యమగండం మరియు రాహు కాలం వివరణ
శ్రీ సాహితిజ్యోతిషాలయం మూల గ్రంధములు:
యమగండం మరియు రాహు కాలం వివరణ
నేటి పంచాంగాలలో జనాన్ని అనవసరంగా భయపెడుతున్న రెండుమాటలు రాహుకాలం, యమగండం వీటి అసలు తత్త్వం ఏమిటో తెలుసు కుందాము.
జ్యోతిష్యంలో, మనకు తెలిసిన ఏడు ముఖ్యగ్రహాలకు తోడు ఉపగ్రహాలని ఉన్నాయి. వీటిని పరాశర హోర చెప్పింది. ఫలదీపిక మొదలైన ఇంకా ఇతర గ్రంధాలలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ ఉపగ్రహాలను ఎలా లెక్కించాలి అనే దానికి ఫార్ములాలు ఉన్నాయి.
పరాశర హోర ప్రకారం ఉపగ్రహాలు అయిదు. అవి - ధూమ, వ్యతీపాత, పరివేష, ఇంద్రచాప, కేతువులు. ఇవన్నీ సూర్యుని డిగ్రీల నుండి లెక్కించబడతాయి.
ఈ అప్రకాశ (కంటికి కనిపించని) ఉపగ్రహములు సూర్య, చంద్ర, లగ్నములతో గనుక కలిస్తే, క్రమముగా, వంశము, ఆయువు, జ్ఞానములను నశింపజేస్తాయని చెబుతూ పరాశరహోర వీటిని పంచార్కదోషములని అంటుంది. అంటే, సూర్యునికి సంబంధించిన అయిదు దోషములని అర్ధం.
శ్లో || రవీందు లగ్న గేశ్వేషు వంశాయుర్జ్నాన నాశనం
ఏషాం పంచార్క దోషాణాం స్థితి పద్మాసనోదితా:
ఇవి పూర్వం, బ్రహ్మదేవునిచేత చెప్పబడ్డాయని కూడా అంటుంది ఇదే గ్రంధం.
ఇకపోతే, ఉపగ్రహములను గురించి చెబుతూ మంత్రేశ్వరుడు తన ఫలదీపిక 25 వ అధ్యాయ ప్రారంభశ్లోకం లోనే ఇలా అంటాడు.
శ్లో || నమామి మాన్దిం యమకంటకాఖ్య:
మర్ధప్రహారం భువికాల సంజ్ఞం
ధూమ వ్యతీపాత పరిధ్యభిఖ్యాన్
ఉపగ్రహానింద్ర ధనుశ్చ కేతూన్
1. మాంది 2. యమకంటక 3. అర్ధప్రహార 4. కాల 5 . ధూమ 6 . పాత 7 . పరిధి 8. ఇంద్రధనుసు 9. ఉపకేతువు అనే తొమ్మిది ఉపగ్రహాలకు నమస్కరిస్తున్నాను అంటాడు.
అసలివన్నీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఉన్న కాల వ్యవధిని బట్టి ఏర్పడతాయి. ఈ టైం స్లాట్ ను ఎనిమిది భాగాలు చేస్తే, ఏడు భాగాలకు ఆ వారంనుంచి మొదలుపెట్టి ఏడు గ్రహాలు అధిపతులు అవుతాయి. ఎనిమిదో భాగానికి ఎవరూ అధిపతి కాదు. రాత్రి పూట అయితే, ఐదో వారం నుంచి లెక్క మొదలౌతుంది.
వీటిల్లో శనీశ్వరుని ఉపగ్రహాన్ని మాంది, లేదా గుళిక అని పిలుస్తారు. గురువుగారి ఉపగ్రహం పేరు యమఘంటక లేదా యమకంటక.
రాహుకాలం
రాహుకాలం అనేదాన్ని పెద్ద బూచిగా నేటి జ్యోతిష్కులు చూపిస్తున్నారు. ఇది నిజం కాదు. రాహుకాలం అందరికీ చెడ్డది కాదు. ఏ జాతకంలో అయితే రాహువు శుభగ్రహమో, ఆ జాతకానికి రాహుకాలం చాలా మంచిది. ఆ సమయంలో వారు చేసే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఈ విషయం చెప్పకుండా నేటి కుహనా జ్యోతిష్కులు 'ఆమ్మో ! రాహుకాలం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు బాత్రూం కి కూడా పోకూడదు. బిగబట్టుకో.' అని చెబుతున్నారు.
ఒక జాతకంలో రాహువు ఉచ్ఛస్థితిలో ఉంది. శుభగ్రహమై ఉంది. ఆ జాతకునికి రాహుకాలం సమయంలో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ జ్యోతిష్కులు ఎక్కించిన భయాలతో బిగదీసుకు పోయాడు. కానీ నేను చెప్పిన మాటలు నమ్మి నార్మల్ గా ఇంటర్వ్యూ చేశాడు. ఫలితం ఏమిటో తెలుసా? అతనికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 10th రాంక్ వచ్చింది. ఇది జరిగి ఇప్పటికి ముప్పై ఏళ్లయింది. ఇప్పుడతను ఒక స్టేట్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. ఇతను నా మిత్రుడు. రాహుకాలం అతనికి ఏమీ చెడు చేయకపోగా, ఎంతో మంచిని చేసింది.
రాహుకాలం బూచి కాదు. ఇది అందరికీ చెడూ చెయ్యదు. అందరికీ మంచీ చెయ్యదు. కానీ నేటి జ్యోతిష్కులు జనాన్ని 'అమ్మో రాహుకాలం' అంటూ భయపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాహువు ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఫలితాన్నిస్తుంది.
జ్యోతిష్యశాస్త్రంలో యూనివర్సల్ గా మంచి గ్రహాలూ, చెడు గ్రహాలూ లేవన్న విషయం నేటి జ్యోతిష్కులు మరచిపోయారు. అందుకే ఈ పిచ్చి ధోరణులు !
యమగండం
(దీనిని ఎక్కువ గా గూడూరు దాటినప్పటి నుండి దక్షిణాది వాళ్లు నమ్ముతున్నారు, పాటిస్తూన్నారు.)
ఇప్పుడు ఇంకో బూచి గురించి చెబుతాను. అదే యమగండం. మీకో విషయం తెలుసా? అసలు యమగండం అనేది జ్యోతిష్య శాస్త్రంలో లేనేలేదు.
ఉపగ్రహాలలో, గురువు యొక్క ఉపగ్రహాన్ని 'యమఘంటక' అంటారు. ఈ ఉపగ్రహం యొక్క కాలవేళ మధ్యభాగంలో ఉదయించే లగ్నసమయాన్ని 'యమఘంటక కాలం' అంటారు. దానిని జ్యోతిష్యశాస్త్రపు ఓనమాలు తెలియని నేటి పంచాగజ్యోతిష్కులు 'యమగండం' గా మార్చిపారేశారు. జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
అసలు 'యమగండం' అనే పదమే శుద్ధబూతు. ఏ ప్రామాణిక జ్యోతిష్య గ్రంధంలోనూ ఈ పదం లేదు. కానీ ఏ పంచాంగం చూసినా ఈ పదం కనిపిస్తుంది. మిమ్మల్ని భయపెడుతుంది.
ఇంకో విషయం తెలుసా? ఇదే జ్యోతిష్కులు, గురువును పరిపూర్ణ శుభగ్రహం అంటారు. మరి ఆ గురువు యొక్క ఉపగ్రహమైన 'యమఘంటక' ను మాత్రం చాలా చెడ్డగ్రహం అంటారు. ఇదేంటి? అని అడిగిన వారికి సమాధానం చెప్పలేరు.
ఫలదీపికలో మంత్రేశ్వరుడు ఏమన్నాడో ఒకసారి చూడండి మరి !
శ్లో || గులికస్య తు సంయోగే దోషాన్ సర్వస్య నిర్దిశేత్!
యమమంటక సంయోగే సర్వత్ర కధయే శుభమ్!! (ఫలదీపిక 25 - 18)
'గులికుడు కలిస్తే ఏ గ్రహమైనా చెడిపోతుంది. ఆశుభాన్నిస్తుంది. అదే, యమకంటకుడు కలిస్తే అంతా శుభమే జరుగుతుంది' అని దీని అర్ధం. దీన్ని 'యమగండం' అని మార్చిన పంచాంగ జ్యోతిష్కులు ఇది చాలా చెడుకాలం అని చెబుతున్నారు !
ఇంకో శ్లోకం చూడండి.
శ్లో || దోషప్రదానే గులికో బలీయాత్!
శుభ ప్రదానే యమకంటకస్యాత్!!
'దోషములు ఇవ్వడంలో గులికుడు బలమైనవాడు. శుభ ఫలితములు ఇవ్వడంలో యమకంటక బలీయమైనది' అని దీని అర్ధం.
అదే ఫలదీపిక నుంచి ఇంకో శ్లోకం చూడండి !
శ్లో || శనివద్గులికే ప్రోక్తం గురువద్యమకంటకే!
అర్ధప్రహారే బుధవత్ఫలం కాలేతు రాహువత్!!
ఈ ఉపగ్రహాలలో కేతువును గురించి చెప్పారు. గుళిక గురించి చెప్పారు, మరి రాహువు ఎక్కడ అని అనుమానం రావచ్చు. దీనిని వివరిస్తూ పై శ్లోకంలో 'కాలే రాహువత్' - 'కాలము అనే ఉపగ్రహం రాహువు వంటిది' అంటాడు.
కనుక - రాహుకేతువుల ఉపగ్రహాలుగా కాల - కేతువులనూ, శనీశ్వరుని ఉపగ్రహంగా గుళికనూ చెబుతూ, ఇవి చాలా దోషప్రదమైనవి అన్నారు ప్రాచీనఋషులు. 'యమకంటక' అనేది గురువు యొక్క ఉపగ్రహం కనుక చాలా శుభప్రదం అని కూడా వారే చెప్పారు. పైన ఉదాహరించిన శ్లోకాలే దీనికి ప్రమాణాలు.
మరి నేడు ఏ పంచాంగం చూసినా - 'యమగండం' అనే పదాన్ని వాడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇదేంటి?
అంతేగాక - అంత దోషాన్నిచ్చే గుళిక కూడా, కొన్ని కొన్ని యోగాలలో ఉన్నప్పుడు అమిత శుభాన్నిస్తుంది అని కూడా కొన్ని మినహాయింపులను చెప్పారు. అదెప్పుదంటే,
శ్లో || గుళిక భవననాధే కేంద్రగే వా త్రికొణే!
బలిని నిజగృహస్తే స్వోచ్చమిత్రస్తితేవా
రధగజతురగానాం నాయకో !
మహిత పృధుయశాస్యాత్ మేదినీ మండలేంద్ర:!!
అంటూ -
గులికుడున్న రాశినాధుడు గనుక ఉచ్చ మిత్ర క్షేత్రములలోగాని, స్వగృహంలో గాని, కేంద్రకోణములలో ఉంటే, ఆ జాతకుడిని రధములు, ఏనుగులు, గుర్రములు కలిగినవానిగా, మన్మధుని వంటి రూపసిగా, గొప్ప కీర్తి కలిగిన రాజుగా చేస్తాడు' అంటాడు మంత్రేశ్వరుడు.
కనుక రాహుకేతువ్లులు శనీశ్వరుడు కూడా చాలా శుభాన్ని ఇస్తారని ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయి.
రాహు కేతువులు శనీశ్వరుడు దుష్టగ్రహాలు కారు. యమఘంటక లేదా యమకంటక అనేది కూడా దుష్టగ్రహమూ దుష్టసమయమూ కాదు.
Comments
Post a Comment