నైమిశారణ్యం !

🙏🕉️🙏🕉️🙏🕉️🙏

         🙏 *నైమిశారణ్యం !* 🙏
-----------------------------------------------               

    *వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.*

        *మహాభారత యుద్ధ అనంతరం కలియుగ ఆరంభ సమయంలో శౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని బ్రహ్మను ప్రార్థిస్తారు.*

        *బ్రహ్మదేవుడు దర్భలతో ఓ పెద్ద చక్రాన్ని సృష్టించి.  ఆ చక్రం వెంట కదిలివెళ్లాల్సిందిగా సూచిస్తాడు. ‘ఈ మనోమయ ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనదని, యాగం చేయడానికి అర్హత కలిగినదని చెబుతారు. అక్కడ జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది’ అని చెబుతాడు.*

        *దీంతో మునులంతా ఆ చక్రాన్ని అనుసరించగా, చక్రం ప్రస్తుతం నైమిశారణ్యం ఉన్న చోటుకు రాగానే పెద్ద శబ్దంతో విరిగి పోతుంది. అంతేకాకుండా చక్రం విరిగి పోయిన చోటు నుంచి ఉధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది.*

        *దీంతో మునులు ఆ ఆది పరాశక్తిని పూజించగా, ఆ జల ఉదృతిని మహాశక్తి ఆపివేస్తుంది. కాల క్రమంలో ఆ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది, లింగధారిణి శక్తి రూపంలో లలితా దేవి ఆలయంగా పేరుగాంచింది. ఆ చక్రం ఆగి విరిగిపడిన ప్రాంతం చక్రతీర్థం అయ్యింది. అదిశంకరులు ఇక్కడి లలితా దేవిని దర్శించి లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు.*

        *నైమిశారణ్యంలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. మహాభారతంతో పాటు రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్యం ప్రస్తావన ఉంది. నైమిశారణ్యం వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటి.*

         *ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతో పాటు మరికొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసింది ఇక్కడే, లవకుశులను కలుసుకున్నది కూడా ఇక్కడే. సీతా దేవి పేరుతో రాముడు బ్రాహ్మణులకు దానం చేసిన ప్రాంతమే నేటి సీతాపురం అని చెప్పుకుంటారు.*

        *శివపురాణంలోనూ నైమిశారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల రాజ్యాల మధ్య నైమిశారణ్యం ఉండేది. శుక్రాచార్యుల ద్వారా ఈ క్షేత్ర పవిత్రత తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్లు చెబుతారు.*

        *నైమిశారణ్యంలో తెల్ల తెగడ, కొడగోగు, ధన, ఉమ్మెత్త, చండ్ర, మామిడి, నేరేడు, వెలగ , మర్రి, రావి, పారిజాత, చందన, అగరు, కొలికొట్టు, పొగడ, సప్తవర్ణ, పున్నాగ, సురపొన్న, నాగకేసర వంటి చాలా రకాల ఔషధ గుణాలు కలిగిన వృక్షాలు, మొక్కలు ఉన్నాయి.*

  *నైమిశారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం, సైంధవారణ్యం, జంబుకారణ్యం, పుష్కరారణ్యం, ఉత్పలారణ్యం, బదిరికారణ్యం, జంగాలరణ్యం, అరుపుత్తరణ్యం, నైమిషారణ్యం తొమ్మిది తపోవనాలు.*

      *ఇక్కడ ప్రవహించే గోమతీ నదీ స్నానం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.*

*మహాభారత కథను మొదటిసారిగా ఇక్కడ శౌనకాది మహర్షులకు సూత మహాముని మహాభారత కథను మొదటిసారిగా ఇక్కడే వినిపించాడని చెబుతారు.*

    *కురుక్షేత్ర సంగ్రామానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో బలరాముడు తాను తటస్థంగా ఉండిపోవాలని నిర్ణయించుకొని…..*
*తీర్థయాత్రలకు బయలు దేరుతాడు. ఈ క్రమంలోనే నైమిశారణ్యం చేరుకొంటాడు. ఆ సమయంలో మునులందరూ ఆధ్యాత్మిక విషయాల పై సుదీర్ఘమైన చర్చలో మునిగి ఉంటారు.* *బలరాముడిని చూసి అందరూ లేచి నమస్కరిస్తారు.*

        *అయితే సభకు ఆచార్యపీఠాన ఉన్న రోమహర్షణుడు సభా మర్యాదను అనుసరించి లేవలేదు. దీనిని బలరాముడు అవిధేయతగా భావించి అతని శిరస్సును ఖండిస్తాడు. దీంతో అక్కడ ఉన్న మునులు బలరాముడిని తీవ్రంగా నిందిస్తారు.*

        *తనతప్పును తెలుసుకొన్న బలరాముడు… ప్రాయశ్చిత్తం సూచించమని వేడుకొంటాడు.* 

*స్థానికంగా ఉన్న బల్వుడనే రాక్షసుడిని సంహరిస్తే బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడానికి మార్గం చెబుతా మంటారు.*

        *దాంతో అమిత బలవంతుడైన బలరాముడు తన ఆయుధాలతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. తర్వాత మునుల సూచనమేరకు ఇక్కడి చక్రతీర్థంలో స్నానం చేసి తన బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకొన్నాడు.*

*అందువల్లే ఈ చక్రతీర్థంలో స్నానం చేస్తే ఎటువంటి పాపాలైనా పటాపంచలై పోతాయని చెబుతారు. గోమతీనది తీరాన ఉన్న ఈ ప్రదేశం ప్రాచీన కాలంలో ఎంతో మంది సాధువుల తపస్సు కారణంగా కూడా ప్రసిద్ది చెందింది.*

  *నైమిశారణ్యంలో ఇతర ప్రత్యేక ఆకర్షణలు… సూతగద్దె, దేవరాజేశ్వర మందిరం, ఆనందమయి ఆశ్రమం, సేతు బంధ రామేశ్వరం, రుద్రావర్తము అనే ఆలయాలు ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.*

       *చక్ర తీర్థం, వ్యాసపీఠం, సూరజ్ కుండ్, పాండవుల కోట, హనుమాన్ గఢీ, లలితాదేవీ మందిరం వంటి ముఖ్యమైన పూజా స్థలాలు భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. తీర్థయాత్రలు చేస్తున్న వారికి నైమిశారణ్యంలో ప్రతి ఏటా మార్చిలో నిర్వహించే ప్రదక్షిణలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.*

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: