జీవన యానం
మనం ఎన్నో విధాలైన పుస్తకాలు చదువుతాం. ఎంతో నేర్చుకుంటాం. తెలిసిన జ్ఞానం పది మందికీ పంచుతాం. మనం మనిషిని సరిగ్గా చదవడం లేదు. మనిషిని చదవడం అంటే ఎదుటి మనిషి స్వభావాన్ని, మాట తీరును, ప్రవర్తనను, మంచి-చెడులను అర్థం చేసుకోవడం. మనిషి సంఘజీవి. అన్ని విషయాల్లోనూ సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి సాటివారి మీద ఆధారపడక తప్పదు. పంట ఒకడు పండిస్తున్నాడు. ఇల్లు వేరొకడు కడుతున్నాడు. గుడ్డ మరొకడు నేస్తున్నాడు. వేర్వేరు వస్తువులను వేర్వేరు వ్యక్తులు తయారు చేస్తున్నారు. మన దగ్గర డబ్బే ఉంది. ఆ డబ్బు ఖర్చుచేసి, అన్నీ కొని తెచ్చుకుంటున్నాం. అందుచేత చాలా మందితో మనకు అనుబంధం ఉంటుంది. సంబంధం ఉంటుంది. ఈ సంబంధాలను, అనుబంధాలను ఎంత వరకు కొనసాగించాలి? ఎంత వరకు పెంచుకోవాలి? ఎంతకాలం పటిష్ఠంగా ఉంచుకోవాలి? ఎవడు తన అవసరం కోసం మనల్ని పొగుడుతున్నాడు? ఎవడు చిత్తశుద్ధితో మనల్ని అభినందిస్తున్నాడు? ఇది గ్రహించడమే మనిషిని చదవడం అనిపించుకుంటుంది. మన జీవన యానానికి, భవిష్యసాధ నిర్మాణానికి ఇది చాలా అవసరం.
Comments
Post a Comment