త్రిపుండ్ర విభూతి మహిమ

*త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ*

ఒకప్పుడు దూర్వాసుడు శరీరంనిండా విభూతి అలంకరించుకుని రుద్రాక్ష మాలికలు ధరించి పితృ లోకానికి వెళ్ళాడు. శివా ! శంకరా ! సర్వాత్మకా ! జగన్మాతా ! జగదంబికా ! అంటూ పార్వతీపరమేశ్వరుల నామధేయాలను బిగ్గరగా జపిస్తూ వెళ్ళాడు. కవ్యవాలాదులైన పితృదేవతలు గౌరవపురస్సరంగా ఎదురువచ్చి నమస్కరించి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు జరిపి సముచితాసనం మీద కూర్చోబెట్టారు. కుశల ప్రశ్నలతో కథలూ కబుర్లతో చాలాసేపు గడిపారు. అంత లోకీ సమీపంలో ఉన్న కుంభీపాక నరకకూపం నుంచి ఆర్తనాదాలూ హాహాకారాలూ హృదయవిదారకంగా వినిపించాయి. దూర్వాసుడికి మనస్సు కలత పడింది. ఎవరివి ఈ అరుపులు ? ఎక్కడినుంచి ? అని ఆత్రంగా ప్రశ్నించాడు

మునీశ్వరా! ఇక్కడికి చేరువ లోనే సంయమినీపురం (యమలోకం) ఉంది. అక్కడ పాపాత్ములను శిక్షించడానికి యముడున్నాడు. అతని ఆధీనంలో వేల మంది యమదూతలున్నారు. నల్లగా బలిష్ఠంగా భయంకరంగా ఉంటారు. ఆ యమలోకంలో ఎనభయ్యారు నరకకూపాలు ఉన్నాయి. వాటిలో కెల్లా కుంభీపాకమనే కూపం అత్యంత భయంకరం, మహా పాపుల్ని తెచ్చి అందులో పడద్రోసి యమదూతలు ఘోరంగా శిక్షిస్తారు. ఆ యాతన వర్ణనాతీతం. నూరేళ్ళు వర్ణించినా తరగదు. శివ ద్రోహులూ దేవీ నిందకులూ విష్ణు ద్రోహులు వేద నిందకులూ సూర్యగణేశాది దేవనిందకులూ కామాచారులూ మాతృ పితృ గురు జ్యేష్ఠ భ్రాతృ- పురాణ స్మృతి నిందకులూ ఇంకా ఇలాంటి పాపాలు చేసిన వారూ ధర్మం తప్పిన వారూ కుంభీపాక కుండంలో పడి యమదూతలు పెట్టే బాధలు భరించలేక కుయ్యో మొర్రో మని దిక్కులు పగిలే లాగా అరిచి రోదిస్తుంటారు. శ్రవణ దారుణమైన ఈ హాహాకారాలు మేము రోజూ వినేవే. వీటిని ఒక్కసారి వింటే చాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది అని పితృదేవతలు వివరించారు.

వింటూనే దూర్వాసుడు చటుక్కున లేచాడు. గబగబా నడుచుకుంటూ- అదేమిటో చూద్దామనిపించి -ఆ నరక కూపం దగ్గరికి వెళ్ళాడు. గట్టున నిలిచి తలవంచి కూపంలోకి చూశాడు. అంతే హహాకారాలు మాయమయ్యాయి. సహ్వాకారాలు మిన్ను ముట్టాయి. ఆ కూపంలో ఉన్నవారు కేరింతలు కొడుతున్నారు. ఆడుతున్నారు. పాడుతున్నారు. పట్టరాని సుఖమేదో అనుభవిస్తున్నట్టు పరస్పరం అనంద పరచుకుంటున్నారు. మృదంగ వీణా మురజ ఢక్కా దుందుభులు మోగిస్తూ చిందులు తొక్కుతున్నారు. స్వర్గాధిక సుఖమంటే ఇదే కాబోలు అనిపించింది. వసంతవల్లీ పుష్పగంధాలూ శుకశారికాపికాలాపాలూ విజృంభించాయి. మునీశ్వరుడు విన్నది వేరు, ఇప్పుడిక్కడ కన్నది వేరు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

యమదూతలకు ఇందంతా చాలా వింతగా విడ్డూరంగా కనిపించింది. జరగరానిదేదో జరిగిపోయిందని కలవర పడ్డారు. పరుగు పరుగున వెళ్ళి అధినాయకుడు యమధర్మరాజుకి విన్నవించారు. మహారాజా ! ఇదేదో విడ్డూరంగా ఉంది. కుంభీపాకంలో మహాపాపులు స్వర్ణ సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. కారణం ఏమిటో అంతుపట్టడం లేదు. ఆశ్చర్యం పట్టలేక నీకు విన్నవించుకుంటున్నాం అన్నారు.

యమధర్మరాజు ఉలిక్కిపడి లేచాడు. మహిషం అధిరోహించి చకచకా వచ్చాడు. బయలుదేరబోతూ ఈ వార్తను దేవేంద్రుడికి దూత ద్వారా పంపించాడు. ఇంద్రుడు దిక్పాలకులకూ బ్రహ్మదేవుడికీ, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి తెలియ పరిచారు. అందరూ వెంటవెంటనే బయలుదేరి తమ తమ దివ్య వాహనాల మీద క్షణాలలో అక్కడికి చేరుకున్నారు. కుంభీపాకం చుట్టూ చేరారు. అందులో జీవులు ఆనంద పరవశులై కేరింతలు కొట్టడం కళ్ళారా చూశారు. అహో! ఇది నరకకూపం కానేకాదు. పాపాత్ముల కోసం నిర్మించిన భోగ కూపంలా ఉందని విస్తుపోయారు. కారణం ఏమిటో ఎవరికీ స్ఫురించలేదు. ఇక సృష్టిలో పాపానికి భయపడే దెవడు ? అందరూ పాపాలే చేసి ఇక్కడికి వచ్చి పడతారు. అక్కడా సుఖ పడతారు. ఇక్కడా సుఖ పడతారు. వేద మర్యాదలూ ధర్మ మార్గాలూ ధ్వంసమై పోతాయి. ఏమిటి ఈ విపరీతం ? చాలా ఆశ్చర్యంగా ఉందే !- తన సంకల్పాన్ని తానే భగవంతుడు ఇలా వృధా పరచుకుంటున్నాడా తర్కించు కుంటున్నారు. కొందరు కారణమేమిటో తెలియక ఏమి మాట్లాడటానికీ తోచక తటస్థులై మౌనంగా నిలుచుండి పోయారు.

విష్ణుమూర్తి చతుర్ముఖ దేవేంద్ర యమధర్మరాజులతో చర్చించాడు. కారణం అంతు బట్టలేదు. క్షణంలో ఇంత మార్పు ఎలా జరిగిందో తెలియలేదు. సరే. శివుణ్ణి అడుగుదామని మరికొందరు దిక్పాలకులనూ దేవ ముఖ్యులనూ వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు.

కోటి మన్మథ సుందరాకారుడు. సదా షోడశ వర్షీయసుడు. లావణ్య నిధి. నానాలంకార భూషితుడు. పార్వతీదేవిని లాలిస్తూ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. హరి విరించి ప్రముఖులు నమస్కరించారు. కాలయాపన చెయ్యకుండా యమ లోకపు వింత విన్నవించారు. కారణం తెలియక కొట్టుకుంటున్నాం. నువ్వు సర్వజ్ఞుడివి. కనక హేతువేమిటో చెప్పు - అని విష్ణుమూర్తి అభ్యర్థించాడు.

శివుడి ముఖపద్మం వికసించింది. చతుర్భుజా ! ఇందులో వింత ఏముంది ? విడ్డూరం ఏముంది? అంతా విభూతి మహిమ. దానికి సాధ్యం కాని దేదీ లేదు. దూర్వాసుడు వచ్చాడు గదా! అతడు పరమ మాహేశ్వరుడు. కుంభీపాకం గట్టున నిలబడి కిందికి తలవంచి చూశాడు గదా ! మరింకేమి ! అతడి నుదుట నున్న విభూతి రేణువులు దైవికంగా ఆ కుండంలో పడ్డాయి. అంతే. విభూతి మహిమ. నరక కూపం స్వర్గ లోకంగా మారిపోయింది. ఇప్పటి నుంచీ అది పితృ లోకవాసులకు తీర్థమవుతుంది. అందులో స్నానం చేసి పితృదేవతలు సుఖ పడతారు. పితృ తీర్థంగా విఖ్యాతి వహిస్తుంది. అక్కడ ఆలయం కట్టి మా దంపతుల్ని ప్రతిష్ఠించండి. పిత్రీశ్వరీ పిత్రీశ్వరులుగా విడిదిచేస్తాం. పితృలోకనివాసుల పూజలు అందుకుంటాం. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోకీ ఇది ఉత్తమోత్తమమవుతుంది- అని శంకరుడు స్వయంగా ప్రకటించాడు.

విష్ణుమూర్తి అతడి అనుచరులూ సంతోషించి శివుడికి నమస్కరించి యమలోకానికి తిరిగివచ్చి అక్కడున్న మిగతా దేవతల కందరికీ ఈ విషయం చెప్పారు. అందరూ శిరసులూపి బాగు బాగని కొనియాడారు. విభూతి మహిమ ఇంతటిదా అని ఎంతగానో ప్రశంసించారు. తీర్థం లభించిందని పితృదేవతలు మరింతగా సంబరపడ్డారు. దాని చెంత శివపార్వతుల మూర్తులను ప్రతిష్ఠించారు. నిత్యమూ పూజలు చేయనారంభించారు. అప్పటిదాకా ఆ కుంభీపాక కూపంలో పడి ఉన్న ప్రాణికోటి అంతా దివ్య విమానాలు అధిరోహించి కైలాసం చేరుకున్నారు. భద్ర గణాలు అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తున్నారు.

యముడూ యమదూతలూ ఇక చేసేదిలేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభీపాక కుండం కొత్తగా నిర్మించు కున్నారు. ఇక నేటి నుంచీ శైవులెవ్వరూ దీని దరిదాపులకు రాకూడదని గట్టి నిషేధం విధించారు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: