రహస్య త్రయం‎*

*రహస్య త్రయం‎*

*సుభాల ఉపనిషత్ ఇచ్చే ప్రమాణం*

ఈ ఉపనిషత్ చాలా విచిత్రమైన విషయాలను తెలుపుతుంది. మన శరీరంలో గుండే, వివిద నాడులు ఎట్లా ఉంటాయి. జీవుడు ఆయా నాడుల్లో ఎట్లా సంచరిస్తాడో చెబుతుంది. అట్లా సంచరిస్తే ఏమి దర్శిస్తాడో తెలుపుతుంది. మనకు వచ్చే కలలు ఎట్లా వస్తాయి, జీవుడు ఏఏ నాడుల్లో సంచరిస్తే ఎట్లాంటి కలలు వస్తాయో చెబుతుంది. మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, అహంకారం, బుద్ది, ఆత్మ ఇలా పదహారింటికీ మన దేహంలో రకరకాల గతులు ఉంటాయి. మామూలుగా మనం ఒక ప్రదేశాన్ని చూసినట్లు కల వస్తే, ఎప్పుడో మనం ఆ ప్రదేశాన్ని చూసి ఉంటాం. మనం ఒక్కో ప్రదేశాన్ని చూడాలంటే ఆయా రోడ్డు మార్గంలోనే వెళ్తాం, అట్లానే మనం చూసే కల కూడా జీవుడు నడిచే నాడిని బట్టి అని చెబుతుంది. వేదాల్లో ఇలా మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. సాధన చేసిన యోగులు వారు కోరిన మార్గాల్లో ఇంద్రియాలని నడిపి లోని ప్రపంచాన్ని చూడగలరు. ఆ సాధన ఎట్లా చేయాలో కూడా ఈ ఉపనిషత్ చెబుతుంది.
 
  
ఈ ఉపనిషత్ మరో విషయం చెప్పింది. మన శరీరంలో ఒక్కో భాగం తీసుకొని ఆయా భగం ఎట్లా ఈ రూపు దిద్దుకుంది అనేది తెలుపుతుంది. కన్ను లేక చక్షువు ఉంది, దానికి ఆ చూడగలిగే శక్తి ఎట్లా వచ్చింది ? దాన్ని చక్షువు అనే ఎందుకు అంటాం ? ఇలా కర్ణః, జిహ్వా మొదలుకొని ఒక్కో భాగానికి ఇలా ఎందుకొచ్చింది ఆయా పేరు, రూపు అనేది చెబుతుంది.
 
 'చక్షుశ్చ ద్రష్టవ్యం చ నారాయణః శ్రోత్రంచ శ్రోతవ్యం చ నారాయణః'  
 
రూపం చూపే కన్ను, ఆ వెనకాతల ఉండే కారణం నారాయణుడు. కంటితో చూసినప్పుడు మనకు కనిపించే రూపాన్ని ఆ రూపంగా నిలబెట్టిన తత్వం నారాయణః.
ఇలా జీవుడి గురించి మొదలుపెట్టి
 
 'దిశశ్చ నారాయణః ప్రదిశశ్చ నారాయణః'
 
ఈ కనబడే వస్తువులకు మనం తూర్పు, పశ్చిమం అని ఇలా దిక్కులు పెట్టుకున్నాం. మనకు కనిపించిన వాటిలో సూర్యుడు ఎప్పటికీ ఉండువాడు కనక ఆ సూర్యుడు ఎక్కడ కనపడితే అది తూర్పు అని ఇలా దిక్కులు ఏర్పాటుచేసుకున్నాం. ఆ దిక్కులను బట్టి ప్రతి దిక్కులు ఆగ్నేయం, ఈశాన్యం అని ఇలా పెట్టుకున్నాం. మరి ఈ అనంతమైన విశ్వంలో సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక వేల మనం సౌరమండలాన్ని దాటి బయటికి వెళ్తే మనం దిక్కులు ఎట్లా చెప్పగలం ? దిక్కులనేవి ఒకేలా ఉండవు.
  
 
అందుకే మన పూర్వులు చాలా అందంగా చెబుతారు. ఇప్పుడు మనం చూసే తిరుమలని ఉత్తర తిరుమల అని అంటారు. మరి దక్షిణ తిరుమల అని కూడా ఒకటి ఉంది. ఆండాళ్ తల్లి తను వెయ్యి గంగాలాల్లో పాయసం పెడతానని మొక్కుబడి చేసింది, ఆయన పేరు సుందరభాహు స్వామి. ఆ ఉందరభాహు స్వామి ఉండే ప్రదేశాన్ని దక్షిణ తిరుమల అని అంటారు. ఉత్తర దక్షిణాలు ఎవరిని బట్టి నిర్ణయం చేసారు అంటే, ఈ సూర్యుడిని బట్టి చేయలేదు. భగవంతుడిని బట్టి నిర్ణయం చేసారు. ఈ భూమిపై మొదటగా కనిపించిన భగవంతుడు 'శ్రీరంగ నాథుడు', ఆయనను బట్టి చెప్పారు. మొదట శ్రీరామ చంద్రుడి ఇలవేల్పు అతడు. తరువాత ఉభయ కావేరీ మధ్యన చేరి ఉన్నాడు. సూర్యుడికి కూడా కాంతినిచ్చేవాడు ఆ భగవంతుడే కదా. భగవద్గీతలో భగవంతుడు ఇదే చెప్పాడు. ఉపనిషత్ కూడా ఈ విషయమే చెబుతుంది.
 
నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం
 
నేమా విద్యుతో భాతి కుతోయమగ్నిః
 
తమేవ భాంతమనుభాసితర్వం
 
తస్య భాస సర్వమిదం విభాసి
 
 
ఈ కాంతి నిచ్చే గోళాలు ఏవీ సహజంగా కాంతి నివ్వడంలేదు. వెనకాతల ఆయన లేకుంటే ఆ కనిపించే సూర్య గోళం కూడా మూలన పడి ఉండాల్సిందే. అందుకే మనకు శ్రీరంగనాథుడు ఎక్కడ ఉంటే సూర్యుడు ఉన్నట్టు లెక్క. దాన్ని బట్టి దిక్కులు. శ్రీరంగం మధ్యలో ఉంది ఇటు వెంకటేశుడు ఉన్నాడు, అటు సుందరబాహు స్వామి ఉన్నాడు. అందుకే వెంకటేశుడు ఉన్న ప్రాంతాన్ని ఉత్తర తిరుపతి అని, సుందరబాహు స్వామి ఉన్న ప్రదేశాన్ని దక్షిణ తిరుపతి అని అంటారు.
 
 
మనం ఆండాళ్ తల్లి గురించి చెప్పే శ్లోకంలో "నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం" అని చెబుతాం. నీలాదేవి హృదయ సౌందర్యంలో పడుకొన్ని ఉన్న కృష్ణుడిని లేపింది ఆండాళ్ తల్లి అని అర్థం. అంత చిన్ని హృదయంలో స్వామి ఎట్లా పడుకోగలడు, ఇది శృగారమయంగా చూపించినా వెనకాతల గంభీరమైన తాత్పర్యం ఉంది. ఈ భూమిని స్త్రీ మూర్తిగా భావిస్తే, ఆమెకు హృదయ స్థానం భగవానుడు ఉండే శ్రీరంగం అయితే, ఒక పక్కన తిరుమల మరో పక్కన తిరుమాలైజోలై ఉంది. ఈ రెంటికి మధ్యన ఉన్న శ్రీరంగనాథుడే శ్రీకృష్ణుడు అని భావించింది ఆండాళ్ తల్లి. కనుకనే ఆమే కృష్ణుడిని లేపింది అంటే ఆమే చేసిన వ్రతానికి కదిలి ఆమెను వివాహమాడింది శ్రీరంగనాథుడు. అంటే దిక్కులు మనం అట్లా ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
  
 
అట్లా మనం ఒక దాన్ని ఆధారం చేసుకొని దిక్కు అని చెప్పుకోవచ్చు, అది ఏదైనా సరే, ఆ దిక్కు ఎలా ఏర్పడుతుంది అంటే 'దిశశ్చ నారాయణః'. ఆదిక్కు ఆపేరుతో పిలవడానికి కారణం నారాయణ. 'ప్రదిశశ్చ నారాయణః' మనం ఏర్పరిచిన ప్రదిక్కులకు కారణం నారాయణ. ఈ సుభాల అనే ఉపనిషత్ ప్రతి వస్తువు ఆయా రూపంతో, పేరుతో ఉంది అంటే అది నారాయణుడి వల్ల అని చాలా విస్తరించి చెబుతుంది.
  
నారాయణ అష్టాక్షరి మంత్రంలో ప్రతిపాదించబడిన తత్వానికి సుభాల అనే ఉపనిషత్ ఇచ్చే ప్రమాణం ఇది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12