మోక్ష కారకుడు కేతువు.

ఓం శ్రీమాత్రే నమః

 మోక్ష కారకుడు కేతువు. 

 చిన్నప్పుడు సామాన్య శాస్త్రం లో మనం చదువుకున్న చిన్న పాఠం .మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు పత్రహరితం ప్రాముఖ్యత వహిస్తుంది. అనగా ఆకుల లోని ఆకుపచ్చరంగు సూర్యరశ్మిలోని కాంతిని శోషించి పోషణ పదార్థాన్ని తయారు చేస్తుంది. కొత్త ఆకులు వచ్చినప్పుడు పాత ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి . 

ఇది కేతు గ్రహానికి, మానవజీవితానికి మధ్య అన్వయించి చూడాలి. ప్రతి మానవునికి చిత్రవిచిత్రమైన కోరికలు వయసుతోపాటు వస్తూనే ఉంటాయి. వాటికి అంతు ఉండదు. భగవానుడు కోరికలే దుఃఖానికి మూలం అని అన్నారు. అదేవిధంగా దుఃఖమే కోరికలు అని కూడా ప్రస్తావిస్తారు. కోరికలన్నింటిలోకి శృంగార వాంఛ అతి ముఖ్యమైనది. ఈ వాంఛను అధిగమిస్తే ముక్తి లభిస్తుంది.అది లభించడానికి కావలసిన అనుగ్రహం కేతువు. మోహములు తీర్చడం, అకస్మాత్తుగా వ్యామోహములు తీరి ఆధ్యాత్మిక చింతన బాట పట్టేలా చూడగలిగేది కూడా కేతు దశలోనే. 

 వివాహం చేసుకుని సంసారం చేసేది వంశాభివృద్ధి కొరకు అనగా సంతానం కోసం మాత్రమే అని ధర్మశాస్త్రములు చెప్తున్నాయి. 

 అశ్విని మఖ మూల కేతు నక్షత్రములు అగ్నితత్వ రాశులలో మొదటి నక్షత్రములై ధర్మ త్రికోణంలో ఉంటాయి. అశ్వని నక్షత్రం ఉన్న రాశిలోనే సూర్యుడు ఉచ్ఛ స్థితిని పొందుతాడు. పంచ భావమైన సింహరాశి సూర్యునికి మూల త్రికోణము అని పిలువబడుతోంది. నవమ భావం మన పితృదేవతలకు సంబంధించినది..అంటే మన వంశం యొక్క మూలాలలోకి ఆధారాన్ని చూపించేది . ధర్మ త్రికోణ రాశులకు అధిపతులు అయిన కుజ, రవి, గురువులకు సంసార జీవనానికి సంబంధం ఉంటుంది. వీరి అనుగ్రహం లేనిదే ఆనందమైన జీవితం ఏ గృహస్థునకు కూడా సాధ్యం కాదు. ఈ రాశిలో ఉండే కేతువు కూడా అంతే ముఖ్య పాత్ర వహిస్తున్నారు. 
కనుక ,కేతువును కార్మిక సంబంధమైన గ్రహముగా చెప్పడంలో అతిశయం లేదు. సూర్యుని అనుగ్రహం లేనిదే సంతానం పొందడం కష్టం. అదేవిధంగా కేతువు ప్రభావాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఒక విధంగా చూస్తే గృహస్థుల శృంగార వాంఛ నియంత్రించేది కేతు గ్రహం అనడంలో సందేహం లేదు. పండిన ఆకులురాలి..కొత్త చిగురు వచ్చినట్లుగా సంతానం గృహ సౌఖ్యం పొందడానికి పెద్దలు ఆధ్యాత్మిక మార్గం అవలంబించాలి. ఒక వ్యక్తి ధర్మబద్ధమైన కామ వాంఛ కలిగి ఉండడానికి కేతువు కారణం అవుతాడు. 
కుజ కేతువులును సంతాన కారకులుగా, వారి అధిదేవతలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు అని గుర్తిస్తూ సంతానం కోసం వారిని ప్రార్థించాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఆదిదంపతులైన శివపార్వతులను సంతానమే వీరు. ఆదిదంపతులలోని అనురాగాన్ని, వైరాగ్య భావనను ఒకేసారి చూడగలం. అదే మన భారతీయ దంపతుల లక్షణంగా , మహర్షుల ఆశీస్సులు గా ,వేదవాక్కు గా మనం స్వీకరించాం. 

సంతానం పొందిన తర్వాత వారి అభివృద్ధి కొరకు పాటుపడడం, శృంగార భావనను విడనాడి ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవడం గృహస్తు లక్షణం, ధర్మం. 

కాల పురుష చక్రమున తులా రాశిలో లేదా సప్తమంలో కేతువు ఉన్నప్పుడు అటువంటి వైరాగ్య భావం సాధ్యమవుతుంది . ఎందుకంటే తులారాశి లోనే రవి తన ప్రభావాన్ని కోల్పోతాడు. కర్మ కారకుడు శని ఉచ్ఛ స్థితిని పొందుతాడు. ఇవన్నీ మనిషిలోని ధర్మ ప్రవృత్తి పెంపొందించడానికి దోహదపడతాయి. 
"కామిగాని వాడు మోక్షగామి కాడు" అని అందుకే అంటారు. శుక్ర గ్రహం కళత్ర కారకుడు, సుఖములకు ముఖ్య కారకుడు అయినప్పటికీ కూడా కేతువు యొక్క వైరాగ్య భావన తోడు కాకపోతే దుఃఖానికి కారణం అవుతాడు. ఎందుకంటే" అతి సర్వత్ర వర్జయేత్ " అనే నానుడి వుంది కదా. శుక్రాచార్యునికి వర ప్రసాదమైన మృత సంజీవిని విద్య కూడా శివుని అనుగ్రహం వలన ప్రాప్తించిన దే అని మనం మర్చిపోకూడదు. పైవన్నీ ఒక పద్ధతిలో విశ్లేషణ చేసుకుంటే కేతువు ముక్తి కారకుడు అని ఎందుకంటారో మనకు అర్థమవుతుంది. 

 అందుకే విద్యార్థులకు గణపతి ఆరాధన మరియు సరస్వతీ దేవి దయ వలన కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పెంపొందింపజేస్తుంది. విష్ణువు, లక్ష్మీ ఆరాధన వలన కేతువు దంపతులకు సుఖాన్ని కలగజేస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి అనుగ్రహంతో కేతువు చల్లని చూపు వలన సంతానం ప్రాప్తిస్తుంది. బాధ్యతలు తీరాక ఆదిదంపతుల అనుగ్రహంతో తప్పకుండా కేతువు ముక్తిని ప్రసాదిస్తాడు. ఓం నమశ్శివాయ🙏.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: