సాలభంజిక కధలు - విక్రమార్కుడు

సాలభంజిక కధలు


విక్రమార్కుడు 


పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడచి పోతూ ఉంటాడు తెలుసు కదా? ఐతే ఆ విక్రమార్కుడుకి ఒక సింహాసనం ఉంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి? 

భూలోకంలో ఉజ్జయనీ అనే మహానగరం ఉంది (దీనికి చాలా పేర్లు ఉన్నాయి అవన్ని మరోసారి). ఐతే ఈ పట్టణం మాళవ దేశంలో శిప్రానదీతీరంలో ఉంది. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం కూడా ఉంది. కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన చోటిదే. ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయనీ నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి, సవతితల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి భట్టి. 

కొన్నాళ్ళ తర్వాత రాజ్య భారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్య త్యాగంచేసి దేశాంతరం వెళ్ళి పోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధనకనకవస్తువాహనాలతో పేరుప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. 

అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. ఎలాగైనా తపోభంగం చేయాలని రంభా ఊర్వశులను ఆజ్ఞా పించాడు. ఐతే ఇద్దరిలో ఎవరు వెళ్ళాలన్న సందేహం కలిగింది. అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయించటం జరిగింది. ఇంతకీ ఆరోజు నాట్య ప్రదర్శనలో ఎవరిని సరిగ నిర్ణయించలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు "ఇంతటి మహామణులున్న సభలో నిర్ణయించే గొప్ప వారేలేరా?" అని ప్రశ్నించాడు. అందుకు మన నారదుడు లేచి "ఈ సభలో కాదు భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడు అతడు సకల కళాకోవిదుడు. ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించగలడు కావున అతగాడిని పిలిపించవలసిందని" కోరాడు. 

అందుకు ఇంద్రుడు సంతసించి వెంటనే మాతలి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుని సగౌరవముగా తీసుకుని రమ్మని ఆదేశించాడు. వెంటనే మాతలి రథాన్ని తీసుకుని ఉజ్జయనీనగరాన్ని చేరుకుని "రాజా నేను ఇంద్రుని రథసారథిని, నిన్ను సగౌరవముగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుని ఆజ్ఞ కావున తమరు బయలుదేరవలసింది" అని విన్నవించాడు. అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతసించి "కామధేనువు, కల్పతరువు, చింతామణి వంటి దివ్య వస్తువులకు పుట్టినిల్లైన అమరావతిని చేరుకున్నాడు. 

విక్రమార్కుని సవినయముగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణిమయరత్నఖచితమైన సింహాసనమ్మీద కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నల అనంతరం అసలు సమస్యను వివరించాడు. "ఓ నరనాథా! ఈ రంభా ఊర్వశులు ఒకరిని మించి మరొకరు గొప్పనాట్యగత్తెలు. వారి తారతమ్యం తెలుసుకోవటమం మాతరంకాలేదు. నీవు సకలవిద్యా పారంగతుడవు కావున వీరిద్దరిలో ఎవరు నాట్య ప్రావీణ్యులో నీవే నిర్ణయించగలవు" అని విన్నవించాడు. 

అంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించగోరి రాగతాళయుక్తముగా గంధర్వ గానంతో శరీరము మెరుపుతీగవలె శృంగారము వర్షించునట్లుగా నాట్యం చేసింది. మరునాడు ఊర్వశి తాను జయము పొందాలన్న పట్టుదలతో భావరాగతాళ లాస్యం ఉట్టిపడేలా మనోహరముగా నృత్యము చేసింది. ఇద్దరినీ పరిశీలించినమీదట "ఊర్వశి"నే నేర్పరిగా నిర్ణయించాడు 

"అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు?" అని ప్రశ్నించాడు ఇంద్రుడు. 

అందుకు "ఓ దివిజేశా! కంటికింపుగా నాట్యం చేయటంలో ఇద్దరు సిద్ధహస్తులే. కాకపోతే ఊర్వశినాట్యం అత్యంత మనోహరమే గాకుండా శాస్త్ర పరిధులని దాటకుండా ఉంది. అందువల్ల ఊర్వశినే నిర్ణయించటం జరింది" అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు అతని మేధాశక్తికి సంతసించి దివ్యాభరణాలతోపాటు నవరత్నఖచితమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ సింహాసనానికి అటు 16 ఇటు 16 మొత్తం 32 బంగారు అందమైన బొమ్మలున్నాయి. వాటిని సాలభంజికలు అంటారు. 

ఆ విధంగా మన విక్రమార్కుడికి సింహాసనం లభించింది. 


విక్రమార్కుడికి శివుడి వరం 


భర్తృహరికి విక్రమార్కుడు సవతి తమ్ముడని కదా చెప్పుకున్నాము, ఐతే ఒక రోజు ఆ భర్తృహరి విక్రమార్కుని పిలిచి "తమ్ముడూ! ఒకప్పుడు మన తండ్రి సూర్యుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు సూర్యుడు మన తండ్రికి కొడుకుగా పుడతానని వరమిచ్చాడు. ఆ వరపుత్రుడుగా పుట్టిన సూర్యుడవే నీవు. కావున సర్వలక్షణ సంపన్నుడవై బుద్ధి మంతుడైన భట్టిని మంత్రిగా చేసుకుని రాజ్య భారాన్ని వహించి ప్రజారంజకమైన పరిపాలన గావించు. నేను రాజ్యత్యాగం చేసి దేశంతరం వెళ్ళిపోతున్నాను. నాకు ఈ రాజ్యకాంక్ష ఈ భోగభాగ్యాలు విరక్తి కలిగాయి. కావున నీవు ఈ భోగభాగ్యాలను అనుభవిస్తూ సన్మార్గమున పాలన గావించు" అని రాజ్యభారం అప్పగించి దేశాంతరం వెళ్ళిపోయాడు. 

అప్పటినుండి విక్రమార్కుడు తన అన్న భర్తృహరి ద్వారా పొందిన రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. రాజుల్ని, సామంత రాజుల్ని గెలిచి వారిని పాదాక్రాంతుల్ని చేసుకుని వారితో సేవలు పొందుతూ ధనకనక వస్తు వాహనాలతో తుల తూగుతూ పుణ్యరాశిగా పేరు పొందాడు.

ఇలా ఉండగా కొంత కాలానికి విక్రమార్కుడు శివుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు మన విక్రమార్కుడు "మరణ మనేది లేకుండా ఉండే వరమీయమని" అడిగాడు.

అందుకు శివుడు "ఓ! రాజా! మానవ జన్మ ఎత్తాక చావు రాకుండా ఉండడం అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. కావున మరొక వరమేదైనా కోరుకో" అన్నాడు.

అందుకు విక్రమార్కుడు "సరిగ్గా ఒక్క సంవత్సరం దాటి ఒక్క రోజు మాత్రమే వయసు గల అమ్మాయికి పుట్టిన కొడుకువలన నాకు మరణం సంభవించేలా వరమీయమని" కోరాడు.

శివుడు దానికి "సరే తధాస్తు" అని వరమిచ్చి "నువ్వు ఇంకా వెయ్యేళ్ళు రాజ్య సుఖం అనుభవించగలవు" అని దీవించి మాయమయ్యాడు.

తన తపస్సు ఫలించినందుకు సంతోషంతో రాజ్యానికి తిరిగి వచ్చి తన మంత్రి ఐన భట్టికి ఈ సంగతంతా చెప్పాడు. అది విన్న భట్టి చాలా తెలివిగలవాడు కావడంతో మరొక ఉపాయం చెప్పాడు. అదెలా అంటే "రాజా నీకు భగవంతుడు వెయ్యేళ్ళు బ్రతకమని వరమిచ్చాడు కదా, పైగా నీకు కూడా చాలా కాలం బ్రతకాలన్న కోరిక ఉంది కదా, కనుక నేను చెప్పే ఉపాయం ఎలా అంటే ఒక సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే నీవు రాజ్య పాలన చేసి మిగిలిన ఆరు నెలలు బయట దేశాటనం చేస్తూ కాలం గడిపితే శివుడు నీకిచ్చిన ఆయుర్దాయం రెట్టింపౌతుంది. అందువలన రెండు వేల సంవత్సరాలు బ్రతుకుతావు. ఒక్క ఆరు నెలలు రాజ్యకాంక్ష వీడితే బయట ప్రజల మంచి చెడ్డలు తెలుస్తాయి. నీ జీవిత కాలం పెరుగుతుంది" అని సలహా ఇచ్చాడు.

అది మన విక్రమార్కుడికి బాగా నచ్చింది. వెంటనే అమలు పరచాలనుకున్నాడు. అలా ఉండగా ఒక నాడు ఒక యోగి వచ్చి తనతో స్మశానానికి రమ్మని కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ హోమాలు మంత్ర తంత్రాలు చేసి బేతాళుణ్ణి రప్పించి మన విక్రమార్కుని బలి ఇవ్వబోయాడు. అందుకు విక్రమార్కుడు తెలివిగా తప్పించుకుని ఆ యోగిని బేతాళుడికి బలిగా అర్పించాడు. అప్పుడు ఆ బేతాళుడు విక్రమార్కుని మెచ్చి "ఓ రాజా! నీకు అవసర మైనప్పుడు ఆపద సమయములోను నన్నెప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి నిన్ను కాపాడగలను. నీకు అస్టసిద్ధులూ లభ్యమగు గాక" అని దీవించి మాయమయ్యాడు. బేతాళుడి పరిచయం ఈ విధంగా జరిగిందన్న మాట.

అదే సమయాన బ్రహ్మాది దేవతలు "నీకు విద్యాధర చక్రవర్తుల ఆధిపత్యం లభించగలదని" దీవించారు. పిమ్మట రాజ్యానికి తిరిగి వచ్చి సప్త సంతతులు, సత్రములు, సంతత యాగములతో అనేక పుణ్యకార్యములతో నిత్యమూ దానధర్మాలతో తేలి యాడుతూ ధర్మరాజుని మించి ఉజ్జయనీ పురాన్ని పరిపాలించి విక్రమార్క శకకర్తగా పేరు పొందాడు.


విక్రమార్కుడి మరణం 


రాజులు రాజ్యాలు అంతరించినా, శకాలు మారినా, యుగాలు గడచినా, శక కర్తలుగా యుగ పురుషులుగా మనకి వింత వింత చరిత్రలు, మంచి మంచి పురాణ కధలూ తెలుసుకోవలసినవి కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే వాటిలో అణు మాత్రమైనా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. అలాంటిదే ఈ విక్రమార్కీయము.

ఇంతవరకు విక్రమార్కుడు శివుని వలన వరం పొందాడని చెప్పు కున్నాం కదా! ఐతే ఆ వరము ఎలా నిజమయ్యిందో , ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం ఎల్లప్పుడూ ఒక్కలా ఉండదు, దారి పొడవునా పూలూ ముళ్ళూ ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవటం ఎవరికి సాధ్యం కాదు. వేలకు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన విక్రమార్కుని రాజ్యంలో కూడా కాలచక్రంలో క్రమక్రమంగా అపశకునాలు కనబడసాగాయి. వాటిని చూసి రాజు చింతాక్రాంతుడై మంత్రిని పిలిచి కారణం ఏమిటని అడిగాడు.

అందుకు మంత్రి ఐన భట్టి "రాజా! మేడ మీద కాకులు గుడ్ల గూబలూ చేరి అరవటం, పట్టపుటేనుగు మరణించటం, గుర్రములు సైతము కన్నీరు గార్చటం ఇవన్నీ నాకెందుకో అపశకునాలుగా కనిపిస్తున్నాయి. ఏదో కీడును సూచిస్తున్నాయి. ఎందుకో భయంగా ఉంది" అన్నాడు.

అందుకు విక్రమార్కుడు నవ్వి "పూర్వము నాకు పరమ శివుడు ఇచ్చిన వరం గుర్తులేదా? ఒక్క సంవత్సరము మీద ఒక్క రోజు మాత్రమే వయస్సు గల కన్యకు కొడుకు పుట్టడం ఎలా సాధ్యమవుతుంది? అట్టి కొడుకు వల్ల నాకు మరణమెలా సంభవిస్తుంది? వింతగా లేదా? ఇదంతా కల్ల, ఇది జరిగే అవకాశమే లేదు. నీవేమీ విచారించకు" అని ధైర్యం చెప్పాడు.

అందుకు భట్టి "మహరాజా! మీరు పొరబడుతున్నారు. అది శివుడిచ్చిన వరం. అంత తేలిగ్గా కొట్టి పారెయ్యకండి. భగవంతుని సెలవైతే అసంభవములు సంభవములు కావచ్చు, సంభవములు అసంభవములు కావచ్చు. ఇది ఈశ్వరేచ్ఛ. ఒకప్పుడు ఉగ్ర నరసింహుడు ఉక్కు స్థంభములో ప్రత్యక్షమవలేదా? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు ముఖములు గల వారెవ్వరితోను చావు రాని తారకాసురుని షణ్ముఖుడు చంపలేదా? రావణాసురుడంతటి వాడు నర వానరుల చేతిలో మరణించలేదా? కావున రాజా, అట్టి బాలుడు పుట్ట వచ్చును అని నా నమ్మకం. అందువలన మన వేగుల వారిని నలు దిశలా పంపి ఎప్పడి కప్పుడు వార్తలను సేకరించుకుని రమ్మనటం శ్రేయస్కరం" అని సలహా ఇచ్చాడు.

అప్పుడు విక్రమార్కుడు తనకీ పని సక్రమంగా చేయగల సమర్ధుడెవరా? అని ఆలోచించగా చివరకు బేతాళుడు జ్ఞాపకం వచ్చాడు. తననీ ఆపదనుంచి కాపాడగల సమర్ధుడు బేతాళుడు ఒక్కడే అని గ్రహించి వెంటనే అతనిని మనస్సులో తలచుకున్నాడు. అంతే, తలచినదే తడవుగా బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు. రాజు కోరిక తెలుసుకుని వెంటనే మాయమై స్వర్గ మత్స పాతాళ లోకాలని గాలించటనికి వెళ్ళిపోయాడు.

అన్ని లోకాలు చుట్టి వచ్చి "మహరాజా! మీ ఆజ్ఞ ప్రకారం ముల్లోకాలు చుట్టి వచ్చాను. ఐతే నాకు మార్గ మధ్యాన ఒక వింత కనిపించింది. అదేమిటంటే ఓ కుమ్మరి వాని ఇంటిముందు ఒక చిన్న దాని పక్కన ఒక చిన్నపిల్ల వాడు కూర్చుని ఉన్నాడు. వాడు మట్టి తో చేసిన సైన్యముతో ఆడుకుంటున్నాడు. అక్కడే కూర్చుని ఉన్న విప్రునితో మాట గలిపి ఈ ' బాలుడెవడు? ' అని అడిగాను. అందుకు ఆ విప్రుడు ' వీడు నా మనుమడు. ఇదిగో ఈమె వాడి తల్లి. ఈమెకు సరిగ్గా ఒక సంవత్సరమ్మీద ఒక రోజు వయస్సు అని చెప్పి ఈమెకు నాగేంద్రుని కృపవలన వీడు జన్మించాడు. ఇలాంటి అపూర్వమైన సంఘటనలు ఆ భగవంతునికే తెలుసు' అని చెప్పాడు. కావున నీ రాజ భోగాలు నీవిగా ఉండాలంటే నీవు మృత్యువును జయించాలంటే ఆ బాలుని ఎలాగైనా చంపగల ప్రయత్నం చేయి" అని చెప్పి మాయ మయ్యాడు.

అదంతా విన్న విక్రమార్కుడికి గుండెల్లో రాయి పడింది. "ఇదంతా వింటుంటే నాకు చావు తప్పదు ఇందులో సందేహం ఏమీలేదు" అనుకుని ధైర్యం తెచ్చుకుని "ఇది తన ప్రాణానికి సంబంధించినది కావున ఇదేదో తనే స్వయంగా పరిష్కరించుకోవాలి" అని నిశ్చయించుకొని వెంటనే భట్టిని పిలిచి రాజ్య భారం అప్పగించి చతురంగ బలాన్ని వెంటనిడుకొని ప్రతిస్టానపురానికి ప్రయాణం సాగించాడు.

ఇంతలో అతని సైన్యం వెళ్ళి ఆ బాలుని యుద్ధానికి ప్రేరేపించారు. ఇంతకీ ఆ బాలుని పేరు "శాలివాహనుడు". అతనికి నాగేంద్రుని మంత్ర శక్తి వలన నాగులు, గుర్రములు, రథములు, భటులు అందరు యుద్ధానికి తరలివచ్చారు.

ఆదిశేషుని ఆశీర్వచనము వలన నాగులు వచ్చి విక్రమార్కుని సైన్యాన్ని చుట్టు ముట్టి చంపసాగాయి. శాలివాహనునికీ విక్రమార్కునికీ ముఖా ముఖీని భయంకర యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో విక్రమార్కుని సైన్యం వీరావేశంతో యుద్ధం చేసింది. కానీ దైవ సహాయం లేనందువలన ఓడిపోయి చెల్లాచెదరైపోయాయి. ఐనా సరే "ఆ సర్వేశ్వరుడే కాలఖర్మాన్ని తప్పించుకోలేనప్పుడు, మానవ మాత్రులం మనమనగా ఎంత?" అనే దృఢ నిశ్చయంతో ధైర్యాన్ని కూడగట్టుకుని మన విక్రమార్కుడు శాయశక్తులా ఫోరాడాడు. ఐనా చివరికి శాలివాహనుని చేతిలో ఓడిపోయి అతని అస్త్రానికి గురియై మరణించాడు.

అప్పుడు అతని శరీరంనుంచి అఖండ ప్రకాశవంతమైన తేజస్సు వెలువడి మహా జ్యోతిలా వెలుగొందుతూ పైకెగసి సూర్యునిలో లీనమైపోయింది. అంటే అసాధ్యమనుకొన్న విక్రమార్కుడి మరణం ఈ విధంగా జరిగిందన్న మాట. అటు పిమ్మట శాలివాహనుడు విజయుడై ప్రతిస్టాన పురానికి రాజయ్యాడు. అప్పడికి విక్రమార్కుడి భార్య గర్భవతిగా ఉంది. ఆమె ఈ వార్త విని, మంత్రులు పౌరులు ఎందరు ఎంత చెప్పినా వినకుండా పొట్ట కోసి పాపడిని తీసి మంత్రుల కప్పగించి తాను అగ్నిప్రవేశం చేసి అమరలోకాన్ని చేరింది.

ఒక వైపు భట్టి రాజ్య భారం వహిస్తూ, మరొక వైపు ఆ పసివాణ్ణి పెంచుతూ, ఇతడు తేజో బల సంపన్నుడూ తండ్రిని మించిన తనయుడూ కాగలడని ఎంచి యుక్త వయస్సు రాగానే ప్రశాంతుడనే పేరుతో రాజ్యాభిషేకం చేసి విక్రమార్కుడి రత్న ఖచితమైన సింహాసనం మీద కూర్చో బెట్టబోయారు. అంతలో అశరీరవాణి "ఓ మంత్రి వర్యులారా! ఇంతటి మహిమాన్వితమైన సింహాసనాన్ని అధిష్టించగల అర్హత ఈ బాలునికి లేదు, మరెవ్వరికీ కూడా లేదు. కనుక మీ ప్రయత్నం మాని ఈ సింహాసనాన్ని భూమిలో పాతి పెట్టించండి" అని పలికింది. అలా చేయక పోతే మరే ప్రమాదమొస్తుందో అని భయపడి ఆ సింహాసనాన్ని వెంటనే భూస్తాపితం చేసారు. ఆ పైన ఎత్తుగా గట్టులా కట్టించారు.

కొంత కాలానికి ఆ రాజు, ఆ రాజ్యం అంతరించి ఒక దిబ్బగా మిగిలి పోయింది. అది కాలక్రమేణ ఒక విప్రుని వశమైంది. ఆ విప్రుడే అక్కడ జొన్నలు, సజ్జలు, అగిశెలు, గోధుమలు, దోస పాదులు పండించు కుంటూ ఒక మంచె మీద కూర్చుని అందరినీ అభిమానంగా పలకరిస్తూ, మంచె దిగాక వారిని తిడుతూ వింతగా ప్రవర్తిస్తూ ఉండేవాడు.  ఇక ఆ సింహాసనం భోజ రాజును ఎలా చేరిందో చూద్దాం.


భోజ రాజు 

ధారాపురం అనే మహా నగరానికి  రాజు  భోజరాజు.  అతను గొప్ప పరాక్రమమం కలవాడు.  అంతటి సద్గుణవంతుడైన రాజు మరొకరు లేరు అని పేరుపొందాడు.  అతన్ని భూలోక దేవేంద్రుడు అనేవారు. భోజరాజు మంత్రి పేరు  నీతిమంతుడు.

క్రూర  మృగాల వల్ల  ప్రజలకు   కష్టనష్టాల గురించి విన్న భోజరాజు  తన మంత్రి నీతిమంతుని పిలిచి  క్రూర మృగాల వేటకు వెళ్ళటానికి  అంతా సిద్దం చేయమని చెప్పాడు. వేటకు కావలసిన అన్ని పరికరరాలతో తగిన సైన్యంతో  బయల్దేరారు  భోజరాజు  నీతిమంతుడు. అడవిలో డప్పులూ, తప్పెట్ట్లూ వాయించారు సేవకులు. పులులు,  సింహాలు, ఎలుగుభంట్లూ, పందులు లాంటి ఎన్నో జంతువులను సంహరించాడు రాజు.  చుట్టుపక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు. రాజు  తన పరివారంతో  రాజధానికి  తిరిగి వెళ్ళసాగాడు.  వాళ్ళు ఓ చోట  జొన్న చేను పక్కగా వెళుతున్నారు.  అక్కడ మంచెపై కూర్చుని  ఉన్న ఆచేను యజమాని ఐన  ఓ బ్రాహ్మణుడు  వీళ్ళను చూసి  “రాజా మీరు మీ సైన్యం ఎండనపడి వెళుతున్నారు  అలసిపోయి  ఉన్నారు,  జొన్నచేను కంకులు తినడానికి సిద్దంగా ఉన్నాయి   సందేహం లేకుండా  అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని   విశ్రాంతి తీసుకుని వెళ్ళండి.   మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం”   అంటూ ప్రార్థించాడు.

రాజు ఆ బ్రాహ్మడి  ఔదర్యానికి ఎంతో సంతోషించి    ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని   తన పరివారంతో చెప్పాడు.
రైతు కాసేపటి తరువాత ఏదో పనిపై  మంచెపైనుండి  దిగి వచ్చాడు. తన జొన్న చేనునంతా తినివేస్తున్న వారిని చూడగానే అతడికి దుఖం ముంచుకు వచ్చింది.  సరాసరి రాజు వద్దకు వెళ్ళి “రాజ ఇదేమిటి, ధర్మవంతుడివి అని నీకు పేరు,  నీ పరివారం అన్యాయంగా నా చేనునంతా నాశనం చేస్తున్నారు.  ఇది నీకెలా న్యాయంగా తోచింది?  నేను పేదవాడిని   కష్టపడి  జొన్న చేను పెంచుకున్నాను.  ఇదే నా ఆధారం.   కంచే చేను మేసినట్టుగా  ఇతరులకు  చెప్పవలసిన వారు మీరే ఇలా చేస్తే నాకు దిక్కేది?  ఇప్పుడు నేనూ నాకుటుంబం జీవించేదెలా?”   అంటూ విలపించసాగాడు.

అతడి మాటలు వింటూ  ‘అందరినీ పిలిచి తినమన్నది ఇతడే, ఇంతలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడేమిటి!  తన పరివారంపై తప్పు నెడుతూ ఇతనిలా ప్రవర్తించటమేమిటీ’  అనుకుంటూ తన వాళ్ళనందరినీ   కంకులు తినటం ఆపి బయటకు వచ్చేయమని చెప్పాడు. ఆ  రైతు  దుఖం చూడలేక  అతడి పంటకి తగిన ఖరీదు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు.
ఆ రైతు పిట్టలను తోలటానికై తిరిగి మంచె మీదకు చేరాడు.  వెళ్ళిపోతున్న  రాజు గారి పరివారాన్ని చూసి  “ఎందుకు వెళ్ళిపోతున్నారు?  విరగకాసిన కంకులను తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పానుకదా,  కడుపార తిని కావలసినన్ని పట్టుకుపొండి. రాజా  మీ పరివారానికి మీరు చెప్పండి. పరులకు ఉపకారం చేయని నా జన్మ వృదా”   అన్నాడు.

ఈ బ్రాహ్మణ రైతు వెర్రివాడేమోనన్న సందేహం రాజుకి కలిగింది.  చూపులకు ఆ రైతు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు.  సరే కానిమ్మని  తన పరివారాన్ని తిరిగి జొన్న చేనులోకి పంపించాడు.  రైతు సంతోషించాడు. తిరిగి కాసేపటితరువాత మంచె దిగివచ్చిన  రైతు  “ధర్మవంతుడైన  రాజు లక్షణం ఇదేనా? నా చేనును మీ పరివారం పూర్తిగా కొల్లగొడుతూ ఉంటే వారించవలసిన మీరే ఇలా వారిని ప్రోత్సాహించటమేమిటి? నా  పంట నాశనం చేస్తున్నారు   నేనేం నేరం చేసానని నాకీ శిక్ష.”   అంటూ భోరాజు ను నిలదీసి అడిగాడు.

భోజ రాజు ఆశ్చర్యంతో  తన మంత్రియైన  నీతిమంతునితో   “ఈ రైతు ప్రవర్తన  విపరీతముగా ఉన్నది. మంచెపై ఉన్నప్పుడు ఒకమాదిరిగా,  మంచె దిగిన తరువాత మరొక విధముగా  ప్రవర్తిస్తున్నాడు. మంచెపై ఉన్నప్పుడు ఉదారముగా ప్రవర్తించినవాడు   మంచె దిగగానే అంతా మరచి ఎంతో అమర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో  అతనిలో ఈ మార్పు ఎందుకు కలుగుతున్నది?”   అంటూ అడిగాడు. దానికి సమాధానంగా మంత్రి రాజా   “ఇతడి ఈ ప్రవర్తనకి కారణం  తప్పకుండా ఆ మంచెయే ననిపిస్తున్నది.  మంచె దిగగానే అతడిలోని ఉదారత్వము పోయి సామాన్య  రైతులా ప్రవర్తిస్తున్నాడు. ఆ మంచె ఉన్న స్థలాన్ని పరీక్షించి గానీ ఆ  మహిమ ఏమిటో చెప్పడం సాధ్యపడదు.”  అన్నాడు.

రాజు వెంటనే బ్రాహ్మణునితో    “ఈ భూమిని నాకు ఇవ్వు ప్రతిఫలంగా నీకు ఇలాంటి పొలాలు ఎన్నైన్నా కొనుక్కొనేంత ధనం ఇస్తాను”  అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ రైతుకి  రాజు మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి, “ రాజా మీ ఇష్టం నా చేను మీరు తీసుకుంటానంటే నాకు సంతోషమే, మీ దయ వలన ఆ ధనంతో  నేనూ నా కుటుంబం సుఖంగా ఉంటాము”    అని చెప్పాడు.

రాజు ధారాపురానికి చేరుకుని రైతుకి చాలా ధనం ఇచ్చి  సేవకులను పంపి ఆ మంచె ఉన్న చోటును తవ్వించాడు. అక్కడ వారికి ఒక అద్భుత మైన రత్నాలు పొదగబడిన  బంగారు సింహాసనం ఒకటి  కనిపించింది. దానికి ముఫైరెండు బంగారు మెట్లు ఉన్నాయి.  ఆ మెట్లకు  రత్నాలతో కూడిన బొమ్మలు ఉన్నాయి. ఆ సింహాసన్నాని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యానందాలు కలిగాయి. ఆ సింహాసనం పుర్తిగా బంగారంతో చేయబడి ధగధగా మెరిసిపోతోంది. సింహాసనం మొత్తం వజ్రాలు, పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మీద ఒక సాలభంజిక (ప్రతిమ) ఉన్నది. ఆ సింహాసనాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఇంత అద్భుతమైన సింహాసనాన్ని అధిష్టించిన రాజు  ఈ భూమినంతటినీ  ఏకచ్చత్రాధిపత్యంగా  ఏలిన వాడై ఉండాలి. అంతటి గొప్ప మహారాజు సింహాసనం భూమిలో ఉన్నచోట మంచె పై కూర్చున్న ఆ రైతుకి తెలియకుండానే ఎంతో ఉదారత్వముతో ప్రవర్తించేవాడు  అని  గ్రహించారు.

ఆ సింహాసనాన్ని తమతో జాగ్రత్తగా  నగరానికి  తీసుకుపోయి  తాను దాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు భోజరాజు. పండితులచే ఒక  శుభముహుర్తం  నిర్ణయించి  ఆ సింహాసనాన్ని అధిరోహించటానికై శుభలగ్నాన మంగళవాద్యాలతో  సింహాసనానికి పూజలు జరిపించి   మంచి ముహుర్తంలో  ఆ సింహాసనం మెట్టుపై కాలు పెట్టబోయాడు.  వెంటనే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరగింది.  మొదటిమెట్టు మీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల 32 ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపకా నవ్వాయి. ఆ మెట్టుపైనున్న  రత్నఖచితమైన బొమ్మ రాజుతో మాట్లాడసాగింది.  రాజు అత్యంత ఆశ్చర్యంతో బొమ్మ మాటలు వినసాగాడు. 


“రాజా సామాన్యులకు ఈ సింహాసనాన్ని అదిరోహించటం  అంత సులువైన విషయంకాదు.  శౌర్య ప్రతాపాలు, సకల గుణవంతుడు ఐన విక్రమార్క మహారాజు సింహాసనం ఇది. ఇది మాన నిర్మితంకాదు,  స్వయంగా దేవేంద్రుడే  విక్రమార్కుడికి ఇచ్చిన సింహాసనం ఇది. దీనిపై కూర్చోవాలనుకునే వారు  అతడితో సమానులై ఉండాలి. దీనిపై ఉన్న ముఫై రెండు బొమ్మలూ మాట్లాడతాయి దానికి కారణం  ముందు ముందు  నీకే తెలుస్తుంది.


సకల ప్రావీణ్యుడూ, దిక్‍దిగాంతాలవరకూ ఖ్యాతి గాంచినవాడు. సుగుణ వంతుడూ ఐన విక్రమార్కుడి లక్షణాలు నీకున్నవని అనుకుంటే ఈ సింహాసన్నాని అధిరోహించు, లేదా నీకు ప్రమాదం తప్పదని గుర్తుంచుకో.”   అంది.
భోజరాజు ఆ బొమ్మమాటలకు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు  “విక్రమార్కుడు ఎవరో అతడి చరిత్ర ఏమిటో నాకు తెలియదు. నేను అతడి వలె సుగుణవంతుడినో లేదో నువ్వే నిర్ణయించాలి. నాకు అతడి చరిత్ర చెప్పు”   అన్నాడు.

దానికి ఆ బొమ్మ బదులిస్తూ  “అతడి గుణగణాలు వర్ణించడం అంతసులభంకాదు, నా శక్తి మెరకు చెపుతాను”   అంటూ ఇలా చెప్పసాగింది…

          
         అందుకు మొదటి మెట్టులోని ప్రతిమ " మహారాజా! నా పేరు వినోదరంజిత ప్రతిమ. నేను ఈ మొదటిమెట్టుకు అధికారిని. తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హుడని కానా అని ప్రశ్నించారు. అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలెను. పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడి అలంకరించి తన మంత్రి అయిన భట్టి తో సుమారు 2000 సంవత్సరాలు రాజ్యం చేసాడు. అతని గుణగణాలు వర్ణించనలవి కాదు. అతను పరమ సాహసోపేతుడు. అసమాన ధైర్య పరాక్రమాలు కలవాడు. ఆ మహారాజు కాలము తరువాత దీనిని అధిరోహించే అర్హులు ఎవరు లేకపోటం చేతనే ఇది భూమిలోకి క్రుంగింది. విక్రమాదిత్యుని గుణాలలో వెయ్యోవంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హులు. అందుచేత దీనిని, దీనిని అధిరోహించిన విక్రమాదిత్యుని గురించి వివరించటం ఎంతో అవసరం" అన్నది.

       అందుకు భోజరాజు "ఓ వినోదరంజితా, నాకు ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు తెలియచేయండి" అని వేడుకున్నాడు.

         అలా ఒక్కొక్క ప్రతిమా చెప్పిన 32 కథలే ఈనాడు "భట్టి విక్రమార్క" కథలు గా "భేతాళ" కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి.

         ఇంకో విషయం ఏమిటి అంటే 32 సాలభంజికలకు 32 పేర్లు ఉన్నాయి. అవి ఏమిటి అంటే :

1. వినోదరంజిత 2. మదనాభిషేక 3. కోమలవల్లి 4. మంగళ కళ్యాణి 5. మంత్ర మనోరమ 
6. శృంగార మోహనవల్లి 7. జయ  8. విజయ 
9. మలయవతి  10. ప్రభావతి  
11. విద్వత్శిరోమణి 12. శాంతగుణవల్లి
13. సూర్యప్రకాశవల్లి 14. పూర్ణచంద్రవల్లి 
15. అమృతసంజీవివల్లి 16. కృపాపరిపూర్ణవల్లి
17. కరుణాకరవల్లి 18. పరిమళమోహనవల్లి 19. సద్గుణవల్లి 20. సుందరవినోదవల్లి
21. కనకరంజితవల్లి 22. పంకజవల్లి 
23. అపరాజితవల్లి 24. మనోరంజితవల్లి
25. స్వర్ణకాంతవల్లి 26. సకలకళావల్లి 
27. మాణిక్యవల్లి 28. మనునీతివల్లి
29. సంప్రదాయవల్లి 30. రుక్మిణీవల్లి 31. నీతివాక్యవల్లి 32. ఙ్ఞానప్రకాశవల్లి


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: