ఆరూడ లగ్నం - సమగ్ర పరిశీలన

*ఆరూడ లగ్నం - సమగ్ర పరిశీలన* 

ఆరూడ చక్రం అంటే రూడి చేసి చెప్పేది. లగ్న, ద్వితీయ, చతుర్ధ, పంచమ, సప్తమ, నవమ, దశమ, ద్వాదశ భావాలనే ఆరూఢాలు అంటారు. ఆరూడములు ఎనిమిది. 3,6,8,11 భావములకు ఆరూడములు లేవు. ఇవి వరుసగా లగ్నరూఢం, ధనరూఢం, వాహన రూఢం, మంత్రరూఢం, దారారూఢం, భాగ్యరూఢం, రాజ్యరూఢం, ఉపపదం.ఇలా అన్ని భావాలకు కూడా చూడవచ్చును.

జాతకచక్రంలో లగ్నం నుండి లగ్నాధిపతి ఎన్ని రాశుల దూరంలో ఉన్నాడో చూసి అన్ని రాశులను లగ్నాధిపతి నుండి లెక్కించగా వచ్చు రాశిలో గ్రహాన్ని ఉంచిన అరూఢలగ్నం అంటారు. ద్వితియాధిపతి ద్వితీయం నుండి ఎన్నవ స్ధానంలో ఉన్నాడో ఆ రాశి నుండి అన్నవ ఇంట్లో ధన రూఢం అవుతుంది. అలాగే చతుర్ధ, పంచమ, సప్తమ, నవమ, దశమ, ద్వాదశ అధిపతులకు ఈ విధంగానే చూసుకోవాలి.

లగ్నరూడం లగ్నం నుండి, ధనరూఢం ధన స్ధానం నుండి, వాహన రూఢం చతుర్ధ స్ధానం నుండి, మంత్ర రూఢం పంచమ స్ధానం నుండి, దారారూఢం సప్తమ స్ధానం నుండి, భాగ్యరూఢం నవమ స్ధానం నుండి, రాజ్య రూఢం దశమ స్ధానం నుండి, లాభ రూఢం ఏకాదశ స్ధానం నుండి, ఉపపదం ద్వాదశ స్ధానం నుండి లెక్కించుచూ చూచుకోనవలెను.
అరూడ లగ్నం నుండియేకాక ఉపపద లగ్నం నుండి కూడా జాతక పరిశీలన చేయవలెను. 

మతాంతరం:- ఏ భావాధిపతియైన అదే భావంలో గాని, సప్తమంలో గాని రాకూడదు. ఆ విధంగా వస్తే అక్కడ నుండి పదవరాశిలో ఆ గ్రహాన్ని ఉంఛాలి.

అరూడ లగ్నం యొక్క ప్రాముఖ్యత వ్యక్తి యొక్క నిజ స్వరూపాన్ని రూడి చేసి చెబుతుంది. ఇతరుల దృష్టిలో ప్రాముఖ్యత ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు. ఆరూడం మాయ వంటిది. ఎదుటి వ్యక్తులు ఏ విధంగా భావిస్తున్నారో తెలుసుకోవచ్చును. ఈ లగ్నం వల్ల మనపై ఇతరులకు గల అభిప్రాయాలను తెలియజేయును.

లగ్నము, చతుర్థము, షష్ఠము, చంద్రుడు, కుజుడు వీటి సహాయముతో మాతృ వైరము లేదా మాతృ సౌఖ్యం చెప్పాలి. ఆరూఢంలో మాత్రారూఢమునకు వాహనారూఢము అని కూడా పేరు. అలాగే లగ్నాత్ నవమ స్థానం పితృస్థానం, లగ్నాత్ తృతీయం భ్రాతృస్థానం. వీటి ఆరూఢములు ఎక్కడ వున్నవో గుర్తించాలి.

“పితృమాతృ భ్రాతృ జాయాస్వామ్యా రూఢాని చాత్మనః కేంద్ర కోణంతధైవ స్యామ్మెత్రీ తేషాం భవేద్ధృవమ్ - పూర్వోక్త బంధ్వా రూఢస్య కేంద్రం కోణం భవేద్యది - స్వారూఢస్యాష్టమం షష్ఠం ద్వాదశం వైర ముచ్యతే.”

ఆరూఢ లగ్నాత్ కేంద్రములు (1,4,7,10) కోణములు (1,5,9) స్థానములు పితృ, మాతృ, భ్రాతృ, కళత్రము సంబంధ ఆరూఢములు అయినచో మైత్రి ఉంటుంది. ఒకవేళ షష్ఠాష్ట వ్యయము అయినచో తల్లికి వైరము వుండును.
ఉదాహరణకు లగ్నరూఢము మేషము అయిందనుకోండి. మేషము, కర్కాటకము, సింహము, తుల, ధనస్సు, మకరం రాశులు వాహన రూఢం (మాత్రారూఢం) అయినచో తల్లితో మైత్రి ఉంటుంది. ఒకవేళ మాత్రారూఢము కన్య, వృశ్చికము, మీనములలో ఏదైనా అయిన ఎడల మాతృమూర్తితో వైరం ఉంటుంది. ఇలాగే పితృ, భ్రాతృ, కళత్ర విషయములు ఊహింపదగినది. మరియు ఆరూఢ లగ్నము కేంద్ర స్థానములు, కోణ స్థానములు అలాగే షష్ఠాష్ట రిప్ఫ స్థానములు ఎలాగ చూశామో రాశి, లగ్నము నుండి కూడా శోధన చేయాలి. ఈ రెంటి యొక్క వివరముల ఆధారంగా స్నేహమా, వైరమా అనేవి స్థాయి నిర్ధారణ చేయవలెను. పితృ విషయంగా నవమ స్థానము రవి, భాతృ విషయంగా కుజుడు తృతీయ స్థానము. కళత్ర విషయంగా ఏడవ స్థానము శుక్రుడు. వీరికి షష్ఠ అష్ఠ, వ్యయ (రిప్ఫ) అధిపతుల సంబంధం దృష్ట్యా మైత్రి లేదా వైరము అనేవి నిర్ధారించవలెను.

“ఆరూఢ తత్పంచమయోః గ్రంథకృద్గురు చంద్రయోః - తమోశ్శుక్షేణ సంబాధే గ్రంథకృత్కించిదే వహి బుధ సంబంధ స్తత్ర గ్రంథ కృద్విరళం భవేత్”.

 ఆరూఢ లగ్నమునందు ఆరూఢ లగ్నాత్ పంచమమందు గురుచంద్రులు వున్న యెడల గ్రంథకర్త అగును. ఆరూఢ లగ్నం పాపగ్రహ సంయుతం కాకుంటే ఇంకా మంచిది. శుక్రుడు కూడిన యెడల కొంచెం తక్కువగాను, బుధుడు కూడిన ఎడల విరళముగా గ్రంథరచన జరుగును.

“ఆరూఢ తత్పంచమయోః కవిశ్శుక్రే స్థితేయది - నాటకాలంకృతి ప్రాజ్ఞో వాచాలః కావ్యభవేత్.” గురుణాతత్ర సంబంధే సర్వజ్ఞో గ్రాంథికో భవేత్ వైయాకరణ వేదాంతవేత్తా వా చాలకో భవేత్”.

ఆరూఢ లగ్నమందును, తత్పంచమమందును శుక్రుడు ఉన్న యెడల కవియు, నాటకాలంకార శాస్తవ్రేత్తయు కావ్యవేత్తయు అగును. - అదే రీతిగా ఆరూఢ లగ్నము తత్పంచమముల యందు గురువు వున్న యెడల సర్వజ్ఞుడును గ్రాంథికుడును అగును. ‘సర్వజ్ఞుడు’ అనే పదం పురాణములు అన్నియు తెలిసిన వాడి విషయములో ఉపయోగిస్తుంటారు.

“బలవత్పాప సంబంధో భవేత్పాప ఫలప్రదః”. బలవంతులైన శుభులతోడి సంబంధం ఉన్న గ్రహములు శుభఫలమును ఇచ్చును. బలవంతులగు పాపులతోడి సంబంధం పాప ఫలితములను ఇచ్చును. బలవంతులు అంటే ‘బలవాన్ షడ్బలయుక్తస్సన్’. షడ్బలయుక్తులయిన గ్రహములు బలవంతులైన గ్రహములు. స్థానబలము, చేష్టాబలము, కాలబలము, దిగ్బలము, దృగ్బలము, నైసర్గికబలములను షడ్బలములు అంటారు.

శుభగ్రహములు, పాపగ్రహములు అనే వర్గీకరణ విషయం ప్రస్తావిస్తే ఆధిపత్యము ప్రధానం. స్వాభావికంగా గురు, శుక్రులు పూర్ణశుభులు. బుధుడు శుభగ్రహమే. కానీ, ‘బుధః పాపయుతః పాపః క్షీణచంద్రసె్తై్ధవచ’ అవడంచేత, అంటే పాపగ్రహములతో కలసిన బుధుడు మాత్రమే పాపగ్రహము. అలాగే పూర్ణచంద్రుడు శుభగ్రహము. క్షీణచంద్రుడు పాపగ్రహము. ‘క్షీణచంద్రుడు’ అనే విషయంలో అనేక పాఠాంతరములు ఉన్ననూ బహుళ ఏకాదశి లగాయతు బహుళ విదియ వరకు క్షీణచంద్రుడుగా వాడకం ఉన్నది. రవి, కుజ, శని, రాహు, కేతువులు పాపగ్రహములు.

లగ్నాత్ 1,5,9 స్థానాధిపతులు ఎవరైననూ శుభగ్రహములే. 4,7,10 స్థానాధిపత్యము వచ్చిన పాపగ్రహములు శుభఫలితములు ఇచ్చును. 4,7,10 స్థానాధిపత్యము వచ్చిన శుభగ్రహములు పాపాధిపత్యము ఇచ్చును. ‘త్రిషడాయ పఅత్వం స్యాదశుభత్వప్రయోజకం, రంధ్రవ్యయే శతాచ స్యాదశుభత్వ ప్రయోజకా’ అని ఉన్నది. 3,6,8,11,12 ఆధిపత్యములు లగ్నాత్‌గా వచ్చిన గ్రహములు చెడు ఫలితములే ఇచ్చును.

‘శుభానాం కేంద్రవాసిత్వ శుభదానస్య సాధనం పాపానాం కేంద్రవాసిత్వమసిమశుభస్మహి సాధనం’. కేంద్రములయందు ఉన్న శుభగ్రహములు శుభఫలితమలను, పాపగ్రహములు, పాప ఫలితములను ఇచ్చును. కేంద్రములు అంటే లగ్నాత్ 1,4, 7, 10 స్థానములు, కోణములు అంటే లగ్నాత్ 1, 5 9 స్థానములు, లగ్నాత్ 2, 5, 8 పణఫరములు, లగ్నాత్ 3, 6, 9, 12 స్థానములు అపోక్లీబములు. లగ్నాత్ 3, 6, 10, 11 స్థానములు ఉపచయస్థానములు అంటారు.

‘స్వమిత్రోచ్ఛక్షేత్ర గత స్తాదృక్సంబంధాన్ బలీ, నీచారిక్షేత్రగస్తాదృక్సంబంధస్తగతోబలః’ స్వక్షేత్రము, మిత్రక్షేత్రము, ఉచ్ఛక్షేత్రమును పొందినవాడు అట్టివారితో సంబంధకలవాడు బలవంతుడు అగును. నీచక్షేత్రమును, శతృక్షేత్రమును పొందినవాడును, అట్టివారితో సంబంధగల గ్రహము అస్తంగత్వము పొందిన గ్రహము దుర్బలుడగును.

 ‘ఆరూఢ లాభే శుక్రేణ దృష్టే రాజా భవేన్నరః తస్మించ్ఛ్భుయుతే సంపద్దారిద్య్రం పాపసంయుతే’. ఆరూఢ లగ్నమునకు లాభస్థానమును శుక్రుడు చూచినేని జాతకుడు భూపతియగును. ఆ లాభస్థానమునందు శుభగ్రహము ఉండెనేని సంపదయు, పాపగ్రహము ఉండెనేని దరిద్రము కలుగును. ‘బలహీనోదేహానాథో యదిస్స్యా ద్వ్యాధిమాన్నరః సకేంద్రకోణగస్స్యాచ్ఛేన్నహ్యధీమాంస్తు కోపవాన్’. తను స్థానాధిపతి బలహీనుడయిన జాతకుడు వ్యాధిగలవాడు అగును.తను స్థానాధిపతి బలహీనుడై కేంద్ర కోణములయందు ఉండెనేని బుద్ధిమంతుడు కాకపోడుగానీ గోపముగలవాడు అగును.

ఆరూఢ లహ్నమనుకు ఏకాదశ స్థానమందు శుభాశుభ గ్రహసంబంధము కలిగిన జాతకుడు సంపన్నుడు కాగలడు. ఆరూఢ లగ్నమునకు ఏకాదశమునందు శుభగ్రహములు ఉన్నఎడల న్యాయమార్గంవలననూ, పాపగ్రహములు ఉన్న ఎడల అన్యాయమార్గము వలననూ లాభము కలుగును. ఆరూఢ లగ్నమునకు ఏకాదశమందు స్వాచ్ఛమిత్ర గ్రహములు ఉన్నచో వాని దశలయందు విశేషముగా ఐశ్వర్య ప్రాప్తికలుగును.

ఆరూఢ లగ్నమునకు ఏకాదశ స్థానముతో ఉన్న గ్రహమునకు ఆస్ధానము నీచస్థానము అయినచో ఆ స్థానంలో ఉన్న గ్రహ దశలయందు ఆదాయ వ్యయములు సమానముగా ఉండును. ఆరూఢ లగ్నమునకు ఏకాదశ స్థానమునందు రవి, శుక్ర, రాహువు ఉన్న ఎడల రాజువల్ల ఐశ్వర్యప్రాప్తి కలుగును. ఏకాదశము ఆరూఢ లగ్నమునకు రవి, శుక్ర, రాహువులు ఉండి చంద్రుడు చూచినేని విశేషముగా ఐశ్వర్యము కలుగును.

‘లగ్నాచ్చ ద్విర్ద్వా శయోర్గ్రహ సామ్యేతు బంధనమ్’ అని చెప్పారు. లగ్నానికి ద్వితీయ ద్వాదశ స్థానముల యందు పాపగ్రహములు సమానముగా వుండెనేని జాతకునకు ఆయా గ్రహ దశ అంతర్దశులలో బంధనం కలుగును. ఇక్కడ జ్యోతిశ్శాస్త్ర శోధనలో జన్మలగ్న, ఆరూఢ లగ్నం, కారక లగ్నముల శోధన ఏది అయినా “ర్ఫిఃష్టారి గతస్య రాశిర స్తద్దేశయు గ్దృష్ట్భం భ్రష్టంస్యాత్” అనే సూత్రం ప్రధాన భూమిక అవుతోంది. అయితే ఈ 6,8,12 స్థానాధిపతులు ఒకరి ఇంట ఒకరు వారికి పరివర్తన మాత్రం రాజయోగమే చెబుతోంది.

ఏ చక్రాలలో అయినా “నీచస్థాన గతాశ్చ పరాజితాస్త్వరి గతా పాపేక్షితా క్రాంత యుఙ్మధ్వస్థాన గతాశ్చవక్ర వికల స్వర్భాను సంసర్గకాః భావంత స్థితిభే చరాః షష్ఠాష్టరిఫాధిపాః” అనే నియమం ప్రకారం మనం ఏ భావం శోధన చేయుచున్నామో ఆ భావం యొక్క అధిపతి నీచలో వున్ననూ, కుజుడితో కలిసి పరాజితుడు అయిననూ అనగా కుజుడుకు వెనకగా వుండటం, శత్రు క్షేత్రంలో వుండడం, పాపగ్రహముల వీక్షణ, యతి (కలయిక), వారిచేత ఆక్రమింపబడటం, వక్రము, వికలావస్థ, అస్తమయం పొందడం, భావం యొక్క అంత్యంలో వుండడం, 6,8,12 అధిపతులతో కలయిక ఆ స్థానములలో వుండడం అనేవి ఏ భావమునకు అయినా మంచిది కాదు. ఇది ప్రతి భావం విషయంలోను శోధించాలి.

మంచి యోగము అయినా చెడు యోగము అయినా సరే దానిని ఇస్తున్న గ్రహము బలవంతమయిన గ్రహం అయితే యోగం పని చేస్తుంది. మంచి యోగం ఇచ్చే గ్రహం బలవంతమయిన గ్రహం అయితే మంచి ఫలితాలు అధికం. చెడు ఇచ్చే గ్రహము బలమయితే అధిక చెడు కలుగజేయును. మంచి చేయు గ్రహం స్థానబలం లేనిది అయితే మంచి పెద్దగా జరగదు. చెడు చేయవలసిన గ్రహం బలహీనం అయితే చెడు పెద్దగా జరగదు. “లగ్నాదారూఢ లగ్నాద్వాకోణ యోరి పురంధ్రయో తృతీయైకాద శయోరావ గ్రహసామ్యేపి బంధనం”. జన్మలగ్నం ఆరూఢ లగ్నమునమే గానీ పంచమ నవయములు/ షష్ఠాష్టములు/ తృతీమైకా దశములలో వీటిలో ఎందయినా సమస్థాయి పాపగ్రహములు వున్న యెడల ఆ గ్రహ దశాంతర్దశలతో కారాగార యోగం కలుగును.

సమం చతుర్థే దశమే స స్థితి స్తదపేక్షయా - శుభ పాప గ్రహాణాం చేద్బంధనం నాత్ర సంశయః - లగ్నము, ఆరూఢములకు చతుర్థ దశమముల యందు శుభ పాప గ్రహముల సామ్యము ఉన్న యెడల బంధనము కలుగును. ఇది కారాగార యోగముగాను లేదా ప్రైవేట్‌గా అనగా కిడ్నాప్ వంటివిగా కూడా చెప్పవచ్చు. అధికారులు నిర్బంధించారు, ప్రజలు నిర్బంధించారు అని చెబుతుంటారు కదా! అటువంటి ఫలితాంశాలను ఇక్కడ వర్తింపజేయవచ్చును.

సామ్యము అనే పదంలో ‘సంఖ్య’ అని తీసుకోవచ్చు లేదా బలము అని కూడా తీసుకోవచ్చు. ‘తేషు చేచ్ఛ్భు సంబంధో భటై దావవరణం ప్రభోః పాపాన్వయే శృంఖలాది పీడా ప్రహరణాదికమ్’ అలా చెప్పబడిన స్థానములకు శుభ గ్రహ వీక్షణ సంబంధం కలిగిన యెడల రాజభటులచే పట్టుబడుటయు పాపగ్రహ సంబంధం కలిగిన యెడల శృంఖలాబంధనం రాజదండనం చెప్పాలి. మరి పాపగ్రహ సామ్యము శుభగ్రహ వీక్షణాది సంబంధం అయితే ఎవరైనా అధికారులు పట్టుకోవడం, వెహికల్‌కి ఫైన్ వేయడం వంటివి స్థానబలం యొక్క స్థాయిని బట్టి నిర్ధారించాలి. యోగం అవయోగం ఏదైనా స్థాయిని అనుసరించి ఫలితం చెప్పాలి. స్థానబలం ఎక్కువ అయితే ఎక్కువ యోగం లేదా శిక్ష తక్కువ అయితే తక్కువ యోగం తక్కువ శిక్ష చెప్పాలి.

“రాశేః కోణవర్తీ రాహుశే్చ త్సూర్య వీక్షితః నేత్రరోగీ భవేన్నూనం వోచేత్తత్ర శుభాన్వయః” శుక్రుడు వున్న రాశికి కోణములలో రాహువు వుండి ఆ రాహువుకు రవి వీక్షణ వున్న యెడల శుభగ్రహ సంబంధం రాహువు లేని యెడల నేత్ర రోగి కాగలడు. జైమిని పరాశరులు, కేవలం సప్తమ స్థాన దృష్టి ఒకటే కాకుండా ఇంకా ఇతర దృష్టి విషయాలు తెలియజేశారు. అందులో భాగంగా రవి శుక్రుడికి దగ్గర్లో వున్నప్పటికీ శుక్రుడికి కోణంలో వున్న రాహువును చూస్తారు.

“ఆరూఢ లగ్నే లగ్నేవా చంద్ర శుక్రాయదిస్థితౌ చతురంగ బలాదీని రాజ చిహ్నాని సంతిహి” లగ్నమునందు లేదా ఆరూఢ లగ్నము నందు చంద్ర శుక్రులు వున్న ఎడల ఆ జాతకుడు చతురంగ బలము మొదలయిన రాజ చిహ్నములతో భోగ జాతకుడు కాగలడు.

 ‘ఉపపదము’ అని ఆరూఢ చక్రములో రాసి ఉంటుంది. ఆ ఉపపదంలో పాపి వున్న యెడల లేదా ఉపపద స్థానమునకు పాప సంబంధము కలిగిన ఎడల జాతకునకు సన్యాసము లేదా కళత్ర వియోగం చెప్పబడినది. మరి ఉపపదంలో వున్న రవి మాత్రం పాపగ్రహ కాదుట. “రవిః పాపోనోపపదే నోక్త దోష శ్శుభాన్వయే - స్యాతాం తౌచ కళత్రేశ నీచత్వాది స్వభావశ” ఉపపదమునకు శుభగ్రహ సంబంధము కలిగినేని వెనుక చెప్పిన సన్యాసముగానీ, కళత్ర వియోగము గానీ కలుగదు. ఒకవేళ కళత్రాధిపతికి నీచత్వాది దోషములు కలిగినప్పుడు కలుగును.

“ఉపపదే ద్వితీయేవా గ్రహస్స్యక్షేత్రగోయది. లగ్నాత్సప్తసు పాపస్స్యా త్స్వక్షేత్రో యది వర్తతే - ఉత్తరాయుషి నిర్దారో భవేన్నో చేచ్ఛ్భున్వయః.” ఉపపదమునకు గానీ దాని ద్వితీయమునకు గానీ అందులో స్వక్షేత్ర గ్రహం వున్ననూ లగ్నము ఆరూఢ లగ్నము కారక లగ్నాదులకు సప్తమంలో స్వక్షేత్ర గ్రహముగా ఏదేని పాపగ్రహం వున్న యెడల ఉత్తర వయస్సులో కళత్ర విహీనం కలుగును. ఉదాహరణకు ఉపపదం మకరం అయినది. మకరంలో లేదా కుంభంలో శని వున్నారు అనుకోండి. శని స్వక్షేత్రంలో వున్నారు కావున దోషం చెప్పబడుతున్నది. ఇదే రీతిగా జన్మలగ్నానికి సప్తమంలో పాపగ్రహం వుంటే ఆ పాప గ్రహమునకు ఆ స్థానం స్వక్షేత్రం అయితే అనే అంశంలో చాలా మతాంతర పాఠాలు వున్నాయి. కళత్రాధిపతి కళత్ర స్థానంలో స్వక్షేత్రంలో వుంటే దోషం లేదు అనేవారున్నారు గానీ ఫలితాలు మాత్రం పై విషయాన్ని సూచిస్తున్నాయి.

ఎటువంటి కళత్రం వచ్చే అవకాశం ఉన్నది అనే అంశం ప్రస్తావిస్తే – “కళత్రేశే చోపపదాదుచ్చస్థే స్వకులోత్తమాత్, దార లాభో భవేన్నీచే స్స్యాచ్చ నీచకులాద్భవేత్”. ఉపపదమునకు సప్తమాధిపతి ఉచ్ఛయందున్నచో తన వంశము కంటే ఉత్తమ వంశము నుండియు నీచయందున్న యెడల తన వంశము కంటే తక్కువ వంశము నుండియు దార లాభము కలుగును.

“సుందరీ శుభ సంబందాద్భార్యాస్సాదస్య ధాన్యధా - అపవాదాద్దారనాశ శ్శని రాహ్వన్యయే భవేత్” ఉపపద సప్తమమునకు కానీ తదధిపతికి గానీ శుభ గ్రహ సంబంధం కలిగినేని భార్య రూపవతి యగును. అట్టి సంబంధం లేని యెడల కురూపి అగును. స్త్రీజాతక శోధన చేయునప్పుడు భర్త అని చెప్పాలి. ఉపపద సప్తమమునకు తదధిపతికి శని రాహు సంబంధం కలిగినేని అపవాదుల వలన భార్యాభర్తలు విడిపోగలరు. నేడు కోర్టు గొడవల జాతకాలు శోధిస్తే ఈ అంశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇదే విషయం జాతకం రాశి చక్రం ద్వారా శోధించదలచిన యెడల “వంధ్యాపతి స్సితరవీ మదనోదయస్థౌ చంద్రోదయే సమగృహే లలనా కృతిస్స్యాత్ పుంరాశిగే పురుష భావయుత కళత్రం స్ర్తిపుంగ్రహే క్షితయుతే సతి మిశ్రరూపం”. శుక్ర సూర్యులు లగ్నంలో కానీ సప్తమంలో కానీ వుండిరేని భార్య గొడ్రాలు అగును అనగా సంతానవతి కానేరదు. రవి శుక్రుల కలయిక అస్తంగత్వ దోషం ఇస్తుంది కదా! మరి వారు అలాంటి దోషం కలవారై లగ్నంలో వుంటే కళత్ర స్థానమును చూస్తారు. కళత్రంలో వుంటే ఇక చెప్పనవసరం లేదు కదా. అందుకే ఈ ఫలితం చెప్పారు. ఇక చంద్రోదయము సమరాశులలో అయితే కళత్రము లలనాకృతి అగును అని చెప్పుచూ పురుష రాశిని పొందినేని కళత్రము పురుష భావం కలిగి వుండును అన్నారు. స్త్రీపుంగ్రహములతో కూడికొని యుండినేని కళత్రము మిశ్రరూపము కలదై యుండును. ఈ సూత్రం పురుష జాతకం వరకే కాక స్త్రీజాతకములకు కూడా అమలుచేయవలెను.

మరొక ముఖ్య శోధన “భౌమాంశేవా భౌమరాశౌమి లగ్నాత్. కామస్థానే జన్మభేవా వధూనామ్‌॥ జాయదాసీ నీచమూఢ గ్రహాంశే దుష్టావా స్యాద్యౌవనే భర్తృహీనాః” పురుషుల జాతకంలో సప్తమ స్థానం స్త్రీల జాతకంలో లగ్నం ద్వారా శోధించవలసిన అంశము ఇది. పురుషుల సప్తమ స్థానము లేదా స్త్రీలకు లగ్నము అంగారక రాశిగానీ అంశ గానీ అయిన యెడల భార్య దాసీయై ఉండును. అలాగే సప్తమము అయినను, లగ్నము అయినను నీచ మూఢ గ్రహాంశలు కలది అయిన యెడల కళత్రము యుక్త వయసులో వుండగా దుష్ట స్వభావము కలది అయి ఉండును. లేదా భర్తృహనురాలు అయి ఉండును. ఇది పురుష జాతకమునకు కూడా అమలు చేయవచ్చును.

“శుభాంశ రాశౌయది సద్గుణాఢ్యా శుభౌక్షితే చారుతరం కళత్రం - చంద్రాంశకే దుర్బల చంద్రరాశౌ జాతాపతిఘ్నీ సబలేతు సాధ్వీ” సప్తమము గానీ లగ్నము గానీ శుభాంశ రాశి అయ్యెనేని భార్య సద్గుణవతి అగును. సప్తమ స్థానము శుభ గ్రహములచే చూడబడెనేని మిగుల సుందరి అయిన భార్య రాగలదు. ఈ నియమం భర్త రాగలడు అని చెప్పవచ్చు. సప్తమ స్థానము చంద్రరాశి అయి వుండగా చంద్రరాశి దుర్బలమయి ఉండెనేని పతిని హింసించునట్టి, భార్య కలుగును. అదే చంద్రరాశి బలము కలది అయిన యెడల భార్య పతివ్రత అగును. లగ్నాధిపతి సప్తమ స్థానమున ఉండి శుభ గ్రహములతో కూడుకొని ఉన్న యెడల సత్కులమునందు పుట్టిన భార్య రాగలదు. లగ్నాధిపతి దుష్ట క్షేత్ర ఆధిపత్యంతో వున్న సప్తమంలో వున్ననూ లేదా దుష్ట గ్రహములతో కలసి సప్తమంలో వున్ననూ దుష్టకులము నందు పుట్టిన భార్య రాగలదు.

“కామస్థేతనుపే శుభగ్రహయుతే సద్వంశ జామృచ్ఛతి క్రూరర్షే మదగ్నే మిగ్నే రమణే దుర్వంశ జాతాంగనామ్‌” భార్య యొక్క లక్షణములు అని చెప్పబడిన ఫలితాంశములు భర్త యొక్క లక్షణములు అని కూడా మార్పుచేసి చెప్పవచ్చు. దారాపదము మిథున కన్యలలో ఏదో ఒకటి అయి శని కుజుల వీక్షణ కలిగిన యెడల ముక్కు, శ్వాస రంధ్రములు, ఊపిరితిత్తులు, వాటికి సంబంధించిన అనారోగ్యములు కలిగిన భార్య కలుగును. ఇదే దారారూఢము మేషము లేదా వృశ్చికములలో ఒకటి అయి గురువు లేదా శనితో వీక్షణ కలిగిన యెడల చెవులకు సంబంధించిన రోగము కలిగిన కళత్రం. దారా రూఢంలో గురు రాహువులు వున్న యెడల చెవుడు, దంత రోగములు ఉండు కళత్రము కలుగును. ఉప పదం కన్య లేదా తుల అయిన అచట శని రాహువులు వున్న యెడల కళత్రమునకు కుంటితనము లేదా వాత రోగము ఉండును. ఈ పై యోగములలో ఏ యోగము కలిగిననూ వారికి శుభ గ్రహ దృష్టి కలిగిన యెడల ఈ యోగములు ఉండవు.

ఉప పదములో శని బుధ శుక్రులు వున్న యెడల జాతకునకు సంతాన యోగం ఉండదు. “లగ్నాదుప పదా దంశా త్కారకాచ్చాపి పంచమః పుత్రభావ ఇతిజ్ఞేయః సూత్రకారాది సమ్మతః” లగ్నము అంశ లగ్నము కారకులు వున్న రాశి తత్పంచమ స్థానములు పుత్ర భావము అని పేరు. అందు గురు రవి రాహువులు వున్న యెడల బహుపుత్రవంతులు అగుదురు. చంద్రుడు వున్న యెడల ఏకపుత్రుడు కలుగును.

 ‘బుధారాభ్యాం దత్తపుత్రః’ కుజ బుధులు గానీ; కుజ శనులుగానీ పైన చెప్పిన పుత్ర స్థానములో వున్న యెడల జాతకుడు దత్తపుత్రుడు కలవాడు అగును. ‘శనిమాత్రే మృతప్రజః’ కేవలం శని ఒకటే వున్న యెడల మృత సంతతి గలవాడు అగును. ‘ఓజేస్మిన్ బహుపుత్ర స్వాత్’ పైన చెప్పిన పంచమ స్థానములు ఓజరాశులు అయిన యెడల జాతకుడు బహు పుత్రకుడు అగును. ఓజరాశులు అంటే మేష, మిథున, సింహ, తుల, ధనుః, కుంభరాశులు. యుగ్మరాశులు అనగా వృషభ, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనములు. ‘యుగ్మేస్మిన్ అల్పపుత్రకః’ పైన చెప్పిన పంచమము యుగ్మరాశులు అయిన యెడల స్వల్ప సంతతి కలుగును.

‘తృతీయే మందరాహుభ్యాం పదాదేకాదశే తథా’ - భ్రాత్రోర్నాశః క్రమే ఇస్స్యాత్కనిష్ఠ జ్యేష్ఠయోరపి’ తృతీయము నందు కానీ ఆరూఢ ఏకాదశమము నందు గానీ శని రాహువులు వున్నచో క్రమముగా కనిష్ఠ జ్యేష్ఠ సోదరుల నాశనము కలుగును. భ్రాతృస్థానము నందు కుజ చంద్ర గురు బుధులు వున్నచో చాలామంది సోదరులు కలుగుదురు. భాతృస్థానము నందు శని యున్ననూ చూచిననూ తన తల్లికి కలిగిన సంతతిలో తానొక్కడే మిగులును.

ఉపపదంలో రవి గాని కుజుడు గాని ఉంటే అప్పులు ఇస్తే రావు. మళ్ళీ మానవజన్మ ఎత్తి అప్పుడు రాబట్టాలి. చంద్రుడు శుభుడై ఉన్న కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు. బుధుడు ఉపపదంలో ఉన్న వ్యాపారంలో పెట్టుబడి పెడతాడు. గురువు ఉన్న దానాలు చేస్తాడు కాబట్టి స్వర్గప్రాప్తి పొందుతాడు. శుక్రుడు కుజ, శని రాశులలో లేకుంటే భోగాలు అనుభవిస్తాడు. నిరంతర ఆనందం, స్వర్గం లభిస్తుంది. శని ఉంటే పిసినారిగా ఉంటూ చివరికి ఎవరికో ఇస్తాడు. రాహువు ఉన్న దురాశతో ఖర్చు పెడతాడు. కేతువు ఉన్న మోక్షం కలుగుతుంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: