శ్రీ భువనేశ్వరి దేవి మంత్ర జప సాధన

శ్రీ భువనేశ్వరి దేవి మంత్ర జప సాధన

మన ఇష్టదైవం నామాన్ని కానీ, మంత్రాన్ని కానీ, ఒక క్రమపద్ధతిలో భక్తిగా జపించే విధానమే జపం. జపంలో జ కారం మరో జన్మ లేకుండా (జన్మవిచ్ఛేదన) చేస్తుంది. ప కారం పాపాలను నశింప చేస్తుంది. పలికిన వెంటనే ఫలితం ఇస్తుంది కాబట్టి పూజ కన్నా జపానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. లింగ పురాణం ప్రకారం జపం చేయడం వల్ల యక్ష రాక్షస పిశాచాది భయంకర గ్రహాల బాధలు తొలిగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. జపం చేయడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది.

జపం మూడు రకాలుగా చేస్తారు. మొదటిది వాచికం అంటే సమీపంలోని వారికి వినపడేటట్లు జపించడం. రెండోది ఉపాంశువు అంటే పెదవులను కదిలిస్తూ ఎవ్వరికీ వినపడకుండా చేయడం, మూడోది మానసికం అంటే మనసులో జపించడం. మూడో పద్ధతిలో చేసే జపం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

మంత్ర మహార్ణవం, మంత్రమహోదధి వంటి గ్రంథాలలో వివిధ దేవతా మంత్రాలని ఏ విధంగా జపం చేయాలి? ఏ మాల ఉపయోగించాలి? ఏ ఆసనం మీద కూర్చోవాలి? ఏ సమయంలో చేయాలి? ఎలాంటి వస్త్రాల్ని ధరించాలి? పురశ్చరణ ఎలా చేయాలి? అనే విషయాలు వివరించాయి. ఆ గ్రంథాలలో చెప్పిన విధంగా మనం కూడా శ్రీ భువనేశ్వరీ మంత్రాన్ని పురశ్చరణా పూర్వకంగా జపించాలి. అప్పుడు మంత్రసిద్ధి కలుగుతుంది. ఆ మూల మంత్రంతో స్వయంగా చేసే జపం సత్ఫలితాన్నిస్తుంది.

ఏ మంత్రాన్నైనా శాస్త్రోక్తంగా ఒక నియమిత పద్ధతిలో సాధన చేసే విధానాన్ని పురశ్చరణ అంటారు. పురశ్చరణలో పంచాంగాలు.. జపము, హోమము, తర్పణము, మార్జనం, బ్రహ్మణ భోజనం. ఈ 5 విధాలైన కర్మతో మనం ఉపాసించే దేవత (శ్రీ భువనేశ్వరీ దేవి) సంతోషించి పుర: = బిడ్డలమైన మన ముందు, చరతి = సంచరిస్తుంది. కాబట్టి దీనికి పురశ్చరణ అనే పేరొచ్చింది.

పురశ్చరణ లేని మంత్రం కూడా నిరర్ధకమైంది కాబట్టి శ్రీ భువనేశ్వరీ దేవి మంత్రాన్ని పురశ్చరణ పూర్వకంగా ఉపాసిస్తేనే ఆ దేవత అనుగ్రహం మనకు లభిస్తుంది.

పురశ్చరణ ఎన్నిసార్లు..?
1. సాధారణంగా ఏ మంత్రానికైనా ఒక లక్ష సార్లు (108 సంఖ్య గల మాలతో 1000 మాలలు) మూల మంత్రాన్ని జపం చేయాలి.
2. అందులో పదో వంతు అనగా 10,000 సార్లు ఆ మూల మంత్రంతో హోమం చేయాలి.
3. హోమ సంఖ్యలో పదో వంతు అనగా 1000 సార్లు ఆ మూల మంత్రతో తర్పణ చేయాలి.
4. తర్పణ సంఖ్యలో పదో వంతు అనగా 100 సార్లు మూల మంత్రతో మార్జన లేదా అభిషేకం చేయాలి.
5. అందులో పదో వంతు అనగా.. పది మంది బ్రహ్మణులకు భోజనం పెట్టాలి.
పై ఐదు పనులతో మంత్ర పురశ్చరణ పూర్తవుతుంది.

మంచి రోజు
శ్రీ భువనేశ్వరీ మంత్రాన్ని పురశ్చరణా పూర్వకంగా అనుష్టానం చేయాలనుకునే సాధకులు శుద్ధ అష్టమి నుంచి పూర్ణిమ వరకు జపం చేస్తే సత్వర ఫలితం లభిస్తుంది. సాధారణంగా సాత్విక దేవతలందరికీ ఈ తిథులు అత్యంత ప్రీతికరమైనవి.

జపస్థానం ఎక్కడ?
జపం ఎక్కడ చేయాలి? ఏ ప్రదేశాలు శుభం అనే విషయానికి వస్తే.. పుణ్యక్షేత్రం, తీర్థ ప్రదేశం, దేవలయాలు, నదీ తీరం, గుహ, పర్వతాగ్రం, తీర్థ ప్రదేశాలు, సాగర సంగమ స్థలాలు, పవిత్ర వనాలు, ఉద్యానవనాలు, సముద్ర తీరాలు, స్వగృహాలు.. ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశాలలో ఎక్కడైనా జపం చేయవచ్చు. అయితే దశ మహావిద్యలు కొలువున్న అత్యంత శక్తివంతమైన స్థలాలు కూడా గురువుల సలహా మేర ఎంచుకోవచ్చు.

ఏ ఆసనంలో జపం..?
నిత్యం ఒక శుభ స్థానంలో కూర్చుని జపం చేయాలి. అయితే, శ్రీ భువనేశ్వరీ మంత్రం జపం చేయడానికి ఆసనం ముఖ్యం. శ్రీ భువనేశ్వరీ దేవికి ప్రీతికరమైన రంగు ఎరుపు కనుక ఎరుపు రంగులో ఉండే ఆసనాన్ని ఉపయోగించాలి. దర్భాసనం మీద ఎర్రని రంగు గల చిత్రాసనాన్ని వేసుకుని కూడా జపం చేయవచ్చు. అయితే, కింద కూర్చోవడానికి శరీరం సహకరించని వారు కుర్చీలో ఆసనం వేసుకుని జపం చేసుకోవచ్చు. ఏ మంత్రము అయ్యినా సరే గురుముఖాతా గ్రహించాలి...

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: