నరక చతుర్దశి
ముందుగా అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు. ఇది పండుగ అనేటువంటిది అందరికీ తెలుసు. దీనికి కారణం నరకాసుర సంహారము అని అందరం ఎరుగుదుము. అసలు ఎవరు ఈ నరకాసురుడు. ఎందుకు ఇతని పేరున ఈ పండుగను నిర్వహిస్తారు?
చలామంది ఆయనాంశ అనే విషయం పైన కొట్టుకుంటూ ఉంటారు.... ఆయనాంశ శూన్యం (జీరో) అయితే.... ఏమి జరుగుతుంది అనేది చెప్పరు. దీనికి చెప్పిన సమాధానం ఏమిటి అంటే... సముద్రం నిశ్చలంగా ఉంటుంది. ఆటుపోట్లు ఆగుతాయి. దీనికి అర్థం ఏమిటి అంటే... సంపూర్ణ జలరాశి ఈ అఖండ ధరణి మండలాన్ని సంపూర్ణంగా ముంచి వేయడం. అప్పుడు ఈ ప్రపంచం మీద ఉన్న జీవరాశి... సకల జీవులు అంతరించిపోయి... జీవన నాదం వేదం సముద్ర గర్భాన ఉండిపోతుంది. మరలా ఈ భూమి మీద జీవం ఎలా ఉత్పత్తి ఎలా అవ్వాలి?
సముద్రంలో పెరగగలిగినటువంటి చేపలు దీనికి కారణం అవుతాయి. అందుకని మత్స్యావతారాన్ని పూజ చేస్తారు భారతీయులు. అఖండ ధరణి మండలం అంతా మునిగిపోయిన తరువాత మరలా ఈ భూమి మీద జీవం ఏర్పడాలి అంటే భూమి మీద ఏర్పడాలి. దానికి భూమి కొంత పైకి లేచి ఉండాలి. దీనికి టిల్టెటెడ్ అయినా అక్షాంశములు కావాలి. అప్పుడు ఆదివరాహస్వామి అవతారం ఎత్తి విష్ణుమూర్తి తన కొమ్ము మీద భూమిని పైకి తీసుకు వచ్చాడని వ్రాస్తారు. 23½° కోణం ఏర్పడటంతో జలమొక పక్కకి భూమి ఒక పక్కకి జరుగుతూ వస్తాయి. భూమాత ఆదివరాహస్వామి చూపిన దారిలో పయనించడం మొదలవుతుంది. అనగా ఆయనాంశము లో చేంజెస్ క్రమేపీ భూమిని నీటిని వేరు చేస్తుంది. తద్వారా భూమండలం మీద జీవం ఏర్పడడానికి అవకాశాలు దొరుకుతాయి. ఎప్పుడైతే జీవం ఉద్భవించిందో జీవన నాదమైనటువంటి వేదము ఉద్భవిస్తుంది. దీనినే ఆదివరాహ స్వామి వేదాలను రక్షించాడని చెప్తూ ఉంటారు. ఇంత రక్షణ పొందినటువంటి భూమాత స్వామివారి వెనక నడుస్తూ ఆయన చూపిన దారిలో వెళ్తుంది కాబట్టి ఆయనకు భార్యగా వ్యక్తీకరం అవుతుంది. నీరు భూమి వేరు అయ్యేటప్పుడు బురద ఏర్పడటం సహజం మట్టి నేలలకు, అందరికీ తెలిసిన విషయం. ఈ బురదని నరకము అని పిలవడం అందరికీ తెలిసిన విషయమే. అలా ఆది వరహస్వామికి భూమాతకు జన్మించిన పుత్రుడు ఈ నరుకుడు. ఉత్పత్తి లక్షణం అయినటువంటి దేవతలకు పుట్టిన పుత్రుడు. ఇతని రాజధాని ప్రాగ్జ్యోతిష్యపురం. తూర్పు దిక్కున ఆకాశ జ్యోతులు. అయినా సూర్యడు చంద్రుడు యొక్క గమనములు కలిగినటువంటి పురం. ఉత్పత్తి శక్తి అయిన దైవ శక్తికి ఇతను పుత్రుడు కాబట్టి ఇతని ఆరాధన భగవదారాధన, కామాఖ్య దేవాలయం. ఇతని రాజ్యము కామరూప. దేవతాది పూజలు చేస్తూ నరకుడు చాలా కాలం బ్రతికాడు. అమ్మవారు ఇతను పూజలకు మెచ్చి వరం కింద కేవలం మాతృమూర్తి చేతుల్లోనే నీ మరణం ఉంటుంది అని వరం ఇవ్వబడింది. కానీ కొంతకాలం తర్వాత పక్కవారి చెప్పుడు మాటలు వింటూ అసుర లక్షణాలను సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి ఈ నరకాసురుడుగా మారాడు. ఇతను గోపికలను బంధించాడు. అది కూడా 16 వేల ఒక వందమంది. గోపిక అంటే సూర్యరశ్మి అని ఒక అర్థం. 16,100 ఘడియలు అనేది రమారమి గర్భ అవధికి సంబంధించిన విశేషము. (కావాలంటే మీరందరూ దాన్ని కన్వర్ట్ చేసి చూసుకోండి.) వరము అనేటువంటిది ఈ విధంగా ఉండటం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కానీ వాస్తవ విషయం ఏమిటి అంటే.... భూమి పైన నీరు ఆవరించి ఉన్న తర్వాత భూమి కొంత నీరును గ్రహిస్తుంది. ఆ నీరు ఇంకిపోతూ బురదగా మారుతుంది. బురదలో ఉన్న నీటిని ప్రత్యేక ప్రక్రియ ద్వారా అంతరింప చేయవలసిన అవసరం లేదు. భూమి తన శక్తి మీద అంతర్గతంగా లాక్కుంటూ ఈ బురదని గట్టిగా మార్చేయగలుగుతుంది తన వేడి ద్వారా. దీనిని నరకాసురుని యొక్క మరణము అని చెప్పటం జరుగుతుంది. ఇలా భూమి తనలోకి నీరు లాక్కోవడం ద్వారా... అనేక రకములైన రత్నములు మినరల్స్ తయారవుతాయి. భూమికి పంట (క్రాప్)కి కావలసినటువంటి లక్షణ సమన్వితం అవ్వటానికి ఇది పనికొస్తుంది. ఇలా అవటంతో రత్నగర్భగా మారుతుంది భూమి... అలాగే పంట పొలాలకు ఆటవిడుపుగా ప్రకృతిని సకల జీవుల ప్రాదుర్భావానికి శ్రీ కారం చుట్టినట్టుగా ప్రకృతి మనకు దర్శనమిస్తుంది. క్రిమి కీటకాదులు సూక్ష్మజీవులు ఉత్పన్నమవుతాయి. వర్షాలు ఆగిపోతాయి. భూములు గట్టిపడే ఆశ్వయుజ మాసం వస్తుంది. దారులు ఏర్పడి యుద్ధాలకి రథాలు నడపటానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచు పడుతూ పంటకి బలం పుంజుకునే లక్షణాన్ని కూడా ఇస్తుంది. మంచు కురవడం అనేది పంట ఎంత ఎక్కువగా పండుతుంది చెప్పడానికి ఉపయోగిస్తారు రైతులు మన ప్రాంతంలో. ఈ విధంగా బురద ఎండి పోయి భూమి గట్టిపడటం, గట్టిపడటానికి భూమాతే కారణం కావడం, నరకాసురుడు యొక్క మరణము తల్లి భూదేవి చేతుల్లోనే జరిగిందని చెప్పటం చేస్తారు. నరకాసురుడు యొక్క చెరలో ఉన్న 16,100 గోపికలు విడుదలై సస్యరక్షణకు గర్భరక్షణకు నడుంకడతారు. భూమిలో అంతర్గతంగా దొరికేటువంటి రత్నాలతో సంబంధం ఉన్నవారు లక్ష్మీ పూజ చేస్తారు. రైతు ప్రకృతి పూజ చేస్తాడు. చీడపీడ ఎక్కువై దానిని సంహరించడం కోసం టపాసులు కాలుస్తారు. పొగ పెడతారు. ఇక మన కథలో అయితే సత్యభామను చూడగానే నరకాసురుడు అందమైన అమ్మాయిగా ఊహించి తన భార్యగా చేసుకోవాలని తనతో కామ క్రీడలు జరపాలని కోరుతాడు. చివరకు ఆవిడ యుద్ధం చేసి ప్రాణం పోయే సమయంలో... తన తల్లిగా గుర్తిస్తాడు సత్యభామను. తల్లితో ఇటువంటి కోరికలు పుర్రె లో పుట్టినందుకు సిగ్గుపడుతూ తన దైవిక లక్షణాలను గుర్తు చేసుకుంటూ... తన మరణము లోకానికి ఒక గుర్తుగా ఉండాలని... భగవానుడిని వరమడుగుతాడు. భగవంతుని ఆశీర్వచనం ప్రకారం అతని మరణం నరకచుతుర్దశి. సారావళి ప్రకారము ఈ చతుర్దశి యుగమునకు ప్రారంభం అని వ్రాయడం జరిగింది.
ఆలోచన చేయండి, పండగ వెనుక పరమార్థం... మన నిత్య జీవితానికి ఉపయోగకరమైన విశేషాలు అనేకం చెప్పించడం జరుగుతుంది భారతీయ పండుగలలో... వాటిని తెలుసుకొని దాని ద్వారా లబ్ధి పొందండి. ఇక ఈ నరకాసురుని యొక్క కుమారుడు భగదత్తుడు... మహాభారతంలో భీష్మను కంటే పెద్దవాడు యుద్ధంలో ఆరి తేరిన యోధుడు. అష్టదిక్కులలో ఒక దిక్కుకి ఆధిపత్యం వహించే సుప్రతీక (ఏనుగు) ఇతని వాహనం. దీని విశేషాలు మహాభారతంలో విస్తృతంగా చెప్పబడ్డాయి. ఇంకా అనేక విశేషాలు సమాహారం ఈ దీపావళి.
నరక చతుర్దశి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు.
జీవపరిణామక్రమమంతా కూడా ఈ దీపావళి చుట్టు పెనవేసుకుని ఉంటుంది
Comments
Post a Comment