దేవీ శక్తులు
*దేవీభాగవతం - 249*
*శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు*
*ద్వాదశ స్కంధము - 14*
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🙏
248 వ భాగములో....
*దిక్పాలక నగరాలు* చదువుకున్నాం.
🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏
*అమ్మ దయతో....* ఈరోజు
*దేవీ శక్తులు*
*దేవీ పరిచారికలు* చదువుకుందాం.
🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🙏
*దేవీ శక్తులు*
పింగలాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధా, స్వాహా, స్వధా, మాయా, వసుంధరా, త్రిలోకధాత్రీ, సావిత్రీ, గాయత్రీ, త్రిదశేశ్వరీ, సురూపా, బహురూపా, స్కందమాతా, అచ్యుతప్రియా, విమలా, అమలా, అరుణీ (20)
ఆరుణీ, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యామాతా, సతీ, హంసీ, మర్ధికా, వజ్రకాపూరా, దేవమాతా, భగవతీ, దేవకీ, కమలాసనా, త్రిముఖీ, సప్తముఖీ, సురాసురవిమర్దినీ, లంబోష్ఠీ (40)
ఊర్ధ్వకేశీ, బహుశీర్షా, వృకోదరీ, రథరేఖా, శశిరేఖా, అపరా, గగనవేగా, పవనవేగా, భువనపాలా, మదనాతురా, అనంగా, అనంగమథనా, అనంగమేఖలా, అనంగకుసుమా, విశ్వరూపా, సురాదికా, క్షయంకరీ, శక్తిః, అక్షోభ్యా, సత్యవాదినీ (60)
బహురూపా, శుచివ్రతా, ఉదారా, వాగీశ్వరీ, నామాలతో *మహాశక్తి కళారూపాలు చతుషష్టి,*
వీరందరూ జ్వాలామాలికల్లాంటి నాలుకలు చప్పరిస్తూ అగ్నులు వెళ్ళగక్కుతుంటారు. సప్తసముద్రాలనూ తాగేస్తాం. సృష్టినంతటినీ సంహరిస్తాం. అగ్నిదేవుణ్ణి చప్పరిస్తాం. వాయువును స్తంభింపజేస్తాం. అఖిలజగత్తునూ భక్షిస్తాం అని అరుస్తూ అగ్నిగోళాల్లాంటి కళ్ళు మిటకరిస్తూ, ధనుర్బాణాలు ధరించి ఎల్లవేళలా యుద్ధం యుద్ధమంటూ ఉరకలు వేస్తుంటారు. వీళ్ళు దంష్ట్రల్ని పటపటలాడిస్తుంటే దిక్కులు చిల్లులు పడతాయి. వీళ్ళది పూర్తిగా రాగిజుట్టు రాగి తీగల్లాగా నిక్కబొడుచుకుని ఉంటుంది. వీరిలో ఒక్కొక్కరికీ శతాక్షౌహిణుల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి లక్ష బ్రహ్మాండాలను నాశనం చెయ్యగలదు. వీళ్ళ సైన్యంకూడా అంతటిదే. ఈ జగత్తులో వీళ్ళు చెయ్యలేనిదంటూ ఏమీలేదు. యుద్ధసామగ్రి అంతా ఈ కక్ష్యలో నిలవ ఉంటుంది. గజాశ్వరథాలకు లెక్కలేదు.
పద్మరాగప్రాకారం దాటగానే గోమేధికప్రాకారం కనపడుతుంది. అదీ పదియోజనాల ఎత్తే, జపాకుసుమకాంతుల్ని విరజిమ్ముతుంటుంది. ఈ కక్ష్యలో నేలా నింగీ చెట్టూ పుట్టా సమస్త వస్తుసామగ్రి - అంతా గోమేధికమయం. భవనాలూ స్తంభాలూ చెరువులు నూతులూ అన్నీ గోమేధిక నిర్మితాలే. ఈ కక్ష్యలో,ముప్ఫయిరెండు మంది మహాదేవీశక్తులు నివసిస్తుంటారు. వారి చేతుల్లో గోమేధికాలు పొదిగిన భీషణాయుధాలు ఉంటాయి. వారి భూషణాలూ గోమేధిక నిర్మితాలే. వీరికీ ప్రత్యేకలోకాలున్నాయి. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడనే ఉంటారు. ఎల్లవేళలా కయ్యానికి కాలుదువ్వుతుంటారు. పిశాచవదనలు. స్వర్లోకవాసులు వీరిని పూజిస్తుంటారు. ఆయుధాలు ధరించి తాండవంచేస్తూ కొట్టు కొట్టు - తన్ను తన్ను - చింపు చింపు - కాల్చు కాల్చు అని అరుస్తూ ఉంటారు. రణప్రియలు. ఒక్కొక్క శక్తి దగ్గరా దశాక్షౌహిణుల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి లక్షబ్రహ్మాండాలను మట్టు పెట్టగలదు. సేనాశక్తిని వర్ణించి చెప్పడం కష్టం. రథగజాశ్వశస్త్రాస్త్రాలకు లెక్కలేదు. సర్వయుద్ధ సమారంభాలూ ఇక్కడినుంచే. వీరి పేర్లుకూడా చెబుతాను. వినేసెయ్యి. పాపాలు నశిస్తాయి.
విద్యా - హ్రీ - పుష్టిః - ప్రజా - సినీవాలీ - కుహూ: - రుద్రా - వీర్యా - ప్రభా - నందా (10) -
పోషిణీ బుద్ధిదా - శుభా - కాళరాత్రి: - మహారాత్రి: - భద్రకాళి - కపర్దినీ - వికృతిదండి - ముండినీ - సేందుఖండా (20)
శిఖండినీ - నిశుంభశుంభ మథినీ - మహిషాసురమనీ - ఇంద్రాణీ - రుద్రాణీ - శంకరార్ధశరీరిణీ - నారీ - నారాయణీ - త్రిశూలినీ - పాలినీ - అంబికా - హ్లాదినీ (32) నామధేయలు. వీరిలో ఎవరికి కోపం వచ్చినా మరిక బ్రహ్మాండం లేనట్టే. ఎప్పుడూ ఎక్కడా పరాజయమంటూ ఎరగరు.
♻️♾️♾️♾️♻️✅♻️♾️♾️♾️
*దేవీ పరిచారికలు*
గోమేధిక ప్రాకారం గడిచాక వజ్రమయసాల. ఇదీ అంతే ఎత్తు. గోపురాలు ద్వారాలూ యథాతథం. కవాటాలూ వాటి గొలుసులూ గడియలూ వజ్రనిర్మితాలే. ఈ కక్ష్యలో ఉన్న సమస్త వస్తుజాలమూ మందిరాలూ జంతుపక్షి బృందమూ వాపీ కూపతటాకాదికమూ - అంతా వజ్రమయం. ఇక్కడ శ్రీ భువనేశ్వరి పరిచారికలు నివసిస్తుంటారు. ఒక్కొక్క పరిచారిక చేతికిందా లక్షమంది దాసీజనం ఉన్నారు. అందరూ మదగర్వితలు. తాళవృంతధరలు. కొందరి చేతుల్లో చషకాలు (పానపాత్రలు) ఉంటాయి. కొందరి చేతుల్లో తాంబూలపాత్రలు. కొందరు ఛత్రధారిణులు. చామర ధారిణులు. వస్త్ర ధారిణులు. పుష్పమాలికా ధారిణులు. ఆదర్శ ధారిణులు (అద్దాలు). కుంకుమ లేపన ధారిణులు. కజ్జల ధారిణులు. సిందూరచషక ధారిణులు. మహాదేవికి కావలసిన అలంకరణ సామగ్రిని సర్వసన్నద్ధంచేసి పట్టుకుని పిలుపుకోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీరిలో కొందరు మకరికాపత్ర నిర్మాణంలో నేర్పరులు. కొందరు పాదసంవాహనలో కొందరు భూషాకరణంలో కొందరు పుష్పమాలికాకరణంలో కొందరు పుష్పాలంకరణలో - ఇలా ఒక్కొక్క విద్యలోనూ కొందరు కొందరు నేర్పరులు. అందరూ బహువిలాస చతురలే. అందరూ యువతులే. చీరలు కట్టుకుని కొంగుబిగించి కళకళలాడుతుంటారు. దేవీ కృపాలేశానికి నోచుకుని జగత్రయాన్నీ తుచ్ఛీకరించిన గర్వం ఠీవి వీరి ముఖాల్లో కదలికల్లో కనపడుతుంటుంది. -
వీరే అమ్మవారికి దూతికలు. శృంగారమదగర్వితలు. వీరి పేర్లు చెబుతాను. విని ఆనందించు. అనంగరూపా - అనంగమదనా - మదనాతురా - భువనవేగా - భువనపాలికా - సర్వశిశిరా - అనంగవేదనా అనంగమేఖలా నామధారిణులు. మెరుపు తీగల్లాంటి సుందరీమణులు. కాంచీకంకణకింకిణీగణ ఝణత్కారాలతో మంజు మంజీర శింజానాలతో ఇటూ అటూ పరుగులు తీస్తుంటారు. సర్వకార్య నిపుణలు. వేత్రహస్తలు. వీరి నివాస సదనాలు ఈ ప్రాకారంలో మనోహరంగా ఉంటాయి. కన్నులున్నందుకు ఒక్కసారైనా చూసి తీరవలసిందే. ఆ సదనాల ముందు ఎన్నెన్ని వాహనాలు ! అడుగడుగునా ఖడ్గధారిణుల కావలి.
🌀♾️🌀♾️🌀♾️🌀♾️🌀♾️🌀♾️
*(అష్టమాతృకలు - 250 వ భాగములో)*
*🙏అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ........🙏*
*.....
*శ్రీ మాత్రేనమః*
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🙏
Comments
Post a Comment