మన గ్రామ దేవతలు - శక్తిస్వరూపాలు

_*మన గ్రామ దేవతలు - శక్తిస్వరూపాలు*_
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 

ఎంతమంది ఎన్ని దేవతలను ఆరాధించినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్నివేదమంత్రములు పఠించినా, మనపల్లె ప్రజలు పూజలు పురాణాలు, వేదాలు తెలియకుండా, వారికి తెలిసిన రీతిలో ఆప్యాయంగా, అత్యంత భక్తితో, నమ్మకంగా కొలుచుకునే స్థానిక దైవాలు మనగ్రామదేవతలు.

ఈ గ్రామదేవతారాధన, మొక్కు బడులు, కట్టుబాట్లు, సంబరాలు, గరగల(గౌరమ్మల) ఊరేగింపులు, ఉత్సవాలు, జాతరలు మన సంప్రదాయములో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

గ్రామదేవతల మూలస్వరూపము:
ప్రకృతి రూపముగా వివరణ. నాస్తికుల కైనా (దైవమంటే నమ్మకము లేనివారు), ఆస్తికుల కైనా (దేవునిపై నమ్మకము గల వారు) తెలిసిన కంటికి కనబడే నిత్య దైవాలు " నేల, నీరు, నింగి, నిప్పు, గాలి". నిత్య జీవనమునకు మనకు ఉపయోగపడే మూల పదార్ధములు ఈ పంచభూతాల నుండే అందుతున్నాయనే నిజము అందరికి తెల్సిన విషయమే కదా. ప్రకృతిలో ఉండే ఈ పంచ భూతాల సంకేతములే మనము కొలుచుకునే ఈ గ్రామదేవతలు.

*వైదిక రూప వివరణ:*

అమ్మ మన్త్ర-యన్త్ర శక్తులుగను, (ప్రతిష్ఠ మూర్తులుగ) , తాంత్రిక శక్తులుగను (గ్రామదేవతలుగ) పూజింపబడుతూ ఉంటుంది. ఈ తాంత్రిక శక్తులే శ్రీ లలితా సహస్ర నామాలలో( 237 వ నామము) చెప్పిన మహా చతుష్షష్టి కోటి యోగిని గణ సేవిత" లయిన అమ్మలు.

శక్తిస్వరూపిణి, జగన్మాత, అమ్మల గన్నయమ్మ అయిన పార్వతీ మాత అంశలే ఈ అమ్మల స్వరూపాలు.

*గ్రామ దేవతల బాధ్యత:*

గ్రామాలను పరిరక్షించడం, చెలరేగిన వ్యాధులను అదుపులో ఉంచడం, తనను నమ్ముకొన్న పశువులను జానపదులను ఈతి భాధలు, గ్రహ బాధల నుండి శత్రువుల నుండి రక్షించడం ఈవిడ నిత్యకృత్యాలు. ఊరి పొలి మేరలను, పంటపొలాలను, చెరువులను, నీటి వనరులను కాపాడుట ఈమె కర్తవ్యం.

*గ్రామ దేవతల స్వరూప స్వభావాలు:*

ఈ దేవతల లక్షణాలు భిన్నంగా ఉంటాయి. వీరి స్వరూపం ప్రసన్నంగాగాని, ఉగ్రరూపములో గానిఉంటాయి.చాలావరకు గ్రామదేవతలు స్త్రీ రూపముగా గాని, కొన్నిచోట్ల పురుష రూపము లోను గూడా, చిన్న రాయిగానో, శూలంగానో చెట్టు రూపంలో గాని, గరగగా గాని దర్శన మిస్తుంటారు. వీరితో పాటు వృక్ష , జంతు సంబంధమైన దేవతలు కూడ పూజింపబడుచున్నారు.

గ్రామదేవత గ్రామాల్లో వేప చెట్లక్రింద, పాము పుట్టల లోపల, కొండలు, గుట్టల పైన, ఊరి పొలిమేరల్లో, పంటపొలాలమధ్య, చెరువు గట్లలో, గుడిలో గాని, ఏ గుడి లేని బహిరంగ ప్రదేశము లో గాని ఉంటాయి.

*గ్రామదేవతల ఆరాధన:*

వీరిని అన్ని కులాలవారు పూజిస్తారు. గ్రామదేవతల స్వరూప స్వభావాలను అనుసరించి, పుట్టుక స్వభావాలను బట్టి ఒక్కొక్క తెగవారు పూజారిగా ఉండడం జరుగుతూఉంటుంది. గ్రామదేవతల పూజార్లు, బ్రాహ్మణేతరులై వుంటారు. గ్రామదేవతల పూజార్లకు సంస్కృత మంత్రాలు రావు. ఆ మంత్రాలన్నీ ఆయా ప్రాంతీయ భాషల్లో వుంటాయి. గ్రామదేతల పూజలను స్త్రీలు కూడా చేస్తారు. గ్రామదేవతలకు ప్రతిరూపమైన గరగను, వేపమండలను జోడించి దేవతలముందుంచి పూజిస్తారు.

*గ్రామదేవతల ఊరేగింపు:*

ఈ గరగలను (గౌరమ్మ స్వరూపాలు) పండుగలు, పర్వ దినాలు,ఉత్సవాలు, జాతరలు వంటి ముఖ్య దినములలో ఊరిలోని ప్రతీ వీధిలోని ఇంటింటికి తీసుకునివెళ్ళుటనే ఊరేగింపు అందురు.. ఆ సమయములో ప్రతీ గృహిణి ఆ గరగ రూపములోని అమ్మను సాదరముగా అహ్వానించి పూజలు చేసి, నివేదన సమర్పించు ఒక మంచి సంప్రదాయము మన పల్లె ప్రజల నిజమైన భక్తికి నిదర్శనము..ఆమ్మవారి నివేదనలు, ఉపారములు (ఉపాహారములు) :మన ఇళ్ళలో ప్రతీ పండుగకు దైవ మందిరములో గోడపై తూర్పు లేక ఉత్తర దిశలో పసుపును వలయాకారముగా (గుండ్రముగా) అలికి, మూడు అడ్డగీతలు కుంకుమతో వ్రాసి, వాటి మధ్య బొట్టులు పెట్టి అమ్మను ఆహ్వానించి, వండిన పదార్దములు పిండివంటలతో అమ్మకు నివేదన చేయు ఈ ఉపారములు పెట్టుట అను సంప్రదాయము మన అందరకు తెలిసినదే. ఈ గుండ్రని పసుపు, ఎరుపుల వలయ రేఖల స్వరూపమే అమ్మ యొక్క నిరాకార (ఏ ఆకారము లేని) సంకేతము. అమ్మ యొక్క సాకార రూపమే ఈ గ్రామ దేవతలు. అవే ఆ జగన్మాత అంశలు. గ్రామ దేవతల పుట్టుక, చరిత్ర అమ్మవారి రూపము తలచుకుంటేనే ఆ అమ్మ మనకు ప్రసాదించిన భూమిలో పండిన పంట రూపము గాని, ఆమె అందించిన నీరు, నిప్పు, గాలి, మనను కాపాడే నింగి (ఆకాశము) రూపము గాని గుర్తుకి వచ్చి తీరుతాయి. ఈ విదముగా మనము అమ్మను ఆప్యాయముగా పిల్చుకునే గ్రామ దేవతల పేర్లన్నీ ఈ ప్రకృతిలోని పంచభూతముల సంకేతములే. మాతృదేవతా స్వరూపాలైన గ్రామదేవతలు గ్రామాలలో స్థిరపడి, వారు నిర్వహించే విధులననుసరించి, గ్రామ ప్రజల జీవన వృత్తులను బట్టి, ఉన్న ప్రదేశములను బట్టి,, స్థానికముగా పండు పంటలను బట్టి, స్థానికుల అలవాట్లు, నమ్మకముల బట్టి, విభిన్న పేర్లతో చలామణి అవుతున్నారు.
🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅

Comments