కాలమానం
100 త్రుటి = 1 తత్పర
30 తత్పర = 1 నిమేష
18 నిమేషాలు = 1 కాష్ఠ
30 కాష్ఠాలు = 1 కలా
30 కలలు = 1 ఘటిక
2 ఘటికలు = 1 క్షణ
30 క్షణాలు = 1 అహోరాత్రము
రోజులో 2916000000వ వంతు త్రుటి. అలాగే, ఆధునిక లెక్కల ప్రకారం త్రుటి సెకండులో 33750వ వంతు.
అయితే, భాస్కరుని 12వ శతాబ్దం దాకా ఈ రకమైన విభజన లేదని మనం అనుకోవడానికి వీలులేదు. 4వ శతాబ్దం తరువాత వచ్చిన భాగవత పురాణం లోనూ, విష్ణుపురాణం లోనూ ఈ విధమైన సూక్ష్మ కాలచర్చ కనిపిస్తుంది. ఉదాహరణకు, భాగవత పురాణంలో విపులంగా వివరించిన ఈ విభజన చూడండి:
అణుర్ ద్వౌ పరమాణూ స్యాత్
త్రసరేణుస్ త్రయః స్మృతః
జాలార్కరశ్మ్యవగతః
ఖం ఏవానుపతన్నగాత్
(3.11.5)
రెండు పరమాణువులు ఒక అణువుగా, మూడు అణువులు ఒక త్రసరేణువుగా భావిస్తారు. ఈ త్రసరేణు కిటికీ గుండా ప్రసరించే సూర్యరశ్మిలో ఆకాశం (ఖం) వైపు పైకి పయనిస్తూ మనం గమనించవచ్చు.
త్రసరేణు-త్రికం భుంక్తే
యః కాలః స త్రుటిః స్మృతః
శత-భాగస్తు *వేధః* స్యాత్
తైస్ త్రిభిస్ తు లవః స్మృతః
(3.11.6)
మూడు త్రసరేణువుల కలయికకు (భుంక్త) పట్టే కాలాన్ని త్రుటి అంటారు. *ఒక వంద త్రుటులను వేధ అని,* మూడు వేధాలను లవమని అంటారు.
నిమేషస్ త్రిలవో జ్ఞేయ
ఆమ్నాతస్తే త్రయః క్షణః
క్షణాన్ పంచ విదుః కాష్ఠాం
లఘు తా దశ పంచ చ
(3.11.7)
మూడు లవముల కాలాన్ని ఒక నిమేషము అంటారు. మూడు నిమేషాలు ఒక క్షణమని, అయిదు క్షణాలు ఒక కాష్ఠమని పదిహేను కాష్ఠాలు ఒక లఘువని తెలుసుకోవచ్చు.
లఘూని వై సమామ్నాతా
దశ పంచ చ నాడికా
తే ద్వే ముహూర్తః ప్రహరః
షడ్ యామః సప్త వా నృణాం
(3.11.8)
పదిహేను లఘువులు ఒక నాడిక. రెండు నాడికలు ఒక ముహూర్తము. ఆరు లేక ఏడు నాడికలు ఒక ప్రహార (లేదా ఒక యామము/జాము)గా నరులు పరిగణిస్తారు.
యామాశ్చత్వారశ్చత్వారో
మర్త్యానాం అహనీ ఉభే
పక్షః పంచ-దశాహాని
శుక్లః కృష్ణశ్చ మానద
నాలుగుజాములు పగలు, నాలుగు జాముల రాత్రి కలసి ఒక మనుష్యుల అహోరాత్రమౌతుంది. పదిహేను రోజులు శుక్లపక్షంగా, పదిహేను రోజులు కృష్ణపక్షంగా పరిగణిస్తారు.
తయోః సముచ్చయో మాసః
పితౄణాం తద్ అహర్-నిశం
ద్వౌ తావ్ ఋతుః షడ్ అయనం
దక్షిణం చ ఉత్తరం దివి
ఒక శుక్లపక్షము, ఒక కృష్ణపక్షము కలసి మాసం అవుతుంది. అది పితృ దేవతల కాలమానం ప్రకారం ఒక పగలు, ఒక రాత్రి. అటువంటి రెండు మాసాలు ఒక ఋతువవుతుంది. ఆరు ఋతువులు కలిస్తే ఒక దక్షిణాయనం, ఒక ఉత్తరాయణం.
అయనే చాహనీ ప్రాహుర్
వత్సరో ద్వాదశ స్మృతః
సంవత్సర-శతం నౄణాం
పరమాయుర్ నిరూపితం
రెండు అయనాలను కలిపి వత్సరమంటారు. ఇది ద్వాదశ పితృ దినాలు అంటే ద్వాదశ మాసాలకు సమానం. శతసంవత్సరాలు నరుల జీవితకాలమని నిర్ధారించారు.
దాదాపు ఇదే విధమైన కాలమానం విష్ణుపురాణంలోనూ, జ్యోతిషశాస్త్రంలోనూ కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రాన్ని వేదాంగంగా భావించినా దాని రచనాకాలం దాదాపు క్రీస్తుశక ఆరంభమని పండితుల భావన.🙏🌹🙏🌹🙏
Comments
Post a Comment