వివాహ లగ్నము వాటి దోషములు
వివాహ లగ్నము వాటి దోషములు
*శ్లో:-* లగ్నాదష్టమగః కుజోనిధనకృద్భౌమాష్టమాఖ్యోప్యయం
యద్యేవం భృగుషట్కదోష ఇతి తల్లగ్నాత్ భృగుష్షష్ఠగః
యుద్దే శత్రుజితౌ రిపోర్గృహగతౌ నీచస్థితౌ చాస్తగౌ
తౌద్వౌ దుర్బలినౌ వదంతిచపరే దోషస్తునా స్తీత్యహో
తాత్పర్యము:- వివాహ లగ్నమునకు కుజుడు 8వ యింట ఉండరాదు. దానిని కుజాష్టమదోషమందురు. దానివలన మృత్యువు సంభవించును. శుక్రుడు 6వ యింట నున్న భృగుషట్కమని మహాదోషము. మృత్యుప్రదమగునది యగును. కుజ, శుక్రులు నిర్జితులై. నీచయందుగాని, శత్రుక్షేత్రములందు గాని యున్నచో, నస్తంగతులైనచో మంచిదని కొందరి మతము. అది కూడినంత మంచిది కాదని గ్రంథకర్త యభిప్రాయము.
కర్తరి (కత్తెర) దోష నిర్ణయము
శ్లో:- లగ్నాద్ద్వాదశగోభవేదృజుగతి ర్వక్రీద్వితీయస్థితః
పాపౌద్వౌయది మథ్యలగ్నముభయోర్మృత్యు ప్రదాకర్తరీ
చంద్రోవా యది మధ్యగస్తదుభయో రన్యేజగుఃకర్తరీ
తౌద్వేవా నచకర్తరీ హ్యృజుగతీ తద్వ్యత్యయౌవక్రిణౌ
తాత్పర్యము:- నిశ్చిత లగ్నమునందు 2 పాపగ్రహములుండి, అందొకటి 12వ యింట, మరియొకటి 2వ యింటయుండి, 12 నందలి గ్రహము యధావిధిగా యుండి, 2వ యింట నున్న పాపగ్రహము వక్రించినచో ఆ రెంటినడుమదైన లగ్నమునకు కర్తరీ దోషము కలుగును. ఇది మరణకారణమగును. అట్టి కర్తిరీ దోషసమయమున పాపగ్రహో భయమునడుమ. చంద్రుడుండెనేని అది అధిక కర్తరీ దోషమని కొందరందరు. ఉపరుక్తములైన పాపగ్రహద్వయము రెండునూ వక్రించియున్నప్పుడూ, వక్రత వీడియున్నప్పుడూ, 2వ యింట గ్రహము సజావుగా నుండి 12వ యింట గ్రహము మాత్రమే వక్రించి యున్నప్పుడూ లగ్నమునకీ కర్తరీ దోషము లేదని చెప్పబడుచున్నది.
వివాహ లగ్నాష్టమ దోషనిర్ణయము
శ్లో:- త్యాజ్యంచాష్టమలగ్న మేవజననాల్లగ్నాచ్చ రాశేస్తయోః
దంపత్యోరపి మృత్యుకృత్తదథి లగ్నస్థితో వాతయోః
చంద్రోప్యష్టమరాశిగః తదుభయోర్నిత్యం దరిద్రప్రద
స్త్స్యాజ్యం ద్వాదశలగ్నమష్యశుభకృత్తజ్జన్మ లగ్నంగృహమ్
తాత్పర్యము:- జన్మలగ్నమునకు జన్మ కాల చంద్రరాశికి అష్టమ లగ్నము విశేష నష్టదాయకము. అది యెంత శాస్త్రోక్తమైన సద్గుణములతో నున్ననూ విడిచిపెట్టుట ముఖ్యము.
అష్టమలగ్నాధిపతి వివాహలగ్నాధిపతి వివాహలగ్నమందుండినచో దంపతులకు కీడు గల్గును. జన్మరాశికి అష్టమమందు చంద్రుడున్న దరిద్రము నిచ్చును.
జన్మలగ్నమును జన్మ సంబంధ ద్వాదశలగ్నము పనిచేయవు.
పెండ్లిండ్లలో యా లగ్నమందు ముహూర్తము పెట్టిన దంపతులకు హాని కలిగించును.
శేష దోషములు
శ్లో:- లగ్నాద్ద్వాదశగేథవా రిపుగతే చంద్రేష్టమస్థే తదా
రిప్ఫాష్టారిగ చంద్ర నామకమహోదోషస్తయోర్మృత్యుకృత్
దోష స్సగ్రహనామకో నిధనకృచ్చంద్రే గ్రహేణాన్వితే
దోషోనేతి పరేజగు శ్శశధరే సౌమ్య గ్రహేణాన్వితే
తాత్పర్యము:- చంద్రుడు శుభలగ్నమునకు షష్ఠస్థానమందుగాని, యష్టమమందుగాని, ద్వాదశస్థానమందుగాని, యున్నచో అది దోషముగా నెరిగి యట్టి ముహూర్తము లుంచరాదు.
చంద్రునకు యితర గ్రహముల సంబంధమున్న సగ్రహ దోషమందురు. చంద్రుడు శుభులతో గూడిన దోషిగా నిర్ణయించనక్కరలేదు.
సగ్రహ చంద్రదోషము
శ్లో:- దారిద్ర్యం మరణం త్వపత్యరహితం దౌర్భాగ్యమేవంస్త్రియా స్సాపత్న్యంయతిభావమేవకలహందుఃఖంచకుర్యాత్క్రమాత్
ఉద్వాహాదిషు చంద్ర ఏకభవనే సూర్యాదిఖేటైర్యుతో
నక్షత్రాంతరగ శ్శుభోయది సశీత్యన్యే జగుర్నేతరే
తాత్పర్యము:- వివాహ మొనరించు లగ్నములలో చంద్రునితో రవి కలిసిన దరిద్రము సంభవించును. కుజుడు కలిసినచో మరణము, బుధునితో కూడిన గొడ్రాలితనము, గురుడు కలిసిన దౌర్భాగ్యము శుక్రుడైన సవతి ప్రవేశించును. శనియున్న దంపతులకు సంపదలుండవు. రాహువున్న కలహము వచ్చును. కేతువున్నచో దుఃఖభాద గల్గించును. యభిమతము యిట్లున్నది. చంద్రుడితో కలిసిన గ్రహము చంద్రుడున్న నక్షత్రములో నుండకున్నను లేక నక్షత్రపాదములు వ్యత్యయములుగా నున్నను దోషమంటదని అందురు.
Comments
Post a Comment