గ్రహ గతులు సమగ్ర పరిశీలన
జ్యోతిష్యము శాస్త్రములో గ్రహా గతులు సమగ్ర పరిశీలన
గ్రహ గతులు సమగ్ర పరిశీలన
భూమి పైన ఉండి గ్రహాలను పరిశీలించినప్పుడు కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన గతులు (చలనాలు) ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చలనాలు అన్నీ తారాగ్రహాలకు మాత్రమే ఉంటాయి. తారాగ్రహాలంటే తారల్లాగా కనబడే బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శనిగ్రహాలు. రవి, చంద్ర గ్రహాలు బింబగ్రహాలు. వీటికి ఋజుగతి మాత్రమే ఉంటుంది. రాహు, కేతువులు ఛాయాగ్రహాలు ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటాయి. మిగిలిన ఐదు తారాగ్రహాలకు మాత్రమే ప్రత్యేకమైన గతులు ఉంటాయి.
వక్రం:- ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ వాటి వాటి కక్ష్యల్లో తిరుగుతుంటాయి. భూమి కూడా తన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి వాస్తవంలో ఏ గ్రహానికి వక్రగతి గాని, ఇతర గతులు గాని ఉండవు. కానీ భూమి మీద ఉన్న పరిశీలకుడు ఒక గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒకొక్కసారి ఆ గ్రహం ముందుకు వెళ్ళినట్లు, ఒకొక్కసారి వెనుకకు వెళ్ళినట్లు, ఒకొక్కసారి కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక గ్రహం ముందుకు వెళ్ళినట్లు కనపడే స్ధితిని ఋజుగతి అంటారు. ఒక గ్రహం వెనుకకు వెళ్ళినట్లు కనపడే స్ధితిని వక్రం లేదా వక్రగతి అంటారు. ఒక గ్రహం వక్రగతిలో ఉన్నదంటే అది భూమికంటే వెనుక ప్రయాణిస్తుందన్న మాట. గ్రహం తానున్న రాశి నుండి గాని, నక్షత్ర పాదం నుండి వెనుకకు పోవటాన్ని వక్రం అంటారు. పాపగ్రహాలకు వక్రగమనం కలిగినచో మిక్కిలి పాప ఫలితాన్ని, శుభగ్రహాలకు వక్రగమనం కలిగినచో సకల శుభ ఫలితాన్ని ఇస్తారు.గురువు వక్రించినప్పుడు అదే రాశి ఫలితాన్ని, మిగతా గ్రహాలు వక్రించినప్పుడు వెనుక రాశి ఫలితాన్ని ఇస్తాయి.
బుధుడు రవిని దాటి 28º ముందుకు వెళ్ళి క్రమంగా వేగం తగ్గి 22º దూరంలో వక్రిస్తాడు. ఆయా రాశులను బట్టి 14º దూరంలో కూడా వక్రించును.వక్రించినప్పుడు బుధుడు గరిష్టంగా 16 º 30 నిమిషాలు వెనుకకు వెళ్తుంది.
శుక్రుడు రవిని దాటి 48º ముందుకు వెళ్ళి క్రమంగా వేగం తగ్గి 29º దూరంలో వక్రిస్తాడు. వక్రించినప్పుడు శుక్రుడు గరిష్టంగా 16 º 30 నిమిషాలు వెనుకకు వెళ్తుంది.
కుజుడిని దాటి రవి 4 రాశుల 11º ముందుకు వెళ్ళగానే కుజుడు వక్రిస్తాడు. వక్రించినప్పుడు కుజుడు గరిష్టంగా 10 º 30 నిమిషాలు వెనుకకు వెళ్తుంది.
గురువుని దాటి రవి 3 రాశుల 24 º ముందుకు వెళ్ళగానే గురువు వక్రిస్తాడు. వక్రించినప్పుడు గురువు గరిష్టంగా 10 º 00 నిమిషాలు వెనుకకు వెళ్తుంది.
శనిని దాటి రవి 3 రాశుల 19 º ముందుకు వెళ్ళగానే శని వక్రిస్తాడు. వక్రించినప్పుడు శని గరిష్టంగా 06 º 58 నిమిషాలు వెనుకకు వెళ్తుంది.
గ్రహ అతిచారం:- గ్రహాలు ఒక రాశి యందు నియమిత కాలం ఉండక ముందు రాశికి పోవుట అతిచారం అంటారు. అట్టి అతిచారం మిగిలిన గ్రహాల కంటే గురువుకు తరచుగా కలుగుచుండును. అతిచారం నందున్న గ్రహం బలహీనంగా ఉండును. అందుచేత అది శుభ ఫలమును ఇవ్వలేదు. రాహు కేతువులకు అతిచారం ఉండదు.
గ్రహ స్తంభనం:- ఒక గ్రహం ఒక రాశి యందు తన నియమిత కాలం కంటే అధిక కాలం అదే రాశి యందు ఉన్నచో అది స్తంభనమని అనబడును. అట్టి స్తంభన కుజునకు తరచుగా కలుగును. స్తంబించిన గ్రహం శుభఫలమును ఇవ్వలేవు.
సమాగమం :- చంద్రునితో ఒకేరాశిలో ఉండు గ్రహమునకు సమాగమం అని అందురు. సమాగం పొందిన గ్రహం అధిక బలమును పొందును. కాని చంద్రుడు ఉన్న నక్షత్రం నందు మాత్రం ఏ గ్రహం ఉండకూడదు. చంద్రస గ్రహ దోషం అనబడును. ఒకే పాదం నందు ఉండరాదు.
గ్రహయుద్దం:-కుజుడున్న నక్షత్రమునకు వెనుక నక్షత్రం నందు గల గ్రహం పరాజిత గ్రహం గ్రహయుద్దం నందు ఓడిన గ్రహం అనబడును. కుజుడున్న నక్షత్రమునకు ముందున్న నక్షత్రమందు గల గ్రహం జయ గ్రహం అనబడును. కుజునితో సమాన భాగములందు కలసిన గ్రహములకు గ్రహయుద్ధం కలుగును. గ్రహ యుద్ధం బుధ, గురు, శుక్ర, శని గ్రహములకు సంభవించును.
ఆచ్ఛాదనం:- పూర్ణచంద్రుడు, శని, కేతువు, గురువు వీరికి మాత్రమే ఆచ్ఛాదనం ఉండును. పూర్ణ చంద్రుడు, శని, కేతువు తామున్న రాశికి ద్వితీయాన్ని, ద్వాదశ స్ధానమును ఆచ్ఛాదించుదురు. ఆచ్ఛాధన అంటే కప్పివేయుట అని అర్ధం. గురువు తానున్న రాశికి తృతీయ, ఏకాదశ స్ధానములను ఆచ్ఛాదించును. మతాంతరంలో గురువు పాపగ్రహములతో కలసి ఉన్నప్పుడు వ్యయస్ధానమును ఆచ్ఛాదించును అని రవి, కుజ, బుధ, శుక్ర, రాహువులు తామున్న రాశి లగాయతు ముందున్న ద్వితీయ స్ధానమును ఆచ్ఛాదనం చూపెదరు.
అస్తంగత్వం:- చంద్రుడు తప్ప మిగిలిన 5 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఇందులో బుధుడు, శుక్రుడు భూ కక్ష్యకు లోపల ఉండి తమతమ కక్ష్యలలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. అదే విధంగా కుజ, గురు, శనులు భూ కక్ష్యకు బయట కక్ష్యలలో ఉండి సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు బుధ, శుక్రులు భూమి కంటే వేగంగా తిరుగుతూ స్యూర్యునికి అవతలి వైపునకు వెళ్ళినప్పుడు భూమి పైన ఉన్న మనకు ఆ గ్రహాలు కనిపించవు. దీనినే అస్తంగత్వం అంటారు. భూ కక్ష్యకు బయట కక్ష్యలలో ఉన్న కుజ, గురు, శని గ్రహాలకంటే భూమి వేగం ఎక్కువ కనుక భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఈ గ్రహాలను దాటి వెళ్ళి సూర్యునికి అవతలి వైపునకు వెళ్ళినప్పుడు భూమిపైన ఉన్న మనకు ఆయా గ్రహాలు కన్పించక పోవటాన్ని అస్తంగత్వం అంటారు. గురు, శుక్రులు అస్తంగత్వం అయినప్పుడు శుభకార్యాలు చేయరాదు. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం అయినప్పుడు బలహీనం చెందుతారు.
కుజుడు సూర్యునికి ముందు, వెనుక 17 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం అవుతారు.
బుధుడు సూర్యునికి ముందు, వెనుక 14 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం అవుతారు.
గురువు సూర్యునికి ముందు, వెనుక 11 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం అవుతారు.
శుక్రుడు సూర్యునికి ముందు, వెనుక 10 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం అవుతారు.
శని సూర్యునికి ముందు, వెనుక 15 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం అవుతారు.
ఊర్ధ్వముఖ, అధోముఖ గ్రహాలు:-
సూర్యునితో కలసి ఉన్న గ్రహాలు అస్తంగత్వం పొందుతాయి.
సూర్యునికి రెండవ రాశిలో ఉన్న గ్రహాలు శీఘ్ర గమనం పొందుతాయి.
సూర్యునికి మూడవ రాశిలో ఉన్న గ్రహాలు సమాన గమనం పొందుతాయి.
సూర్యునికి నాల్గవ రాశిలో ఉన్న గ్రహాలు మంద గమనం పొందుతాయి.
సూర్యునికి ఐదు, ఆరు రాశులో ఉన్న గ్రహాలు వక్ర గమనం పొందుతాయి.
సూర్యునికి ఏడు, ఎనిమిది రాశులలో ఉన్న గ్రహాలు అతి వక్ర గమనం పొందుతాయి.
సూర్యునికి తొమ్మిది, పది రాశులలో ఉన్న గ్రహాలు కుటిల గమనం పొందుతాయి.
సూర్యునికి పదకొండు, పండెండు రాశులలో ఉన్న గ్రహాలు అత్యంత శీఘ్ర గమనం పొందుతాయి.
Comments
Post a Comment