ఆడవాళ్ళ ముక్కుసంపెంగ - కళ్ళు తుమ్మెదల రెక్కలు
ఒక రోజు కృష్ణ దేవ రాయలు సభలో 'కవులందరూ అందమైన ఆడవాళ్ళ ముక్కును సంపెంగ తోనూ, కళ్ళను తుమ్మెదల రెక్కల తోనూ పోలుస్తారు కదా! ఎందు వలన?' అని అడిగాడట. అష్ట దిగ్గజాల్లో ఒకడైన రామరాజ భూషణుడు వెంటనే లేచి చమత్కారంగా యీపద్యం వినిపించాడు.
నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్లదటంచు గంధఫలి పల్కాకన్ తపంబొనర్చి యో
షా నాసాకృతి దాల్చె సర్వ సుమన సౌరభ్య సంవాసి యై
పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్
అర్థము:--అన్ని పూలమీద వ్రాలి మకరందాన్ని గ్రోలే తుమ్మెద యింత సువాసనతో వున్న నా మీద ఎందుకు వ్రాలి మకరందాన్ని గ్రోలదు? అని సంపెంగ అలిగి బ్రహ్మ దేవుణ్ణి గూర్చి ఘోరమైన తపస్సు చేసిందట. అప్పుడు బ్రహ్మ కవులు యికపై నిన్ను అందమైన ఆడవాళ్ళ ముక్కుతోనూ, కళ్ళను తుమ్మెదల రెక్కలతోను పోలుస్తారు. అప్పుడు నీకు రెండు వైపులా రెండు తుమ్మెదలు నీ పై వ్రాలినట్టు అవుతుంది, నీ కోరిక తీరుతుంది లే అని వరం యిచ్చాడట. అందుకని కవులు ముక్కును సంపెంగ తోనూ కళ్ళను తుమ్మెద రెక్కల తోనూ పోలుస్తున్నారు. మహారాజా! అని చెప్పాడట. కవులకు యీ సమయ స్ఫూర్తి వుంటుంది. అప్పటికప్పుడు యిలా ఏదో కథ అల్లి చెప్పడం వాళ్ళకే సాధ్య మవుతుంది.
Comments
Post a Comment