మహాశివరాత్రి*

*మహాశివరాత్రి*

*మహేశ్వరుడికి 'అష్టతనువు' అనే విశేషనామమున్నది. అంటే ఎనిమిది దేహాలు కలిగిన వాడని అర్థం. జలం శివుడి శరీరాల్లో ఒకటి. నిత్యం నీటిలో ఆ స్వామిని దర్శించుకోగలిగితే అదే శివపూజ అవుతుంది. రెండవది హోమాగ్ని. యజ్ఞగుండంలో రగిల్చే అగ్ని లింగమూర్తితో సమానం. ఇంట్లో వంట కోసం వెలిగించే అగ్నిని కూడా హోమాగ్నిగా భావించాలి. ఆయన మూడవ శరీరం యజ్ఞకర్త. అంటే భగవంతుడికి కైంకర్యాలు చేసే వ్యక్తి. అలా భక్తుల్ని కూడా నీలకంఠుడి గానే భావించమంటున్నాయి పురాణాలు. శివుడి 4, 5 శరీరాలు సూర్యుడు, చంద్రుడు. మనకు వెలుగును, చైతన్యాన్ని, ఆహారాన్ని ప్రసాదించే ప్రభాకరుడు పరమశివుడే. మన మనసును చల్లబరిచే చంద్రుడు చంద్రశేఖరుడి ప్రతిరూపమే. ఆదిభిక్షువు ఆరో తనువు ఆకాశం. గగనం నుంచే ధ్వని పుడుతుంది. శబ్దం పరబ్రహ్మ స్వరూపం. సృష్టిలో తొలుత పుట్టింది ప్రణవరూపమైన ఓంకార నాదమే. అందుకే శబ్దం పుట్టుకకు కారణమైన ఆకాశాన్ని చూసినప్పుడల్లా మహేశ్వరుడే స్ఫురణకు రావాలి. ఆయన ఏడో శరీరం పుడమి. సమస్త జీవులకు ఆధారభూతమైన ఆ భూమిని సద్వినియోగం చేసుకోవటమూ సదాశివుని పూజించడమే. గంగాధరుడి ఎనిమిదవ శరీరం గాలి. వాయువును గౌరవిస్తే ఆ విశ్వనాథుని అర్చించినట్లే. అందుకే పూజలు, సంధ్యావందనాల్లో ముందుగా ప్రాణాయామం చేయిస్తారు. ఈ విధంగా ఎనిమిది రూపాల్లో ఉన్న ఈశ్వరుని దర్శించి ధన్యులమవుదాం.*
 *అపచారాలకు తావియ్యక ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం.*

*పరమేశ్వరుడే భూమండలమంతా వ్యాపించి వున్నాడు. అందుకే 'సర్వం శివమయం జగత్' అన్నది శివపురాణం. కఠ, మాండూక్య, శ్వేతాశ్వతర, బృహదారణ్యక, సూర్య, కైవల్య, స్కంద తదితర ఉపనిషత్తులు శివమహిమను కీర్తించాయి. "ఈశావాస్యమిదం జగత్" - "ఈ జగత్తంతా ఈశ్వరుడే ఆవరించి ఉన్నాడు" అని ఈశావాస్యోపనిషత్ పేర్కొన్నది. శివలింగం ప్రకృతి పురుషులకు ప్రతీక అని*
*వ్యాఖ్యానిస్తారు. "శివాయ గురవే నమః", "ఈశానః సర్వవిద్యానాం', "ఈశ్వరః సర్వభూతానాం" అని వేదమంత్రాలు శివుని స్తుతించాయి. అంటే సర్వవిద్యలూ, సకల జీవులకూ ఆయన మూలకారకుడు. "బ్రహ్మాధిపతిః బ్రహ్మణోధిపతిః" అన్నారు. అంటే సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు, వేదాల్లోని మంత్రాలకూ ఉమాపతే అధిపతి. అయితే, నిర్మలమైన మనసుతో స్వామిని కీర్తించి, ఆరాధించినప్పుడే సత్ఫలితాలుంటాయి. అందుకే "చిత్తశుద్ధి లేని శివపూజ లేల" అని వేమన ఎద్దేవా చేశాడు.*

*మాఘ బహుళపక్ష చతుర్దశి అర్థరాత్రి లింగోద్భవ కాలం. పరమాత్మను నిశిరేయిలో పూజించే ప్రత్యేక పర్వదినమిది. ఈ మహాశివరాత్రి రోజే శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. రాత్రి అనేది లౌకిక వ్యవహారాలు సద్దుమణిగే స్థితి. అందునా అర్ధరాత్రి. "బహిర్ముఖ దృష్టిని వదలి, బుద్ధిని అంతర్ముఖం చేసి అంతరంగంలో ఈశ్వర జ్యోతిపై కేంద్రీకృతం చేయడమే రాత్రి. పగలు బహిర్ముఖం, రాత్రి అంతర్ముఖం" అని వ్యాఖ్యానించారు పారమార్థిక సాధకులు. "ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాల చుట్టూ భ్రమించే మనసును చైతన్యానికి మూలకేంద్రమైన ఆత్మజ్యోతిలో అంటే శివజ్యోతిలో లీనం చేసే అంతర్ముఖ ప్రయాణమే శివరాత్రి" అని వారు భావిస్తారు.*

*ప్రాతస్సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంసంధ్య - మనందరికీ తెలిసినవి. నాలుగోది అర్ధరాత్రి అయిన తురీయ సంధ్య. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలకు సంబంధించింది. అలజడులన్నీ అణగిన ఈ అచల స్థితి ధ్యానానికి మరింత అనుకూలం. మనసు పరమానందాన్ని అనుభవించే ఆ తాదాత్మ్య స్థితిలో లౌకిక లంపటాలన్నీ సద్దుమణుగుతాయి. దాన్ని ఆధ్యాత్మిక గురువులు 'పరమమైన లయ' అంటారు. ఈ పర్వదినాన పగలంతా ఉపవాసముండి, రాత్రిపూట అభిషేకాలు, పూజలు, జాగరణ చేయాలని లింగ పురాణం చెబుతోంది. రోజంతా శివనామస్మరణతో గడపడం వల్ల, మనసు పరిశుద్ధమవుతుంది.*

*ఓం నమశ్శివాయ*🙏🙏🙏

*సేకరణ : ఈనాడు*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: