సీమంతము

సీమంతము (సీమంతోన్నయనము)

షోడశకర్మలలో మూడవది సీమంతోన్నయనము. 5, 7, 9 నెలలు సీమంతమునకు శుభప్రదము. సీమంతము సమయమునందు దంపతులచే వైదికముగా హోమప్రక్రియ కూడా జరుపబడుతుంది. (వాస్తవానికి సీమంతము నకు హోమం చేయించడము, గాజుల వేడుక లౌకికముగా జరుపబడుతుంది.)

గాజులు పెట్టించుట

7వ నెలలో గాజులు పెట్టించేటపుడు కొత్తగా పెళ్ళయి ఇంకా గర్భం ధరించని స్త్రీని తోడుగా కూర్చుండబెట్టి ఇద్దరికీ నూతన వస్త్రములు ఇచ్చి, చూలింతకు కుడిచేతికి 19, ఎడమచేతికి 21, 18, 19 జతలు లేదా 11-13 జతల చొప్పున వేస్తారు. ముందుగా పెద్ద సైజు గాజులు వెనుకకు వేసి ఆ తరువాత పాత గాజులు తీసివేసి మిగిలిన గాజులు తొడిగించి చివరలో నల్లగాజులు దిష్టి తగులకుండగా వేయించాలంటారు. అదే విధముగా తోడుపెళ్ళికూతురుకి కూడా ముత్తయిదువలందరు చేతికి నిండుగా గాజులు తొడగడం మన ఆచారము.

గమనిక :

సుమంగళిస్త్రీలు ఎట్టి పరిస్థితులలోనూ గాజులు లేకుండా ఉండరాదు అనే శాస్త్రవచనాలననుసరించే ముందు రెండు కొత్తగాజులు ఎక్కించుకుని ఆ తరువాత పాతగాజులు తీసివేయడమనే పద్ధతి వచ్చింది కానీ మూఢాచారములని కొట్టివేసేది కాదు అని మనం గ్రహించగలగాలి. నవతరం యువతులు పాశ్చాత్య నాగరికత వ్యామోహములో సుమంగళీత్వ చిహ్నాలను స్వయముగా తమకు తామే దూరం చేసుకొంటూ జరుగుతున్న, జరగబోయే దుష్పరిణామాలకు మాత్రం తమ అదృష్టాన్ని, దైవాన్ని నిందిస్తూంటారు.

చూలింతకు గాజులు వేసేటపుడు మున్ముందుగా పెద్ద ముత్తయిదువ గాని, తల్లిగాని గాజులు తొడుగుతారు. ఆ తరువాత పెద్ద ముత్తయిదువలందరూ కలిసి చూలింతకు ఒక్కొక్క జత చొప్పున ఎక్కించడము జరుగు తుంటుంది. గాజుల గలగల శబ్దము గర్భస్థ శిశువులు వినికిడి, గ్రహణశక్తి మీద ప్రభావము చూపిస్తుంటాయి.

శాస్త్రీయత

స్త్రీలు చేతులకు గాజులు లేకుండగా నుండుట అశుభము, మూఢాచారము మాత్రమేకాదు, గాజులు ధరించుటకు వైజ్ఞానికపరంగా ఎన్నో కారణములు ఉపయోగములు కలవు.

మానవుని దేహమునందు జీవనాడి (Vegus Nerve) అనునది ప్రతి అంగములకు సంబంధము కలిగి ఉంటుంది. దీని ఒక శాఖ హృదయానికి నేరుగా సంబంధము కలిగియుండి, హృదయము సరిగా కొట్టుకొనుటకు రక్త సంచాలన నియంత్రణకు ఉపయోగపడును.

పురుషులకు, స్త్రీలకు అంగ రచన యందు ముఖ్యమైన వ్యత్యాసము కలదు. స్త్రీల జననేంద్రియములకును, గర్భకోశమునకు ఎక్కువ రక్తపు ఒత్తిడి ఉండవలసి ఉన్నది గావున, యజ్ఞోపవీతమునకు బదులుగా మాంగల్యధారణ నియమము చేసినారు. ఎంతటి బీదవారయినాసరే ఈ మాంగల్యమును బంగారముతో చేయించి ధరించుట ఆచారముగానున్నది.

1. మిగిలిన లోహములవలె బంగారము వలన ఎటువంటి దోషమూ కలుగదు.

2. బంగారము శరీరముపైనున్న, దాని సంపర్కముచేత స్నానము చేయునపుడు దీనిపై పడు నీరు శరీర ఆద్యంతము పరచుకొని దీని గుణము శరీరమునకు వ్యాపించును. దీనినే ఎలక్ట్రోమేగ్నటిక్ ఆక్టివిటి (Electro Magnetic Activity) అని అందురు.

3. ఆయుర్వేదము ప్రకారము బంగారమునందు సంతానోత్పత్తికి వలయు శక్తి గలదని తెలియజేయబడుతుంది. మహిళలయందు ఈ జీవనాడిని నియంత్రించుటకు ఈ బంగారపు వత్తిడి చాలదు. దీని జతకు గాజు గాజులను ధరించుటయను ఆచారమును నియమము గావించినారు.

4. మణికట్టు పైభాగమున ఈ నాడి వ్యాపించి ఉండుటచే, ఈ నాడీ మూలకముగా రక్తప్రసారములో హృదయనియమిత స్పందనములను నియంత్రించుటకు గాజులను ధరించుట అత్యవసరము, గాజుల యొక్క స్వల్పభారపు వత్తిడి వలన ఈ నాడీ మూలకముగా రక్తచలనము హృదయ స్పందనము నియంత్రించబడును.

గమనిక :

 మణికట్టునందుండు నాడీపరీక్షతోనే గర్భధారణ జరిగిన విషయమును ఆయుర్వేద వైద్యులు నిర్ధారించెదరు (Diagnosis).

గర్భస్థ శిశువుపై గర్భిణీ స్త్రీ యొక్క మానసిక స్థితి ప్రభావం

కాబోయే తల్లి మానసికస్థితి ప్రభావం గర్భస్థ శిశువుపై తీవ్రంగా ఉంటుందని డాక్టర్లు కూడా నిర్ధారించారు. ఆయా మానసిక ధోరణుల వలన శరీరంలో కొన్ని రకముల రసాయనములు ఉత్పత్తి అవుతాయి. భయము, కోపము, ప్రేమ, అభిమానము, ఆనందమూ, దుఃఖములాంటి వానివలన ఉత్పన్నమయ్యే గాఢ రసాయనములు 'బొడ్డు' ద్వారా ప్రవహిస్తాయి. తద్వారా ఈ రసాయనములు గర్భస్థ శిశువును ప్రభావితం చేస్తాయి. గర్భిణీ స్త్రీ మానసికంగా ఆందోళనకు గురి అయినపుడు గర్భస్థ శిశువు తల్లిని పొట్టలో తన్నుతూ ఉంటుంది. అలా జరగటానికి కారణం ఆ రసాయనాల ప్రభావం ఆ శిశువులపై ఉండడమే. అంతేగాక గర్భిణీ స్త్రీలు శ్రవణానందకరమైన సంగీతాలలోని మాధుర్యమును ఆస్వాదించడం వలన ఆ బిడ్డకు హుషారు కలుగుతుందని కూడా పరిశోధకులు కనుగొన్నారు.

మహాభారత గాథలో అభిమన్యుడు తన తల్లి సుభద్రాదేవి గర్భములో నున్నపుడే తండ్రి అర్జునుడు తన భార్యకు తెలియజేసిన పద్మవ్యూహాది యుద్ధతంత్రాలను గురించి విని నేర్చుకున్నాడు.

హిరణ్యకశిపుని భార్య లీలావతిని అందునా గర్భవతిని దేవేంద్రుడు చెరబట్టి తమవెంట తీసుకుని పోవుచుండగా నారదుడు చూచి, దేవేంద్రునికి నచ్చచెప్పి ఆమెను తన ఆశ్రమమునకు తీసికొనిపోయి కాపాడుచూ, తత్వజ్ఞాన సంబంధిత విషయములను కథలుగా చెప్పుచూ “తత్త్వోప దేశము” చేసెను. అప్పటికే గర్భిణిగానున్న లీలావతి ఒకమారు తత్వోపదేశములను ఆకళింపు చేసికొనుచూ 'ఊ' కొడుతూనే నిద్రలోనికి జారుకున్నది. నారదుడు లీలావతికి నిద్ర ఆవహించినప్పటికీ, తనకు చెప్పుతున్నదానికి 'ఊ' కొడుతున్న శబ్దం వినపడుతున్నదేమిటా అని ఆశ్చర్యపోయి చుట్టుప్రక్కల పరికించి చూడగా, లీలావతి యొక్క గర్భము నుండియే ఆ శబ్దము వస్తున్నదని గ్రహించి గర్భమునందున్న బాలుడు కూడా తత్త్వోపదేశములను గ్రహించినాడని తెలుసుకుని ఆ బాలునికి “నారాయణమంత్రము"ను ఉపదేశించెను. అతడే శ్రీమహా విష్ణువు యొక్క పరమభక్తుడు “ప్రహ్లాదుడు”.

తల్లిదండ్రుల యొక్క మనస్తత్వము, గర్భిణిస్త్రీ మాటిమాటికి వినునట్టి కథలు, గర్భములోని శిశువు యొక్క పూర్వజన్మ సుకృతము. పూర్వజన్మ వాసనలు బట్టి శిశువు యొక్క మనస్తత్వము రూపొందించ బడుతుంది. అని అంటారు.

అమెరికన్ శాస్త్రజ్ఞుల పరిశోధనల ఆధారంగా పుట్టబోయే శిశువులు సైతం వినగలుగుతారని, విషయములను నేర్చుకొనగలరని వెల్లడైనది. అంటే మహాభారత గాథలోని అభిమన్యుడు మాతృగర్భంనించే తన తల్లి సుభద్రకు అర్జునుడు తెలిపే యుద్ధతంత్రాలు గహించగలిగాడన్న అంశానికి ఆధారం లభించినదన్నమాట.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: