకల ఖ్యాతిపై కధనంఉంది. పురాణకథ ప్రకారం పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుని దర్శనంకోసం తపస్సుచేయగా శివుడు ఆతని భక్తికిమెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమ్మని అడిగాడు. పుష్కరుడు జీవులుచేసిన పాపాలవల్ల వారు స్నానంచేసిన నదులు అపవిత్రం ఆవుతున్నాయని, నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, లోకహితంకోరి తన శరీర స్పర్శచే నదులు పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని అడిగాడు. శివుడు పుష్కరుడు ప్రవేశించిన నది పుణ్యతీర్థం అవుతుందని, ఆనదిలో స్నానంచేసిన వారు పాపవిముక్తులు ఆవుతారని, ఆనదులు ప్రవహించు క్షేత్రములలో మరణించినవార్కి పిండ ప్రధానం చేసినవారి ఆత్మలకు ముక్తి కలుగుతుందని వరమిచ్చాడు. పుష్కరుడు పుష్కరసరస్సు రూపంలోకి మారాడని కధనం. ఈసరస్సు రాజస్తాన్ నందు అజ్మీర్ దగ్గరలోఉన్న పుష్కర్ క్షేత్రంలోఉంది. దేవతలందరు పుష్కరకాలంలో సంబంధిత నదులందు పుష్కరునితోపాటుగా నివసిస్తారని చెప్పబడింది.  

ప్రతి సంవత్సరం బృహస్పతి ఒక్కోరాశిలోకి ప్రవేశించినప్పుడు పుష్కరుడు 12 నదులలో ఒకనదిలో ప్రవేశిస్తూ ప్రతి 12 సంవత్సరాలు పరి భ్రమిస్తూ తిరుగుతాడు. పుష్కరుడు ఏనదిలోకి ప్రవేశించాడో ఆనదికి పుష్కరాలుగా పరిగణిస్తారు. పుష్కరుడు ప్రతిసంవత్సరం సింధూ, గంగ, ప్రాణహిత, నర్మద (రేవా), సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ,, కావేరీ, భీమ, తపతి మరియు తుంగబద్ర లందు ఒక్కో జీవనదిలో ప్రవేశిస్తూ చక్రంవలె పరిబ్రమిస్తూ పాపాలనుండి విముక్తి కలిగిస్తున్నాడు. 
సింధూనదికి కుంభరాశిలో 20-11-2021 తేదీ ప్రాణహితకు మీనరాశిలో 13-04-2022 తేదీన పుష్కరాలు జరిగాయి. 
గంగానదికి మేషరాశిలో 22-04-2023, 
రేవాకు (నర్మదకు ) వృషభరాశిలో 01-05-2024, సరస్వతికి మిథునరాశిలో 14-05-2025, యమునకు కర్కాటకరాశిలో 01-06-2026, గోదావరికి సింహరాశిలో 26-06-2027, 
కృష్ణకు కన్యారాశినందు 24-07-2028, 
కావేరికి తులారాశిలో 24-08-2029, 
భీమాకు వృశ్చికరాశిలో 23-09-2030, 
తపతి లేదా పుష్కర వాహినికి ధనస్సురాశినందు 15-10-2031 మరియు 
తుంగభద్రకు మకరరాశినందు 24-10-2032 తేదీలలో పుష్కరప్రారంభమై పన్నెండురోజులు ఆది పుష్కరాలు మరియు సంవత్సరము చివరి పన్నెండురోజులు అంత్యపుష్కరాల పేరుతో జరుపబడతాయి. 

తపతి (పుష్కరవాహిని) మరియు బ్రహ్మపుత్ర నదులమధ్య పుష్కర విషయమై సందేహం ఉన్నది. అన్నిపుష్కర నదులు స్త్రీల పేర్లతో ఉన్ననూ బ్రహ్మపుత్ర పురుషుని పేరుతో పిలువబడుతూంది. తపతీనది గుజరాత్ రాష్ట్రం తూర్పున సాత్పురా పర్వతశ్రేణిలో ఉద్బవించి చత్తీస్ ఘడ్, మహారాష్ట్రల ద్వారా ప్రయాణించి గుజరాత్ రాష్ట్రంలో ప్రవేశించి సూరత్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. హిమాలయాల్లో కైలాస పర్వతంవద్ద పుట్టిన బ్రహ్మపుత్ర టిబెట్లో యార్లుంగ్ నదిగా, అస్సాంలో బ్రహ్మపుత్రగా బంగ్లాదేశ్ లో జముననదిగా వివిధ పేర్లతో పిలువ బడుతున్నది. భక్తులు బ్రహ్మపుత్రలో పుష్కరస్నానం చేయవచ్చని, బ్రహ్మపుత్రలో స్నానం పుష్కరస్నానంతో సమానమని వ్యాస మహర్షి చెప్పినట్లు సమాచారం. కనుక యాత్రికులు వారి అవకాశంబట్టి ఈ రెండుప్రాంతాల్లో ఎక్కడైనా పుష్కరస్నానం చేయవచ్చు. బృహస్పతి ధనస్సురాశిలో ప్రవేశించినప్పుడు 2019 సం.రం నవంబరు 5 నుండ్ 16 వరకు బ్రహ్మపుత్ర పుష్కరాలు జరిగాయి. తపతి లేదా పుష్కర వాహిని నదికికూడా ధనస్సురాశి నందు బృహస్పతి ప్రవేశించినప్పుడు 2019 సంవత్సరము అదేతేదీలలో పుష్కరాలు జరిగాయి.  

బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగాపుష్కరం 22-04-2023 తేదీన ప్రారంభమై బృహస్పతి పన్నెండో రాశిఅయిన మీనంలో ప్రవేశించినప్పుడు 03-05-2023 తేదీతో ముగుస్తుంది. పుష్కరకాలము ప్రామాణికం ఒక సంవత్సరం అనిచెప్పబడింది.

పుష్కరకాలంలో గంగానదికి 22-04-2023 నుండి మొదటి పన్నెండు రోజులను ఆదిపుష్కర కాలంఅని, చివరి పన్నెండు రోజులు 03-05-2023 వరకు అంత్యపుష్కర కాలంగా వ్యవహరిస్తారు. సంవత్సరకాలంలో ఆది మరియు అంత్య పుష్కరాల పన్నెండురోజులు ప్రత్యేకమైనవి. అంత్య పుష్కరాలకంటే ఆదిపుష్కరాలు పన్నెండురోజులు మరింత పవిత్రమైనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించి నప్పటి నుంచి 12 రోజులు గంగానదినందు పుష్కరుడు సకలదేవతలతో ఉంటాడని పన్నెండు రోజూలలో గంగానదిలో స్నానం చేయటంవల్ల అన్నతీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని అనేకమంది భక్తులు స్నానాలుచేస్తారు.

హిందువులు గంగాదేవిని పాపములు తొలగించి ఆత్మలను శుద్ధిచేయు దేవతగా పూజిస్తారు. ఋగ్వేదంనందు నదులలో పవిత్రమైనదిగా పేర్కొనబడిన గంగ మొసలి వాహనధారి. గంగాదేవి పర్వతరాజు హిమవంతుని ప్రధమ సంతానమని, పార్వతి సోదరిఅని పురాణాల్లో చెప్పబడింది. బ్రహ్మ హిమవంతున్ని సృష్టించి హిమాలయాలకు రాజును చేశాడు. హిమవంతుడు మేరు పర్వతరాజు కుమార్తె మేనవతిని వివాహం చేసుకున్నపిమ్మట వారికుమార్తె జన్మించగా ఆమెకు గంగఅని పేరుపెట్టారు. పిమ్మట వారికి సతీదేవి అవతారమైన పార్వతి కుమార్తెగా జన్మించింది. గంగకు యుక్తవయస్సు వచ్చినపిమ్మట దేవతలు ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లారు,. 

మహాభారత కధనంలో బ్రహ్మ గంగ మరియు శంతనులను భూలోకంలో జన్మించమని శాపం ఇచ్చాడు. గంగ కురువంశరాజైన శంతనుని భార్యగా దేవవ్రతునితో (భీష్మునితో) ఎనిమిదిమంది వశువులకు తల్లిగా తెలుపబడింది. శంతనుడు గంగానది ఒడ్డున గంగాదేవిని కలుసుకుని తనను పెళ్లి చేసుకోమని కోరాడు. తన చర్యలను శంతనుడు ప్రశ్నించకూడదనే షరతుపై గంగ అంగీకరించింది. శంతనుడు గంగను వివాహంచేసుకొని ఆమెవల్ల శాపగ్రస్తులైన ఎనిమిదిమంది వసువులను కుమారులుగా పొందాడు. వసువులు జన్మించుటకు ముందు తాముజన్మించిన వెంటనే నీటిలో పారవేసి విముక్తి కలిగించమని గంగను కోరియున్నారు. వారి అభ్యర్థనప్రకారం శంతనుని ఎదురుగానే గంగ సంతానాన్ని గంగలో పారవేయడం ప్రారంభించింది. ఎనిమిదవ కుమార్డు దేవవ్రతుని నదిలో ముంచబోగా, శంతనుడు అడ్డుకున్నాడు. గంగ దేవవ్రతునితో శంతనుని విడచివెళ్లి బాలునికి పదేళ్ల వయసులో శంతనునికి అప్పగించి వెళ్లిపోయింది.                                                                                 

భాగవత గ్రంధంలో విష్ణువు గంగకు మూలమని పేర్కొనబడింది. వామన అవతారంలో విష్ణువు తన ఎడమపాదం విశ్వమంతా విస్తరించి బొటనవేలు గోరుతో ఒకరంధ్రం ఏర్పరచాడు. రంధ్రంద్వారా, సముద్రంనీరు స్వచ్ఛమైన గంగానదిగా భూమిపై ప్రవేశించింది. ఎర్రటి కుంకుమ రంగుకల వామనుని పాదాలను కడిగిన తరువాత, గంగ గులాబీరంగు పొందింది. విశ్వంలోకి వచ్చేముందు గంగ విష్ణువు పాదాలను తాకింది కాబట్టి గంగను విష్ణుపది అని పిలుస్తారు. భూమిపైకి దిగేముందు గంగ బ్రహ్మ లోకంలో ఉండిపోయిందని నిర్ధారణఅయింది. తరువాత ఆమె నదిరూపంలో భూమిపై ప్రవహించింది భగీరథుడు తన 60,000 మంది పూర్వీకులను పవిత్ర గంగాజలంతో నరక జ్వాలలనుండి విముక్తి చేయడంద్వారా వారిఆత్మలకు మోక్షాన్ని కలుగజేసిన విధానం గంగాసాగర్ కథ వివరిస్తుంది.     
                 
రామాయణం, మహాభారతం, వివిధ పురాణాల్లో వివరించబడిన కధనంప్రకారం సాగరరాజు వంశములోని భగీరథుని ప్రయత్నంద్వారా గంగ భూమిపైకి తేబడినది. కర్దంముని విష్ణువు తనకుమారుడిగా జన్మించాలనికోరి అందుకుతాను వైవాహిక జీవితంనుండి దూరంగా ఉంటానని మహావిష్ణువుకు మాట ఇచ్చాడు. కాలంగడచిన పిమ్మట మహావిష్ణువు కపిలముని అవతారంలో జన్మించాడు. గంగాసాగర్‌లో కపిలముని తన ఆశ్రమంలో నివసిస్తూ తపస్సు చేసేవాడు. 

సాగర రాజు అశ్వమేధయాగంచేసి గుర్రాన్ని సంచరించడానికి వదిలాడు. గుర్రం నిర్విఘ్నంగా ప్రయాణిస్తుండగా, యజ్ఞం విజయవంతం కాకూడదని ఇంద్రుడు భావించి, గుర్రాన్ని దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశాడు. గుర్రం అదృశ్యమైందని సాగరరాజు తన అరవైవేలమంది కుమారులను గుర్రాన్నివెతకడానికి పంపాడు. వారు లోకమంతా తిరుగుతూ కపిలమహర్షి ఆశ్రమంలో గుర్రం కట్టివేయబడి ఉండటం చూశారు. వారుకపిలమహర్షి గుర్రాన్ని దొంగిలించాడని భావించి, మహర్షితపస్సు ఆటంకపర్చారు. 

తపస్సును ఆటంకపరచిన సాగరరాజు కుమారులపై కపిలమహర్షి ఆగ్రహించి తన చూపుల యోగాజ్ఞితో అరవై వేలమందిని కాల్చి బూడిద చేసాడు. సాగరరాజు తన మనవడు అన్షుమాన్‌ను కపిలమహర్షి కలిసి మరణించిన తన కుమారుల ఆత్మల మోక్షానికి పరిహారం అడగడానికి పంపాడు. సాగర్ రాజు మనవడు అన్షుమాన్ ప్రార్థనలకు సంతోషించిన కపిలమహర్షి స్వర్గంనుండి ప్రవహింఛు పవిత్ర గంగతో తర్పణం చేయడం ద్వారా మరణించిన 60,000 మంది ఆత్మలు విముక్తి పొందుతాయని పరిహారం తెలిపాడు. 

అటు పిమ్మట అంశుమాన్ మనుమడు భగీరథుడు తీవ్రమైన తపస్సుచేసి, బ్రహ్మ మరియు శివుని అనుగ్రహం పొందాడు. బ్రహ్మ గంగాదేవిని భూమిపైకి రావడానికి అనుమతించగా, శివుడు గంగను తన జుట్టులో బంధించి , ఆమె వేగాన్ని అదుపుచేసి భూమిపై ఒక ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. శివుని జటాఝూటం (కేశముల) నుండి గంగానది గంగోత్రి వద్ద ఉద్భవించింది.

భగీరధుని కృషివల్ల గంగోత్రివద్ద భూమిపై అవతరించడంవల్ల భగీరధుని పేరుపై గంగాదేవిని భగీరధిఅని పిలుస్తారు. భగీరథుని వెనుక గంగ గంగోత్రినుండి దేవప్రయాగ, ఋషీకేశ్, హరిద్వార్, గర్హ్ ముక్తేశ్వర్, కాశీ (వారణాశి), అలహాబాద్ (ప్రయాగరాజ్) మీదుగా సముద్రంలోని గంగాసాగర్ ప్రవహించింది. గంగ భూమిపై ప్రవహించే మార్గంలో జానుమహర్షి ఆశ్రమంలో హోమాగ్నిని ఆర్పివేసింది. మహర్షి కోపించి గంగను మొత్తం సేవించాడు. 

కపిల మహర్షి యొక్క నేత్రాల శక్తి నుండి ఉద్భవించిన అగ్నిలో ఆహుతి అయిన భగీరథుడి పూర్వీకుల ఆత్మలు గంగానదిని చితాబస్మంపై ప్రవహింప చేయడంద్వారా ముక్తి పొందుతాయని పేర్కొంటూ భగీరధుడు చేసినప్రార్ధన మన్నించి జానుమహర్షి తన ఎడమచెవి నుండి గంగను వదిలాడు. అందువల్ల గంగను జాహ్నవిఅని అంటారు. గంగ గంగాసాగర్‌లోని కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకుని భగీరథుని పూర్వీకుల చితాబస్మం నుండి ప్రవహించి శాపం నుండి విముక్తి చేసి వారి ఆత్మలకు మోక్షాన్ని ప్రసాదించింది. వారిఆత్మలకు ముక్తికలిగిన పిమ్మట గంగాదేవి భూమిపైనే స్తిరపడింది. ఈవిధంగా గంగ ఆవిర్భవించిన గంగోత్రితోపాటు గంగాసాగర్ ఉత్కృష్టమైనది. 

భగీరధుని కృషి వలన భూమిపైకి వచ్చుటవలన భగీరధిగా పిలువబడు గంగానది భారతదేశంలో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద నది. గంగాదేవి స్వర్గం, భూలోకం మరియు పాతాళ లోకాల్లో ప్రవహిస్తుంది. గంగానదికి జాహ్నవి, గంగ, శుభ్ర, సప్తేశ్వరి, నికిత, భాగీరథి, అలకనంద మరియు విష్ణుపది వంటి వివిధ నామాలు (పేర్లు) ఉన్నవి. పవిత్రమైన గంగానది దైవత్వం కలిగి స్నానం చేసినంత మాత్రాన సకల పాపములు హరిస్తుంది. మరణించినవారికి పిండప్రదానం చేస్తే వారికి ముక్తి కలిగించి స్వర్గలోక నివాసం ప్రసాదిస్తుంది. హిందూ మతంలో గంగాదేవిని మానవాళికి తల్లిగాతలచి యాత్రికులు తమ బంధువుల చితాభస్మం గంగానదిలో నిమజ్జనం చేయడంద్వారా వారిఆత్మలు శుద్ధి చేయబడి జనన మరణ చక్రంనుండి విముక్తికలిగి మోక్షం పొందుతాయని భావిస్తారు. గంగోత్రి, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, వారణాశి, కలకత్తాలోని కాళీ ఘాట్‌ మొదలైన గంగానది పరీవాహక ప్రదేశాల్లో గంగానదికి పండుగలు జరుపుతారు.

గంగా పుష్కరాలు అనగానే భక్తులు సాధారణంగా కాశీ లేదా వారణాశి వెళ్లడానికి ఉత్సాహం చూపుతారు. వారణాశిలో బస మరియు భోజన సౌకర్యాలు చాలా అభివుద్ధి చెందిఉన్నాయి. భద్రీనాధ్ వద్ద ఉద్భవించిన అలాకనంద దేవప్రయాగ వచ్చుసరికి గంగోత్రివద్ద ఉద్భవించిన భగీరధితో కలిసి గంగానదిగా ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి ప్రవహించి ప్రయాగరాజ్ వద్ద యమున మరియు సరస్వతీనదులతో కలిసి ప్రవహిస్తుంది. గంగా పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ దివ్యప్రదేశాలు గంగోత్రి, దేవప్రయాగ, ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి, ప్రయాగరాజ్, గర్ ముక్తేశ్వర్ (హాపూర్) మరియు గంగాసాగర్ గంగా పుష్కరాల సమయంలో పవిత్రస్నానాలకు మరియు మరణించినవార్కి పిండప్రదానం చేయుటద్వారా వారి ఆత్మలకు మోక్షం కలిగించే దివ్యప్రదేశాలు. 

పుష్కర సమయంలో వారి ఆర్ధిక స్తోమత మరియు లభ్యత బట్టి రోజువారీ క్రిందతెలిపిన దానములు చేయవచ్చును.
మొదటి రోజు - సువర్ణం, రజితం, ధాన్యం, భూమి, రెండవరోజు -వస్త్రం, లవణం (ఉప్పు), రత్నం మూడవ రోజు - గుడ (బెల్లం), అశ్వం, ఫలం,
నాల్గవ రోజు - ఘృతం (నెయ్యి), తైలం (నూనె), క్షీరం (పాలు, మధువు (తేనె), 
ఐదవ రోజు - ధాన్యం,శకటం, వృషభం, హలం (నాగలి), 
ఆరవవ రోజు - ఔషధం, కర్పూరం, చందనం, కస్తూరి, ఏడవ రోజు - గృహం, పీట, శయ్య, 
ఎనిమిద రోజు - చందనం, కందమూలం, పుష్ప మాల, 
తొమ్మిదవ రోజు - పిండం, దాసి, కన్య, కంబళి, 
పదవ రోజు - కూరగాయలు, సాలగ్రామం, పుస్తకం, పదకొడవ రోజ -ఏనుగు, 
పన్నెండవ రోజు - తిల (నువ్వులు). 

పుష్కరసమయంలో గంగానది ప్రవహించిన గంగోత్రి,, దేవప్రయాగ, ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి, ప్రయాగరాజ్, గర్ ముక్తేశ్వర్ (హాపూర్) మరియు గంగాసాగర్ లలో ఏ క్షేత్రమందైనా గంగాస్నానం చేయవచ్చు. మరణించినవారికి పిండప్రధానం చేయవచ్చు. గంగాసాగర్ కొద్ది శ్రమతో చేయవలసిన యాత్ర. ఇతర పుణ్యక్షేత్రాలు దేశంలోని పట్టణాలతో రైలుసౌకర్యం కలిగి ఉన్నాయి. పుష్కరయాత్రకు వెళ్లాలనుకునే ప్రయాణికుల సౌకర్యార్థం ఆలయాలు, భోజనాలు, వసతి మరియు పిండ ప్రధాన సౌకర్యాల వివరాలతో వ్యక్తిగత పోస్టులు ప్రచురించబడతాయి.                

            పుష్కరస్నానం పాపాల శుద్ధి 
            పిండప్రధానం ఆత్మలకు మోక్షం.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: