విదేశీ ప్రయాణం
జ్యోతిష్య శాస్త్రం ద్వారా విదేశీ ప్రయాణం మరియు విదేశాలలో స్థిరనివాసం....✍️✍️
విదేశీ ప్రయాణం అనేది ప్రస్తుత భారత దేశంలో ఉన్న యువకులు అందరిలో ఒక కల లాగా ఉంటుంది కానీ ఆ కలలను నెరవేర్చుకోవడం కొంతమంది అదృష్టవంతులను మాత్రమే వరిస్తుంది కావున జ్యోతిష్య శాస్త్రం ద్వారా విదేశీయాన యోగం గురించి మరియు గ్రహాల కలయిక గురించి తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాను దయచేసి సహకరించగలరు
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పరంగా అనేక రంగాలకు సంబంధించిన ఇంజనీర్లు లేక డాక్టర్లు స్వల్పకాలిక వ్యవధిలోనే విదేశాలకు వెళుతున్నారు కానీ అందరూ విదేశాలలో స్థిరపడడం లేదు కొంతమంది ఒకటి లేక రెండు సంవత్సరాలలో తిరిగి వచ్చేస్తున్నారు కొంతమంది విదేశాల్లోనే స్థిరపడటం జరుగుతుంది కాబట్టి ఈరోజు విదేశాలలో స్థిర పడడానికి మరియు విదేశాలకు వెళ్ళడానికి కావలసిన గ్రహాలు మరియు యోగాలు గురించి తెలుసుకుందాం
విదేశీ యోగం గురించి జ్యోతిషశాస్త్రంలో కొన్ని సూత్రాలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ విదేశాల్లో ప్రయాణించడానికి అత్యంత ప్రభావవంతమైన మరియు ముఖ్యమైన జ్యోతిష్య శాస్త్ర సూత్రాలను మాత్రమే చర్చిస్తున్నాను జాతక చక్రం లో కొన్ని రకాల గ్రహాల కలయిక లు మరియు యోగాలు వ్యక్తిని మాతృభూమి లేక సొంత దేశం నుండి దూరంగా తీసుకువెళుతుంది
జ్యోతిష్య శాస్త్రం ద్వారా విదేశాలలో స్థిరపడడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు.....
మన రాశిచక్రంలో చెప్పిన విధంగా రాశులను మూడు రకాలుగా విభజించారు అవి చరరాశులు,స్థిరరాశులు,ద్విస్వభావరాశులు
చరరాశులు÷మేషం,కర్కాటకం,తుల,మకరం
స్థిరరాశులు÷వృషభం,సింహం,వృశ్చికం,కుంభం
ద్విస్వభావరాశులు÷మిధునం,కన్య,ధనస్సు,మీనం
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం విదేశీ ప్రయాణానికి చరరాశులు ప్రధానమైనవి చరరాశులలో మారుతున్న ధోరణి ఎక్కువగా ఉంటుంది కావున చరరాశులలో ఉన్న గ్రహాలు ఉద్యోగం మార్చటం,నివాస స్థలాన్ని మార్చటం వంటి ధోరణినీ వ్యక్తికి కలిగిస్తాయి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విదేశీ యోగానికి స్థిర రాశులలో ఉన్న గ్రహాలు అంతగా సహాయ పడవు స్థిర రాశులలో ఉన్న గ్రహాలు నిర్దిష్ట ప్రదేశానికి అంటిపెట్టుకునే ధోరణినీ కలిగిస్తాయి కాబట్టి స్థిర రాశులలో ఎక్కువ గ్రహాలు ఉన్న వారు వారి నివాసం లేక ఉద్యోగం ఎక్కువ గా మార్చరూ.విదేశాలకు వెళ్లడం అంటే నివాస మార్పు అని అర్థం చేసుకోగలరు కాబట్టి స్థిర రాశులలో ఉన్న గ్రహాలు విదేశాలకు వెళ్లే అవకాశాలను అడ్డుకుంటాయి
ద్విస్వభావ రాశులలో ఉన్న గ్రహాలు విదేశీ ప్రయాణాన్ని ఇవ్వగలవు ద్విస్వభావ రాశులలో ఎక్కువ గ్రహాలు ఉన్న వారు తరచుగా విదేశాలకు వెళ్లి వస్తూ ఉండవచ్చు కానీ చాలా తక్కువ కాలం విదేశాలలో ఉండే అవకాశం ఉంటుంది
రాశులను వాటి యొక్క తత్వం ప్రకారం మరింతగా విభజించబడ్డాయి
అగ్ని తత్వ రాశులు÷మేషం,సింహం,ధనస్సు
భూతత్వ రాశులు÷వృషభం,కన్య,మకరం
వాయుతత్వ రాశులు÷మిధునం,తుల,కుంభం
జలతత్వ రాశులు÷కర్కాటకం,వృశ్చికం,మీనం
కర్కాటకం,వృశ్చికం,మరియు మీనరాశి లాంటివి విదేశాలకు ప్రయాణించడానికి చాలా ముఖ్యమైనవి విదేశాలకు వెళ్లాలంటే మనం సముద్రాలు దాటాలి కాబట్టి జలతత్వ రాశులు ముఖ్యమైనవి కర్కాటక రాశి చరరాసి మరియు జలతత్వ రాశికి సంబంధించినది మరియు కాలపురుషుని లగ్నం నుంచి నాలుగవ స్థానం కావున కర్కాట రాశి విదేశీ ప్రయాణానికి సంబంధించి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది
రాహు,చంద్రుడు,శని మరియు జలరాసులు లో ఉన్న శుక్రుడులాంటి గ్రహాలు విదేశీ ప్రయాణానికి సంబంధించి సూచనలు
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం విదేశాలలో స్థిరనివాసానికి ముఖ్యమైన గ్రహాలు.....
ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లడానికి లేదా సొంత దేశం నుండి బయటకు వెళ్లడానికి సహాయపడే నాలుగు ప్రధాన గ్రహాలు ఉన్నాయి 1.రాహు/కేతు 2.చంద్రుడు 3.శని 4.శుక్రుడు. విదేశాలకు వెళ్లడానికి ఈ నాలుగు గ్రహాలు మరియు వాటి యొక్క స్థితి మరియు భావాలతో సంబంధాలను బట్టి మనం అంచనా వేయవచ్చు
రాహు గ్రహం విదేశాలకు వెళ్లడానికి చాలా ముఖ్యమైన గ్రహం రాహువు మంచి స్థానంలో స్థితి పొంది ఉన్నట్లయితే ఆ యొక్క దశలో విదేశీ ప్రయాణాలు ఇవ్వగలదు కానీ అది పూర్తి సంతృప్తిని ఇవ్వదు రాహు గ్రహం ఏడు లేక ఎనిమిది లేక 12 స్థానాధిపతిలతో కలయిక జరిగి ఉన్నట్లయితే విదేశీ ప్రయాణాన్ని సూచిస్తుంది రాహు గ్రహం లగ్నంలో లేక ఏడో స్థానంలో స్థితి పొందినట్లయితే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది
చంద్రుడు సహజంగానే నాలుగో స్థానానికి అధిపతి జ్యోతిష్య శాస్త్రం ద్వారా విదేశాలలో స్థిరనివాసం అంచనా వేసేటప్పుడు చంద్రుడు ప్రత్యేకమైన గ్రహం అని మనం గుర్తుంచుకోవాలి చంద్రుడు కేంద్రాలలో(1,4,7,10) ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేశం మరియు దేశం వెలుపల చాలా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు అని కొన్ని జ్యోతిష్య పుస్తకాలలో సూచించబడ్డాయి చంద్రుడు మరియు రాహు గ్రహం జల రాశులలో కలయిక జరిగినప్పుడు విదేశీ ప్రయాణానికి ఎక్కువ అవకాశం ఉంటుంది చంద్రుడు 8,9 లేక స్థానాలలో స్థితి పొంది ఉన్నట్లయితే విదేశీ ప్రయాణాలు ఉంటాయి.12వ స్థానంలో ఉచ్చ స్థానం పొందిన చంద్రుడు ఉన్నట్లయితే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది
బుధుడు నాలుగో స్థానంలో ఉన్నట్లయితే వ్యక్తి నివాసాన్ని తరచూ మారుతూ ఉంటాడు మరియు చాలా ప్రదేశాలలో ప్రయాణిస్తాడు చరరాశులలో బుధుడు ఉన్నట్లయితే ఇలాంటి మార్పులు ఇంకా ఎక్కువగా ఉంటాయి
విదేశీ ప్రయాణానికి సంబంధించి కొన్ని నక్షత్రాలు కూడా మనం పరిగణించవలసి ఉంటుంది. అవి అశ్విని,భరణి,ఆరుద్ర ,స్వాతి,పుష్యమి,హస్త మొదలైనవి.చంద్రుడు లేక రాహు ఈ నక్షత్రాలలో స్థితి పొంది ఉన్నట్లయితే విదేశాలకు వెళ్లే అవకాశం పెరుగుతుంది
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విదేశీ ప్రయాణానికి సంబంధించి కొన్ని భావాలను కూడా పరిశీలించవలసి ఉంటుంది.
పూర్వ కాలపు రోజుల్లో సొంత దేశాన్ని విడిచి పెట్టి విదేశాలకు వెళ్లడం ఒక శాపం గా భావించేవారు కానీ ప్రస్తుత రోజుల్లో విదేశీ ప్రయాణం అంటే ఒక వరం లాగా భావించబడుతుంది విదేశీ ప్రయాణానికి లగ్నం మరియు 9 వ భాగం మరియు 12 భావాలు ప్రధానంగా చూడాలి 12వ భావం అంటే విదేశీ భూమి కాబట్టి విదేశీ ప్రయాణానికి సంబంధించి అతి ముఖ్యమైన స్థానం శుక్రుడు మరియు చంద్రుడు 12వ స్థానంలో స్థితి పొంది ఉన్నట్లయితే విదేశీ ప్రయాణానికి సూచన రాహు గ్రహం కూడా ఈ కలయిక లో చేరి నట్లయితే విదేశీ ప్రయాణానికి చాలా బలమైన సూచన అని మనం గ్రహించాలి. 12వ స్థానంలో శని గ్రహ స్థితి పొంది ఉన్నట్లయితే విదేశీ సంస్కృతి పట్ల ఆకర్షితుడవుతాడు.తొమ్మిదో స్థానం అదృష్టం మరియు దూరప్రాంత ప్రయాణాలు సూచిస్తుంది.కాబట్టి విదేశీ ప్రయాణానికి సంబంధించి తొమ్మిదవ స్థానం మరో ముఖ్యమైన స్థానం అని మనం గ్రహించాలి.తొమ్మిదో స్థానాధిపతి 12వ స్థానంలో స్థితి పొంది ఉన్నట్లయితే మీ యొక్క అదృష్టం విదేశాలలో ఉంటుంది అని సూచిస్తుంది.నాలుగు లేక ఐదు గ్రహాలు కలిసి 9 లేక 12వ స్థానంలో స్థితిపొంది ఉన్నట్లయితే విదేశీ ప్రయాణానికి బలమైన సూచన అని మనం గ్రహించాలి
విదేశీ ప్రయాణానికి సంబంధించి లగ్నం కూడా ప్రధానమైనది లగ్న ఆమోదం లేకుండా జాతకంలో ఏమీ జరగదు కాబట్టి లగ్నాధిపతి 12వస్థానాధిపతి తో సంబంధాలు కలిగి ఉంటే లేక లగ్నాధిపతి 12వ స్థానంలో స్థితి పొంది ఉన్నట్లయితే విదేశీ ప్రయాణానికి బలమైన సూచన.ఈ సంబంధాలు జలతత్వ రాశులలో (కర్కాటకం,వృశ్చికం,మీనం) లేక చరరాశులలో(మేషం,కర్కాటకం ,తుల,మకరం)సంబంధాలు కలిగి ఉంటే విదేశీ ప్రయాణానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
ఒక్క మాటలో చెప్పాలంటే లగ్నాధిపతి,నవమాధిపతి,పన్నెండవ స్థానాధిపతి సంబంధాలు కలిగి ఉండాలి ఆ సంబంధాలు కలయిక లేక దృష్టులు లేక పరివర్తన ఇలా ఏ రకంగా అయినా ఉండవచ్చు.ఆ సంబంధాలు ఎంత ఎక్కువ బలం కలిగి ఉంటుందో విదేశాలలో స్థిరనివాసం ఏర్పరుచుకునే అవకాశం ఎక్కువగా కలిగి ఉంటుంది
కానీ మనం చూడవలసిన మరో ముఖ్యమైన భావం ఉంది.అది చతుర్ధ స్థానం ఈ స్థానం సంబంధం లేకుండా విదేశాలకు వెళ్లడం సాధ్యపడదు.నాలుగో స్థానం మాతృభూమి లేక సొంత దేశాన్ని సూచిస్తుంది కావున చతుర్ధ స్థానము లేక చతుర్ధ స్థానాధిపతి పాపగ్రహాల చేత బాధించబడితే అప్పుడు మీకు విదేశీ ప్రయాణానికి త్వరగా అనుమతి లభిస్తుంది.6,8,12 స్థానాధిపతిలు చతుర్ధ స్థానంలో స్థితి పొందడం లేక చతుర్ధ స్థానాధిపతి 6,8,12 స్థానాలలో స్థితిని పొందడం ఇలా ఏ రకంగా అయినా చతుర్ధ స్థానము లేక చతుర్ధ స్థానాధిపతి బలహీనపడితే విదేశీ ప్రయాణానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రకంగా చతుర్ధ స్థానాధిపతి బలహీనంగా ఉండి 9 మరియు 12 స్థానాధిపతి లతో సంబంధాలు కలిగి ఉంటే విదేశాల్లో స్థిరనివాసం ఏర్పరుచుకునే అవకాశం ఉందని మనం చెప్పవచ్చు చతుర్ధ స్థానంలో రాహు/కేతు,రవి లేక శని స్థితి పొంది ఉన్నట్లయితే విదేశాలకు వెళ్లే అవకాశం పెరుగుతుంది
నాలుగో స్థానం లేదా నాలుగో స్థానాధిపతి బలహీనంగా లేనప్పుడు వ్యక్తి తమ సొంత దేశాన్ని విడిచి పెట్ట లేడు 9 మరియు 12స్థానాధిపతి సంబంధాలు కలిగి ఉండి చతుర్ధ స్థానం మరియు చతుర్ధ స్థానాధిపతి చాలా బలంగా ఉంటే విదేశీ ప్రయాణానికి అవకాశాలు వస్తాయి కానీ వ్యక్తి మాతృభూమిని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళలేడు నాలుగో స్థానం బలంగా ఉండి 5 మరియు 10వ స్థానం తో సంబంధాలు కలిగి ఉంటే ఆ వ్యక్తి సొంత దేశంలోని మంచి అవకాశాలు లభిస్తాయి ఆ వ్యక్తికి విదేశాలకు వెళ్లవలసిన అవసరం లేదు అనిపిస్తుంది
మరో రెండు భావాల గురించి మనం తెలుసుకోవాలి అవి 3 మరియు 7.ఏడో స్థానం కూడా విదేశీ వ్యవహారాల ను సూచిస్తుంది.7 మరియు 12 స్థానాల సంబంధాలు లేక రాహు/కేతు వంటి గ్రహాలతో సంబంధాలు ఉంటే వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది
మూడో స్థానం చిన్నచిన్న ప్రయాణాలను సూచిస్తుంది ఈ స్థానం ఎల్లప్పుడూ విదేశీ ప్రయాణాలతో నేరుగా అనుసంధానించబడదు.కానీ ఈ స్థానం ప్రయాణాల విషయాలను సూచిస్తుంది.మూడో స్థానంలో చంద్రుడు లేదా కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే వ్యక్తికి ప్రయాణాలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది.మూడో స్థానాధిపతి కి 9 మరియు 12 స్థానాధిపతి ల సంబంధాలు కలిగి ఉంటే విదేశీ ప్రయాణానికి బలమైన యోగంగా మనం పరిగణించవచ్చు
మనం విదేశీ ప్రయాణం మరియు విదేశాలలో స్థిర నివాసం మధ్య వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి విదేశీ ప్రయాణం కోసం 1,3,7,9 జలతత్వ రాశులలో మరియు చరరాశులలో సంబంధాలు సరిపోతాయి.కానీ విదేశాలలో స్థిర నివాసం కోసం 12 వ స్థానం మరియు 12వ స్థానాధిపతి ప్రమేయం అత్యంత ప్రధానమైనది.12వ స్థానాధిపతి ప్రమేయం లేకుండా విదేశాలలో స్థిరనివాసం సాధ్యపడదు
ఇక్కడ ప్రధానమైన విషయం ఒకటి గ్రహించాలి ఈ కలయిక లో గురుగ్రహం యొక్క ప్రాముఖ్యత ఒకసారి తెలుసుకోవాలి పైన చెప్పిన యోగాలలో లేక కలయిక లో గురుగ్రహ సంబంధాలు కలిగి ఉంటే ఆ వ్యక్తిని మాతృభూమి నుండి విదేశాలకు వెళ్లడానికి అడ్డుపడుతూ ఉంటుంది
జాతక చక్రం నుండి విదేశీ ప్రయాణం అంచనా వేయడానికి కొన్ని సూత్రాలు....
లగ్నం నుండి చతుర్ధ స్థానము లేక చతుర్ధ స్థానాధిపతి బాధపడవలసి ఉంటుంది.రాహు/కేతు చతుర్ధ స్థానము లేక చతుర్ధ స్థానాధిపతి తో సంబంధాలు కలిగి ఉండాలి లేక నక్షత్ర పరివర్తనం జరిగి ఉండాలి
చతుర్ధ స్థానం బలహీనంగా ఉండి చతుర్ధ స్థానాధిపతి 6,8,12 లాంటి దుస్థానాలలో ఉన్నప్పుడు స్థానికులు విదేశాలలో స్థిరపడడానికి మాతృభూమిని వదిలేస్తాడు
ఈ సంబంధాలు అన్నింటిని లగ్నం మరియు చంద్రుడు,D9,మరియు D4 చక్రం లో కూడా చూడాలి
వ్యక్తి జాతకంలో తొమ్మిదో స్థానం లేక 12వ స్థానం జలతత్వ రాశులలో లేక చరరాశులులో ఉండటం లేక 9వ స్థానాధిపతి మరియు 12 స్థానాధిపతి చరరాశులలో లేక జలతత్వ రాశులలో స్థితి పొంది ఉంటే విదేశీ ప్రయాణాన్ని సూచిస్తుంది
ఉదాహరణకు చతుర్ద స్థానాధిపతి 9వ స్థానంలో స్థితి ఉండడం మరియు 12 స్థానాధిపతి తో కలయిక చెందటం ఆ రాశి చర రాశి లేక జలతత్వ రాసి అయ్యి ఉంటే ఆల్ కి ఉన్నత విద్య కొరకు విదేశీ ప్రయాణానికి సూచన...
చతుర్ధ స్థానాధిపతి 12వ స్థానంలో స్థితి పొందినప్పుడు ఆ వ్యక్తి తన స్వస్థలంలో కాకుండా విదేశాలలో మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది
D10 చక్రంలో 5,9 మరియు 12 స్థానాధిపతి ల కలయిక ఆ వ్యక్తి వృత్తి పరంగా విదేశాలకు వెళ్లేటట్లు చేస్తాయి అలాంటి వ్యక్తి తమ యొక్క నైపుణ్యంతో విదేశాలలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు
రాహు 12వ స్థానంలో తొమ్మిదో స్థానాధిపతి తో కలయిక జరిగి అది జలతత్వ రాశి అయితే ఆ వ్యక్తి విదేశీ ప్రయాణం రాహుదశ లేక అంతర్దశ కాలంలో కచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. 12వ స్థానంలో రాహు/శని విదేశాలలో స్థిర నివాసం ఇవ్వగలవు
ఏడవ స్థానాధిపతి మరియు 7వ స్థానం 8,9 లేక 12 స్థానాలు మరియు వాటి యొక్క అధిపతులు చేత సంబంధాలు కలిగి ఉంటే వివాహం తర్వాత విదేశీ ప్రయాణాన్ని సూచిస్తుంది
లగ్నం మరియు లగ్నాధిపతి చర రాశుల లో లేక ద్విస్వభావ రాశుల్లో స్థితి పొంది ఉన్నట్లయితే విదేశీ ప్రయాణాన్ని సూచిస్తుంది లగ్నం వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది కావున వ్యక్తిత్వాన్ని సూచించే గ్రహం చరరాశులలో లేక ద్విస్వభావ రాశుల్లో స్థితి పొంది ఉన్నట్లయితే ఆ వ్యక్తికి విదేశీ ప్రయాణం అవకాశం మెరుగుపరచగలదు
జ్యోతిష్య శాస్త్రం ద్వారా విదేశాలకు వెళ్ళే సమయం...
జాతక చక్రంలో వ్యక్తికి విదేశాలకు వెళ్లడానికి తగినంత అవకాశాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఈ క్రింద పేర్కొన్న సమయాలులో విదేశీ ప్రయాణాలకు వెళ్ళవచ్చు
9 లేక 12 స్థానాధిపతిల దశ/అంతర్దశ కాలంలో వెళ్లి అవకాశాలు ఉంటాయి లేక 12వ స్థానంలో స్థితి పొందిన గ్రహాలు మరియు 12 స్థానాధిపతి తో సంబంధాలు కలిగిన గ్రహాల యొక్క దశ/అంతర్దశ కాలంలో విదేశీ ప్రయాణాలు ఉంటాయి
చంద్ర,శుక్ర,శని,రాహు/కేతు గ్రహాలు 12వ స్థానం లేక 12 స్థానాధిపతి తో సంబంధాలు కలిగి వుంటే ఆ గ్రహాల దశలు జరుగుతూ ఉంటే విదేశీ ప్రయాణం చేయవచ్చు
గోచారంలో రాహు లేక శని గ్రహాలు 8వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు లేక జన్మ నక్షత్రం లో సంచారం చేస్తున్నప్పుడు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది
రాహు యొక్క దశ విదేశీ ప్రయాణానికి చాలా ప్రత్యేకమైనది రాహువు విదేశాలకు కారకత్వంగా ఉన్నాడు.శని యొక్క దశ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది
సంవత్సరానికి ఒకసారి విదేశాలకు వెళ్లే వారికి సాధారణంగా వారి జాతకంలో విదేశీ ప్రయాణానికి సంబంధించి పెద్ద కలయిక కలిగి ఉండరు కానీ గోచారంలో వారి యొక్క నాలుగో స్థానం బలహీన చెందటం ద్వారా కొన్ని ఇతర కారణాల ద్వారా విదేశీ ప్రయాణం చేస్తారు
విదేశాలలో అదృష్టం....
రహదారికి అవతలివైపు గడ్డి ఆకు పచ్చగా ఉంటుంది కానీ ఇది ఎల్లప్పుడూ నిజం కాదు ఏ గ్రహాల కలయిక లేక యోగాలు విదేశాలలో ప్రయోజనకరమైన ఫలితాన్ని ఇస్తాయో చూద్దాం...
11వ స్థానం వ్యక్తి యొక్క ఆర్థిక లాభాలను సూచిస్తోంది11వ స్థాన అధిపతి ఆరో స్థానంలో ఉంటేఆ వ్యక్తి విదేశాల్లో పని చేయడానికి అదృష్టం గా ఉంటుంది(గమనిక÷11వ స్థాన అధిపతి ఆరో స్థానంలో ఉంటే దరిద్ర యోగంగా పరిగణిస్తారు కానీ విదేశాల్లో పని చేయడానికి ఇది మంచి యోగం అని గ్రహించాలి). ఆరుడ లగ్నం నుంచి 11వ స్థానం మనం మరువకూడదు. ఆరుడ లగ్నం మన యొక్క మాయ ఇతర వ్యక్తులు మిమ్మల్ని ఏ విధంగా చూస్తారు అనే విషయాలను తెలుపుతుంది మీరు తరచుగా విదేశాలకు వెళ్తే మిమ్మల్ని ధనవంతులుగా భావిస్తారు కాబట్టి ఆరుడ లగ్నం నుంచి 11వ స్థానం బలంగా ఉంటే విదేశాలలో అదృష్టవంతులుగా ఉంటారు
వ్యక్తి జాతకంలో 11వ స్థానం అధిపతి 12వ స్థానంలో ఉంటే విదేశాలలో స్నేహితులు ఉంటారు
మీ లగ్నాధిపతి ఏడో స్థానంలో స్థితి పొంది ఉంటే ఏదైనా వ్యాపార నిమిత్తం లేక ఏదైనా పని కోసం తరచూ విదేశాలకు వెళ్తూ ఉంటారు
పైన పేర్కొన్న యోగాలలో కొన్ని ఉంటే విదేశీ ప్రయాణ సమయంలో మీరు అదృష్టవంతులు కావచ్చు
రాహు,శని,కుజుడు వంటి పాప గ్రహాలు జాతక చక్రం లో 12వ స్థానంలో స్థితి పొందితే మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు కానీ మీరు అక్కడ ఉండటాన్ని ఆస్వాదించలేరు.రాహువు 12 స్థానంలో ఉంటే విదేశాలలో పనిచేయటానికి బలమైన సూచన.కానీ అది ఒత్తిడితో నిండి ఉంటుంది
వ్యక్తికి నాలుగో స్థానాధిపతి,5 మరియు లగ్నాధిపతితో మరియు నాలుగో స్థానంలో శుభగ్రహాల సంబంధాలు కలిగి ఉంటే ఆ వ్యక్తి విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపడు.ఆ వ్యక్తి తన యొక్క మాతృభూమి లోనే మంచి అవకాశాలను పొందుతాడు
వ్యక్తి విదేశాలలో కొంత నిర్దిష్ట సమయం గడుపుతాడుఆ గ్రహాల యొక్క దశ కాలం పూర్తి అయిన తర్వాత విదేశాలలో ఉండే కాలం ముగుస్తుంది. మీరు మీ స్వదేశానికి తిరిగి వస్తారు మీరు మీ జీవితాన్ని మళ్లీ ప్రారంభించాల్సి ఉంటుంది కొన్ని పరిహారాలు చేసుకోవటం ద్వారా అలాంటి వాటిని చాలా వరకు నివారించవచ్చు
జ్యోతిష్య శాస్త్రం ద్వారా విదేశీ ప్రయాణం యొక్క ప్రయోజనం.....
ఒక వ్యక్తి విదేశాలకు ఎందుకు వెళ్తాడో అనే విషయాలను పరిశీలించాలి వ్యక్తి యొక్క విద్య లేక ఉద్యోగం మొదలైన విషయాలలో కొన్నింటిని తెలియజేసే ప్రయత్నం చేస్తాను
5,7,9,10 మరియు 12 స్థానాలు మరియు స్థానాధిపతి లు బలమైన సంబంధాల చేత ఆ వ్యక్తి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళవచ్చు.5వ స్థానం తెలివికి మరియు 9వ స్థానం ఉన్నత విద్య మరియు దూర ప్రాంతాల ను సూచిస్తుంది ఇక్కడ పేర్కొనబడిన స్థానాధిపతిల గ్రహాలు చరరాశులలో లేక జలతత్వ రాశులలో ఉండాలి. వ్యక్తికి జరుగుతున్న దశ\అంతర్దశ లను గమనించాలి.విద్యా ప్రయోజనం కోసం విదేశీ ప్రయాణాన్ని తెలుసుకోవటానికి 4,5,7,8,9,10,12 మధ్య సంబంధాలను రాహు,శని,చంద్రుడి తో కలిపి తనిఖీ చేయాలి. ఈ విషయంలో గురుగ్రహం పాత్ర పరిశీలించవలసి ఉంటుంది
దౌత్య సేవ కోసం విదేశాలకు వెళ్లే గ్రహాల కలయిక ను పరిశీలిస్తే వారి జాతకంలో 1,5,7,8,9,10,12 స్థానాలు మరియు ఆ స్థానాల యొక్క అధిపతి లతోపాటు రాహు,శని,చంద్ర,రవి సంబంధాలను పరిశీలించవలసి ఉంటుంది.జాతకంలో ఉన్న వివిధ రకాల రాజయోగాలు,ధనయోగం యోగం కూడా గమనించాలి.పైన పేర్కొనబడిన గ్రహాల యొక్క దశ జరుగుతూ ఉంటే వ్యక్తికి విదేశాలకు వెళ్లే అవకాశం ఇస్తాయి
ఏడో స్థానం మరియు ఏడో స్థానాధిపతి,9 వ స్థానం మరియు 9 వ స్థానాధిపతి, 12 వ స్థానం మరియు 12వ స్థానాధిపతితో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు వివాహం తర్వాత విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.నాలుగో స్థానం మరియు నాలుగో స్థానాధిపతి బలహీన పడాలి.ఇక్కడ రాహు మరియు వివాహ కారకుడైన శుక్రుడిని కూడా పరిశీలించాలి.ఒకవేళ ప్రేమ వివాహం అయితే 5వ స్థానాన్ని మరియు ఎనిమిదో స్థానాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది.శుక్రుడు మరియు రాహువు 8 లేక 12 స్థానాలతో సంబంధాలు కలిగి వుంటే(D1 or D9) వివాహం తరువాత విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
జ్యోతిష్య శాస్త్రం ద్వారా విదేశాలలో స్థిర నివాసం.....
విదేశీ ప్రయాణానికి మరియు విదేశాలలో స్థిర నివాసానికి వ్యత్యాసం ఉందని నేను పైన పేర్కొన్న అంశాలలో చెప్పి యున్నాను.విదేశాలలో స్థిరనివాసం కొరకు 12 వ స్థానం మరియు నాలుగో స్థానం పాత్ర చాలా ముఖ్యమైనది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్క మాటలో చెప్పాలంటే విదేశాలలో స్థిరనివాసం కోసం బలమైన 12వ స్థానం మరియు బలహీనమైన నాలుగో స్థానం వ్యక్తి జాతకచక్రంలో కలిగి ఉండాలి
వ్యక్తి జాతకంలో నాలుగో స్థానం మరియు నాలుగో స్థానాధిపతి రెండు లేదా అంతకంటే ఎక్కువ పాపగ్రహాలు చేత ప్రభావితం అయితే ఆ వ్యక్తి నివాస స్థలాన్ని మార్చుకునే అవకాశం ఉంది. రాహు/కేతు,శని,రవి లాంటి గ్రహాల చేత ప్రభావితం అయి ఉండాలి. D4 చక్రంలో నాలుగో స్థానాన్ని మరియు నాలుగో స్థానాధిపతి ని మరియు 12వ స్థానాన్ని మరియు 12వ స్థానాధిపతి ని పరిశీలించవలసి ఉంటుంది సాధారణంగా రాహు దశ విదేశీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.ఎందుకంటే రాహువు విదేశీ కారక గ్రహం అని మనం గమనించాలి.సాధారణంగా 6,8,9,12 స్థాన అధిపతులు చరరాశులలో లేక జలతత్వ రాశులలో స్థితి పొంది ఉంటే విదేశాలలో స్థిరపడే అవకాశం ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ద్వారా విదేశీ ప్రయాణానికి సంబంధించి కొంత సమాచారం అందించడానికి ప్రయత్నం.. అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ..
Comments
Post a Comment