యక్షుడి ప్రశ్న. '
'ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది?' అన్నది యక్షుడి ప్రశ్న. 'నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటూంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది?' బదులిస్తాడు యుధిష్ఠిరుడు.
ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషికి క్షణం కూడా తీరికలేదు.
మనిషికి తన పుట్టుక గురించి తెలుసు. కాని, మరణం గురించి బొత్తిగా తెలియదు. దాన్నించి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు. చనిపోయాక ఏమవుతుంది? మరణం తరవాత మనిషి ఎక్కడికి వెడతాడు? అసలు మానవ జన్మకు ప్రయోజనమేమిటి? ఆత్మ అన్నది ఉన్నదా? శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెడుతుంది?
జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికీ ఎదురయ్యే ప్రశ్నలివి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బుచేసినా, ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా- ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న ఆలోచనే తప్ప, జన్మాంతర జీవితం గురించి తలంచడు.
వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటినుంచి మరణంవైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగుతూంటుంది. ఓ క్షణం ముందుకు నడుస్తోందంటే ఆయుష్షులో ఓ క్షణం తరిగిపోతున్నట్టే కదా! బ్రహ్మ జ్ఞానులకు ఇది అసంబద్ధమనిపించదు. ఎందుకంటే, మరణానంతర జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో, ఆ జీవితమూ అంతే అవసరం!
కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛాసుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ముగించవచ్చని మన వేదాలు చెబుతున్నాయి.
కొందరు మతస్తులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తు రూపేణా దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు. మనిషికొకే జన్మ అని అనుకోవటంలో ప్రమాదమే అది. రేపో, ఎల్లుండో ఎలాగా పోతాం కనుక త్వరత్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు.
వేద పరిజ్ఞానమున్నవారిని మరణం భయపెట్టదు. వస్తురూపంగా చవిచూసే గుణాలకన్న మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే! మరణం దారి మరణానిదే! మరణం జీవితానికి ఆఖరిమెట్టు. ఆత్మ జీవితం అనంత వాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే! ఆత్మకు చావులేదు.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అర్జునా! ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు. అవధ్యుడు. మరణమనగా దేహంనుంచి దేహి బయటికి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిది. ఈ రెండింటి సంయోగం క్షణికమే! పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించటం వంటిదే! ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది' అని స్పష్టంగా చెప్పాడు.
ఏదో క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరక్కుండానే సమయం అంతం అయిపోవచ్చు. అందుకే, వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తిమార్గం లభ్యమవుతుంది. దివ్యజ్ఞానం దక్కుతుంది. ఈ ఆత్మ పరమాత్మకెంతో దగ్గరని అర్థమవుతుంది.
Comments
Post a Comment