మనిషిని మనిషిగా చేసేవి
మనిషి లోకంలోకి పుట్టుకతో ఒక్కడిగా వస్తాడు. పోయేటప్పుడూ ఒక్కడిగానే పోతాడు. ఈ నడుమ గడిపే జీవితమంతా పదిమందితో ముడివడి ఉంటుంది. అనేక విధాలైన బంధాలు, అనుబంధాలు, సంబంధాలు అతడి చుట్టూ అల్లుకుని ఉంటాయి.
సమాజంలోకి వచ్చాక మనిషికి ఎందరి అవసరమో, సహకారమో కావాల్సి ఉంటుంది. అమ్మ, నాన్న, తోబుట్టువులు, బంధువర్గం, స్నేహితులు, సేవకులు... ఇలా ఎంతోమందితో ఆత్మీయంగా మెలగవలసి ఉంటుంది. వెలుగు-నీడల్లా, మిట్టపల్లాల దారిలా, ఆటుపోట్ల సముద్రంలా కష్టసుఖాలను అనుభవించాల్సి వస్తుంది. ఐశ్వర్యంలో, సుఖంలో, ఆనందంలో మనిషి అన్నీ మరచిపోతాడు. బాధ్యతలను విస్మరిస్తాడు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మాత్రం అంతా గుర్తుకొస్తారు. ఎవరూ తన మొర వినడంలేదని బెంబేలెత్తిపోతాడు. అందరినీ నిందిస్తాడు. ఒంటరినైపోయానే అంటూ కుంగిపోతాడు. ఆలోచనా శూన్యుడైపోతాడు. వివేకం, విజ్ఞత ఈ దుస్థితికి కారణమేమిటో విశ్లేషించుకోడు. నిజానికి మనిషి నిరాశా నిస్పృహల్లో చిక్కుకుపోయాడంటే, అందుకు కారకులు ఇతరులెవ్వర కారు. అది స్వయంకృతాపరాధమే!
సాటివారిని ప్రేమించలేకపోవడం, ఆత్మీయత పంచకపోవడం, వాళ్లకు సహకరించకపోవడం, తరచూ పలకరించి, వాళ్ల యోగక్షేమాలు తెలుసుకోకపోవడం, వాళ్ల అవసరాల్లో ఆదుకోకపోవడం... ఇలాంటివి ఎన్నెన్నో కారణాలుంటాయి- ఒంటరితనానికి. ప్రేమైనా, గౌరవమైనా, వాత్సల్యమైనా ముందు నిస్సంకోచంగా ఒకళ్లకివ్వడం నేర్చుకోవాలి. చదువొక్కటే కాదు దాంతోపాటు సభ్యత, సంస్కారం, సదభ్యాసం, వాక్శుద్ధి, మంచి నడతా- ఇవే మనిషిని మనిషిగా చేస్తాయి. అటువంటి మనిషి ఏ సత్ఫలితం కోసమో నిరీక్షించవలసిన అవసరమే ఉండదు. విజయ ఫలాలు ఆయా సమయాల్లో ముందుకొచ్చి వాలతాయి.
Comments
Post a Comment