పలికెడిది భాగవతము. అట ...
పలికెడిది భాగవతము. అట ...
మామూలుగా అంతగా తెలియని విషయాన్ని, ఎవరో చెపితే కాబోలు అనిపించినప్పుడు "అట" అంటాము కదా. విషయార్ధమును అట అనరు.
అందుకే పోతన భాగవతములో అందరికీ తెలిసిన పలికెడిది భాగవతమట అంటూ ఆపకూడదంటారు మాడుగుల నాగ ఫణిశర్మ గారు. ఆ పద్యం ఎలా అర్ధం చేసుకోవాలంటే..
పలికెడిది భాగవతము. అట (అక్కడ) పలికించెడి విభుండు రామ భద్రుండు.
అటనే పలికిన భవహరమగును. (ఆయన చెప్పినట్లే చెప్పాలి)
అట పలికెద (అలాగే పలుకుతాను. ) వేరొండు గాధ పలుకగనేల. (ఇంకొక కధను, ఇంకొక రకంగా చెప్పడం ఎందుకు?)
ఎంత ఔచిత్యమో చూడండి.
***
ఈ పద్యం పోతన భాగవత అవతారికలో వచ్చిన సందర్భం, నేపథ్యం చూస్తే గాని ఇది కేవలం మాటల ఆట కాదని ఒక భావోద్వేగ భరిత అభివ్యక్తి అనీ అర్థం కాదు. ఈ పద్యానికి ముందు పోతన తనకు ధ్యానంలో జరిగిన సాక్షాత్ శ్రీ రామ చంద్ర దర్శనానుభవాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తారు. 'ఒక సోమోపరాగం అంటే చంద్రగ్రహణం సందర్భంగా నదీస్నానంతరం జపం చేసుకుని ధ్యానంలో ఉన్నాను.
మెఱుఁగు చెంగటనున్న మేఘంబు కైవడి-
నువిద చెంగట నుండ నొప్పువాఁడు,
చంద్రమండల సుధాసారంబు పోలిక-
ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు,
వల్లీయుత తమాల వసుమతీజము భంగిఁ-
బలువిల్లు మూఁపునఁబరఁగువాఁడు,
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి-
ఘన కిరీటము దలఁ గలుగువాఁడు,
పుండరీకయుగముఁ బోలు కన్నుల వాఁడు,
వెడఁద యురమువాఁడు, విపులభద్ర
మూర్తివాఁడు, రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.
'మెఱుపు తీగతో కలిసి ఉన్న మేఘం లాగున అమ్మాయి తన పక్కన ఉన్నవాడు. చంద్రమండలపు అమృతమంతా సారం తేసినట్లున్న చిరునవ్వు ముఖంమీద ఉన్నవాడు, తమాల వృక్షంమీద తీగపాకినంత అందంగా తన బలమైన భుజం మీద పాకుతూ చక్కని విల్లు ఉన్న వాడు, నల్లనికొండమీద సూర్యుడు ఉన్నట్లుగా తన తలమీద గొప్పకిరీటం ఉన్నవాడు, తామర రేకుల జంట లాంటి కళ్లున్నవాడు విశాలమైన వక్షస్థలం ఉన్నవాడు ఎవరో ఒక గొప్ప రాజు నా రెండు కళ్లకు కనపడ్డాడు ' అంటాడు పోతన.
ఆ కనపడ్డ ఆకారం మాట్లాడే దాకా అయన ఎవరో తెలియదు. ఎవరో రాజు గారు. నల్లగా ఉన్న విలుకాడు. అందమైన వాడు. అంతే తెలుస్తూ ఉంది.
'నేను ఆయన్ను తేఱి పార చూసి పలకరించబోగా ఆయనే మాట్లాడాడు'.
"ఏను నా రాజశేఖరుం దేఱి చూచి భాషింప యత్నంబు సేయునెడ నతఁడు దా,”రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబుఁ దెనుంగు సేయుము; నీకు భవబంధంబులు దెగు"నని, యానతిచ్చి తిరోహితుం డయిన, సమున్మీలిత నయనుండనై వెఱఁగుపడి చిత్తంబున."
'నేను ఆ గొప్ప రాజును తేరి చూసి పలకరించడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆయనే నోరు తెరిచి " నా పేరు రామభద్రుడు. నా పేరు అంకితం( గుర్తు) గా శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో రచించు. నీకు పుట్టుక బంధాలు తెగిపోతాయి ( మోక్షం లభిస్తుంది) అని చెప్పి అదృశ్యమయిపోయాడు. వాల్చిన రెప్పలతోనే సంభ్రమ ఆశ్చర్యాలతో మనసులో ఇలా అనుకున్నాను '
అంటూ తాను మనసులో ఏమనుకున్నదీ ఈపద్యంలో చెబుతాడు.
ఇది వింటూ ఉంటేనే ఎవరికి రోమాలు నిక్క పొడుచుకోవు? ఎవరు పులకింతలో తాదాత్మ్యంలో మునిగిపోరు ? స్వయంగా రామభద్రుడే కనిపించేశారా ? తనపేరు చెప్పుకుని పరిచయం చేసుకున్నారా ? చేసుకుని ? ఆ శ్రీ రామచంద్రమూర్తి తన నామాంకితంగా భాగవతం రచించమని మోక్షం లభిస్తుందని చెప్పారట. అది విన్న పోతనకు ఎలా ఉండి ఉంటుంది ? ఆ భావోద్వేగాన్ని పంచుకునేదే ఈ పద్యం. చదువుతూ ఉంటే భగవంతుడే కనపడి మాట్లాడితే కలిగిన ఆనందాన్ని పంచుకోవడం తెలిసిపోతూ ఉంటుంది.
ఇంత పెద్ద అవకాశం, ఇంత పెద్ద వరం, ఇప్పటి భాషలో ఇంతపెద్ద ఆఫర్ దొరికితే ఎవరు వదులుతారు ? వదలను . " పలికేస్తా " అనడం ' పలికెద' అనే మాటలో కనపడుతుంది.
ఈ పద్యాన్ని ఎంత ఆనంద బాష్పాలతో ఎంత మై మరపుతో చెప్పారో పోతన. ఊహించుకుంటూంటే మనకూ అంతే ఆనంద బాష్పాలూ, మైమరపు.
Comments
Post a Comment