శ్రీ ముత్తుస్వామి దీక్షితులు

నేడు శ్రీ ముత్తుస్వామి దీక్షితులు వారి పుట్టిన రోజు (ఆంగ్లం). 

సంగీతరంగంలో భారతదేశంలో ఉపాసకులు, యోగులు, ఆధ్యాత్మిక తత్త్వవేత్తలు ఉంటూ సువర్ణమయం చేశారు. కేవలం ఒక వినోదవిద్యగానో, లేదా ఒక కళారూపంగానో మాత్రమే కాకుండా ఒక యోగరూపంగా సంగీతం భారతీయ సనాతనధర్మంలో తీర్చిదిద్దబడినది. 

ఒక త్యాగరాజస్వామి వారిని తలంచుకున్నా అదేవిధంగా శ్యామశాస్త్రిగారు ఇలాంటి వారిని మనం స్మరించితే వారు కేవలం చక్కటి సంగీతకారులు మాత్రమే కాకుండా గొప్ప యోగులు, సంగీతాన్ని యోగంగా మార్చుకొని పరమాత్మని అనుభవానికి తెచ్చుకొని ముక్తిపొందిన వారు అని తెలుస్తోంది. త్యాగరాజస్వామి వారు, శామశాస్త్రిగారితో పాటు సమాకాలికులైనటువంటి శ్రీ ముత్తుస్వామి దీక్షితులు కూడా అటువంటి కోవకే చెందినటువంటి వారు. ఇందులో ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు – వీరిద్దరి ప్రత్యేకత ఏమిటంటే వీరు అమ్మవారి ఉపాసకులు. శ్రీవిద్యా ఉపాసకులు. త్యాగరాజ స్వామి వారు రామతారక మంత్ర సిద్ధులు. ఆ రహస్యాలన్నీ తన కీర్తనలలో తెలియజేశారాయన. తేటతెలుగులో అద్భుతంగా రచించారు. శ్యామశాస్త్రి గారు కూడా తెలుగులోనే కృతులు రచించారు. 

అయితే ముత్తుస్వామి దీక్షితుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆయన కృతులు సుమారుగా అన్నీ సంస్కృతంలోనే రచించారు. అవి కేవలం ఒకానొక పాటగా మాత్రమే కాకుండా అవి వివిధ దేవతారహస్యాలని, ఉపాసనా మర్మాలని గర్భీకరించుకొని ఒక్కొక్క కీర్తనా ఒక్కొక్క మంత్రంలాగా తీర్చిదిద్దబడ్డాయి. ఆ కీర్తనలో ఏ దేవతని కీర్తిస్తున్నారో ఆ దేవతయొక్క స్వభావము, ఆ దేవతకు సంబంధించిన ఇతర విషయములు, అన్నీ నిక్షిప్తం చేస్తూ ఒక్కొక్క కీర్తనా అధ్యయనం చేసి తెలుసుకోవలసిన విషయములు కలదిగా కనిపిస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ప్రతి కీర్తనకీ ఆయన వాడే రాగం. ఆ రాగానికీ, ఆ కీర్తనకీ, ఆ దేవతకీ ఒక అనుబంధం ఉండేటట్లు అద్భుతమైన కల్పన చేశారు. అలా నవగ్రహ కృతులు మొదలుకొని ఎన్నో అద్భుతాలు ఆయన రచించారు. అలాంటి అద్భుతమైనటువంటి గుచ్ఛకీర్తనలలో నవావరణ కీర్తనలు ఒకటి. 

ఈయన రచించినటువంటి నవావరణ కీర్తనలలో కమలాంబా నవావరణ కీర్తనలు, నీలోత్పలాంబా నవావరణ కీర్తనలు, అంటూ రెండు రకాలుగా ఉంటాయి. ఇటు అటూ కూడా నవావరణ కీర్తనల గురించి అదే నవావరణ కీర్తనలపై ఇద్దరు అమ్మవార్లపై రచన చేశారు. ఇవి కాకుండా మంగళాంబా నవావరణ కీర్తనలు, అభయాంబా నవావరణ కీర్తనలు కూడా రచించారు అంటారు. 

ఈ నవావరణ కీర్తనలలో ఎక్కువగా ప్రసిద్ధి చెందినవి ‘కమలాంబా నవావరణ కీర్తనలు. వీటికి ‘శ్రీపుర కమలాంబా నవావరణ కీర్తనలు’ అని కూడా పేరున్నది. ‘శ్రీపురం’ అనే మాటకి ద్రవిడభాషలో తిరువారూర్ అని అర్థం. తిరూవారూర్ అంటే దీక్షితుల వారు జన్మించినటువంటి క్షేత్రం. 
ముత్తుస్వామి దీక్షితుల రచనలు వివిధ విధములుగా వ్యాఖ్యానించవచ్చు. అందులో క్షేత్రసాహిత్యాలు చాలా ఉన్నాయి. వివిధ క్షేత్ర దేవతలను ఆయన కీర్తిస్తూ రచించిన కీర్తనలు చాలా ఉన్నాయి. అదేవిధంగా సంస్కృత వాఙ్మయ ప్రతిభ ఉదాహరణకి వాఙ్మయం, పద్ధతిలో రచించిన కీర్తనలు వీటన్నింటిలో మనకి గోచరిస్తుంది. అయితే ఈ గుచ్ఛకీర్తనలలో నవగ్రహ కీర్తనల వలెనే నవావరణ కీర్తనలు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఈ నవావరణ కీర్తనలు అమ్మవారిని ఆరాధించి హాయిగా పాడుకోవడానికి పనికొచ్చేవి. అయితే పటిష్టమైనటువంటి సంగీతరచన దీనిలో కనిపిస్తూ ఉంటుంది. ఎంచుకున్న రాగానికీ, చక్రమునకు ఏదో అనుబంధం ఉందేమో అనిపించేటంత అద్భుతంగా సమకూర్చారు వీటిని. పైగా సంగీతంలో ప్రౌఢ విజ్ఞానం కలిగిన వారు మాత్రమే గానం చేయగలిగిన పద్ధతిలో రచింపబడిన కీర్తనలు ఇవి. 

ఆ తల్లిని ఆరాధించి ఆ తాదాత్మ్యంతో రచించారు ఈయన. 
చిదంబరనాథ యోగి వద్ద శ్రీవిద్య దీక్ష తీసుకొని పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందిన మహానుభావుడు, సిద్ధపురుషుడు ముత్తుస్వామి దీక్షితులు. అంటే పూర్ణదీక్షలో సిద్ధిపొందినటువంటి మహాత్ములు. శ్రీచక్రం యొక్క సమస్తమైన అంశములు తెలిసినటువంటి వారు. కేవలం చక్రార్చన చేయడం మాత్రమే కాకుండా ఆవరణలు ఏమిటి? ఆవరణలలో దేవతలు ఏమిటి? కేవలం దేవతా నామములు ఆవరణలు ఒక సాంకేతికమైనటువంటి అంటే technical విజ్ఞానంతో మాత్రమే కాకుండా వాటిని తాత్త్వికంగా చూసి ఇటు పిండాండాన్ని, అటు బ్రహ్మాండాన్ని సమన్వయిస్తూ ఒక బ్రహ్మవిద్యగా శ్రీవిద్యను దర్శించిన మహానుభావుడు. అందుకే ఈ భావాలు ఆయన కీర్తనలలో మనకి కనబడుతూ ఉంటాయి. 

సంగీతపరంగా మాత్రమే కాకుండా సాహిత్యపరంగా కూడా గొప్ప ఔచిత్యం ఇందులో కనబడుతుంది. సంగీతానికి మాత్రమే కాకుండా సంస్కృత వాఙ్మయానికి, సనాతన ధర్మ సంస్కృతికీ వారిచ్చినటువంటి ఉపాయం సామాన్యమైనది కాదు.
పాడేవారు స్వరము, అక్షరము మాత్రమే కాకుండా అందులో ఉన్న భావాన్ని తెలుసుకున్నట్లయితే హృదయాన్ని అందులో ప్రవేశింపజేసి అద్భుతంగా పాడి ఆ సంగీతానికి న్యాయం చేకూర్చగలరు.

గురువు గారు Bramhasri Samavedam Shanmukha Sarma వారు

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: