ఫాల్గుణ మాస ప్రాశస్త్యం:

⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏

💥సర్వదేవతావ్రత సమాహారం!.. #శఫాల్గుణం

ఫాల్గుణ మాస ప్రాశస్త్యం:

పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలలలో చేసిన పూజలు, పండుగలూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్తరూపం ఈ మాసం.

ఫాల్గుణం ..విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం.
ఈ మాసాధిపతి గోవిందుడు కావున, ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం.

గోః – వేదాలు, గోవులు విందః – రక్షించేవాడు గోవిందుడు, అంటే ఈ సమస్త జీవకోటికీ పూజనీయమైన వేదాలను, గోవులను రక్షించేవాడు అంతేగాకుండా మనలని రక్షించి ఆత్మతత్త్వాన్ని తెలియచేసేవాడు.

ఈ మాసంలో అచ్యుత, అనంత, గోవింద అనే నామస్మరణ ఎంతో శుభఫలితాన్ని ఇస్తుంది.

వసంతఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతీ దినమూ ప్రత్యేకమే. ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు, పర్వదినాలూ, విశేషమైన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

💥ఫాల్గుణ శుద్ధ పాడ్యమి.. మొదలు ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకూ పయో వ్రతం ఆచరిస్తారు. భాగవతం అష్టమ స్కందం ప్రకారం, బలిచక్రవర్తి చేతిలో తన కుమారులు ఐన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవడం భరించలేని అదితి, కశ్యపుణ్ణి బలి గర్వం అణచే కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకొనగా, కశ్యపుడు ఈ పయో వ్రతాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఆమె దాన్ని పాటించి వామనుడిని కుమారుడిగా పొందింది.

ఈ వ్రతంలో ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకూ లక్ష్మీ నారాయణులని షోడశోపచారాలతో పూజించి, కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. ఆ పన్నెండు రోజుల అనంతరం హోమం చేసి, బ్రాహ్మణులను పూజించి సమారాధన చేస్తారు. ఈ రోజులలో గో, వస్త్ర, ధన దానాలు శక్తి కొలదీ చేస్తారు.

💥ఫాల్గుణ మాసం శుద్ధ విదియ.. నుండీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

💥ఫాల్గుణ శుద్ధ చవితి.. రోజు వినాయకుడిని పూజించే అవిఘ్నవ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు. ఆ రోజున ఉపవాసం ఉండి, సాయంకాలం స్వామిని షోడశోపచారాలతో పూజించి, ప్రసాదం స్వీకరిస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా వారికి ఉన్న ఆటంకాలు తొలగుతాయి మరియు పుత్ర సంతానం కాంక్షిస్తూ చేసేవారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి.

ప్రతీ ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకూ ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి రెండు రోజులూ స్వామివారికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే తరువాత మూడురోజులూ శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తారు.

💥ఫాల్గుణ శుద్ధ నవమి.. నాడు మధ్వులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం.

💥#అమలక_ఏకాదశి:- ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని "ఆమలక ఏకాదశి" అంటారు. ఆమలక లేదా ధాత్రీ ఫలం గా పిలుచుకునే ఉసిరిని విష్ణుస్వరూపంగా భావించి ఈనాడు ఉసిరివృక్షం క్రింద శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఋషివాక్యం. ఈరోజు ఏకాదశీ వ్రతం ఆచరించి, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభపలితాన్నిస్తుంది.

💥ఫాల్గుణ శుద్ధ ద్వాదశి..నే #గోవిందద్వాదశి, నృసింహ ద్వాదశి అంటారు. ఈ నాడు గంగాస్నానం పవిత్రం. కుదరని వారు సమీపం లోని ఏదైనా నది వద్దకు వెళ్లి, గంగను స్మరిస్తూ నదీస్నానం చేయాలి. నృసింహ కరావలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో కానీ స్వామిని ఆరాధించాలి.

💥ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ.. మహా పూర్ణిమ, #హోళికా_పూర్ణిమ, డోలా పూర్ణిమ, కామదహనోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర భారత దేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు.

💥ఫాల్గుణ బహుళ విదియ..నాడు లక్ష్మీదేవి పాలకడలి నుండి ఉద్భవించిందని చెప్పబడింది. ఆరోజు కనకధారా స్తవం చదువుకోవడం సత్ఫలితాలనిస్తుంది.

💥ఫాల్గుణ బహుళాష్టమి.. రోజునే సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు.

ఫాల్గుణ మాసంలోనే రామరావణ యుద్ధం జరిగింది. మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేకమంది వీరులు ఫాల్గుణ మాసంలోనే జన్మించారు.

💥ఫాల్గుణ బహుళ అమావాస్య.. రోజును కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు పితృ దేవతలకి తర్పణాలు ఇస్తారు.

ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరచుకున్న ఫాల్గుణ మాసంలో, భక్తితత్పరతలతో ఆ భగవానుని సేవించి ఆయన కృపకు పాత్రులమగుదము గాక !
💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: