శ్రీ క్రోధి నామ సంవత్సర ఆదాయ, వ్యయాల

🕉️🏹🔱🙏

శ్రీ క్రోధి నామ సంవత్సర ఆదాయ, వ్యయాల, రాజపూజ్యం అవమానాల నిర్ణయం

పంచాంగాలలో ఇచ్చే ఆదాయ, వ్యయాల వల్ల పంచాంగ సంవత్సర కాలానికి రోగం -ఆరోగ్యం, పుణ్యం-పాపం, లాభం-నష్టం, జయం-అపజయం, సుఖం-దఃఖం, వృద్ధి - హీనత్వాలు తెలుస్తాయని ఈ క్రింది శ్లోకం తెలియజేస్తుంది.

శ్లో:- రోగారౌగ్యౌ పుణ్యపాపో లాభాలాభౌ జయాపజయో Ι
సుఖదఃఖే వృద్ధిహీనా ఆదాయ సంగ్ఞికా Ι

పంచాంగ కర్తలు ఆదాయ వ్యయాలను ఈ క్రింది విధంగా నిర్ణయిస్తారు.

శ్లో:- రాశీ సంవత్సరే చైక్యం త్రిగుణం శరసంయుతం
పంచే దశ హరేద్భాగం శేషమాదాయ నిర్ణయః
తల్లబ్ద త్రిగుణేకృత్వా లాభ సంఖ్యాయుతం పదం
పంచాదశే హరేద్భాగం శేషంతు వ్యయమాదిశేత్

రవ్యాది వారాధిపతులకు మనపూర్వులు ధ్రువాంకాలను నిర్ణయించారు.

రవి-6, చంద్రుడు-15, కుజుడు-8, బుధుడు- 17, గురువు-19, శుక్రుడు-21, శని-10.

రాశికి అధిపతులు కూడా వీరే కాబట్టి రాశ్యాధిపతి ధ్రువాంకాలు కూడా ఇవే అవుతాయి. ఈ ధ్రువాంకాలు మారవు. స్ధిరంగా ఉంటాయి. ఈ ధ్రువాంకాలను బట్టి ఆదాయ వ్యయాలను గుణించవచ్చును.

సంవత్సర ఆదాయ వ్యయాలను గుణించే విధానం:-
సంవత్సరాధిపతి రాజు ఎవరైతే అవుతారో ఆ అధిపతికి చెందిన ధ్రువాంకాన్ని, రాశి అధిపతి ధ్రువాంకాన్ని కలపాలి. కలపగా వచ్చిన సంఖ్యను 3 చేత గుణించి వచ్చిన లబ్ధానికి 5 కలిపి 15 చేత భాగించగా వచ్చిన సంఖ్యా శేషం ఆదాయమవుతుంది. ఆ లబ్ధాన్ని మరలా 3 చే గుణించి 5 చేత కూడి, 15 చేత భాగించగా వచ్చే సంఖ్యా శేషం వ్యయమవుతుంది.

ఉదాహరణకు:- శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మంగళ వారం కాబట్టి సంవత్సరాధిపతి కుజుడు అవుతాడు. రాశి కన్యా రాశి అనుకుంటే కన్యా, మిధున రాశులకు అధిపతి బుధుడు కాబట్టి రాశి అధిపతి బుధుని ధ్రువాంకం -17, సంవత్సరాధిపతి కుజుడు కాబట్టి కుజుని ధ్రువాంకం -8.

కన్యా  రాశి వారికి ఆదాయం
సంవత్సరాధిపతి కుజుని ధ్రువాంకం -8 + రాశి అధిపతి బుధుని ధ్రువాంకం -17 కలుపగా వచ్చిన సంఖ్య 25. 25 ను 3 చే గుణించగా 75 వచ్చును. 75 కి 5 కలుపగా 80 వచ్చును. 80 ను 15 చే భాగించగా 5 లబ్ధం, 5 శేషం వచ్చును. శేషం 5 కాబట్టి ఆదాయం -5.

కన్యా  రాశి వారికి వ్యయం
80 ను 15 చే భాగించగా వచ్చిన లబ్ధం 5. ఈ సంఖ్యను 3 చేత గుణించగా 15 వచ్చును. 15 సంఖ్యకు 5 కలుపగా 20  వచ్చును. 20 సంఖ్యను 15 చేత భాగించగా 1 లబ్ధం, 5శేషం వచ్చును. శేషం 5  కావున వ్యయం-5 .

కాబట్టి కన్యా  రాశి వారికి ఆదాయం -5, వ్యయం – 5.

పంచాంగాలలో ఇచ్చే రాజపూజ్యం అవమానాల నిర్ణయం

సంవత్సరంలో ప్రతి రాశి వారికి రాజపూజ్యం అవమానాలు ఈ క్రింది విధంగా నిర్ణయించాలి.

శ్లో:- రాశి సంఖ్యా నృపశ్చైక్యం త్రినిఘ్నం బాణ సంయుతం
మునిభిర్భాజితం శేషం రాజా పూజ్యామిహేచ్యతే
తల్లబ్ధం పుర నిఘ్నంచ పంచ సంఖ్యాయుతం పదం
మునిభిర్భాజితం శేషం అవమానమితిస్మృతమ్ ΙΙ

రవ్యాది వారాధిపతులకు మనపూర్వులు ధ్రువాంకాలను నిర్ణయించారు.

రవి-6, చంద్రుడు-15, కుజుడు-8, బుధుడు- 17, గురువు-19, శుక్రుడు-21, శని-10.

ఈ ధ్రువాంకాలు మారవు. స్ధిరంగా ఉంటాయి. రాశి సంఖ్యను మేషాదిగా నిర్ణయించాలి.

సంవత్సర రాజపూజ్య, అవమానాలను గుణించే విధానం:-

రాశి సంఖ్యకు సంవత్సర రాజు యొక్క ధృవాంకాలను కలపాలి. వచ్చిన సంఖ్యను 3 చేత గుణించాలి. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపాలి. కలపగా వచ్చిన సంఖ్యను 7 చేత భాగించాలి. భాగించగా వచ్చిన శేషం రాజా పూజ్యమవుతుంది. భాగించగా వచ్చిన లబ్ధాన్ని 3 చేత గుణించాలి. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపాలి. కలపగా వచ్చిన సంఖ్యను 7 చేత భాగించగా వచ్చిన శేషం అవమానం అవుతుంది.

ఉదాహరణకు:- కన్యా రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర రాజపూజ్య అవమానాలను నిర్ణయిద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం శుక్ల పాడ్యమి మంగళవారం కావున కుజుడి యొక్క ధృవాంకాలను -8, రాశి సంఖ్య మేషాదిగా 6 వది.

రాజపూజ్యం గుణించు విధానం

సంవత్సరాధిపతి రాజు అయిన కుజ ధృవాంకం -8, రాశి ధృవాంకం -6 కలపగా వచ్చిన సంఖ్య 14. కలపగా వచ్చిన 14 ను 3 చేత గుణించగా 42 వచ్చును. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపగా 47 వచ్చును. కలపగా వచ్చిన సంఖ్యను 7 చేత భాగించగా లబ్ధం 6 వచ్చును. శేషం 5 వచ్చును. శేషం 5 కాబట్టి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి రాజపూజ్యం 5 అవుతుంది.

అవమానం గుణించు విధానం

రాజపూజ్యం గుణించినప్పుడు వచ్చిన లబ్ధం 6  ని 3 చేత గుణించగా వచ్చిన సంఖ్య 18. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపగా 23 వచ్చును. కలపగా వచ్చిన 23 సంఖ్యను 7 చేత భాగించాలి. భాగించగా వచ్చిన లబ్ధం 3. శేషం 2 అవుతుంది. కావున శ్రీ క్రోధి నామ సంవత్సర కన్యా రాశి వారికి అవమానం 2  అవుతుంది.

శ్రీ క్రోధి నామ సంవత్సర కన్యా రాశి వారికి రాజపూజ్యం 5 అవుతుంది. అవమానం 2 అవుతుంది.

💐🙏💐

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: