సదాచారం అంటే
*🌹 జయ జయ శంకర హర హర శంకర
*సదాచారం అంటే*
*సదాచారమంటే మంచి ఆచారమని, మంచి వారు ఆచరించే ఆచారమని అర్ధం. ప్రాణికోటిలో మనుష్యజన్మ లభించటం గొప్ప అదృష్టమని మహనీయులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనుష్యుడు తప్ప ఇతర ప్రాణులన్నీ ప్రకృతి నడిపినట్లు నడవటమే తప్ప ఆలోచించి ప్రవర్తించే శక్తి వాటికి లేదు. ఆలోచించి తగిన రీతిగా ప్రవర్తించే అవకాశం మనుష్యునకే ఉంది. కాని లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతకాలో, ఎలా బ్రతకాలో తెలియనివారే అనేకు లున్నారు. మన మహర్షులు ఆ విషయంలో చక్కని మార్గదర్శనం చేశారు. ఎలా బ్రతకాలో ఎందుకలా బ్రతకాలో చక్కగా వివరించారు. ఆ విధానమే సదాచారం. సదాచారంద్వారా ఇహము, పరము రెండూ సాధించుకొనవచ్చు. శాండిల్యుడు పంచేంద్రియాలు, దేహము, బుద్ధి, మనస్సు, ద్రవ్య, దేశక్రియల శుద్ధే ఆచారమని చెప్పాడు. ఏ దేశమందు ఏది ఆచారమో అదే అక్కడ క్రమపద్ధతి. అన్యదేశంలో అది ఆచారం కాకుంటే దానిని పరిగణించ నక్కరలేదు.*
*ఆచరించేది ఆచారం. అంటే మనం చేసే పనులన్నీ ఆచరణక్రిందికే వస్తాయి. అటువంటి ఆచారం అంతా మంచియే అని చెప్పటానికి వీలులేదు. కాబట్టే ఆచారం అనాచారమని, దురాచారమని, మిథ్యాచారమని, కదాచారమని, అత్యాచారమని, సదాచారమని అనేక రూపాలలో ఉంది. ఆచరించవలసినది ఆచారమయితే దానికి వ్యతిరేకంగా ఆచరించేది అనాచారం. మిక్కిలి కూడనిపనుల నాచరించటం దురాచారం. శాస్త్ర తిరస్కారం, అసత్యవచనం ప్రాణిహింస, పెద్దలయెడ అనాదరణ, యథేష్టాచరణ, అపాత్రదానం, దాంభికం, గర్వం, ఆహారవిహారాలలో నియమం లేకుండా ఉండటంలో రాహిత్యం, శౌచవిధి పాటించకపోవటం, సూర్యోదయ, సూర్యాస్తమయాల నిద్రించటం, రెండు చేతులతో గోక్కొనటం వంటి వన్నీ దురాచారాలుగ చెప్పబడ్డాయి. మంచివిధానంతో ఆచరించటం సదాచారం. ''అత్యాచారస్తు మూర్ఖతా'', అని మూర్ఖంగా ఆచరించేది అత్యాచారం. సత్పురుషులాచరించేది సదాచారమయితే కుత్సిత పురుషులాచరించేది కదాచారం. విచక్షణ లేనిది, అతిగా చేసేది మూఢాచారం.*
*ఉదాహరణకు పండుగనాడు పిండివంటలతో భోజనం చేయటం ఆచారం. భగవంతుని పూజ చేసి నివేదన పెట్టి ప్రసాదంగా తీసికొనటం సదాచారం. మంచం మీద కూర్చొని, చెప్పులతో, నడుస్తూ అన్నం తినటం అనాచారం. పండుగ పేరుతో తాగి తందనాలు తొక్కటం దురాచారం. దురాచారుడయిన పురుషుడు లోకంలో మిక్కిలి నిందింప బడతాడు. దుఃఖభాగి అయి ఎల్లప్పుడు వ్యాధిగ్రస్తుడవుతూ అల్పాయుష్కుడయిపోతాడు. అదే సదాచారపరు డయితే సమాజంచేత గౌరవింపబడుతూ ఆరోగ్య వంతుడుగా సుఖశాంతులతో పూర్ణాయుర్దాయంతో వర్ధిల్లుతాడు. కాబట్టి సమాజమంతా సదాచారంతో ఉంటే లోకమంతా సుఖశాంతులతో వర్థిల్లుతుంది.*
*అందుకే లోకశ్రేయస్సును ఆకాంక్షించే మన మహర్షులు నిద్రలేచినది మొదలు మరల నిద్రించేవరకూ మనుష్యుడు ఆచరింపవలసిన విధానాన్ని సదాచారంగా అందించారు. వారు చెప్పిన లక్ష్యమును అర్థంచేసికొనక మూర్ఖంగా ఆచరిస్తూ దాన్నే మూఢాచారంగా విమర్శించే స్థాయికి తెస్తున్నారు. మితం తప్పినవన్నీ అనర్థాలే. అతిదానం చేత బలిచక్రవర్తి, అతికామంచేత రావణుడు, అతిలోభంచేత దుర్యోధనుడు, అతికోపంచేత విశ్వామిత్రుడు నాశనమయ్యారు. కావున ''అతి సర్వత్ర వర్జయేత్'' అన్నారు.*
*సదాచారం ద్వారా పెద్దలు అందించిన వైజ్ఞానిక విలువలను అర్థంచేసికొంటే మహర్షులందించిన మంచి ఆచరణ విధానం మూఢాచారం కాక మనకు సకలశ్రేయస్సులు చేకూరుస్తుంది. మనస్సులో చెడుని ఆలోచిస్తూ పైకి మంచి ఆచరిస్తున్నట్లుండేది మిథ్యాచారం. సదాచారాన్ని సద్వినియోగం చేసికొంటూ అందరూ ఆయురారోగ్య సుఖశాంతులను పొందవచ్చు.*
*సజ్జనుల నడవడికే సదాచారానికి లక్షణంగా చెప్పబడింది. బాగా స్థిరపడిన సదాచారాలే ఋషిసత్తముల ఆమోదంతో ధర్మాలుగా పరిణమిస్తాయి. అందుకే భారతంలో ''ఆచారప్రభవో ధర్మః'' అని ధర్మము ఆచారము నుండే పుడుతుందని చెప్పబడింది. దేశకాల పాత్రలను బట్టి ఆచారభేదా లుండవచ్చు. మద్యం సేవించటం మనదేశంలో దురాచారం కాని కొన్ని దేశాలలో అది ఆచారం. ఒకప్పుడు మనదేశంలో ఆచారమయిన సతీసహగమనం నేడు దురాచారం. ఒంటిచేత్తో నమస్కరించటం మనకు తగనిదే కాని ఆయుధధారులయిన సైనికుల కది ఆచారం.*
*''కిం కర్మ కిమకర్మేతి కవయో ప్యత్ర మోహితాః"*
*అని భగవద్గీతలో ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యమనేది పండితులు కూడా గ్రహించటం కష్టమని చెప్పబడింది. ఇలా బహుముఖమయిన సదాచారాన్ని గ్రహించి ఆచరించినచో జీవితం ధన్యమవుతుంది. సదాచారపరుల రాకకై తీర్థాలు కూడా ఎదురు చూస్తాయట. ఎందుకంటే వారివలన తాము పవిత్రమవుతామని. యథేచ్ఛగా నేలమీద పాకే తీగె పూలు మట్టి కొట్టుకొంటాయి. పందిరి అల్లిక పెట్టిన తీగె పూవులు రమ్యంగా ఉంటాయి.*
*అలా సదాచారపరుని జీవితం పవిత్రంగా ఉంటుంది. ఏమి చేసినా చేయకున్నా జీవితం గడిచిపోతుంది. అలా జీవితం గడపటంకాదు నడపటం గ్రహించాలి. అదే సదాచారం సాధించటం. పాశ్చాత్య దార్శనికులు సద్విచారమే వ్యక్తిత్వ వికాసానికి మూలంగా భావిస్తారు కాని భారతీయ దార్శనికులు సదాచారమే వ్యక్తిత్వ వికాసానికి మూలంగా భావిస్తారు. సదాచారపరుల వలననే భూమి నిలబడిందని విష్ణుపురాణం చెప్పింది.*
*సదాచారమనే వృక్షానికి మూలం ధర్మమని, కొమ్మ అర్థమని, పుష్పం కామమని, ఫలం మోక్షమని వామనపురాణం చెప్పింది. దురాచారంతో వందేళ్ళు బ్రతకటం కన్న సదాచారంతో ఒక్కరోజు జీవించినామేలే అని బుద్ధుడు ధమ్మపథంలో అన్నాడు. మాక్సుముల్లర్ మరల పుడితే భారతదేశంలోనే పుట్టాలని అనటంలో కారణం ఇచ్చటి సదాచారమే. అసూయ, రాగద్వేషాదులు లేని విద్వజ్జనులు దేని నాచరిస్తారో అదే సదాచారమని మహర్షులు తెల్పారు.*
*సమాజం సదాచారానికి దూరమవుతున్న కారణం 1)తెలియక పోవటం 2) అశ్రద్ధ 3) విధర్మానుకరణ 4) స్వేచ్ఛపట్ల ఆకాంక్ష. వీటి నుండి బయటపడి ప్రతివాడూ సదాచార పరుడు కావాలి.*
*ఇహపరములు రెంటినీ సాధించటానికి ఉన్న ఒకే ఒక్కమార్గం సదాచారం. ఈ కాలానికి కావలసింది అనుభవ వేదాంతమని స్వామివివేకానంద అన్నారు. అట్టి అనుభవ వేదాంతం సదాచారమే. మన సదాచారం తెలియచేసే ఉత్తమ జీవన విధానం విలువ తెలిసిన అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన రుట్టెర్స్ యూనివర్సిటీ మన సదాచారాన్ని గూర్చి కూడా అండర్ గ్రాడ్యుయేట్ క్రెడిట్ కోర్సును ఏర్పరచినట్లు 3 ఏప్రియల్ 2007 నాటి దినపత్రికలో వచ్చింది.*
*ఇలా దేశవిదేశాలన్నిటా స్వీకరింపబడుచున్నది, సకలజనులకు శ్రేయస్కరమయినది సదాచారం. దానిని గూర్చి విపులంగా సదాచారం అంటే యావత్ప్రపంచానికి అందించాలి.*
*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
Comments
Post a Comment