రహస్య త్రయం‎*

*రహస్య త్రయం‎*

*శిష్యుడంటే ఎట్లా ఉండాలి ?*
 
వినే శ్రద్ద దానితో పాటు మరికొన్ని యోగ్యతలు ఉంటే ఆ వ్యక్తికి ఉజ్జీవన తప్పనిసరి లభిస్తుంది అని అంటారు. మన పెద్దలు మన చెవులను మనం సవ్యంగా పని చేయించుకోగలిగితే భగవంతుడిని హృదయంలో నిశ్చలంగా నిలుపుకోవచ్చు అని ఒక సూత్రం చెప్పారు. భగవంతుడిని మనం తెల్సుకోవాలి అంటే ఒకరి ఉపదేశం ద్వారానే పొందాలి తప్ప మనంతట మనం ఆర్జించుకోవడం అనేది అసాధ్యం. ఉపదేశం చేసే వ్యక్తిని ఆచార్యుడు అని అంటారు, ఉపదేశం పొందే వ్యక్తిని శిష్యుడు అని అంటారు. ఆచార్యుడు ముందు దాన్ని గ్రహించిన మహనీయుడు కావాలి. శిష్యుడు దాన్ని పొందలనే జిజ్ఞాసతో పాటు సుశ్రూషుడు కావాలి. సుష్రూషు అంటే వినకోరే వాడై ఉండాలి. సుశ్రూష అంటే గురువుగారు చెప్పే వాటిని వినే కోరిక. అయితే వినాలని కోరితే సరిపోదు, అది లభించేవరకు వేచిచూడగలగాలి. భగవంతుడు భగవద్గీతలో గురువు ఏం చేస్తాడో చెప్పాడు. తాను చెప్పినది కేవలం ప్రేరేపణ కోసమే తప్ప అసలు చెప్పాల్సింది "ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వ దర్శిణః" తత్వ ద్రష్టలు అయిన జ్ఞానమును పొందిన మహనీయులు నీకు చెబుతారు అని చెప్పాడు. అయితే వారు చెప్పే ముందు నీవు చేయవల్సినవి కొన్ని ఉన్నాయి అని చెబుతూ "ప్రణిపాతము, పరిప్రశ్న సేవ" ఈ మూడు నీవు చేస్తూ ఉంటే ఒక నాడు ఉపదేశం చేస్తాడు. ప్రణిపాతము అంటే తల వంచుట దానితో పాటు మనస్సు వంగాలి. అట్లా వంగినప్పుడు నిజంగా తెలుసుకోవాలి అనే తపనతో సందేహాలను తీర్చుకొనడానికి అడిగిన ప్రశ్నలను పరిప్రశ్న అని అంటారు. ఆ వేసే ప్రశ్న వారికి వాత్సల్యం కలిగేలా ఉండాలి. వారు చెప్పేవరకు ఎదురుచూడాలి, ఆ ఎదురుచూసేంత కాలం వారి అవసరానికి తగిన సేవ చేయాలి. అప్పుడు ఉపదేశం అనేది చేస్తాడు ఆచార్యుడు. ఇది కృష్ణుడు చెప్పినది. అట్లా ఎంతకాలం వరకు ఉపదేశం కోసం వేచి ఉండాలి అంటే, చాలా కాలం అట్లానే సాగేది. ఇది రామానుజాచార్య కాలం వరకు అట్లానే ఉండేది. రామానుజాచార్య వారు అవతరించాక ఇట్లా చాలా కాలం వరకు ఉపదేశం చెయ్యకపోతే మనిషి ఎంతకాలం వరకు బ్రతక గలడు, వాడికి శ్రద్ద కలిగింది అంటే చాలు ఉపదేశం చెయ్యండి. క్రమంగా వాడికి ఏర్పడ్డ సంస్కారమే బాగు పరుస్తుంది అని చెప్పారు రామానుజాచార్య స్వామి. సుశ్రూషు అంటే వినాలనే కోరిక కల్గి ఉండటమే.

శిష్యుడికి ఉండవల్సిన లక్షణాలు ఏవో తెల్సుకుందాం.

సద్బుద్దిః సాదుసేవి సముచిత చరితః తత్వభోదా విలాషీ
సుశ్రూషుః త్యక్తాణః ప్రణిపతనపర ప్రశ్న ప్రశాల ప్రతీక్షః
శంతో దాంతో అనసూయుః శరణముపగతః శాస్త్ర విశ్వాస శాలీ
శిష్యః ప్రాప్తః పరీక్షాం కృతవిదిమతః తత్వతః శిష్యణీయగం
ఇట్లాంటి లక్షణాలు కనక ఉంటే తప్పని సరిగా శిక్షణ ఇవ్వాలి సుమా అనేది ఆచార్యుల నిర్ణయం.


సత్- అంటే వాస్తవమైన విషయం లేక ప్రమాణ పతిపన్నము. ఏదో ఒక ప్రమాణానికి అందేది అని అర్థం. ఏదో ఒక ప్రమానం అంటే, కంటికే కనిపించాలి అని కాదు, ఏదో ఒక ప్రమాణానికి అందినా చాలు. మనస్సుకు గోచరించినా చాలు. శాస్త్రంలో ఉన్న విషయాలను ఆప్తవాక్యం అని కూడా అంటారు. మన మంచి మాత్రమే కోరిన పెద్దలని ఆప్తులు అంటాం, వారు చెప్పిన మాటలే మనకు ప్రమాణం. మన ఋషులు అట్లాంటి వారు. వారికి ఏదో ఫలితం వస్తుంది అని చెప్పిన మాటలు కావు. వారు చెప్పిన మాటలని ఆప్తవాక్యం అని అంటారు. అట్లాంటి సద్బుద్ది కలిగి ఉండాలి.


ఉపనిషత్ ఒక కథ చెబుతుంది. జానస్రుతి అనే మహనీయుడు ఉండేవాడు, ఎంతో అన్నదానం చేసేవాడు, మంచి పేరు ఉండేది, దానితో పాటు గర్వం కూడా ఆయనలో చేరింది. తనంత గొప్ప వాడు ఎవడు ఉన్నాడు అని. వాడి గర్వాన్ని అణిచివేయాలి అని ఇంద్రుడు, అగ్ని పక్షివేషంలో వచ్చారు ఆయన ఎక్కడికో వెళ్తుంటే. ఈ జానస్రుతికి పక్షుల మాట కూడా తెల్సును. వెనక వెళ్ళే పక్షి ముందు పక్షితో అందట "హే వళాక్ష! క్రింద చూసావా ఒక తేజస్సు కనిపిస్తుంది. అది జానస్రుతి యొక్క తేజస్సు, అక్కడికి వెళ్తే మనం మండిపోతామేమో". ఆ ముందు వెళ్ళే పక్షి అందట "ఈయనేం రైక్వుడా, అంత తేజస్సు ఉండటానికి". అంటూ వెళ్ళిపోయాయి పక్షులు. క్రింద జానస్రుతికి అనిపించిందట నేను ఇంత శ్రమ పడి పేరు సంపాదిస్తుంటే ఈ రైక్వుడనే వాడెవడు, ఆయన చేసేదేంటి అని అసూయపడటం ప్రారంభించాడు. అట్లా గురువు వద్ద మంచిని గ్రహించాలి అంటే అసూయను ఉండకూడదు.


అట్లా ఎన్నో లక్షణాలు ఉన్నప్పుడు గురువుకోసం వెతుక్కుంటూ వెళ్ళాలి, ఆశ్రయణ చెయ్యాలి. గురువే ఉపాయం అని నమ్మగలగాలి, అప్పుడు శరణాగతి చేయాలి. శాస్త్రం తెలిసినా వాటి మీద నమ్మకం ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉంటే వాడిని శిష్యుడు అని అంటాం. శిష్యుడు అవగానే వెంటనే గురువు ఉపదేశం ఏమి చెయ్యరు. వాడి యోగ్యతలను చూసి, వాడికి నచ్చినా నచ్చకున్నా కొన్ని పరిక్షలు చేసి, అట్లాంటి పరిక్షలను నెగ్గిన వారు కొందరు ఉంటాడు, అట్లాంటి వారి వద్ద కూడా అభిమానం సంపాదించాక, అప్పుడు తగినటువంటి ఉపదేశం ఎదో గురువు గారు చేస్తారు.


ఉపనిషత్తులు, శాస్త్రాలు శిష్యుడి లక్షణాలు ఇట్లా ఉండాలి అని చెబుతున్నాయి. ఇంత శ్రమనా అని అనిపించవచ్చు. కానీ పొందే ఫలితం విలక్షణమైనది. ఎన్ని కోట్ల జన్మలుగా మనం తెచ్చుకున్న సంసారం అనే రోగాన్ని తగ్గించుకోవాలి అంటే తప్పదు. అట్లాంటి శిష్య లక్షణాలు మనకు చూపించడానికి, భగవంతుడే శిష్యుడై భగవంతుడే గురువై తిరుమంత్రాన్ని ప్రకాశింపజేసాడు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: