గ్రహాల కలయికలు....

జ్యోతిష్య శాస్త్రం ద్వారా వైద్యుడు అవ్వటానికి కావలసిన గ్రహాల కలయికలు....

వ్యక్తికి సమాజంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కెరీర్ అనేది ప్రత్యేకమైనది అని మనందరికీ తెలిసిన విషయమే.. కావున జ్యోతిష్య శాస్త్రం ద్వారా వ్యక్తి జాతకంలోని గ్రహాల కలయిక లు మరియు వాటి స్థితి ద్వారా వ్యక్తి ఏ రంగంలో మంచి స్థితిని పొందుతాడో మనం తెలుసుకోవచ్చు. అలాంటి రంగాలలో ఒక రంగమైన వైద్యరంగం గురించి ఈ రోజు మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైద్యరంగం అనేది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వృత్తులలో అగ్రశ్రేణికి చెందినది గా ఉంది. వైద్య రంగం అనేది వ్యక్తికి ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో మంచి గుర్తింపును మరియు గౌరవాన్ని కూడా ఇస్తుంది. కావున వ్యక్తి జాతకంలో వైద్యుడు కావటానికి కొన్ని గ్రహాల కలయికను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి సహకరించగలరు

జ్యోతిష్య శాస్త్రం ద్వారా వైద్యుడు కావటానికి పరిశీలించవలసిన గ్రహాలు...

వైద్యుడి యొక్క జాతకం లో ముఖ్యంగా రవి,చంద్ర, గురు గ్రహాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి అలాగే వైద్య వృత్తి కోసం శుక్రుడు మరియు సర్జన్ కోసం కుజ గ్రహాన్ని కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. గురు గ్రహం వ్యక్తికి పూర్తి జ్ఞానాన్ని ఇస్తుంది ఆ జ్ఞానం ఉపయోగించి వైద్యుడు ఇతరుల జబ్బులను నయం చేసే అవకాశం ఉంటుంది అలాగే బలహీనమైన చంద్రుడు లేక పాపగ్రహాల చేత ప్రభావితమైన చంద్రుడు వైద్యుడి యొక్క జాతకం లో ఉంటే ఇతరుల జబ్బులను నయం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది బలంగా ఉన్న చంద్రుడు ఇతరుల జబ్బులను నయం చేయడానికి అంతగా ప్రేరేపణ పొందలేడు ఇది ఒక విచిత్రమైన కలయిక అని మనం పరిశీలించాలి కొన్ని కొన్ని వృత్తులలో నీచబడిన గ్రహాలు పాప గ్రహాల చేత ప్రభావితమైన గ్రహాలు మేలు చేస్తాయి గమనించగలరు. రవి గ్రహాన్ని వ్యక్తి యొక్క ఆత్మ గా సూచించబడుతుంది రవి గ్రహం వలన కొన్ని వ్యాధులు నిర్మూలన అవుతూ ఉంటాయి. మహర్షి వరాహమిహిరుడు రవి గ్రహాన్ని వైద్యులకు సూచికంగా చెప్పబడి ఉన్నారు రవి గ్రహం వృశ్చికము లేక ధనస్సు రాశిలో ఉంటే ఆ వ్యక్తి వైద్యుడు అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పబడి ఉంది. శుక్రుడు సంజీవని విద్య జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు సంజీవనీ విద్య అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది చనిపోయిన వ్యక్తిని బ్రతికించ గలిగే విద్య.. కావున వైద్య వృత్తి కోసం శుక్రుడు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాడు అలాగే సర్జన్ విషయంలో భౌతిక శరీరం మరియు రక్తంతో వ్యవహరిస్తూ ఉండాలి కావున కుజుడు కూడా వైద్య వృత్తి కోసం తన పాత్రను పోషిస్తాడు కావున వైద్య వృత్తి కోసం ఈ గ్రహాలు మరియు వాటి కలయిక లు మనం పరిశీలించవలసి ఉంటుంది

వైద్యుడి యొక్క జాతకంలో పరిశీలించవలసిన భావాలు మరియు రాసులు...

వైద్యుడి యొక్క జాతకంలో లగ్నం మరియు పంచమ భావం మరియు పదవ భావాన్ని పరిశీలించాలి లగ్నం వ్యక్తిత్వాన్ని పంచమ భావం తెలివిని మరియు విద్యను సూచిస్తుంది ఒక వ్యక్తి వైద్యుడు కావాలంటే ఆ వ్యక్తికి మంచి విద్య మరియు తెలివితేటలు ఉండాలి పదవ స్థానం వృత్తిని గౌరవాన్ని స్థితిని తెలియజేస్తుంది కాబట్టి వ్యక్తి వైద్యుడు కావాలంటే బలమైన పదవ స్థానం కలిగి ఉండాలి కావున 5వ స్థానం మరియు పదవ స్థానం మరియు వాటి అధిపతులు కలయిక లేక వీక్షణ లేక పరివర్తన చెందటం ఇలా ఏదో రకంగా ప్రభావితమైన వ్యక్తి జాతకం వైద్యుడు కావటానికి బలమైన సూచనగా మనం పరిగణించవచ్చు

6 మరియు 12 స్థానాలు వైద్య వృత్తి కోసం అత్యంత ప్రధానమైన స్థానాలు అని మనం గమనించాలి.. 6వ స్థానం సర్వీస్ మరియు వ్యాధులను సూచిస్తుంది 12వ స్థానం హాస్పిటల్ ను సూచిస్తుంది ఈ రెండు స్థానాలు మరియు అధిపతులు కలయిక లేక వీక్షణ లేక పరివర్తనం ఏదో రకంగా ప్రభావితం అయి ఉండాలి

వైద్య వృత్తి కోసం వృశ్చిక రాశి అత్యంత ప్రధానమైనది వైద్యుడి యొక్క జాతకంలో రాశి చక్రం లేదా అంశ చక్రాలలో వృశ్చిక రాశి ముఖ్యపాత్రను పోషిస్తుంది

వైద్యుడి యొక్క జాతకంలో 2,9,11 స్థానాలు సహాయకారిగా పనిచేస్తాయి రవి చంద్ర కుజ గురు శుక్ర గ్రహాలు పైన చెప్పబడిన స్థానాలతో మరియు రాసులతో సంబంధాలు కలిగి ఉంటే ఆ వ్యక్తి వైద్యుడు కావటానికి కావలసిన గ్రహాల కలయిక లు ఉన్నాయి అని మనం గ్రహించాలి

జ్యోతిష్య శాస్త్రం ద్వారా సర్జన్ కావడానికి కావలసిన గ్రహాల కలయికలు...

సర్జన్ యొక్క జాతక చక్రం లో మనం రవి కుజుడు మరియు శని గ్రహాలను పరిశీలించవలసి ఉంటుంది సర్జన్ జాతకంలో కుజుడు ముఖ్య పాత్రను పోషిస్తాడు వృశ్చిక రాశి పదవ స్థానం అయ్యి ఉండి ఆ రాశిలో రవి మరియు కుజుడు కలిసి ఉంటే ఆ వ్యక్తి సర్జన్ గా మారడానికి బలమైన సూచనగా మనం పరిగణించవచ్చు. కర్కాటక రాశిలో కుజుడు తులా రాశిలో శని ఒకరిమీద మరొకరు దృష్టి కారణాలతో ఆ వ్యక్తి గొప్ప సర్జన్ గా మారడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ రెండు గ్రహాలు కేంద్రాలలో ఉండాలి నవాంశ చక్రం లో లగ్నం లేక చంద్రుడి నుండి పదవ స్థానం మేషం లేక వృశ్చికం అయినప్పుడు ఆ వ్యక్తి సర్జన్ అయ్యే అవకాశం ఉంటుంది

వైద్య వృత్తి కోసం కొన్ని గ్రహాల కలయికలు...

ఐదవ స్థానం మరియు పదవ స్థానం మరియు వాటి యొక్క అధిపతులు ఆరవ స్థానం లేక 12వ స్థానం లేక వాటి అధిపతుల తో అనుసంధానించబడి ఉండాలి

చంద్రుడు బలహీనం చెంది లగ్నం మరియు 5వ స్థానం మరియు పదవ స్థానం గురుగ్రహం చేత ప్రభావితం అయి ఉండాలి

రవి మరియు చంద్రుడు పాపగ్రహాల చేత కలయిక చెంది 6,8,12 భావాలతో లేదా వాటి అధిపతుల తో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి వైద్య వృత్తిని స్వీకరించే అవకాశాలు ఉంటాయి

రవి గ్రహం కుజుడు లేక రాహు లేక కేతు గ్రహాల తో కలయిక లేక కోన స్థితిలో ఉండి గురు గ్రహ వీక్షణ ఉంటే ఆ వ్యక్తి వైద్యుడు అయ్యే అవకాశాలు ఉంటాయి

రవి మరియు శని కలయిక లేక పరస్పర వీక్షణ కలిగి ఉంటే ఆ వ్యక్తి వైద్యుడు అయ్యే అవకాశాలు ఉంటాయి

వైద్య వృత్తికి పైన చెప్పబడిన కలయికలు నవాంశ మరియు దశాంశ చక్రాల్లో కూడా పరిశీలించవలసి ఉంటుంది

D10 చక్రంలో అమాత్య కారక గ్రహం కూడా పరిశీలించవలసి ఉంటుంది అమాత్య కారక గ్రహం వ్యక్తి యొక్క వృత్తి నిర్ణయించడంలో సహాయపడుతుంది రవి లేక చంద్రుడు అమాత్య కారక గ్రహం అయి ఉండి D10 చక్రంలో గురువు లేక శని లేక శుక్ర గ్రహాలు చేత ప్రభావితం అయితే లేక ఆ గ్రహాల యొక్క రాసులలో స్థితి పొంది ఉన్నట్లయితే ఆ వ్యక్తికి వైద్యుడు అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి

వృశ్చిక రాశిలో D1 మరియు D10 చక్రాలలో పదవ స్థానాధిపతితోపాటు ఎక్కువగా గ్రహాలు ఉంటే మరియు అమాత్య కారక గ్రహం వృశ్చిక రాశిలో ఉంటే ఆ వ్యక్తి వైద్యుడు అయ్యే అవకాశాలు ఉంటాయి

ఉదాహరణ జాతకం...

D1> లగ్నం> వృశ్చికం ;1వ స్థానం> రవి,చంద్ర బుధ,శుక్ర ; 2వ స్థానం> శని ; 3వ స్థానం> రాహు ; 7వ స్థానం> కుజుడు ; 9వ స్థానం> గురువు,కేతువు

D9> లగ్నం> వృశ్చికం ; 1వ స్థానం> శుక్రుడు, కేతువు ; 4వ స్థానం> బుధుడు, గురువు, శని ; 5వ స్థానం> చంద్రుడు ; 7వ స్థానం> రాహు ;
 9వ స్థానం> కుజుడు ; 11వ స్థానం> రవి ;

పైన చెప్పిన జాతకాన్ని ఒక సారి జాగ్రత్తగా పరిశీలించండి నేను పైన చెప్పిన వ్యాసం ప్రకారం వైద్య వృత్తి కోసం వృశ్చిక రాశి అత్యంత ప్రధానమైనది అని చెప్పి యున్నాను వృశ్చిక లగ్నం లో నాలుగు గ్రహాలు ఉన్నాయి రవి చంద్ర బుధ శుక్ర గ్రహాలు ఉన్నాయి 10వ స్థానాధిపతి అయిన రవి లగ్నంలో ఉన్నాడు 12వ స్థానాధిపతి అయిన శుక్రునితో కలసి ఉన్నాడు ఒకటవ స్థానాధిపతి మరియు ఆరవ స్థానాధిపతి అయిన కుజుడు వీక్షణ మరియు గురు గ్రహ పంచమ దృష్టి లగ్నం మీద మరియు రవి గ్రహం మీద ఉంది నేను ఇంతకుముందు చెప్పినట్టు చంద్రుడు బలహీనంగా ఉన్నాడు నీచబడి ఆరవ స్థానాధిపతి అయిన కుజ గ్రహ వీక్షణ చంద్రుని మీద ఉంది ఈ జాతకంలో అమాత్య కారక గ్రహం చంద్రుడు అయి ఉన్నాడు అమాత్య కారక గ్రహం అయిన చంద్రుడు D10 చక్రంలో రవి మరియు గురు గ్రహాలతో కలసి 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాశి చక్రంలో వైద్య వృత్తి కోసం గ్రహాలు సూచించబడ్డాయి అని గమనించాలి

మనం వైద్య వృత్తి కోసం జాతకాన్ని పరిశీలించేటప్పుడు తప్పనిసరిగా అశ్విని నక్షత్రాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది అశ్విని నక్షత్ర అధిపతి కేతువు అశ్విని నక్షత్ర దేవతలు అశ్విని కుమారులు వీరిని దైవ వైద్యులుగా మన పురాణాలలో చెప్పబడి ఉంది కాబట్టి పదవ స్థానాధిపతి అశ్విని నక్షత్రంలో ఉండటం లేక రవి లేక చంద్ర గ్రహాలు అశ్విని నక్షత్రం లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వైద్యుడు అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి అని మనం గమనించవచ్చు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: