పరస్పరం ద్వేషించుకోవద్దు -




*మా భ్రాతా భ్రాతరం ద్విక్షన్ మా స్వసారముత స్వసా*

👉 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు పరస్పరం ద్వేషించుకోవద్దు - ద్వేషించుకోరాదు ( *అథర్వవేదం* )

కుటుంబవ్యవస్థలో సోదరీ సోదరుల బంధానికి ప్రాధాన్యముంది. అందరూ ఒకే తల్లిదండ్రుల సంతానాలైనా ఎవరికి వారికే ప్రత్యేక అభిప్రాయాలు, విభిన్న సామర్ధ్యాలు ఉంటాయి. ఒకొక్కరు ఒకొక్క రంగంలో రాణిస్తారు. శారీరక, బౌద్ధిక తారతమ్యాలు కూడా సహజం. ఈ తారతమ్యం క్రమంగా అసూయకీ, ఈర్ష్యకీ దారితీసి-ద్వేషంగా బలపడే అవకాశముంది. కనుకనే వేదమాత ఆ ప్రమాదం రాకుండా హెచ్చరిస్తోంది.

"*మీకు లేని సుఖం నాకు అక్కర్లేదు" అని శ్రీరాముడు లక్ష్మణ, భరతులతోపలుకుతాడు*. 

ఈ భ్రాతృ ప్రేమ ఒకే తల్లిదండ్రుల బిడ్డల్లోనేకాక, పెద్దనాన్న చిన్నాన్న పిల్లల పట్ల కూడా విస్తరించిన మంచిరోజులు నాడు ఉండేవి. ద్వాపరాంతంలో దుర్యోధనుడు మాత్రం దీనికి విరుద్ధం. కేవలం ఈర్ష్య వల్ల వంశనాశనం తెచ్చుకున్నాడు.
“నువ్వెందుకు పెత్తనం చెలాయించాలి? నేనెందుకు విధేయుడుగా ఉండాలి?" అనే తర్కాల వల్ల విభేదాలు వస్తాయి. అదే పెద్దల్ని గౌరవించడం, పిల్లల్ని లాలించడం వంటి భావంలో 'అహం' భావనను లోపింపజేసేది ధర్మం. ఆ ధర్మానికి కట్టుబడ్డారు అర్జున, భీమ, నకుల, సహదేవులు.

( తరతరాలకు విస్తరిల్లవలసిన భ్రాతృభావం ఎప్పటికప్పుడే చివికిపోతోంది. సోదరీమణుల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఒక అక్క చెల్లెలిని చూసి మరో అక్క చెల్లెలు అసూయపడుతోంది. "అందరూ అన్నదమ్ముల్లా
కలిసి ఉండాలి" అని ఆ రోజుల్లో బోధించేవారు. ఇప్పుడామాటను వాడలేని పరిస్థితి. ‘సౌభ్రాతృత్వ భావన'ను ఉపమానంగా చెప్పలేని కాలం వచ్చింది.)

*కలి ప్రవేశంతో ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో కూడా భయంకర ద్వేషాలు,అసూయలు పెచ్చరిల్లుతున్నాయి.*

*చివరికి ఒకరి కుటుంబ నాశనానికి ఇంకొకరు వెనుదీయడం లేదు. ఒకరి అభివృద్ధిని చూసి మరొకరు సహించలేని దుస్స్వభావం పెరుగుతోంది*

తరతరాలకు విస్తరిల్లవలసిన భ్రాతృభావం ఎప్పటికప్పుడే చివికిపోతోంది.సోదరీమణుల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఒక అక్క చెల్లెలిని చూసి మరో అక్క చెల్లెలు అసూయపడుతోంది. ఇది వారి పిల్లల్లో కూడా విస్తరిల్లుతోంది. *ఒకవేళ అప్పుడప్పుడూ కథాకార్యాల్లో కలిసినప్పుడు కూడా 'పెదవినవ్వులు - నొసలిచిట్లింతలు'అన్నట్లు కపటాల కలయికలే అవుతున్నాయి. ఎవరి స్వార్థం వారిది.*

“అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి" అని ఆ రోజుల్లో బోధించేవారు. ఇప్పుడామాటను వాడలేని పరిస్థితి. 'సౌభ్రాతృత్వ భావన'ను ఉపమానంగా చెప్పలేని కాలం వచ్చింది.

ఒకరికొకరు పరస్పర పూరకంగా ఉంటూ కుటుంబాల ఉమ్మడి సౌఖ్యాన్ని, ప్రతిష్ఠని నిలబెట్టడం సోదరీ సోదరుల బాధ్యత. అక్క చెల్లెళ్ళని జీవితాంతం 'ఆడబడుచు'గా ప్రత్యేక గౌరవస్థానంలో అన్నదమ్ముల కుటుంబాలు గౌరవించే సంప్రదాయం మనది. *అయితే- కొండొకచో ఈ గౌరవస్థానాన్ని దబాయింపు స్థానంగా భావించే గయ్యాళితనమున్న ఆడబడుచులూ లేకపోలేదు. పరస్పరం ఆత్మీయంగా ఉండవలసిన బంధాలు హక్కులుగా పరిణమించడంతో వికృతవేషాలే మిగులుతున్నాయి.*

కుటుంబ వ్యవస్థకి ప్రాధాన్యమిచ్చిన మన వైదిక సంస్కారం ఇంత చక్కగా బోధించి - పరస్పరానుబంధానికి పెద్దపీట వేసింది. ఈ వేదవాక్కును గౌరవించే కుటుంబాలు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. ఆ ఉత్తమ పరివారాలకు నమస్కరిస్తూ ఈ సు(స్వ)ధర్మాన్ని అనుసరిద్దాం.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: