ఆహారము తీసికొనే ముందర భగవంతునికి నివేదిస్తాము.. ఎందుకు ?

ఆహారము తీసికొనే ముందర భగవంతునికి నివేదిస్తాము.. ఎందుకు ?

భారతీయులు ఆహారం భగవంతునికి నివేదన చేసిన తరువాత 'ప్రసాదం' గా స్వీకరిస్తారు. దేవాలయాలలో మరియు అనేకుల గృహాల్లోను ప్రతి రోజూ వండిన పరార్ధాలు ముందుగా భగవంతునికి నివేదించ బడతాయి. ఆ నివేదింప బడిన పదార్ధము మిగతా పదార్ధాలతో కలిపి ప్రసాదంగా వడ్డించబడుతుంది. మన నిత్య పూజా కార్యక్రమంలో కూడా మనము భగవంతునికి 'నైవేద్యము' సమర్పిస్తాము.

మనము నైవేద్యము ఎందుకు సమర్పిస్తాము..?

భగవంతుడు సర్వ శక్తివంతుడు మరియు సర్వజ్ఞుడు. భగవంతుడు పూర్ణుడయి ఉండగా మానవుడు అందులో అంశ మాత్రమె. మనము ఏ పనైనా భగవంతుడు ఇచ్చిన శక్తి, జ్ఞానము వలన మాత్రమే చేయగలుగుతున్నాము. కావున జీవితములో మనం చేసే కర్మల ఫలితంగా మనము పొందేదంతా నిజానికి ఆయనదే.. ఈ విషయము గ్రహించి ఆహారాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తాము. భగవంతునికి అర్పించిన తర్వాత అది ఆయన దివ్య స్పర్శ నొంది అనుగ్రహంతో మనకిచ్చిన కానుకగా మనచే స్వీకరించ బడుతుంది.

ఈ విషయం తెలిసికొన్న తరువాత ఆహారం పట్ల, ఆహారం తినే విదానం పట్ల మన వైఖరి పూర్తిగా మారుతుంది. సాధారణంగా నివేదింప బడిన ఆహారము పవిత్రం గాను, ఉత్తమమైనది గాను ఉంటుంది. మనము దానిని స్వీకరించే ముందర ఇతరులతో పంచుకొంటాము. మనము ఆహారాన్ని అధికార పూర్వకముగా అడగకూడదు. అసంతృప్తి పడకూడదు.. లేక మనకు లభించిన ఆహారపు నాణ్యత గురించి విమర్శించ కూడదు. మనము దానిని సంతోషముగా ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఈ విధముగా ప్రసాద భావన పెంపొందింప చేసుకొంటే కేవలము ఆహారము పట్లనే కాక మన జీవితములో లభించే అన్నింటిని కూడా ప్రసాదంగా సంతోషముగా స్వీకరించగలము.

ప్రతిరోజు భోజనాన్ని ముందర పవిత్రము చేసే చర్యగా కంచం చుట్టూ నీరు చల్లుతాము. కంచం ప్రక్కగా ఐదు ముద్దలను మనచేత చెల్లించబడే రుణాలకి ప్రతీకగా ఉంచుతాము.

1) దేవ ఋణం .. దేవతల దయార్ద్ర అనుగ్రహము మరియు రక్షణలకు..
2) పిత్రు ఋణం .. పితృ దేవతలకి వంశ పారంపర్యత్వాన్ని మరియు సంస్కృతిని ఇచ్చినందుకు..
3) భూత ఋణం .. ఎవరి ఆలంబన లేనిదే ఈ సంఘములో మనము జీవించలేమో ఆ సంఘాన్ని ఏర్పరిచిన వారు..
4) రుషి ఋణం .. మన మతమును మరియు సంస్కృతిని గుర్తింపచేసి, వృద్ధి పరచి, తద్వారా మనకందించినందుకు..
5) మనుష్య ఋణం .. ఇతర ప్రాణులు స్వలాభాపేక్ష లేకుండా మనల్ని సేవిస్తున్నందుకు..

ఆ తర్వాత పంచ ప్రాణాలుగా శరీరాన్ని నిలబెట్టే ప్రాణ శక్తిగా మనలో ఉన్న భగవంతుడికి...
 ప్రాణాయా స్వాహా; అపానాయ స్వాహా; వ్యానాయ స్వాహా; ఉదానాయ స్వాహా; సమానాయ స్వాహా అని చెపుతూ నివేదించ బడుతుంది. పంచ ప్రాణాలు ఈ క్రింది విధముగా శారీరక విధులు నిర్వహిస్తాయి.

1) ప్రాణము ... శ్వాస కొశమును చైతన్య వంతము గావిస్తుంది..
2) వ్యానము ... నాడీ వ్యవస్థను నియంత్రింప చేస్తుంది..
3) అపానము ... వ్యర్ధ పరార్ధాలను బయటకు త్రోస్తుంది..
4) సమానము ... జీర్ణ క్రియను చైతన్య వంతము చేసి శరీరానికంతటికి శక్తి సరఫరా చేస్తుంది..
5) ఉదానము... ఎక్కిళ్ళు మొదలగునవి కల్గించేది, ఆలోచనా శక్తి నిచ్చేది. పై విధంగా నివేదించబడిన తరువాత ఆహారం ప్రసాదంగా తీసికోబడుతుంది. ఈ భావన గుర్తు చేసి కోవడానికి భగవద్గీత లోని ఈ శ్లోకాలను చదువుతారు..

బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: 
బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవతేన గంతవ్యం 
బ్రహ్మ కర్మ సమాధినా..!

కర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించి బ్రహ్మమనే హవిస్సు బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మము చేత హోమం చేయబడేది బ్రహ్మమే. దాని ద్వారా అందుకోవలసిన గమ్యం కూడా బ్రహ్మమే.

అహం వైశ్వానరోభూత్వా 
ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః 
పచామ్యన్నం చతుర్విధం..!!

నేను వైశ్వానరుడినై ప్రాణుల దేహాలను ఆశ్రయించి ప్రాణాపానములతో కూడికొని చతుర్విధ అన్నాన్ని పచనము చేస్తున్నాను..

ఓం తత్సత్..
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: