వాగ్భూషణం
వాక్కు: వాగ్భూషణం.. భూషణం..
*****
★★★మాట తెచ్చే సమస్యల మూట★★★
అకారణంగా ఒక్కొక్కసారి మిత్రులు కూడా శతృవులవుతారు....
అంతకుముందు వరకూ మనల్ని గౌరవిస్తూ వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా దూరంగా వెళ్ళిపోతారు... సహోద్యోగులు, బంధువులు కూడా దూరదూరంగా తప్పించుకుని తిరగాలనుకుంటారు...! "
ఎందుకిలా జరుగుతోందీ అని ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు అనేక సందర్భాలలో సులభంగా అర్థమవుతుంది. మన వాగ్ధోరణే మన మానవ సంబంధాల్ని దెబ్బతీస్తోందని.
మాట్లాడడం అనేది జీవనకళలో ప్రధానమైనది. భావవ్యక్తీకరణ సాధనం వాక్కు - అన్నది నిజమే అయినా, సందర్భానుగుణంగా దానిని వినియోగించడంలోనే జీవితంలోని మానవ సంబంధాలు, కార్యసాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి.
"వాగ్ఘి సర్వస్య కారణమ్" అంటోంది శాస్త్రం,
ఒకేభావాన్ని రకరకాల మాటలతో చెప్పవచ్చు. కుండబద్దలు కొట్టినట్టో, బుజ్జగింపు ధోరణిలోనో, నచ్చజెప్పే విధంగానో, కఠినంగానో, కోమలంగానో ఒకే భావాన్ని పలురీతులలో వ్యక్తపరచవచ్చు.
వాక్కు మన సంస్కారాన్ని చాటి చెబుతుంది. వాల్మీకి తన రామాయణ కావ్యంలో ఆది నుండి వాక్సంస్కారంపై ఎన్నో మంచి విషయాలను పేర్కొన్నాడు.
"వాగ్విదాం వరః", "వాక్య కోవిదః", "మృదు భాషీ", "మధుర భాషీ", "పూర్వ భాషీ" "స్మిత భాషీ" అంటూ ఉత్తమ వాగ్లక్షణాలను చక్కగా తెలియజేశాడు.
మాటలో స్పష్టత, నిష్కపటత్వం ప్రధానం. ఒక్కొక్కసారి నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడ్డం మన స్వభావం - అని గొప్పగా చెప్పుకుంటుంటాం. కానీ అవతలివారు అదే నిక్కచ్చితనం మన పట్ల చూపిస్తే సహించగలమా?
బాధించే విధంగా సత్యాన్ని కూడా పలుకరాదు. ప్రయోజనం ప్రధానం. అలాగని అబద్ధం చెప్పనవసరం లేదు. నిజం చెబితే ప్రమాదమనే చోట తటస్థ వైఖరి క్షేమం.
మాట్లాడే నైపుణ్యం గురించి మన శాస్త్రాల ఆధారంగా గమనిస్తే ఈ క్రింది విషయాలు స్పష్టమౌతాయి.
★ మాట అవతలి వారికి ఉద్వేగం కలిగించకూడదు.
★ అవతలి వారి పేరును పలికి సంభాషిస్తే, వారికి ఆదరంగా వుంటుంది.
★ మనమే ముందు మాట కలపడం స్నేహానికి, కార్య సాఫల్యానికి ముఖ్యం.
★ ప్రియంగా, హితంగా, సత్యంగా మాట్లాడడం 'మధుర' వాక్కు అనిపించుకుంటుంది.
★ కసిరి కొట్టినట్టుగాను, వెకిలితనంతోను మాట్లాడడం శత్రువులను పెంచుతుంది.
★ అతి సంక్షిప్తమూ, అతివిస్తారమూ రెండూ పనికిరావు.
★ ఉచ్చారణ తేటగాఉండాలి.
★ చిరునవ్వుతో మాట్లాడడం, ఆప్యాయంగా పలకరించడం అవతలి వారిని వినేటట్లు చేస్తుంది.
★ వడివడిగా పలకడం, అతి నెమ్మదిగా నాన్చడం - రెండూ రాణించవు.
★ సద్గ్రంథపఠనం, మంత్రజపం, మౌనం... ఇవి మాటకి శక్తినిస్తాయి.
★ ఎప్పుడూ సకారాత్మకంగా (Positive) మాట్లాడటం శ్రేష్ఠం.
★ మన గురించి మనమే ప్రశంసించుకుంటూనో, అలాగని అతి వినయంతో హీనపరుచుకుంటూనో మాట్లాడటం నిరాదరణకు గురిచేస్తుంది.
★ ఒక విషయంపై మాట్లాడేటప్పుడు దానిపై అవగాహన కలిగి ప్రారంభించాలి.
★ తక్కువ సమయంలో విషయాన్ని స్పష్టంగా, సానుకూలంగా చెప్పగలిగే రీతిని అలవరచుకోవాలి.
★ ప్రతికూల పరిస్థితుల్లో భీతి, ఉద్వేగం, శత్రుత్వం లాంటివి మాటల్లో ప్రకటిస్తే అది ప్రమాదహేతువౌతుంది. మనం దుర్బలత్వాన్ని చూపిస్తే, అది ఎదుటివాడిలో తెగింపును పెంచుతుంది.
★ అవతలి వారిని పొగడడంలో కూడా కొన్ని మెలకువలున్నాయి. పొగడ్త మంచిదే. కానీ అందులో స్వాభావికత, సముచిత వైఖరి అవసరం. స్వార్థం, మితిమీరినతనం - రెండూ ప్రశంసలో లేకుండా జాగ్రత్తపడాలి.
★ ప్రశంసతో కూడిన మాటలు, ఎదుటివారిలోని మంచినో, గొప్పతనాన్నో గుర్తించామన్న భావాన్ని కలిగిస్తాయి. దానితో వారు మన పట్ల సానుకూలంగా స్పందిస్తారు.
★ శరీరంలో బాణాలు గుచ్చుకుంటే మెలకువతో వాటిని తొలగించి చికిత్స చేయవచ్చుగానీ, మనసులో గుచ్చుకొనే నిష్ఠూర వాక్కుల స్వభావాన్ని నివారించడం మాత్రం అసాధ్యం - అంటోంది మహాభారతం. గాయపడే విధంగా సంభాషించడం ఒక హింసాత్మక పాతకం.
★ మనసా, వాచా, కర్మణా -ఈ త్రికరణాలలో రెండవదైన 'వాక్కు' అనే ఉపకరణం ఎంతో ముఖ్యం. మనస్సుకీ, కర్మకీ వంతెన వంటిది మాట.
శ్రీరామ హనుమంతుల సంభాషణలో ఆంజనేయుని వాగ్వైఖరిని వాల్మీకి ఎంత అద్భుతంగా తెలియజేశాడో - సుప్రసిద్ధం.
★ మాటలు సంబోధనలకి ప్రాధాన్యం ఉంది. గాఢ పరిచయం ఉన్న వారితో సంబోధించే వైఖరి వేరు. ఎంతో ప్రగాఢ పరిచయస్థులైనా ఏకాంతంలో సంబోధనలకీ, పదిమంది మధ్యలో సంబోధనలకీ మార్పులుంటాయి.
ఒక ప్రసిద్ధ వ్యక్తిని మనం కలుసుకోవచ్చు. అతడు బాల్యంలో స్నేహితుడు కావచ్చు. అది కూడా 'ఒరేయ్', 'ఏమిరా' అనేటంత చనువు కలిగిన మిత్రత్వం కావచ్చు. కానీ సంఘంలో అతడో ఉన్నతస్థానంలో ఉన్నప్పుడు, నలుగురి నడుమ అటువంటి సంబోధనలు చేయడం స్నేహాన్ని పెంచదు సరికదా, ఆత్మీయతను తుంచుతుంది.
అదే విధంగా - కొందరితో ప్రేమతో చేసే సంబోధనలు, మాటతీరు బహిరంగంగా ప్రదర్శించడం చుట్టూ వున్న వారికీ , వారికీ కూడా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు.
ఎంత దగ్గరివారినైనా సవరించదలుచుకుంటే ఏకాంతంలో మృదువుగా చెప్పాలిగానీ, "నీ మేలుకోరి చెబుతున్నాను" అంటూ పదిమందిలో విమర్శించడం, మందలించడం తగదు.
తీవ్రమైన కోపం, అసహనం కలిగినప్పుడు హఠాత్తుగా అనుచిత కఠినభాషణ రావడం సహజం. కానీ అటువంటి ఉద్వేగాలు కలిగినప్పుడు నిగ్రహించుకొని మౌనాన్ని వహించడమో, ఆ సంఘటన నుండి దూరంగా వెళ్ళడమో మంచిది.
[సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర, ప్రవచన విరించి, శివతత్త్వసుధానిధి, ధార్మిక తపస్వి, ధార్మిక వరేణ్య పూజ్య గురువుగారు - ''బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు" రచించిన వ్యాసం.]
Comments
Post a Comment