అన్నానికి దోషం
అన్నానికి దోషం అంటడమంటే ఏమిటి? అదెలా పోగొట్టుకోవాలి?
ఎడమ చేతితో తినే తిండికి, నిలబడి తినే తిండికి రాక్షస శక్తులు వస్తాయి. ఒకరి ఎంగిలి ఒకరు పంచుకు తింటే అది కూడా దోషాన్నమే. అన్నానికి జాతి దోషం, ఆశ్రయ దోషం, నిమిత్త దోషం అని మూడు రకాల దోషాలుంటాయి.
జాతి దోషం అంటే సహజంగానే ఆ పదార్థానికి ఉన్న దోషము. అవి ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి లాంటివి. వీటిలో తామస గుణములు ఉంటాయి కనుక ఇవి వర్జనీయములు. సాత్త్విక సాధన చేసి భగవంతుడు కావాలి అనుకునే వారు వీటిని వదిలేయాలి.
ఆశ్రయ దోషం అంటే పాత్రను బట్టి దోషము. పాలు శ్రేష్టమైనవి. కాని అవి రాగి పాత్రలో పోసి భగవంతునికి నివేదిస్తే అవి కల్లుతో సమానం. అది పాత్ర దోషం.
నిమిత్త దోషం అంటే అవి పుట్టే చోటు బాగుండాలి. మారేడు దళాలు శివునికి ప్రీతి. కాని ఆ చెట్టు శ్మశానంలో ఉంటే అది దోషం. అంటే దుష్టమైన ప్రాంతంలో పెరిగినా దోషమే. కాకి, పిల్లి, కుక్క మొదలైనవి ముట్టుకున్న భోజనము కూడా దోషమే.
మనము బయట నుంచి తెచ్చిన వస్తువులు ఎలా పండిస్తున్నారో, ఎక్కడ నుంచి తెస్తున్నారో తెలీదు. అందుకని భగవంతునికి నివేదించి భోజనం చెయ్యాలి. మన దగ్గరకు రాక మునుపు అవి ఏమైనా మన దాకా వచ్చాక జాగ్రత్త అవసరం కనుక భగవంతునికి నివేదించడం వలన ఆ దోషాలు పోతాయి. అందుకే దోషము లేని అన్నము ఇవ్వమ్మని వేడుకోవాలి. ప్రతి రోజు నీకు నివేదన చేసి తినే భాగ్యం కల్పించు తల్లీ అని కోరుకోవాలి. బియ్యాన్ని రామ నామముతో ఏరుకుని ఆ బియ్యంతో వండుకొని తింటే ఇంక దానికి దోషము ఉండదు.
Comments
Post a Comment