కాకినాడ మా ఊరండి

కాకినాడ మా ఊరండి ఆ పేరు వినగానే మనసంతా ఏదో అయిపోతుంది. జగన్నాధపురం బ్రిడ్జి దాటగానే మన కాకినాడ పాత జ్ఞాపకాలు ఒక్కసారి సినిమా రీలులా గిర్రున తిరుగుతాయి.
అప్పట్లో అలా ఉండేది. ఎప్పుడో విదేశీయులు కాకినాడ వచ్చి కోకల వ్యాపారం మొదలుపెట్టారుట. వ్యాపారం అంటే చీరలు అమ్మడం కాదు. చీరలు ఎగుమతి. 
చుట్టూ విశాలమైన బంగాళాఖాతం ఉండగా చేపలు పట్టడం
 మానేసి కాకినాడలో ఈ కోకల వ్యాపారం ఎందుకు ఎంచుకున్నారో ఆ విదేశీయులు డచ్ వారు . అప్పటినుంచి కాకి నందివాడ కోకనాడగా మారిపోయింది. ఇప్పటికీ రైల్వే డిపార్ట్మెంటవారుకోకనాడపేరుమర్చిపోలేదు.అదిఅలాగేకంటిన్యూ అవుతోంది.ఆ విదేశీయుల నామకరణం వాడుకలో కాకినాడ గా మారిపోయింది.

కోకనాడ అతి పురాతన నగరం . తూర్పున బంగాళాఖాత సముద్రం ఓడరేవుగా మారి ఎగుమతలకి సహాయం చేస్తూ మధ్యలోనీ హోప్ ఐలాండ్ నగరాన్ని ముంపు నుండి కాపాడుతోంది.

అందాల నగరం లోపల అందమైన రోడ్లు మంచి మంచి పార్కులు మంచి మంచి కాలేజీలు మంచి స్కూల్స్ ఎన్ని ఉండేవో.
అప్పట్లో కాలేజ్ అంటే గుర్తుకొచ్చింది పి ఆర్ కాలేజ్ అండి . ఈ కాలేజీలో చదువుకుని ఎంతోమంది కలెక్టర్లు డాక్టర్లు నాయకులు ఇంజనీర్లు యాక్టర్లు అయిపోయారు.
కాకినాడ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మహా వ్యక్తి పిఠాపురం మహారాజువారు శ్రీ రాజారావు వెంకట మహిపతి గంగాధర రామారావు గారు. ఈ మహారాజా వారు 1884 లోనే ఒక స్కూలు స్థాపించి దాన్ని కాలేజీగా మార్చి ఎంతో మందికి విద్యను అందించారు. అదే పి ఆర్ గవర్నమెంట్ కాలేజ్. 
ఈనాటి కూడా అది అత్యున్నత ప్రతిష్టాకరమైన కళాశాల. ఈ నగరంలో రంగరాయ మెడికల్ కాలేజీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ లకు కూడా స్థల దాత పిఠాపురం మహారాజు వారే. అలాగే జగన్నాధపురం లోని మల్లాడి సత్య లింగం నాయకర్ గారి కళాశాల నాయకర్ గారి బిక్ష.

ఏ రాజుల ఏలుబడిలో ఈ నగరం ఉండేదో తెలియదు గాని
రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు మటుకు కాకినాడ మీద వేశారుట. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఈ నగరంలో జరగడం ఒక చారిత్రాత్మక విషయం. బ్రిటిష్ వారి కట్టడాలు కొన్ని ఈనాటి కూడా ఈ నగరంలో చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఉదాహరణకికలెక్టర్ కార్యాలయం.

అతి సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకు అందరూ హాయిగా బ్రతకగలిగే ఈ నగరాన్ని ఒకప్పుడు పెన్షనర్స్ పారడైజ్ అనే వారు.
ఊరి మొదట్లో ఒక బోధన ఆసుపత్రి , పిఠాపురం రాజు గారి కాలేజీ ,మెక్లారిన్ హై స్కూలు, ఒక ఇంజనీరింగ్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ,రామారావు పేట, గాంధీ నగరం లో అందమైన పెంకుటిళ్లు సుబ్బయ్య గారి హోటల్ ,కోటయ్య గారి కాజా విశాలమైన సముద్రం ,త్రిపుర సుందర గుడి, భానుగుడి ,నూకాలమ్మ గుడి ,రమణయ్యపేట కూరగాయ మార్కెట్, సర్పవరం పూల మార్కెట్ ,రోజు ఇత్తడి బిందెల తోటి పాలు అమ్మే వ్యాపారులు, ఇంటి ముందర పాలు పిండే వ్యాపారులు, పొట్టి పెసరట్టు ,గాంధీ పార్క్ఇన్ని ఆకర్షణలతో ఇలా సుందర నగరంలా ఉండేది. 

ఒకే వీధిలో సినిమా హాళ్లు, ఒక వీ ధిలో బట్టల షాపులు సమస్తం అందులోనే దొరికేవి. ఎటు చూసినా ఎనిమిది కిలోమీటర్లు వ్యాసార్థంతో నగరం ఉండి ట్రాఫిక్ సమస్యలు అన్నమాట లేక రిక్షాలోనే ప్రయాణం . కార్లు బస్సులు ఆర్టీసీ వారి బస్సులు ఉన్నా వాహన కాలుష్యం లేక ఎంత ఆనందంగా ఉండేది నగర జీవనం. సర్కార్ ఎక్స్ప్రెస్ గౌతమి ఎక్స్ప్రెస్ ఒకటో రెండో ప్యాసింజర్ రైళ్లు తప్ప ఇంకేమున్నాయి మనకి. సగటు మనిషి కూడా సరదాగా బతికేసే రోజులు అవి.
 చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశాలు మామిడి తోటలు పనస చెట్లు. గట్టిగా వర్షం వస్తే మునిగిపోయే ప్రదేశాలు. స్థలాలు కొనుక్కోమని బతిమాలుతుండేవారు. ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు.

అప్పట్లో కాకినాడ నగరమే గాని తెల్లవారితే పల్లెటూరు అంతా కాకినాడ లోనే ఉండేది. పొద్దున్నే ఎర్ర బస్సు ఎక్కి కాకినాడ వచ్చి
ఉదయం శాంతిభవన్లో టిఫిన్ చేసి మధ్యాహ్నం సుబ్బయ్య గారిని పలకరించి సాయంత్రం కూడా బజార్లో కుమార్ బిస్కెట్లు కొనుక్కుని పని చూసుకుని సాయంత్రానికి ఇంటి చేరేది.

. అలాగే రోజు వచ్చే పోయే జనంతో బిజీ బిజీగా ఉండేది. సాయంత్రం పూట చల్లటి గాలి. ప్రాణం హాయిగా ఉండేది. బజారు కెళ్ళి హాయిగా పని చూసుకుని ఇంటికి వస్తే ఎంతో ఆనందంగా ఉండేది. 

అటు పల్లెటూరు కాదు ఇటు పట్నం కాకుండా ఉండే కాకినాడ వాతావరణం పది కాలాలపాటు ఈ ఊర్లోనే ఉండాలి రా బాబు అనుకుని ట్రాన్స్ఫర్ వచ్చిన పిల్లల్ని ఎక్కడకి కదపకూడదు అంటూ పక్క ఊర్లకు రోజు విశాఖపట్నం వరకు ప్యాసింజర్ రైలు ఎక్కి ఉద్యోగం చేసి సాయంకాలం కాకినాడ చేరి హాయిగా ఊపిరి పీల్చుకునే స్నేహితులు ఎంతోమంది. 

ఎప్పుడైనా విశాఖపట్నం ఫాస్ట్ పాసింజర్ రైలు ఎక్కితే దారి పొడుగునా చేతిలో ఒక క్యారేజీతో కనబడే స్నేహితులు చాలా మంది. అంటే ఆ రోజుల్లో కాకినాడ నుండి మకా o మార్చడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు. సొంతిల్లు లేకపోయినా సామాన్యుడుకి అందుబాటులో ఉండేవి ఇంటి అద్దెలు. సినిమాల్లో చూపించినట్లు ఉండేవారు కాదు ఇంటి యజమానులు. 

ఎంతో ఆప్యాయంగా ఎంతో అభిమానంగా ప్రేమగా ఉండేవారు. అద్దె ఒక రోజు లేట్ అయినా ఏమి అనుకునేవారు కాదు. సహాయం అంటే ఎవరైనా ముందుకు వచ్చేవారు.
 ఇక పిల్లలు చదువులు కూడా కార్పొరేట్ కళాశాలలు స్కూళ్లు చాలా చాలా తక్కువ. ఒక మాదిరి కాన్వెంట్లో లేదా గవర్నమెంట్ స్కూలు ,కాలేజీల విద్య సామాన్యుడు కూడా చాలా అందుబాటులో ఉండేది.

పెద్ద బజార్లో కిరాణా షాపులు సామాన్యుడుకి అందుబాటులో ఉండే ధరలతో సరుకులు అమ్మేవి. రమణయ్యపేట కూరగాయల మార్కెట్ గాంధీనగర్ మార్కెట్ ఆదివారం పూట కిటకిటలాడుతు ఉండేది. తాజా కూరగాయలు రేట్లు తక్కువ.
ఉదయం 5 గంటల నుంచి ప్రక్కనుండే పల్లెటూరు నుంచి సైకిల్ మీద కూరగాయలు తట్టలో పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్మే కూరగాయలు వారు కోకొల్లలు. అరువు రేపు అనే బోర్డు ఉండేది కాదు వీరి దగ్గర. నెలాఖరులో కూడా డబ్బు తీసుకునే వాళ్ళు I. మరి సరుకు తాజా. ఎందుకంటే కాకినాడ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో అన్ని కూరగాయలు పండించేవారు. చిత్రాడ బీరకాయలు ఎవరు మర్చిపోతాం.

వర్షాకాలం వస్తే కూరగాయల విత్తనాలు వంగ నారు బాలాజీ చెరువు సెంటర్ లో దొరికేవి. 

తెల్లవారుగానే కాఫీ పడకపోతే ఎవరికి తోచదు. ఉదయం ఐదు గంటలకు వీధి గుమ్మo తలుపు తీస్తే ఎదురుగుండా సైకిల్ మీద ఇత్తడి బిందె లతో పాలు పెట్టుకుని ప్రతి ఇంటికి వచ్చి పాలు పోసేవాడు. కావాలనుకుంటే నాలుగు గేదెలతో వచ్చేవాడు.

 ఇంటి ముందే పాలు పితికి తన నిజాయితీని ప్రతిరోజు ప్రదర్శిస్తూ ఉండేవాడు పాలవాడు. ఆ వాతావరణం మన గ్రామీణ వాతావరణం తలపించి ఉండేది. ఉదయమే ప్రశాంతంగా ఉండేది.

నగరంలో ఆఫీసులకు చేరాలంటే బస్సు ఎక్కక్కర్లేదు ట్రైన్ లెక్కకర్లేదు రిక్షాలు, స్కూటర్లు నగరంలో తిరిగే సిటీ బస్సులు సామాన్యుడు కూడా చాలా అందుబాటులో ఉండేవి. ఇంటిదగ్గర భోజనం చేసి తాంబూలం వేసుకుని చక్కగా ఆఫీస్ సీట్లో కూర్చుని మధ్యాహ్నం లంచ్ బాక్స్ స్నేహితులతో పంచుకొని సాయంకాలం 6:00 కాగానే ఇంటికి చేరి స్నానం చేసి లుంగీ పంచ కట్టుకుని రేడియోలో వార్తలు పెట్టుకుని వాలు కుర్చీలో పడుకుని సేదదీరేవాడు సగటు ఉద్యోగి. ఉద్యోగి కూడా ఒత్తిడి ఫీలయ్యే వాడు కాదు

ఎవరికైనా అనుకోకుండా రోగం వస్తే జిల్లాలోనే అతి పెద్దదైన రంగరాయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సామాన్యుడికి చాలా అందుబాటులో ఉండేది. నిష్ణాతులైన వైద్యులు ఆ ప్రభుత్వాసుపత్రిలో ఉండేవారు. డాక్టర్ కి రోగికి ఉండే సంబంధం ఒక తల్లికి బిడ్డకు ఉండే సంబంధంలా ఉండేది. అందులో పని చేసే వైద్యులు అనుభవజ్ఞులే కాకుండా ధర్మబద్ధంగా ఉండేవారు.

పిల్లలు స్కూల్ కి రిక్షాలో వెళ్లేవారు. ఇంటింటికి రిక్షావాడు టైంకి వచ్చి పిల్లల్ని ఎక్కించుకుని జాగ్రత్తగా స్కూల్ దగ్గర దింపి మళ్లీ టైం కి స్కూల్ నుంచి తిరిగి తీసుకొచ్చేవాడు. రిక్షావాళ్లు చాలా నమ్మకంగా ఉండేవారు.

రోడ్డు మీద కూడా స్త్రీలు నిర్భయంగా తిరగడానికి ఏవి ఇబ్బంది ఉండేది కాదు. ఆకతాయిమూక ఎక్కడో తప్పితే కాకినాడలో లేరు. అటువంటి సంఘటనలు ఏమీ లేవు. ప్రజలందరూ ఆప్యాయత అభిమానాలతో కలిసిమెలిసి ఉండేవారు. మనకి పల్లెటూర్లో ఉండే వాతావరణం ఇక్కడ కనిపించేది.

వినాయక చవితి దసరా ఉత్సవాలు ప్రతివీధిలోను జరుగుతూ ఉండేవి. రాత్రిపూట సినిమాలు రోడ్డు మీద వేశారు. రికార్డింగ్ డాన్సులు కోలాటాలు హరికథలు బుర్రకథలు అబ్బో ఆ సందడే వేరు.

ఇక సూర్య కళామందిర్లోను సరస్వతి గాన సభలోను సంగీతం జరుగుతూ ఉండేవి. ఆనందభారతి లో మీటింగులు చెప్పక్కర్లేదు 

అలాంటి మా కాకినాడ అమాంతం ఆకాశం అంత ఎత్తుకు ఎగిరిపోయింది. ఉప్పు పండే భూముల్లో మహా సౌధాలు లేచాయి. ఒకప్పుడు చుట్టుపక్కల ఉండే ఊరిలో ఉండే భూములన్ని రేట్లు అమాంతం పెరిగిపోయాయి.అపార్ట్మెంట్ కల్చర్ పెరిగి పోయింది. పెంకుటిల్లు మచ్చుకి కూడా కనబడట్లేదు. షాపింగ్ కాంప్లెక్స్ లెక్కలేదు. ట్రాఫిక్ విపరీతంగా పెరిగి రాత్రి పగలు తేడా లేకుండా జనం తిరుగుతూనే ఉన్నారు.

 కాకినాడ నుంచి ఏ మూలకైనా బస్సులు. ట్రైన్లు కూడా గణనీయంగా పెరిగేయి. ఇక ప్రైవేట్ బస్సులు అయితే చెప్పక్కర్లేదు. సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హైదరాబాద్ కి లెక్క లేనన్ని ప్రైవేటు బస్సులు. 

ఎక్కడైనా ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుమీదకి దాటాలంటే చాలా ఆలోచించి అడుగేయాలి. లేకపోతే ఆసుపత్రిలో ఉండాలి.మామూలుగా ఉండే కిరాణా షాపులు మాట అలా ఉంచి కార్పొరేట్ స్థాయిలో సూపర్ మార్కెట్ విపరీతంగా పెరిగాయి. ఇ క్కడ ఉప్పు మొదలుకొని ఒక కుటుంబానికి కావాల్సిన కిరణా సామాగ్రి బట్టలు స్టీల్ సామాన్లు కూరగాయలు ఫర్నిచర్ కూడా దొరుకుతుంది. ఏ సూపర్ మార్కెట్ చూసిన ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటాయి. అవి కాకుండా పెద్ద బజారులో కిరాణా షాపులు యధావిధిగా నడుస్తున్నాయి . ఎంతమంది జనాలు . మెయిన్ రోడ్ లో షాపులన్నీ కిటకిట లాడుతూ ఉంటాయి.

మామూలుగా ఉండే బంగారం షాపులు అవి యధావిధిగా నడుస్తున్న కార్పొరేట్ సంస్థల చేత స్థాపించబడిన బంగారo షాపులను చూస్తే మతిపోతోంది. 

ఇక బట్టల షాపులు షాపింగ్ మాల్స్ లో బట్టలు సూపర్ బజార్లో బట్టలు అది కాకుండా ఏసి షోరూంలు, రెడీమేడ్ బట్టల షాపులు, సంత మార్కెట్ దగ్గర బట్టల షాపులు ఆదివారం మార్కెట్ మెయిన్ రోడ్ లో బట్టలు ఇవి ఎప్పుడూ ఖాళీ ఉండటం లేదు ఇదివరకు పండగ రోజుల్లో బట్టలు కొనుక్కునేవారు ఇప్పుడు అలా కాదు కార్డులు గీకేసి సరుకు తెచ్చుకుని ఇంట్లో పడేస్తున్నారు.

కాకినాడలో లేని బ్యాంకు లేదు . ఇక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలైతే చెప్పలేనన్ని ఉన్నాయి. మార్వాడీలు రోజువారీ ఫైనాన్స్ చేసే సంస్థలు బాగా పెరిగిపోయాయి. బ్యాంక్ అకౌంట్ అంటే ఇదివరకు అందరికీ ఉండేది కాదు. గవర్నమెంట్ స్కీముల పుణ్యమా అని ఏ ఒక్కరు ఎకౌంటు లేకుండా లేరు. ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు లేనివాడు ఎవడు లేడు. కార్డులు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఒక క్షణం షాప్ దగ్గర కూర్చుంటే జేబులో నుంచి డబ్బులు తీసేవాడు ఎవడు లేడు
అందరూ స్వైపింగ్ లే. ఎంత డెవలప్ అయిపోయింది నగరం. ఆటో నడుపుకునే అతి సామాన్యుడు కూడా క్రెడిట్ కార్డ్ కార్డు గురించి మాట్లాడేస్తున్నాడు. ఏ వేళైనా డబ్బులు తీసుకోవడానికి కాకినాడలో ప్రతి అడుగుకి ఏటీఎం లే.

ఒక మామూలుగా భోజనం హోటల్ సంగతి చెప్పక్కర్లేదు. సుబ్బయ్య గారు యధా విధిగా అయ్యర్ హోటల్ సరే సరి. చిన్న పెద్ద హోటల్స్ క్యాటరింగ్ చేసే వాళ్లు పొద్దున సాయంకాలం తోపుడుబండ్ల మీద టిఫిన్ సెంటర్లు. ఇలా ప్రతి చోట తినుబండారాలే. పెద్ద పెద్ద హోటల్స్ నిర్వహించే భోజనశాలలు చెప్పక్కర్లేదు.

ఫోన్ పే గూగుల్ పే ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టాయో గానీ ప్రతి టిఫిన్ సెంటర్లో ఫోన్ పేలు గూగుల్ పే లే. కాగితం రూపాయలు ఇవ్వక్కర్లేదు. కాగితం రూపాయలతోటి చిల్లర సమస్య. ఇలా పెరిగిపోయిందండి. స్విగ్గిలు జోమాటోలు
క్షణాల్లో కావాల్సిన చోట కావాల్సిన తినుబండారాలు తెచ్చిపడేస్తున్నాయి. చుట్టాలొస్తే కష్టపడి వంట అక్కర్లేదు. బుజ్జిగాడు సెల్ ఓపెన్ చేసి కొట్టేస్తున్నాడు. ఏం ఫాస్ట్ గా ఇస్తున్నాయండీ సర్వీసు. 

ఇలా బుజ్జిగాడు ఆర్డర్ ఇచ్చాడో లేదో అలా మెసేజ్లు మీద మెసేజ్లు ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. అడ్రస్ తెలియకపోతే ఫోన్లో లొకేషన్ షేర్ చేసేస్తాడు చంటిగాడు
అంతా మరీ ఈజీ అయిపోయింది అండి. మరి మాకు కాకినాడ ఇలా అయిపోయింది ఏమిటా అని మా తరం వాళ్ళు తెగ సంతోష పడిపోతున్నాము.

 ఎందుకంటే కష్టాలన్నీ మేమే పడ్డాము. అవునండి అదేదో చెప్పడం మర్చిపోయా ను. కొత్తగా బిగ్ బాస్కెట్ ఒకటి వచ్చింది. సరుకు ఇలా ఆర్డర్ ఇచ్చారో లేదో అలా కిరాణా సామాన్లు ఇంటి దగ్గర పడేస్తోంది. ఇంక మంచం దిగక్కర్లేదు. అపోలో ఫార్మసీ వాడితో పాటు మరికొన్ని కార్పొరేట్ సంస్థలు మందులు డోర్ డెలివరీ చేసేస్తున్నాయండి. ఆ బాధ కూడా మనకు లేదు. కిరణాసరకు ఇంటి దగ్గరికి వచ్చేస్తోంది. మందులు ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాయి. డాక్టర్ ఆన్లైన్లో కూడా సంప్రదించవచ్చు. ఆపరేషన్ కోసమే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. బట్టలు Flipkart వాడు తెచ్చిపడేస్తున్నాడు. ఇంకేముంది భాధ.

కాకినాడలో రైతు బజార్లు ఆదివారం వస్తే కిటకిటలాడుతూ 
ఉంటాయి. ఇక కూరగాయలు మామూలుగా మార్కెట్లో లోను
 సూపర్ బజార్లోను కిరాణా షాపుల్లోనూ కిళ్లీ షాపుల్లోనూ కూడా దొరుకుతున్నా యి.

ఇక స్కూళ్లు చెప్పక్కర్లేదు కార్పొరేట్ స్కూల్ లన్ని కాకినాడ వచ్చేసేయ్. కొత్త కొత్త పేర్లు అవి ఎప్పుడు పెట్టారో అవి ఎక్కడ ఉన్నాయి కూడా తెలియటం లేదు. పిల్లల్ని తీసుకెళ్లే రిక్షా టైర్లు 
పంచరైపోయాయి. ఆటోలు, కొత్త కొత్త బస్సు లు రోడ్లు ఎక్కడా ఖాళీ ఉండటం లేదు. కానీ పిల్లల సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు బెంగగా ఉంటుంది. ట్రాఫిక్ కదండీ. 

ఇంజనీరింగ్ కాలేజీలు చెప్ప అక్కర్లేదు. ఊరికి దూరంగా ఉండి ఇంజనీర్లు తయారు చేసేస్తున్నాయి. ఎవరికి ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాలు లేక బస్సు ఎక్కి తెలంగాణ రాజధానికి వెళ్లిపోతున్నారు. నిరుద్యోగులు ఎవరు కాకినాడలో కనబడలేదు. అంతా హైదరాబాద్. చదువు కాకినాడలో సంపాదన హైదరాబాదులో.

అప్పట్లో రాందాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు సర్కు మాత్రమే రవాణా చేసేవారు. ఈ మధ్య షాపింగ్ మాల్ కట్టేసి ప్రజలందరినీ అక్కడే కట్టి పడేస్తున్నారు అండి. షాపింగ్ మాల్ చూడవలసిందే మనం కాకినాడలో ఉన్నామా సింగపూర్ లో ఉన్నామా ఒకసారి బలే డౌట్ వచ్చేస్తుందండి. ఇంకా అపార్ట్మెంట్లు కూడా బలేగా కట్టేసారండి. అపార్ట్మెంట్ అంటే ఎవడు వచ్చేవారు కాదు. ఇప్పుడు కోటి రూపాయల అపార్ట్మెంట్ కొనడానికి లైన్ లో ఉంటున్నారు. మా చెడ్డ అపార్ట్మెంట్లు కట్టేశారు లెండి. అబ్బ మతిపోతోందండి. ఒక్కసారి దారి కూడా మర్చిపోతున్నాం. ఏ వీధిలో ఉన్న గుర్తు ఉండటం లేదు.

అప్పట్లో కోటయ్య గారు ఒకరే కాజా తయారు చేసేవారు. ఇప్పుడు కాజా షాపులు పూతరేకులు షాపులు తినుబండారాల షాపులు అబ్బా ఆ బొమ్మలు చూస్తుంటే నోరూరు పోతోందండి.
ఇక దేవాలయం వీధిలో పెసరట్టు మామూలే. గాంధీనగర్ దగ్గర భాషా భాయి మామూలే. సాయంకాలం జేబులో కార్డులు పెట్టుకుని మెయిన్ రోడ్ లో నడిచే వెళ్తుంటే రాత్రి ఇంటికి వచ్చి మంచి నీళ్లు తాగి పడుకోవచ్చు. అబ్బబ్బ స్వీట్లు హాట్లు మిర్చి బజ్జీలు పకోడీలు బోండాలు కొన్ని పేర్లు తిరగటం లేదండి.
అప్పట్లో మా నాన్నగారు మెయిన్ రోడ్ నుంచి మిర్చి బజ్జి. ఆ బజ్జీయే చూడలేదు మళ్ళీ. ఏం చెప్పను ఏం చెప్పను కొత్త కొత్త రుచులన్నీ తినిపించేస్తుంది కాకినాడ.

ఇవన్నీ తినేసి కడుపునొప్పి అనో కాలు నొప్పి అనో చక్కెర వ్యాధి అనో డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అంటే అన్ని రకాల స్పెషలిస్టులు కాకినాడలోనే ఉన్నారండి. ఎన్ని మెడకల్ షాపులు ఎన్ని రక్త పరీక్ష కేంద్రాలు అబ్బబ్బ రోగం వచ్చిందని భయం లేదు. అటు చూస్తే అపోలో ఇటు చూస్తే ట్రస్ట్ ఆసుపత్రి గుండె నొప్పికి మా పెద్ద ఆసుపత్రులండి కాకినాడలో. కంటి ఆసుపత్రి లెక్కలేదు. బస్సులతో జనాన్ని ఎక్కించుకుని ఆపరేషన్ చేసేస్తున్నా రు. బాగా డెవలప్ అయిపోయింది అండి కాకినాడ.

అప్పట్లో చొల్లంగి అమావాస్యకి సముద్ర స్నానం చేసేవాళ్ళం అండి. ఇప్పుడు చుట్టాలు వస్తే మా బీచ్ చూపించడానికి రోజు సముద్రం ఒడ్డునే ఉంటున్నాం అండి. మాకు ఉప్పాడ ఒకటి కాకినాడ ఒకటి కాదండి. ఈ చివరి నుంచి ఆ చివరికి ఏం జనం ఏం జనం. సెలవు వచ్చే జనాన్ని చూసి కాల క్షేపo చేసేయొచ్చు.
అదేదో సినిమా తీశారండి . అప్పటినుంచి ఉప్పాడ బీచ్ మరీ పెరిగిపోయింది.

హైదరాబాద్ నుండి కారు వేసుకుని చుట్టాలు ఉప్పాడ పట్టు చీరలు కొనుక్కోవడానికి వచ్చేస్తున్నారు. పక్కనున్న కాకినాడ వాళ్ళు ఉప్పాడ పట్టు చీర మెయిన్ రోడ్ లో కొనుక్కుంటుంటే హైదరాబాదులో తెలంగాణ వాళ్లు తెగ తెగ వచ్చేస్తున్నారండి బాబు. చేతిలో కారు ఉంది గుప్పెట్లో మొగుడు ఉన్నాడు పర్సులో కార్డు ఉంది. మనకి ఏంటి లోటు. నాలుగైదు పట్టు చీరలు మంచివి తీసుకుని భలే మంచి చౌక బేరం అనుకుని ఆనంద పడిపోయి చీరల షాప్ ని వాట్సాప్ లో పక్కింటి ఆవిడకి చూపించేసి ఆవిడను కూడా టెంప్ట్ చేసి కాకినాడ లాక్కొచ్చేస్తున్నారండి బాబు . కాకినాడ కాదు ఉన్నట్టుండి ఉప్పాడ కూడా సముద్రమంత ఎత్తుకు ఎదిగిపోయింది. సముద్రవేమో లోపలికి పోతోంది.

ఆఖరున ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. స్థలాలు చవగ్గా ఇచ్చారు కదా అని కొని పడేసి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతే కబ్జాదారులు ముంచేస్తున్నారండి. ఈ మధ్యన ఇవే ఎక్కువ అయిపోయాయి. కాకినాడ దీంట్లో కూడా ప్రథమ స్థానంలో ఉంది. 

కడుపులో చల్ల కదలకుండా ఉండేది కాకినాడలో కాపురం. 
ఇప్పుడు అంతా రోజు పరుగుల పందెంలో పాల్గొన డమే.
ఇలా ఉందండి కాకినాడ కథ కమామీషు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: