మన పంచాంగములు పూర్వ పద్ధతి - దృక్ పద్ధతి - ఒక సమీక్ష
మన పంచాంగములు పూర్వ పద్ధతి - దృక్ పద్ధతి - ఒక సమీక్ష
శ్రీరామ
మన పంచాంగములు పూర్వ పద్ధతి - దృక్ పద్ధతి ఒక సమీక్ష
1. కాలమనునది మానవ జీవితముతో అనాదిగా పెనవేసికొని యున్న ఒక అతి ముఖ్యాంశము. కాల పరిశీలనము, కాలగణనము అనేవి అన్ని కాలములందు, అన్ని దేశములందు, అందరకు, అన్నిట అనివార్యము. కాలగణనమునకు గంటలు, రోజులు, నెలలు, సంవత్సరములు ఈ రీతిగ కొన్ని కొలతలు కూడ అనాదిగ ప్రపంచమంతటా వాడబడుచున్నాయి.
2. ప్రపంచములో ఇప్పటికి వెలసిన అన్ని సంస్కృతులలోను మన భారతీయ సంస్కృతి వరమ విలక్షణమైనది. వైదిక వాఙ్మయ సంప్రదాయ సంస్కృతులే మన భారతీయ జీవన విధానమునకు జీవగఱ్ఱలు. మన మనఃప్రవృత్తికి, ఐహిక ఆముష్మిక ఆధ్యాత్మికములగు సకల శ్రేయస్సులకు, ఒక్క మాటలో, మన భారతీయతకు అవియే మూలనిధులు. మన కాలగణానా విధానమునకు కూడ అవియే మూలాధారములు, ఇతరుల వలె రోజులు, నెలలు, సంవత్సరములని మాత్రమేగాక, మనకు, కాలగణనముతో పాటు సూర్యచంద్రాది గ్రహముల స్థితిగతులతో పెనవేసికొనియున్న తిథులు, వారములు, నక్షత్రములు, యోగములు, కరణములు అను ఐదు విశిష్టాంశములతో కూడిన, ఒక ప్రత్యేకమైన, ప్రపంచమున ఇతరులకు ఎవరికిని లేని, పంచాంగ సంప్రదాయము అనునది ఒకటి ఉన్నది. ఈ తిథ్యాదులు భూగోళముపై మన స్థితిని బట్టి, ఖగోళమున సూర్యచంద్రాది గ్రహముల స్థితి గతులను బట్టి కూడ నిర్ణయములగు చర రాశులు. ఏ రోజుకారోజు ఒక సంవత్సరమున వీటి సమాచారమును తెలిపెడి సాంకేతిక సమాచార గ్రంథమునకే పంచాంగమని పేరు.
3. ఇట్టి పంచాంగములు మన భారతీయ జీవితములో ఒక విడతీయరాని భాగము. మనము చేయవలసిన ప్రతి పుణ్య కార్యక్రమానికే గాక, మన సాంసారిక, వృత్తి వ్యాపారాది సమస్త ఐహికాముష్మిక కార్యక్రములన్నిటికి అది చాల అవసరము, అంతేకాదు గ్రహముల స్థితిగతులను బట్టి. మనకు కలుగుచున్న, కలుగబోయే మంచి చెడ్డలను తెలుసుకుని, మంచిని పెంచుకునేందుకు, చెడుకి విరుగుడు చేసికొనేందుకు కూడ పంచాంగమే మొదటి సాధనము. కనుక పంచాంగము ఖగోళ విజ్ఞాన విలసితము, ధర్మశాస్త్ర, సంప్రదాయానుగుణము కూడ అయి ఉండుట తప్పనిసరి.
4. పంచాంగ కర్తలు ఎందరు ఉన్నను. అందరకు అవే గ్రహగతులు గనుక పంచాంగములన్నియు ఒకే రీతిన ఉండవలెను. కాని అట్లు ఉండుటలేదు. నేడు మనకు అనేక విధములగు పంచాంగములు లభించుచున్నాయి. వాటిలో సామాన్య మానవులు పెద్దగా గుర్తించని గ్రహ ప్రవేశ, సమాగమాదులేగాక అందరకును అతి ముఖ్యములైన ఉగాది, దీపావళి వంటి పండుగలలో కూడ తేడాలు వచ్చి - వివాదాలు చెలరేగుచుండుట అందరకు చికాకుని కలిగించుచునే ఉన్నది. పంచాంగముల ప్రామాణికతయే చర్చనీయాంశమై పోవుచున్నది. ప్రజలకు పంచాంగ సంప్రదాయముపై విశ్వాసము సడలుచున్నది. సమాజ శ్రేయస్సునకై విజ్ఞులు పూనుకుని - ఈ పరిస్థితిని త్వరగ సరిచేయవలసిన అవసరము మీదకు వచ్చియున్నది. తదర్ధమై ఎందరో పెద్దలు, పీఠాధిపతులు పూనుకుని కృషిచేయుచునే ఉన్నారు. ఈ సందర్భముగ మన పంచాంగ సంప్రదాయమును సామాన్యులకు పరిచయము చేయుటకు ప్రస్తుత పంచాంగములలోని తేడాలను వాటి పూర్వాపరములను తెలుపుటకు, విజ్ఞుల పరిశీలనకై ఈ సమీక్ష సమర్పించబడుచున్నది.
పంచాంగములలో, పండుగలలో తేడాలపై విమర్శలు ప్రధానముగా ఈ తీరున ఉన్నాయి:
1. పంచాంగములకు మూలగ్రంథమేమైన ఉన్నాదా? ఉన్నచో - దానిలో ఒకే పద్ధతి ఉన్నదా? లేక దానిలోనే భిన్న భిన్నపద్ధతులు ఉన్నాయా? 2. ఒకే పద్ధతి ఉంటే ఇన్ని రకాల పంచాంగాలు ఎలా వస్తున్నాయి? పంచాంగకర్తలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్రాస్తున్నారా?.
3. ఏ పంచాంగం ప్రమాణం?
4. ఒకే పంచాంగములో సంవత్సరాది వంటి పండుగలని కూడా ఒక ఊర్లో ఆదివారం నాడు మరొకచోట సోమవారమని వ్రాస్తారేమి? పండుగ అందరికి ఒకే రోజు రాదా?
5. పంచాంగకర్తలలో ఐకమత్యం లేకపోవటమే ఇట్టి చికాకులకి కారణం కనుక - అందరు ఒకే తీరుగ పంచాంగం చేయవలెననే నియమమే దానికి పరిష్కారము కనుక, దేశం మొత్తానికి ఒకే ఒక ప్రామాణికమైన (STANDARD) మరియు అధికారికమైన (AUTHORITATIVE) పంచాంగము ఏర్పడటమే మంచిది కదా?
Comments
Post a Comment