వివాహంలో "బ్రహ్మముడి" ని ఎందుకు వేస్తారు..?

వివాహంలో "బ్రహ్మముడి" ని ఎందుకు వేస్తారు..?

మన శరీరంలో మూలాధార చక్రానికీ, స్వాధిష్టాన చక్రానికీ, మధ్యలో ‘బ్రహ్మ గ్రంధి’ ఉంటుంది. ఇది ప్రత్యుత్పత్తి కి సంబంధించిన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.
పురోహితుని రూపంలో ఉన్న సాక్షాత్తూ బ్రహ్మ దేవుడు వేసే ముడులే, బ్రహ్మ ముడులనీ, బ్రహ్మ గ్రంధులను కలపడానికి వేసే ముడులు కాబట్టి బ్రహ్మ ముడులు అని పెద్దలు చెబుతారు. వధూవరులు ఇద్దరినీ రెండు దేహాలూ, ఒకటే ఆత్మ, ఒకటే ప్రాణంగా చేసే ప్రక్రియే, బ్రహ్మ ముడి! 
కంద పిలక, తమలపాకు, వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరపుకాయ, చిల్లరనాణెం కలిపి , వధూవరుల కొంగుకు కట్టి, ఇద్దరి కొంగులను కలిపి ముడి వేస్తారు. కంద ఒకచోట పాతితే దిన దినమూ వృద్ధి చెందుతూ, ఎకరం ఎకరముల వరకూ వ్యాపిస్తూ పోతుంది. కందలాగా అనుదినమూ వారి బంధము వృద్ధి చెందుతూ, వంశవృద్ధిని చెయ్యాలని కందను కడతారు.
క్షయం లేనిది ఖర్జూరపుకాయ. దంపతుల బంధమూ, వంశమూ, క్షయం లేకుండా ఉండాలని ఖర్జూరపుకాయను కడతారు. అందాన్ని, ఆరోగ్యాన్ని, పవిత్రతనూ, పెంపొందించే ఔషధం పసుపు. ఆయురారోగ్యములతో, పవిత్రంగా ఉండాలని పసుపుకొమ్ములను కడతారు.
ఇకపోతే, ఆకు-వక్క అనేది విడివిడిగా ఉన్నా, కలిస్తే ఎర్రగా పండుతాయి. దంపతులు ఇరువురూ ఒకటే ప్రాణం గా ఉంటూ, వారి కాపురాన్ని నూరేళ్ళ పంటగా పండించుకోవాలని ఆకు, వక్క కడతారు. మనకు తెలిసినదే, చిల్లర నాణెం లక్ష్మీస్వరూపం. అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందాలని చిల్లర నాణెం కడతారు.

ఇన్ని పరమార్ధాలు ఉన్న… కంద పిలక, పసుపుకొమ్ము, ఖర్జూరపుకాయ, ఆకు, వక్క, చిల్లరనాణెం కలిపి పురోహితుడి రూపంలో ఉన్న సాక్షాత్ బ్రహ్మ దేవుడే వేదమంత్రాల నడుమ పెద్దల ఆశీర్వచనములతో ముడి వేస్తే, ఆ కాపురానికి తిరుగులేదని మన ప్రగాఢ నమ్మకం, విశ్వాసం..

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: