సరస్వతి దేవి ప్రార్థనా శ్లోకం

సరస్వతి దేవి ప్రార్థనా శ్లోకం 

యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వీతా
యావీణ వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుథిభి: దేవై: సదా వందితా
సామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహా

తాత్పర్యం

యా = ఏ స్త్రీ మూర్తి
కుంద = మల్లెల వంటి
ఇందు = చంద్రుని వంటి
తుషార = మంచు బిందువుల వంటి
హార = దండలతో
ధవళ = మరింత తెల్లగా ప్రకాశించుచున్నదో
యా = ఏ స్త్రీ మూర్తి
శుభ్ = పరిశుభ్రమైన (తెల్లనైనా)
వస్త్రంన్వీత = వస్త్రమును ధరించినది
యా = ఏ స్త్రీ మూర్తి
వీణ = వీణ యనెడి
వర = సమున్నతమైన
దండ = కొయ్య సాధనముతో
మండిత = అలంకరింపబడిన
కరా = చేతులు కలదియై
యా = ఏ స్త్రీ మూర్తి
శ్వేత = తెల్లనైన
పద్మ = తామర పువ్వును
ఆసనా = ఆసనముగా చేసుకొనినదో
యా = ఏ స్త్రీ మూర్తి
బ్రహ్మ = బ్రహ్మ దేవుడు
అచ్యుత = శ్రీ మహావిష్ణువు
శంకర = శివుడు
ప్రభృతిభి: = మొదలుగాగల
దేవై: = దేవతల చేత
సదా = ఎల్లప్పుడును
వందితా = నమస్కారింపబడునో
నిశేష = సంపూర్ణముగా
జాఢ్య = బుద్ధిమాంధ్యమును (అజ్ఞానమును)
ఆపహా = తొలగింప జాలిన
భగవతీ = భగవత్ స్వరూపిణియైన
సరస్వతి = సరస్వతి యనెడి
సా = అటువంటి స్త్రీ మూర్తి
మాం = నన్ను
పాతు = రక్షించుగాక

భావము:-
            
మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.
 
ఈ శ్లోకములో సరస్వతి దేవి ధరించి నవన్నీ తెలుపులో వున్నాయి. తెలుపు సాత్విక గుణము. జ్ఞానము. తెల్లపువ్వు వలె, చంద్రునివలె, (తూషార) మంచు వలె, హారధవళ - ముత్యాలహారము. తెల్లని వస్త్రములు ధరించినది. తెల్లని పద్మములో ఆసీనురాలయినది, వీణ ధరించి నది. సరస్వతి బొమ్మను పిల్లలకు చూపాలి.

సరస్వతి అనగా = చదువుల తల్లి.
సర+స్వ+తి= జ్ఞానము+మనలోని+ఇచ్చునది.
మనలో ఉన్న ఆ జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేస్తుంది.

సరస్వతి ధరించే వీణ పేరు - కఛ్ఛపి
చేతిలో జపమాల - ఆధ్యాత్మికతను అభివృద్ధి చేయును
మరొక చేతిలో వేదములు - అనగా జ్ఞానమును ఇచ్చును
వీణ - సంగీత సాహిత్యము నాదము

సరస్వతికి ఇంకా పేర్లు ఉన్నాయి: వాక్కుకు అధిపతి, వాగ్దేవి, బ్రాహ్మారీ, శారదా, వాణి, విద్యావతి
సరస్వతిని ప్రార్థిస్తే మనకు విద్యా, బుద్ధిని, జ్ఞానమును (జ్ఞాపక శక్తిని) ,ప్రజ్ఞను ఇచ్చును.

 ఆమె కటాక్షము వుంటే మూగవాడు కూడా గొప్ప పండితుడు అవుతాడు. చాలామంది కవులకు సరస్వతి దేవి ప్రత్యక్షముగా దర్శనమిచ్చి అనుగ్రహించినది.

పోతన కథ
               
పోతన ఓరుగల్లు నగరమున బమ్మెర గ్రామమున జన్మించెను. తల్లి లక్కమ్మ, తండ్రి కేశన వ్యవసాయము చేసేవారు. గురువైన పెనటూరి సోమనాథాచార్యుల ప్రేరణచే చిన్నతనమునే వీరభద్ర విజయము రచించెను. యవ్వనమున భోగని దండకం రచించి రాచకొండ రాజైన సర్వజ్ఞసింగ భూపాలునికి అంకితము చేసెను. అతనిలో మార్పు వచ్చెను. పొట్ట పోసుకొనుటకై కవిత్వమును మానవులైన రాజులకు అమ్మకుండా శాశ్వతమైన భగవంతునికి అంకితము ఇవ్వవలెననుకొనెను.
           
ఒకసారి పోతన గోదావరి తీరమున ధ్యానమూలో ఉండగా చంద్ర గ్రహణ దినమున సీతారాములు సాక్షాత్కరించి భాగవతమును తెలుగులో అనువదించి తమకే అంకితము చేయమని చెప్పిరి. శ్రీనాథుడు పోతనకు బావ. శ్రీనాథుడు రాజా ఆస్థాన కవిగా ఉండెను. అందుకే పోతనను ఎప్పుడూ కవిత్వమును రాజుకు అంకితం ఇవ్వమని, రాజు దండిగా డబ్బులు ఇచ్చునని, నీ దారిధ్ర్యము తీరి పోవునని బలవంతము చేయుచుండెను. పోతనకు సంకట పరిస్ధితి కల్పించినచో కవితను రాజుకు అంకితము చేయునని, ఒకసారి
శ్రీనాథుడు తన పరివారంతో పోతన ఇంటికి భోజనమునకు వచ్చెను. అప్పుడు పోతన ఇంట్లో వండుటకు ఆహార పదార్థములు లేవు. అప్పుడు పోతన రక్షింపమని సరస్వతి దేవిని ప్రార్థించెను. ఆమె సాక్షాత్కరించి అతిధులకు కావాల్సినవన్నియు సమకూర్చెను. భాగవతము పూర్తి అయిన పిమ్మట దానిని రాజుకు అంకితము చేయమని శ్రీనాథుడు అన్ని విధములుగా బలవంత పెట్టుచుండెను. అప్పుడు సరస్వతి దేవి మళ్ళీ సాక్షాత్కరించి "సొమ్ము కొరకై నన్ను ఎవ్వరికీ అమ్మవలదు భగవంతునికి అంకితము చేయమని చెప్పెను". సరస్వతి దేవిని నమ్మిన వారికి ఆమె కటాక్షము ఎప్పుడూ వుంటుంది.

//సర్వం శ్రీకృష్ణార్పణమస్తు //

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: