భరణి నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు
*భరణి నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు*
మేష రాశిలోని రెండో నక్షత్రమే 'భరణి నక్షత్రము'. ఈ నక్షత్రం స్త్రీ లక్షణం కలిగి ఉన్నప్పటికీ ఉగ్రతారగా గుర్తింపు పొందింది. శుక్రుడు అధిపతిగా ఉన్నాడు కనుక వీరు రజో గుణంతో భాసిల్లుతారు. ఈ నక్షత్రము 4 పాదాలూ మేష రాశిలోనే ఉన్నాయి.
భరణి మొదటి పాదము
శారీరకంగా శక్తివంతులై ఉంటారు. ఇదే సమయంలో పౌరుషవంతులుగానూ.. శత్రువులను లొంగదీసుకుంటారు. పంతాలు పట్టింపులు సాధించుకునేందుకు ప్రయత్నిస్తారు. పెద్దలపట్ల గౌరవం, ఆచార వ్యవహారాలపైనా, సాంస్కృతి సాంప్రదాయలపైన, నీతి నియమాలపైనా శ్రద్ధాసక్తులు కలిగి మెసులుకుంటారు. అయితే తమలోని లోపాలు బయటపడకుండా నిరంతరం జాగ్రత్త పడుతుంటారు.
మొదటి పాదములో గ్రహ దశలు
జన్మించినప్పటి నుంచి శుక్ర మహాదశ ఇరవై సంవత్సరాలు, రవి మహాదశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు ఉంటుంది.
భరణి రెండో పాదము
భరణి రెండో పాదం యందు పంతం, పట్టుదల అధికంగా కనిపిస్తుంది. అనుకొన్నది పూర్తి చేయాలన్న పట్టుదల ఉంటుంది. అయితే ఈ క్రమంలో పలు సందర్భాల్లో మొండితనంతో వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడపడంతోపాటు మంచిచెడులపై అవగాహన, నీతి నియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు. ఆలోచనా ధోరణి అధికం. అనవసర విషయాలపై ఆసక్తితో శోధిస్తారు.
రెండో పాదములో గ్రహ దశలు
జన్మించినప్పటి నుంచి శుక్ర మహాదశ 20 సంవత్సరాల పాటు ఉంటుంది. రవి మహాదశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు ఉంటుంది.
భరణి మూడో పాదము
భరణి మూడో పాదంలో జన్మించినవారు తమ ప్రమేయం ఏమీ లేకుండానే ఫలితం కోరుకుంటారు. వాస్తవానికి-ఆలోచనకు మధ్య పొంతన ఉండదు. అయితే తెలివితేటల విషయంలో గొప్పవారే. పొగడ్తలంటే ఇష్టపడతారు. శక్తివంతులు కావడంవల్ల ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి ముందుంటారు. తొందరగా కోపం వచ్చినా నిగ్రహ శక్తిని కలిగి ఉంటారు. ఈ పాదంలో జన్మించిన వారికి దైవభక్తి ఎక్కువ.
భరణి మూడో పాదంలో గ్రహ దశలు
పుట్టినప్పటి నుంచి ముందుగా శుక్ర మహాదశ సుమారుగా పదేళ్లు. రవి మహాదశ ఆరేళ్లు, చంద్ర మహర్దశ పదేళ్లు, కుజ దశ ఏడేళ్లు, రాహు దశ పద్దెనిమిదేళ్లు ఉంటుంది.
భరణి నాలుగో పాదము
ఈ పాదంలో ఊహల ఊయాల ఊగుతారు. మరోవైపు ఆడంబరాన్ని, పటాటోపాన్ని కోరుకుంటారు. పంతంపట్టి పనులు సాధించుకోవడం వీరి లక్షణం. కష్టమైనా, నష్టమైనా తమదే పైచేయిగా ఉండాలని పట్టుబడతారు. తరచూ కోపాన్ని ప్రదర్శిస్తారు. బతిమాలించుకునే మనస్తత్త్వం. పొగడ్తలను ఆస్వాదిస్తారు. గర్వంతోనూ, కఠినత్వంతోనూ వ్యవహరిస్తారు.
భరణి నాలుగో పాదంలో గ్రహ దశలు
ఈ పాదంలో జన్మించిన వారు శుక్ర మహాదశ ఐదేళ్లు, రవి మహాదశ ఆరేళ్లు, చంద్ర మహర్దశ పదేళ్లు, కుజ దశ ఏడేళ్లు, రాహు దశ పద్దెనిమిదేళ్లు ఉంటుంది. భరణి నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు
భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడు. ఈ కారణంగా వీరు అందంగానూ ఆకర్షణీయంగా ఉంటారు. ఇది మానవ గణ నక్షత్రము కనుక లౌక్యం చొరవ ప్రదర్శించే గుణము కూడా ఎక్కువే. ఈ నక్షత్రంలో జన్మించినవారు వేదాంత విషయాలపట్ల, ప్రాచీన సంప్రదాయాలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు.
పొగడ్తలంటే గిట్టనివారుగా పైకి కనిపించినా వాటిని బాగా ఆస్వాదిస్తారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి తమ అభిప్రాయాలు మార్చుకుంటుంటారు. ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంతే కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధం కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు. వృద్ధాపయంలో సుఖజీవనం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు.
సమాజంలో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యం, విలాసవంతం ఉండే విషయాల్లో ఆసక్తి చూపిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికం. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. అంతేకాదు వీరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు సలహాదారులుగానూ రాణిస్తారు.
ఈ నక్షత్రంలో జన్మించిన వారికి బాల్యం సుఖవంతంగా జరుగుతుంది. 28 నుంచి 32 సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయం గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు ఉంటాయి. ఇక వీరు వృద్ధాప్య దశలో సుఖవంతంగానే ఉంటారు.
వీరి తమ వ్యక్తిత్వ తీరువల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించడానికి ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే నిత్యం భరణీ నక్షత్రములో పుట్టిన జాతకులు మహాలక్ష్మిదేవి పూజించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఇంకా సంవత్సరానికి ఒక్కసారైనా ఇంద్రాణీ హోమం చేయించడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9 అనే సంఖ్య అనుకూలిస్తుంది. 9తో పాటు 18, 27, 36, 45, 54, 63, 72 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అలాగే ఈ జాతకులకు ఎరుపు, తెలుపు రంగులు అదృష్టానిస్తాయి. ఇందులో ఎరుపు రంగు చేతి రుమాలును వాడటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.
భరణి నక్షత్ర జాతకులకు కుజ గ్రహ ప్రభావం ఉండటంతో వీరికి మంగళవారం కలిసివస్తుంది. బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. అయితే గురువారం మాత్రం ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది
Comments
Post a Comment